"అంకుల్! మీరు కధలు రాస్తారట కదా! నా కధ రాయరూ!" - ముద్దుగా; బొద్దుగా వున్న పాప ముద్ద ముద్దగా అడిగింది.
"ఈ రోజు నా బర్త్ డే అంకుల్. కేక్ తీసుకోండి" అంటూ కేక్ తీసుకొచ్చింది.
"థాంక్యూ! మెనీ మెనీ హాప్పీ రిటర్న్స్ ఆఫ్ ద డే సౌమ్యా!" నాలుగో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ పాప నెత్తుకొని ముద్దుపెట్టుకుని మనస్పూర్థిగా దీవించాను.
"ఇదిగో చాక్లెట్" చాక్లెట్ అందించబోయాను.
నా వంక పరీక్షగా చూసి ఒక నిమిషం బుగ్గ మీద వేలేసుకుని "ఇటు తిరగండి" అంది.
అటు తిరిగాను. నా మొహాన్ని తదేకంగా చూసి ముక్కు పట్టుకుని అటు ఇటు తిప్పింది.
" ఓ .కే!" అని చాక్లెట్ అందుకుంది.
ఆమె వాలకం నా కర్థం కాక 'ఏమిటీ" అన్నాను అయోమయంగా.
"ముక్కు మొహం తెలియని వారి దగ్గర ఏమీ తీసుకోవద్దంది మా అమ్మ!" అందుకే ముక్కు మొహం పరిశీలించి మరీ తీసుకున్నా!" అంది పెద్ద ఆరిందలా.
పెద్దగా నవ్వు వినిపించి తిరిగి చూశాను.
వాళ్ళమ్మ పడి పడీ నవ్వుతోంది.
అది బయటి వారి దగ్గర అమ్మూ!" అంటూ దగ్గరికి వచ్చింది.
"అంటే..." పెద్ద పెద్ద కళ్ళను విచిత్రంగా తిప్పుతూ అడిగింది సౌమ్య.
"అంటే స్కూల్లో; రోడ్లో ...తెలియని వారి దగ్గరన్న మాటా..." కూతుర్ని ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
"అంటే ...అంకుల్ మనకు తెలిసిన వారన్న మాట" అంది ఆశ్చర్యం నటిస్తూ. వారి మాటలకు నాకూ నవ్వాగింది కాదు. ఉద్యోగ రీత్యా ఆ రికొచ్చి వాళ్ళింట్లో మేడ మీద రూం లో అద్దెకు దిగి వారమయింది.
"ఏమనుకోకండి. ఈమధ్య పేపర్లలో కిడ్నాపుల వార్తలు చూసి కొత్తవాళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దని చెప్పాం. అందుకే అలా అంటోంది." వివరణ ఇచ్చింది వాళ్ళమ్మ.
"కరెక్టే నండీ! మనమున్న జాగ్రత్తల్లో మనముండాలి కదా!" అన్నాను.
"పద పాపా! పోదాం" అంది పాపనుద్దేశించి.
"అంకుల్ దగ్గర ఒక కధ రాయించుకొని వస్తానమ్మా! నువు పో!" అంది పాప.
"ఏం కధ?" అడిగింది వాళ్ళమ్మ.
"నా కధే...ఏమంకుల్?" అంది నావైపు తిరిగి.
"నీ కధ...ఏం రాయాలి?" అడిగాను.
"ఏదైనా మంచి కధ ...పెద్ద పెద్ద బొమ్మలతో" అంది చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ.
"కానీ...ఇప్పుడు కాదు. నువ్వు గొప్ప గొప్ప పనులు చేసి మంచి పేరు సంపాదించుకో ముందు" అన్నాను.
"అంటే... ఇప్పుడు నా పేరు మంచిగా లేదా?" అంది అమాయకంగా.
"బాగుంది. కాకపోతే ...." ఎలా చెప్పాలో అర్థం కాక ఆగాను.
ఇంతలో వాళ్ళమ్మే జోక్యం చేసుకొంది.
