విముక్తి - దినవహి సత్యవతి

vimukti

పండ్రెండు సంవత్సరాల భరత్ చదువులో చురుకుతనంతో పాటు తన చుట్టుపక్కల జరిగే అన్నీ విషయాలనూ ఆసక్తిగా గమనిస్తుంటాడు. రోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. వాళ్ళ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో చాలా మంది పిల్లలున్నారు. దాదాపు అందరూ ఒకటి రెండు సంవత్సరాలు అటు ఇటుగా వాడి వయసు వాళ్ళే .

ఈ మధ్య భరత్ కి ఇంకొక మంచి కాలక్షేపం దొరికింది. ఖాళీగా ఉన్న వాళ్ళ ఎదుటి ఇంట్లోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళకి ఇద్దరు ఆడ పిల్లలు. చిన్న పిల్ల భరత్ స్కూలులోనే మూడవ తరగతిలో చేరింది. ఆ పెద్దమ్మాయి వేరే ఏదో స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుతోందని అమ్మ చెప్పింది కానీ “ఆ అమ్మాయి స్కూలుకి వెళ్ళటం నేను ఏనాడూ చూడలేదు లేదు సరికదా రోజు చిన్న పాప స్కూలుకి వెళ్ళేటప్పుడు బస్సు దాకా సాయం రావటం , స్కూలు బ్యాగు , లంచ్ డబ్బా చేతికి ఇచ్చి బస్సు వెళ్ళేదాకా ఉండి చెయ్యి ఊపి టాటా చెప్పి వెళ్ళటం , ఆ పాప కూడా “టాటా అక్కా అని అనటం మాత్రం విన్నాను చాలాసార్లు” అనుకున్నాడు భరత్ .

ఎనిమిదవ తరగతి లో ఉంది అంటే నా వయసో లేక నా కంటే ఒక సంవత్సరం పెద్దదో అయి ఉంటుంది “ అని కూడా అనుకున్నాడు ఏడవతరగతి చదువుతున్న భరత్ . సాయంత్రం అందరూ చేరి ఆడుకునేటప్పుడు కూడా ఆ పెద్దమ్మాయి ఒక పక్కగా కూర్చుని ఉండటం ఎవరైనా పలకరించినా నవ్వి ఊరుకోవటం తప్ప ఆటలాడగా ఎప్పుడూ చూడలేదు భరత్.

“చెల్లి ఇంగ్లీషు మీడియం స్కూలుకి వెళుతోంది కానీ అక్క వేరే స్కూలుకి ఎందుకు వెళుతోంది? నేను స్కూలుకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉంటుంది తిరిగి నేను స్కూలునించి తిరిగి వచ్చేటప్పటికే ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది!!! ఆ అమ్మాయి స్కూలు ఎక్కడ ఉంది? టైమింగ్స్ ఏంటి? అసలు స్కూలుకి వెళుతుందా లేదా?“ ఇలా ఎన్నో సందేహాలు భరత్ కి . అసలే అన్నిటిలోనూ ఆసక్తి ఎక్కువ పైగా ఇదేదో మిస్టరీ లా అనిపించసాగింది వాడి చురుకైన బుర్రకి.

ఒకరోజు అమ్మతో ఆమాటే అంటే “ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు భరత్” అని వాడిని కూకలేసింది ఆవిడ . ఇంక ఇలా లాభంలేదనుకుని తానే రహస్యంగా ఎదురింటి వాళ్ళని గమనించసాగాడు భరత్. వాడి పరిశోధనలో తేలినదేమంటే ఆ చిన్న పాప పేరు దివ్య అని , పెద్దమ్మాయి పేరు పోలేరమ్మ అని వాళ్ళ అమ్మ నాన్న పేర్లు సంగీతా, రోహిత్ అని , వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ననీ .

“అందరూ మాట్లాడగా విన్నాను కానీ ఆ పోలేరమ్మ మాట్లాడగా నేనెప్పుడు వినలేదు , పాపం మూగదేమో? “ అనుకున్నాడు తనలో తానే భరత్.

