కృషి తో నాస్తి దుర్భిక్షం - వుయ్యూరు రాజచంద్ర

krushito nasti dhurbhikshyam

పూర్వం రామాపురం, కృష్ణాపురం అనే ఊళ్ళు పక్క పక్కనే ఉండేవి. ఐతే వాటి మధ్యలో అడ్డంగా ఒక పెద్ద కొండ ఉండటంతో రెండు గ్రామాల వారు రాక పోక లకి కొండ చుట్టూ తిరిగి వెళ్ళేవారు. దీనివల్ల రెండు గ్రామాల మధ్య దూరం చాలా ఎక్కువ అవటంతో ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ కొండని తొలిచి దారిని ఏర్పాటు చేస్తే తమ సమస్యలు తీరు తాయి అని ఐతే ఆ పని ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనుకొని ఊరుకునేవారే తప్ప ఎవ్వరూ ఆ దిశగా ప్రయత్నం చెయ్య లేదు. అంత పెద్ద కొండని తవ్వి దారి ఏర్పాటు చేయటం అసాధ్యం అని గ్రామస్తులంతా భావించేవారు.

రామాపురం తో పోల్చుకుంటే కృష్ణాపురం చాలా అభివృద్ధి చెందింది. కృష్ణాపురం లో విద్యాలయాలు, వైద్యశాలలు, అంగళ్ళు వంటివి ఉండడం వలన రామాపురం ప్రజలు చుట్టూ తిరిగి కృష్ణాపురం వెళ్లి పనులు చూసుకునేవారు. ఏ అవసరానికి అయినా వాళ్ళకు కృష్ణాపురం వెళ్ళక తప్పేది కాదు.

రామాపురం లో రామయ్య అనే ఒక బీద రైతు ఉండేవాడు. తనకున్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తన భార్య తో సంతోషం గా ఉండేవాడు. రామయ్యకి సంతానం లేదు. ఒక రోజు రామయ్య భార్య కి తీవ్రమైన అనారోగ్యం చేసింది. రామాపురం లో సరైన వైద్య సదుపాయాలు లేనందున కృష్ణాపురం తీసుకు వెళ్ళ వలసి వచ్చింది. ఎడ్లబండి లో రామయ్య తన భార్యని పడుకోబెట్టి ప్రయాణం మొదలు పెట్టాడు. చుట్టూ తిరిగి కృష్ణాపురం చేరే సరికి రామయ్య భార్య మరణించింది. దాంతో రామయ్య ఎంతో కలత చెందాడు. తమ గ్రామానికి కృష్ణా పురానికి మధ్య ఉన్న కొండ మధ్య నుంచి దారి ఏర్పాటు అయి ఉంటే తన భార్య సకాలంలో వైద్యం అంది బ్రతికేది అని రామయ్య కి అనిపించింది. తన భార్య లాగ ఇంకెవరికీ ఇలా జరుగ కూడదని నిర్ణయించుకున్నాడు. అంతే మరు సటి రోజునుంచి రామయ్య ఒక పెద్ద సుత్తి, ఉలి తీసుకొని కొండ దగ్గరికి వెళ్లి కొండ ని తొలిచి తమ గ్రామానికి పక్క గ్రామమైన కృష్ణా పురానికి మధ్య దారి ఏర్పాటు చేయటం మొదలు పెట్టాడు. కొండని తొలిచి దారి ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్న రామయ్యని గ్రామస్తులు పిచ్చి వాడి కింద జమకట్టి ఒక్కరూ సాయానికి రాలేదు. అయినా రామయ్య పట్టించుకోకుండా తన పని తాను చేస్తూనే ఉన్నాడు. అలా కొంత కాలం గడిచింది.అనుకోకుండా ఆ ప్రాంతపు జమీందారు ఒక రోజు మారు వేషం లో రామాపురానికి వచ్చాడు. ఆయనకి ఆ గ్రామస్తుల ద్వారా రామయ్య ప్రయత్నం గురించి తెలిసింది. జమీందార్ రామయ్య తొలుస్తున్న కొండ దగ్గరికి వెళ్లి రామయ్య ని పలకరించాడు. రామయ్యని " నీవు ఒక్కడివే ఇంత పెద్ద కొండ తొలిచి మార్గం ఏర్పాటు చేయ గలవా ? మీ వూరు వారంతా నిన్ను వెర్రి వాడి కింద జమ కట్టుతున్నారు కదా!" అని ప్రశ్నించాడు. జమీందారుని గుర్తించని రామయ్య " అయ్యా తమరు ఎవరో నేను ఎరుగను. నా జీవితం ముగిసే లోగా దారిని తప్పక ఏర్పాటు చేస్తానని నాకు నమ్మకం ఉన్నది. నా భార్య లాగా మరి ఎవ్వరూ మరణించ కూడదు అనే నా ఈ చిన్ని ప్రయత్నం" అని సమాధానము ఇచ్చాడు. జమీందారు రామయ్య సమాధానికి ఎంతో సంతోషించాడు. చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిరు దీపం వెలిగించాలి అనే విధంగా రామయ్య చేస్తున్న ప్రయత్నం జమీందారుకి ఎంతగానో నచ్చింది. ఇటువంటి వాడు ఊరికి ఒక్కడు ఉన్నా చాలు ప్రజల సమస్యలు చాలా వరకు తీరిపోతాయి అని జమీందారు కు అనిపించింది.

తరువాత కొన్ని రోజులకి జమీందారు పంపించిన కూలీలు, నిర్మాణ సామగ్రి రామాపురానికి చేరుకున్నాయి. రామయ్య కొండ తొలచి ఏర్పాటు చేసిన దారిని జమీందారు పంపించిన కూలీలంతా కలసి మరింత విశాలంగా తీర్చి దిద్దారు. చూస్తుండగానే కొండ కరిగి పోయింది. అసాధ్యం అనుకున్న దారి సుసాధ్యం అయ్యింది. కృష్ణాపురానికి రామా పురానికి మధ్య చక్కని దారి ఏర్పడింది. రామాపురం ప్రజల కష్టాలు తీరాయి. ఇప్పుడు రామాపురం ప్రజలకు రామయ్య అంటే కార్యసాధకుడు, మార్గదర్శి. జమీందారు ఆ కొండ దారి పూర్తి అయ్యాక స్వయంగా ఆ వూరు వచ్చి రామయ్య ని సత్కరించాడు.

(Mountain Man గా పేరు తెచ్చుకున్న దశరథ్ మాంజి నిజ జీవిత కధ స్ఫూర్తి తో - రచయిత. )

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