"మంచి పేరు అంటే... బాగా చదువుకోవాలి. క్లాస్ ఫస్ట్ రావాలి. అందరూ నిన్ను చూసి పొగడాలి." అంది.
"అంటే...ఎవరు పొగడాలి?"
"అందరూ ...మీ టీచర్లు,మీ ఫ్రెండ్స్,బంధువులు; అమ్మా; నాన్నా; బాబాయిలు, పిన్నీలు: తాతలు, అమ్మమ్మా; నానమ్మా ఇంకా బోలెడంత మంది" అంది చేతులు విశాలంగా చాస్తూ.
"అంతేనా? అయితే అంధరి దగ్గరా బోలెడు పేరు సంపాదిస్తా ...అప్పుడే రాద్దురు గానీ..." అంది సంతోషంగా.
"అలాగే బువ్వ తినేసి పడుకో బుజ్జీ" అని లాలనగా తల నిమిరాను.
"ఓ.కే." అంది.
"గుడ్.ఇక పోదాం పద" పాపను తీసుకెళ్ళింది వాళ్ళమ్మ.
ఒకరోజు ఆఫీస్ నుంచి తిరిగొస్తూ;మెట్లెక్కుతుంటే అడ్డం పడింది సౌమ్య.
"అంకుల్! ఈ రోజు మా టీచర్ నన్ను పొగిడింది" సంతోషంతో చేతులాడిస్తూ అంది.
"ఎందుకూ?" అడిగాను.
"హోం వర్క్ నీట్ గా రాశానని... గుడ్ అని కూడా రాసింది. చూద్దురుండండి" అంటూ లోపలికెళ్ళి నోట్ బుక్ తెచ్చి చూపించింది
"వెరీ గుడ్. కీప్ ఇట్ అప్" అని భుజం తట్టాను. ఆ చిన్నారి మొహంలో నవ్వు విప్పారింది.
"మా అమ్మా, నాన్నా, నాన్నమ్మ అందరూ మెచ్చుకున్నారు." గొప్పగా చెప్పింది.
"ఫైన్" మెచ్చుకోలుగా అన్నాను.
" అదిగో మీరూ పొగిడారు. అయితే...అయితే …నా కధ రాయరూ?" గోముగా అడిగింది.
ఇంతలో వాళ్ళమ్మ వచ్చింది "ఇదిగో పాపా! నిజం చెప్పు. హోం వర్క్ ఎవరు చేశారూ?" అంటూ.
"నువ్వు చెయ్యనని మారాం చేస్తే ... స్కూల్లో దెబ్బలు తింటావని నేను రాసిచ్చాను. అవునా?" గద్దించింది.
అంతవరకు ఎంతో హుషారుగా ఉన్న పాప మొహం చిన్నబోయింది.
"లేదాంటీ! రేపట్నించి చూడండి ...మీరు చెప్పాల్సిన పనే లేదు. ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే హోం వర్క్ రాసే ఆడుకుంటుంది. సౌమ్య ఈజ్ గుడ్ గర్ల్...ఏమంటావ్ సౌమ్యా?" పాపనడిగాను.
"అవును. ఈ రోజు నుంచే..." అంటూ నోట్ బుక్ తీసుకొని "పదంకుల్ మనం పోదాం" నాతో పాటు పైకొచ్చేసింది. బుంగమూతి పెట్టుకుని సీరియస్ గా హోం వర్క్ రాసేసింది. వాళ్ళమ్మ ఎంత బ్రతిమిలాడినా అంతవరకు పాలు కూడా తాగలేదు. అప్పట్నుంచీ నా గదిలోనే హోం వర్క్ రాయడం; తెలియనివి అడిగి చెప్పించుకోవడం; బోలెడు కబుర్లాడడం ... నాకూ మంచి కాలక్షేపం. సౌమ్య మంచి ఇంటెలిజెంట్. ఒకసారి చెబితే చాలు ఇట్టే పట్టేస్తుంది. బొమ్మలు కూడా బాగా గీస్తుంది. కొన్ని జంతువుల బొమ్మలు గీయించి పత్రికలకు పంపించాను. తొలిసారి తను గీసిన బొమ్మను పత్రికలో చూసి ఎంత మురిసిపోయిందో చెప్పలేను. తన పేరును చూసి పొంగిపోయింది.