కోప్పడుతుందని తెలిసినా ఉండబట్టలేక ఒక రోజు “ అమ్మా చిన్న పాపకి దివ్య అని మోడర్న్ పేరు పెట్టి వాళ్ళ అక్కకి మాత్రం పోలేరమ్మ అనే పాత పేరెందుకు పెట్టారమ్మా?” అని అడిగాడు వాళ్ళమ్మని భరత్ .

” తప్పు భరత్ అలా మాట్లాడకూడదు . ఒక్కొక్కసారి ఎవరికైనా చాలాకాలం వరకూ పిల్లలు పుట్టక పోతే , వాళ్ళు తమ కులదేవతకి కానీ లేదా గ్రామదేవతకి గాని ‘ పిల్లలు పుడితే ఆ దేవత పేరు పెట్టుకుంటామని’ మొక్కుకుంటారు . బహుశా పోలేరమ్మ దేవతకి మొక్కుకున్నందువల్ల ఆ పాప పుట్టి ఉంటుంది అందుకే ఆ అమ్మాయి పేరు పోలేరమ్మ అని పెట్టి ఉంటారు” అంది భరత్ వాళ్ళ అమ్మ. తన సందేహానికి తల్లి విసుగు పడకుండా వివరించి సమాధానం చెప్పటం భరత్ కి ఎంతో సంతోషాన్ని కలుగచేసింది.

ఒక రోజు తలనెప్పి, జ్వరంగా అనిపించి స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు భరత్ .

“భరత్ నేను బజారుదాకా వెళ్లొస్తాను తలుపువేసుకో ” అన్న తల్లి పిలుపుకి “సరేనమ్మా “ అని వచ్చి వీధి తలుపు వేసి హాలు బాల్కనీలో కూర్చుందామని వెళ్ళాడు భరత్. వాళ్ళ బాల్కనీ నించి ఎదురింటివాళ్ల వంటింటి బాల్కనీ కనిపిస్తుంది (kitchen utility area). ఎందుకో యాధాలాపంగా అటు చూసిన భరత్ కి పోలేరమ్మ ఏడుస్తూ కళ్ళు తుడుచుకోవటం కనిపించింది. భరత్ తనని గమనించటం చూసిన పోలేరమ్మ గబగబా లోపలికి వెళ్లిపోయింది.

అప్పటిదాకా వాడి మనసులో మెదులుతున్న సందేహాలు ఈ సంఘటనతో బలపడి ఎదురింట్లో ఏదో జరుగుతోందన్న అనుమానం మొదలైంది భరత్ కి.

“ఏం చెయ్యాలి? ఎవరితో చెప్పాలి? అమ్మతో చెప్దామా అంటే “అనవసర విషయాలలో జోక్యం చేసుకోకు “ అని ఇదివరకే ఒకసారి కోప్పడింది. ఆలోచించగా - ఆలోచించగా వాడికి ఒక ఉపాయం తట్టింది.

ఆ రోజు సాయంత్రం అందరూ చేరి ఆడుకునేటప్పుడు , భరత్ కాసేపు వాళ్ళతో ఆడుకుని , పోలేరమ్మ దగ్గరికి వచ్చి కూర్చుని “ హలో!” అని నవ్వుతూ పలకరించాడు. రోజు దాదాపు భరత్ ని చూస్తుండటంవల్ల పోలేరమ్మ కూడా పలకరింపుగా నవ్వి , మౌనంగా ఉండిపోయింది.

భరత్ కి తిరిగి ఏం మాట్లాడాలో తెలియక “నా పేరు భరత్, మరి నీ పేరు?” అని అడిగాడు.

“పోలేరమ్మ” అని సమాధానం చెప్పింది.

“అమ్మయ్య ! అయితే పోలేరమ్మ మూగది కాదన్న మాట ” అని మనసులో అనుకుని ,

“నువ్వు బడికి ఎందుకు వెళ్ళవు?” అని మళ్ళీ ప్రశ్నించాడు. ఈ సారి మాత్రం వాడు ఊహించినట్లుగా ఎదుటివైపునించి సమాధానం రాలేదు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.

ఈ సారి “ ఏ భాష “ మాట్లాడిందో కానీ పోలేరమ్మ చేతి సైగతో తను అడిగింది ఆ అమ్మాయికి “అర్థం కాలేదు “ అని భరత్ లుసుకున్నాడు. ఇంతలో దివ్య ఆట ముగించి రావటంతో ఇద్దరూ ఇంటికి వెళ్ళి పోయారు.

పోలేరమ్మ పలికిన “ఆ పదం” గుర్తు పెట్టుకుని భరత్ గబ గబా ఇంటికి వచ్చి అంతర్జాలంలో (Inter net) “ఆ పదం” ఏ భాష లోదో , దానికి అర్థం ఏమిటో కూడా తెలుసుకున్నాడు. “కానీ మరి నీ పేరేమిటి అంటే పోలేరమ్మ అని చెప్పిందిగా, అది ఎలా అర్థమయిందీ ?” అని సందేహం వచ్చి “పేరు” కి ఆ భాషలో అర్థం చూశాడు. పోలేరమ్మ మాట్లాడిన భాషలోనూ , తెలుగులోనూ కూడా “పేరు” అంటే ఒకటే అర్థం అనీ తెలుసుకున్నాడు. దాంతో వాడికి పోలేరమ్మకి తెలుగు తెలియదని , బహుశా ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదేమోననీ సందేహం కలిగింది.

“ పోలేరమ్మ తెలుగు అమ్మాయి కాకపోతే మరి ఎదురింటి వాళ్ళు ఆ అమ్మాయి తమ కూతురే అని చెప్తున్నారే అందరితో! నేనేమైనా అనవసరంగా సందేహిస్తున్నానా లేక ఇందులో ఏదైనా తిరకాసు ఉందా?“ అనుకున్నాడు భరత్ . అసలే తెలివైన వాడి బుర్రకి పలురకాల ఆలోచనలు ఈ విషయంలో . విషయం అర్థమయీ కానట్లుగా ఉంది – పోలేరమ్మ ఎందుకు బడికి వెళ్ళదో, ఎందుకు ఎప్పుడు ఆ చిన్నపాప పనులన్నీ చేస్తుంటుందో, ఆ రోజు ఎందుకు ఏడ్చి ఉంటుందో ....ఇత్యాది విషయాలన్నిటికి ఫలానా కారణం అయిఉండవచ్చు అని వాడికి అనిపించినా “ అది ఎంతవరకు నిజమో ముందు తెలుసుకోవాలి “ అనుకున్నాడు.

ఆ మర్నాడు భరత్ వాళ్ళ స్కూలులో, ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా సమాజంలో పిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలు , వాటిని గ్రహించుకుని తగు జాగురూకతతో పిల్లలు ఎలా ప్రమాదాలనించి తమని తాము కాపాడుకోవాలి , అత్యవసర మరియు ఆపత్కర పరిస్థితులలో సంప్రదించవలసిన వారి తాలూకు వివరాలు .. .........ఇత్యాది విషయాల పైన ఒక సదస్సు (Seminar) నిర్వహించారు. అందులో బాల కార్మికుల గురించి కూడా ప్రస్తావించటం జరిగింది. భరత్ మొదటినించి చివరిదాకా ఎంతో ఆసక్తిగా ఆ వక్తలు చెప్పినవన్నీ విని ఆకళింపు చేసుకున్నాడు. ఎప్పటికైనా పనికి వస్తాయి అనిపించిన కొన్ని విషయాలని ఒక నోట్ పుస్తకంలో వ్రాసుకున్నాడు.

సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆ విషయాల గురించే ఆలోచిస్తుండగా వాడికి హఠాత్తుగా పోలేరమ్మ గురించిన ఒక విషయం అర్థమయింది.

“ అవును బహుశా అదే పోలేరమ్మ విషయంలో జరుగుతోంది “ అనుకుని , ఆ రోజు నించి మరింత శ్రద్ధగా పోలేరమ్మని గమనిస్తూ, సాయంత్రం ఆటల దగ్గర నెమ్మదిగా ఆ అమ్మాయితో “ అక్కా” అంటూ మాటలు కలిపి , పోలేరమ్మకి తెలుగు రాదని నిర్థారించుకుని కొన్ని తెలుగు పదాలు పోలేరమ్మకి నేర్పిస్తూ , తాను కొన్ని ఆ అమ్మాయి భాషా పదాలు నేర్చుకుంటూ .... .... నెమ్మదిగా పోలేరమ్మతో స్నేహం పెంచుకోసాగాడు .