"అంకుల్...అంకుల్ " అంటూ ఆనందంతో నోట మాట రాక తబ్బిబ్బయింది.
పత్రికను పట్టుకుపోయి ఇంట్లో అందరికి చూపించింది. ఇంట్లో అందరి ఆనందం వర్ణానాతీతం. పాపను ముద్దులతో ముంచెత్తారు.
ఆ ఉత్సాహంతో సౌమ్య "అంకుల్ అది వేయమంటారా? ఇది వేయమంటారా?" అని బొమ్మలపైన బొమ్మలు వేసి చూపించేది. బాగున్నవి యధావిధిగా పత్రికలకు పంపే వాడిని. అలా ఆమె బొమ్మలు పత్రికల్లో చాలా పడేవి. స్కూల్లో ఆమె ఫ్రెండ్స్; టీచర్స్ అవి చూసి పొగిడేవారు. అలా ఆమెకో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు కు నేనే కారణమని వాళ్ళల్లో నాకూ గౌరవం పెరిగింది.
"అంకుల్ ఈ రోజు నన్ను బోలెడంత మంది మెచ్చుకున్నారు" అంది నేను గేటు తీసీ తీయగానే.
"ఎవరెవరు మెచ్చుకున్నారూ!" అడిగాను.
"మా స్కూల్లో టీచర్లు, నా ఫ్రెండ్స్,ఇంకా...ఇంకా స్కూల్లో పిల్లలందరూ .." చేతులు అదోలా తిప్పుతూ అంది.
"ఎందుకు?"
"ఎందుకంటే ...మరి నేను గీసిన బొమ్మలు పుస్తకంలో పడిందిగా!"
"ఏమని మెచ్చుకున్నారు?"
"బొమ్మలు భలే బాగున్నాయి. ఎలా వేశావు? ఎవరు నేర్పారు? ... అని అడిగారు"
"ఏమని చెప్పావు బుజ్జీ" రెట్టించాను.
"మరి...మరీ …మా అంకుల్ నేర్పారు...అన్నాను"
"వెరీ గుడ్" మెచ్చుకోలుగా అన్నాను.
"అంతేనా?..." నిరుత్సాహంగా బుంగమూతి పెట్టింది.
"ఏమయింది బుజ్జీ' లాలనగా అడిగాను.
"అంటే ....అంతమంది మెచ్చుకున్నారుగా...మరి నా కధ రాయరూ?" అంది అదోలా మొహం పెట్టి.
"అది కాదురా.."
"నాకు మాటిచ్చారు. అందరూ మెచ్చుకుంటే రాస్తానని.."
"నీ కధ రాయాలంటే ఇంకా చాలా మంది మెచ్చుకోవాలి." అన్నాను వూరిస్తూ.
అప్పుడే సివిల్స్ లో రాంక్స్ సాధించిన అమ్మాయిల ఇంటర్వ్యూ వస్తోంది టీ వీ లో.
"ఆ అమ్మాయిని చూడూ...ఒక ఆటో డ్రైవర్ కూతురట. బాగా చదివి కలెక్టరయింది."
"కలెక్టరా....అంటే?"
"కలెక్టరంటే జిల్లాకే పెద్ద అధికారి. అందరూ అయన మాటే వినాలి"
"అంటే...ఏం చదవాలి?"
"ఐ.ఏ.యస్."
"అయితే నేను చదువుతా...కలెక్టరయిపోతా" అంది ధృఢంగా.
"అప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు. టీ.వీ ల్లొ; పేపర్లలో నీ పేరు మారుమ్రోగిపోతుంది. నీకు బోలెడు పేరొచ్చేస్తుంది."