ఈ మధ్యలో కొన్ని సార్లు పోలేరమ్మ ఏడవటం భరత్ చూసినప్పటికి వాడెప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఈ విషయం ప్రస్తావించలేదు. పోలేరమ్మ కూడా భరత్ తనని “అక్క” అని పిలిచి రోజు ఆప్యాయంగా పలకరించి కబుర్లు చెప్తుంటే తాను కూడా వాడిని తన తమ్ముడిలాగా భావించి అభిమానించసాగింది. ఇలా కొంతకాలం గడిచింది.

పోలేరమ్మ కి తనపై నమ్మకం కుదిరింది అని గ్రహించాక ఒకరోజు భరత్ “ అక్కా , నువ్వు అప్పుడప్పుడు ఎందుకు బాల్కనీలో నిలబడి ఏడుస్తుంటావు?“ అని అడిగాడు ఆప్యాయంగా.

అప్పటివరకూ ఏనాడూ ఎవరు అంత ఆప్యాయంగా తన గురించి అడుగగా ఎరగని పోలేరమ్మకి భరత్ అలా అడిగేటప్పటికి దుఃఖం ముంచుకొచ్చింది . నెమ్మదిగా సంబాళించుకుని తన గురించి వాడికి వచ్చీ రాని తెలుగులోను , కొంత తన భాషలోనూ వివరించి చెప్పేసింది. అంతా విన్న భరత్ కి పోలేరమ్మ అక్క గురించి ఆ నాడు తనకు కలిగిన అనుమానం నిజమేనని నిర్థారణ అయింది.

“ ఊరుకో అక్కా బాధపడకు , నీకు అంతా మంచే జరుగుతుంది” అని పోలేరమ్మని ఓదార్చాడు.

ఇది జరిగిన రెండు రోజుల తరువాత ఒక రోజు సాయంత్రం భరత్ వాళ్ళ ఇంటికి ఇద్దరు మగ పోలీసులు ఒక ఆడ పోలీసు వచ్చారు. భరత్ తల్లిదండ్రులిద్దరూ పోలీసులు తమ ఇంటికి రావటం చూసి భయ పడిపోయారు.

“ ఇవాళ ఉదయం ఈ ఇంటి నించి మాకు భరత్ అనే అబ్బాయి నించి ఒక ఫోన్ వచ్చింది , ఆ అబ్బాయి మీకు ఏమవుతాడు?” అని అడిగారు అందులో సీనియర్ ఆఫీసరుగారిలా కనిపిస్తున్న ఒకాయన .

“భరత్ మా అబ్బాయండి , ఏం జరిగింది, వాడేం తప్పు చేశాడు?” అన్నారు ఆందోళనగా భరత్ తల్లిదండ్రులిద్దరూ.

“భరత్ ని ఒకసారి పిలవండి , వాడితో మాట్లాడాలి” అన్నారు ఆయన .

“భరత్ ఇలారా నాన్నా ఒకసారి”, అని పిలిచింది వాళ్ళమ్మ.

ఇంకొకవారంలో పరీక్షలని తన గదిలో చదువుకుంటున్న భరత్ తల్లి పిలుపు విని బయటకి వచ్చాడు.

హాలులో పోలీసులని చూసి కంగారుపడకుండా “నమస్కారమండి ” అన్నాడు వాళ్ళకేసి చూస్తూ.

“ బాబు నువ్వేనా ఈ నంబరుకి ఫోన్ చేసింది?” అన్నారు ఆ సీనియర్ ఆఫీసరు కాగితంపై రాసి ఉన్న ఒక నంబర్ భరత్ కి చూపిస్తూ . “అవునండి” అన్నాడు భరత్.

” ఈ నంబరు నీకు ఎవరిచ్చారు?” అని అడిగారు ఆయన భరత్ ని.

అప్పుడు భరత్ ఒక రోజు తన స్కూలులో సాంఘిక సంస్థవారు నిర్వహించిన సదస్సు గురించి చెప్పాడు.