నేను వూరిస్తుంటే ఆమె వూహల్లో తేలిపోతోంది
"అప్పుడు రాస్తారన్నమాట నా కధ" అంది కిల కిలా నవ్వుతూ చివరికి.
"తప్పకుండా రాస్తాను"
"అయితే ఎన్ని రోజులు పడుతుంది?" అంతలోనే మళ్ళీ సందేహం వెలిబుచ్చింది.
"బోలెడు రోజులు పడుతుంది. అందాకా నువ్వు కష్టపడి చదవాలి." అన్నాను.
"ఓ కే. అలాగే చదువుతా." అనేసి హోం వర్క్ రాయడంలో నిమగ్నమయింది.
అప్పుడప్పుడు ముసిముసిగా నవ్వుకుంటోంది. అందమయిన భవిష్యత్ సౌధాన్ని నిర్మించుకుంటూ కలల్లో తేలిపోతోంది. కాలక్రమేణా ఆమెలో చాలా మార్పులొచ్చాయి. ఎప్పుడూ హుషారుగా; నవ్వుతూ; త్రుళ్ళుతూ కనిపించేది. తన ఈడు పిల్లల్లాగా ఆటలు; పాటలు కాక...పేపర్లు చదవడం; పుస్తకాలు చదవడం వాటిల్లో కనిపించే ఫోటోలు చూపి వాళ్ళెవరు?...వీళ్ళెవరు అని వివరాలు అడగడం మొదలెట్టింది. ఒక ఆదివారం ప్రక్క వీధీలో వున్న లైబ్రరీకి తీసికెళ్ళాను. మెల్లగా పిల్లల బొమ్మల పుస్తకాలు చూడడం, కథలు చదవడం అలవాటు చేసుకుంది.
గాంధీ జయంతి నాడు బడికి సెలవిస్తే "సెలవెందుకిచ్చారు? ఇంతకీ గాంధీ ఎవరు?" అనడిగింది.
"గాంధీ అంటే మన జాతిపిత" అన్నాను.
"అంటే? " బుగ్గన వేలెట్టుకుని అడిగింది.
"ఆయన మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు..."
"స్వాతంత్ర్యం ..అంటే..."
వయసుకు మించిన ఆరాటం. తెలుసుకోవాలనే తపన. ఆ చిట్టి బుర్రలో ఎన్నెన్నో ప్రశ్నలు.
స్వాతంత్ర్య సంగ్రామం గూర్చి క్లుప్తంగా చెప్పి గాంధీజీ అహింసా మార్గంలో ఎలా సాధించారో చెప్పాను. చాలా ఆసక్తిగా వింది. ఎన్నో ప్రశ్నలు సంధించింది. ఆ చిట్టి బుర్రలోని చిట్టి చిట్టి ప్రశ్నలకు నాకు ముచ్చటేసేది. విసుగనిపించేది కాదు. పైగా ఆశ్చర్యం వేసేది.
ఒకరోజు పేపర్లో అబ్దుల్ కలాం ఫోటో చూపి "ఈయనెవరు?" అనడిగింది.
"మాజీ రాష్ట్రపతి" అన్నాను.
అంతటితో ఆగదు ఆమె ప్రశ్నల పరంపర.
రాష్ట్రపతి అంటే ఎవరు? అయనే ఎందుకు రాష్ట్రపతి అయ్యాడు? ఆయన ప్రత్యేకత ఏమిటి? గొప్పతనమేమిటి? ఆయన గురించి; ప్రత్యేకతల గురించి చెప్పి విద్యార్థులకు; యువతకు ఆయన తరచూ చెప్పే కొటేషన్ చెప్పాను. "కలలు కనండి. కష్టపడి దాన్ని సాకారం చేసుకోండి." "భలే భలే ....కొటేషన్ చాలా బాగుంది. మరో సారి చెప్పండి. రాసుకుంటాను" అని నోట్ బుక్ లో రాసుకుంది. "కలలు అందరూ కంటారు బేబీ! కానీ దాన్ని సాధించడానికి ఆ వైపు తగిన కృషి; ప్రయత్నమూ కావాలి" అన్నాను. ఇలా ఒక్కొక్కరి గురించి వివరాలు అడిగి తెలుసుకునేది. గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, భగత్ సింగ్,అల్లూరి సీతారామరాజు, మదర్ థెరిస్సా, శ్రీ శ్రీ, ఆమె అడిగేవారి లిస్ట్ చాలా పెద్దదే. ఒక రంగమని కాదు. కొత్త ఫోటో కనబడితే; కొత్త పేరు వినబడితే; వారిని గురించి తెలుసుకోవాలనే జిఙ్ఞాస. ఆమె తెలివితేటలకు నేను అబ్బురపడేవాణ్ణి. భవిష్యత్ లో ఆమె ఏదో ఒక రంగంలో అత్యున్నత శిఖరాలధిరోహిస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదు. కానీ...విధి మరోలా ఉందని ఎవరికి తెలుసు?
ఆ రోజు -గేటు తీసే చప్పుడు వినీ వినగానే "అంకుల్" అని పరుగెత్తుకొచ్చే చిన్నారి సౌమ్య కనిపించలేదు. వాళ్ళ అమ్మ గేటు దగ్గరే వెయిట్ చేస్తోంది.
"పాప ఇంకా బడి నుంచి రాలేదండి?" అంది.
"అలాగా! చాలా లేటయిందే!" అన్నాను.
"మాములుగా ఈ టయానికి వచ్చేసేదే. ఎందుకో లేటయింది. వాళ్ళ నాన్న స్కూలుకెళ్ళారు తీసుకురావడానికి" అంది మళ్ళీ.
"సరేనండి" అని నేను రూం కొచ్చేశాను.
రాత్రి ఏడు దాటినా సౌమ్య ఇంటికి రాలేదు.
వాళ్ళ డాడీ స్కూల్లో విచారిస్తే "అప్పుడే వచ్చేసిందే" అన్నారట.
భార్యా భర్తలకు కాళ్ళుచేతులు ఆడడం లేదు. ఒకటే కంగారుపడి పోతున్నారు. ఆ దంపతుల ఏకైక ముద్దుల పట్టి సౌమ్య. ఆ పాపంటే అందరికి ముద్దే.తల్లి - భారతి కి ఏడుపు ఒక్కటే తక్కువ. చుట్టుప్రక్కల వారంతా గుమిగూడారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. "ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా?" అని అందరూ తెగ కంగారు పడిపోతున్నారు. కొందరు దగ్గరి బంధువుల ఇళ్ళకెళ్ళి విచారించి వచ్చారు. మరికొందరు ఫ్రెండ్స్ ను విచారించి వచ్చారు. కొందరు ఫోన్ ల ద్వారా వాకబు చేశారు.ఎవరింటికి వెళ్ళినట్లు సమాచారం లేదు. పాప తండ్రి- ప్రసాద్ ని ఓదార్చడం మాకు శక్తికి మించిన పనయింది. ఎవరికీ పాలుఫోని పరిస్థితి."ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దామంకుల్" అన్నాను. అందరూ అదే మంచిదన్నారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు.
"స్కూల్లో ఏమన్నారు?"
"అప్పుడే వచ్చేసిందన్నారు" అన్నాడు ప్రసాద్ తన్నుకొస్తున్న ఏడుపును దిగమ్రింగుకుంటూ.
"అంతా వెతికారా?"
"అంతా వెతికాము సార్! "
"మీకు శత్రువులెవరయినా ఉన్నారా?"
"లేరండి" అన్నాడు ప్రసాద్.
"ఎవరిపైనైనా అనుమానం ఉందా?" ప్రశ్నించారు పోలీసులు.
"లేదండీ"
"ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉందా?"
"ఛ... ఛ...పాపను ఎవరు చేస్తారండీ"
"ఎందుకోసమేమిటి? డబ్బు కోసం ... చూద్దాం! ఒక వేళ కిడ్నాప్ అయ్యుంటే ఫోన్ లేమయినా వస్తాయేమో..." అనేసి పోలీసులు తమ పనిలో నిమగ్నమయ్యారు. ఆ రాత్రంతా ఎవరికీ నిద్ర లేదు. ఇదో వస్తుంది అదో వస్తుందని ఎదురు చూడ్డంతోనే సరిపోయింది. తెలిసిన ఇళ్ళళ్ళో; బంధువుల ఇళ్ళళ్ళో లేదు కనుక పోలీస్ లు చెప్పినట్లు కిడ్నాప్ కే ఎక్కువ ఛాన్సస్ ఉంటుందని; ఇంక వారి ఫోన్ కోసం ఎదురు చూడ్డం తప్ప గత్యంతరం లేదని ఎవరి ఆలోచనలలో వారుండిపోయారు. విచారణలు, ఎదురు చూపులతో ఎవరుకీ కంటి మీద కునుకు లేదు. భారతిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపడిపోయింది. తెల్ల వారింది. కానీ పాప అచూకి తెలియ లేదు. పోలీస్ ల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. పేపర్లలో పతాక శీర్షికల్లో పడింది. దాదాపు అన్ని పత్రికలు ఫోటోతో పాటు వార్త ప్రముఖంగా ప్రచురించారు. టీ వీ లలో గంట కో సారి కవర్ చేశారు.
"ఎంత డబ్బయినా ఇస్తాం. చివరికి మా ఆస్తి నంతా ఇచ్చేస్తాం. పాప కెలాంటి హాని తలపెట్టకండి.ప్లీజ్ మా పాపను విడిచిపెట్టండి" - కిడ్నాపర్స్ కు పాప తలిదండ్రుల కన్నీటి విఙ్ఞప్తిని అన్నీ ఛానెల్స్ పదే పదే ప్రసారం చేశాయి.వారి బాధ హృదయవిదారకంగా ఉంది.
మరోప్రక్క పోలీస్ విచారణ ప్రారంభమయింది. మొదటిగా నన్నే విచారించారు. నేను కొత్తగా రావడం; పాప నాతో చనువుగా ఉండడంతో వారి మొదటి అనుమానం నా పైన్నే పడింది. కానీ పాప తల్లిదండ్రులు నాపై అనుమానం ఏమాత్రం లేదన్నాక వదిలేశారు.
నా మెదడు మొద్దుబారిపోయింది. పాపకు ఏం కాకూడదని; క్షేమంగా తిరిగి రావాలని వేయి దేవుళ్ళకు మ్రొక్కుకున్నాను. వారి బంధుమిత్రులంతా ఇంటికి వచ్చి విచారిస్తున్నారు. ఎవరి నోట విన్నా "అయ్యో పాపం! పాప చాలా ముద్దుగా;బొద్దుగా ఉండేది. చాలా తెలివిపరురాలు. ఇలా అయిపోయిందే." అని జాలి పడేవారే.
ఒకప్రక్క పరామర్శల వెల్లువ. మరోప్రక్క అన్ని పేపర్లలో " చిన్నారి సౌమ్య కిడ్నాప్" ఉదంతం పతాక శీర్షికల్లో ప్రచారం. టీ వీ ల్లో అయితే అదేపనిగా ఫోటోతో పాటు కిడ్నాపర్లకు పాప తల్లిదండ్రుల విన్నపం పదేపదే టెలికాస్ట్ చేశారు. పాప ఫోటో; కిడ్నాప్ వార్తలు అప్ డేట్ చేస్తున్నారు. వీధుల్లో ; వాడల్లో చిన్నారి కిడ్నాప్ విషయమే చర్చించుకొంటున్నారు. ఎక్కడ చూసినా పాప పేరు మారుమ్రోగిపోతోంది.
సమయం గడిచే కోద్దీ ఉత్కంఠగా ఉంది. కిడ్నాప్ అయితే ఇప్పటికే వారి డిమాండ్ తెలియజేసుండాలి. ఎలాంటి ఫోన్లు; మరెలాంటి వివరాలు తెలియరాలేదంటే ఇది కిడ్నాప్ కాకపోవచ్చు. పోలీసులు అన్ని కోణాల్నించి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. రెండో రోజు సాయంత్రానికి కూడా ఎలాంటి సమాచారం లేదు. మా ఆందోళన మరింతగా పెరిగింది. అసలు పాపకెలాంటి హాని జరగలేదు కదా! ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు కదా! రాను రాను అనుమానం బలపడసాగింది.
పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. స్కూల్లో అందర్నీ విచారించారు. "దోషుల్ని పట్టుకుంటాం. పాపకేం కాదు" అంటున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
ఆ రాత్రి కూడా కునుకు లేదు. పరిపరి ఆలోచనలు ...తల్లిదండ్రుల ఆందోళన వర్ణనాతీతం. క్లోజ్ ఫ్రెండ్స్ అంతా వారిని ఓదారుస్తూ; వారి చుట్టే ఉన్నారు. పాపకేమీ కాకుండా సురక్షితంగా తిరిగి రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు.
నాకయితే పిచ్చెక్కినట్లుంది. అమాయకంగా, ముగ్ధంగా, మనోహరంగా నవ్వుతూ ఎదురొచ్చే పాప రెండు రోజులుగా కనపడక పోయేసరికి అదోలా ఉంది.
మూడో రోజు మధ్యాహ్నం కళ్ళు బైర్లు కమ్మే నిజం బయట పడింది. ఏదైతే జరగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నామో అదే జరిగింది. పాప శవమై ఒక పాడు బావిలో బయటపడింది. ఎవరు చేశారీ అఘాయిత్యం? ముక్కుపచ్చలారని పాపను చంపడానికి ఎవరికైనా చేతులెలా ఆడాయి? ఇంతకూ ఎవరా హంతకులు? పోలీసులు నిగ్గు తేల్చాల్సిన విషయమిది. దర్యాప్తులో ఏదో తేల్తుంది. దోషులెవరో తేలొచ్చు. వారికి శిక్ష పడినా పడవచ్చు. కానీ... పోయిన ప్రాణం తిరిగి రాదుగా?
ఏదైతేనేం? ఘోరం జరిగిపోయింది. ఎవరి పాపానికో: ఎవరి స్వార్ధానికో ఒక అమాయక బాలిక బలయిపోయింది. ఒక మొగ్గ అర్ధాంతంగా రాలిపోయింది.
ఎంతో అందంగా వున్న చిన్నారి సౌమ్య శవం ఉబ్బి వికారంగా ఉంది. ఎప్పుడూ చిరు నవ్వుతూ కలకలలాడే మొహం వాడిపోయింది. సగం తెరిచిన కళ్ళు ఇంకా అమాయకంగా “నేను చేసిన తప్పేంట”ని ప్రశ్నిస్తునట్లుంది. లోకాన్ని నిలదీస్తునట్లుంది.
"చూశావా అంకుల్! నా పేరు ఎంతగా మారుమ్రోగిపోతుందో! ఇప్పటికైనా నా కధ రాయరూ?" ఆ కళ్ళు సూటిగా నావైపు చూసి అడిగినట్లుంది.
"ఇలాంటి పేరు కాదమ్మా! నేనాశించింది. ఏదో ఒక రంగంలో అద్భుతాలు సృష్టించి నీ పేరు పదిమందికి ఆదర్శంగా నిలబడాలని...అలా నీ పేరు దేశమంతా మారుమ్రోగాలనుకున్నాను తల్లీ!" దుఃఖంతో నాకు కన్నీళ్ళాగలేదు. చిన్నార్లకు కనీస రక్షణలేని ధౌర్భాగ్యపు లోకంలో ఉన్నామని బాధగా ఉంది. విరిసీ విరియని పువ్వులను మొగ్గల్లోనే చిదిమేస్తున్నా ఏమీ చేయలేని మన నిస్సహాయతకి జాలేస్తోంది. *