“ ఆ సదస్సులో ఎప్పుడైనా అవసరమైనప్పుడు సంప్రదించటానికి కొన్ని నంబర్లు ఇచ్చారు. అందులో ఒక నంబరు, ఇప్పుడు మీరు చూపించినది , దానికే నేను ఫోన్ చేశాను” అని చెప్పాడు భరత్ ఆఫీసరుగారితో.

“అసలు విషయమేమిటి? ఫోన్ చేయవలసిన అత్యవసరం ఏమొచ్చింది? అంతా వివరంగా చెప్పు” అన్నారు ఆయన మళ్ళీ .

అప్పుడు భరత్ ఎదురింటి అమ్మాయి పోలేరమ్మ గురించి తనకు తెలిసిన విషయాలు, తనకు కలిగిన అనుమానం, అది నిర్థారణ చేసుకోవటానికి గత కొంతకాలంగా తాను చేసిన ప్రయత్నాలు, ఆఖరుకి రెండురోజుల క్రితం పోలేరమ్మ స్వయంగా తనతో చెప్పిన విషయం ...... పోలేరమ్మ తల్లి రోహిత్ వాళ్ళింట్లో పని చేస్తుండేది. రోహిత్ దంపతులకి ఉద్యోగరీత్యా ఈ ఊరుకి బదిలీ అవటంతో, పోలేరమ్మని వాళ్ళ పాపకి తోడుకోసం తమతో పంపమని , నెలకి కొంత డబ్బు పోలేరమ్మ పేరుతో బ్యాంకులో వేస్తామని , పోలేరమ్మకి ఏ లోటు రానీయకుండా తమ కూతురిలా చూసుకుంటామనీ బాగా చదివిస్తామనీ ,..... ఇలా ఎంతో నమ్మబలికారు. పోలేరమ్మ తల్లిదండ్రులు చాలా బీదవారు కావటం, ఎక్కువమంది పిల్లలు తక్కువ ఆదాయం ...ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్లనూ , రోహిత్ దంపతులు ఇస్తామన్న డబ్బుకి ఆశపడి , కనీసం ఒక బిడ్డకైనా కొంచం మంచి జీవితం దొరుకుతుందనే ఆశతో ఒప్పుకుని పోలేరమ్మని రోహిత్ దంపతులతో పంపించారు. తీరా ఇక్కడికి వచ్చాక పోలేరమ్మని చదివించటం లేదు సరికదా ఆ అమ్మాయితో బండ చాకిరీ చేయించుకుంటున్నారనీ , ఆఖరుకి పోలేరమ్మని తల్లిదండ్రులని కలుసుకోవటానికి కూడా పంపించమంటున్నారని .............ఇవన్నీ పోలేరమ్మే తనతో స్వయంగా చెప్పి కంట తడి పెట్టుకుందనీ ............ ఆఫీసరుగారికి వివరించి చెప్పాడు భరత్ .

“ నీ మాట ప్రకారం ఇప్పుడు మేము వెళ్ళి అడిగిన తరువాత తీరా ఆ అమ్మాయి తాను అలా ఏమి చెప్పలేదంటే? మన దగ్గిర బలమైన సాక్ష్యం లేనిదే ఒక మర్యాదస్తుల కుటుంబాన్ని అనుమానించటం అంత మంచిది కాదు ?” అని అన్నారు ఆఫీసరుగారు .

అప్పుడు భరత్ “ నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది” అని తన గదిలోకి వెళ్ళి ఆ సాక్ష్యం తెచ్చి ఆఫీసరుగారికి ఇచ్చాడు. అది ఒక సెల్ ఫోన్. ఈ మధ్యనే భరత్ వాళ్ళ డాడీ కొత్త ఫోన్ కొనుక్కుని , తన సెల్ ఫోన్ భరత్ కి ఇచ్చారు. వాడు ఇంట్లో ఉన్నప్పుడు దాన్లో గేమ్స్ ఆడుకుంటుంటాడు . పోలేరమ్మ తో మాట్లాడదామని ముందుగానే ఆలోచించుకుని ఉండటంవల్ల , ఆ రోజు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని పోలేరమ్మ తనతో మాట్లాడినదంతా , ఆ అమ్మాయికి తెలియకుండా , రికార్డు చేశానని చెప్పాడు భరత్. అది విన్న ఆయన , భరత్ తెలివితేటలకి మెచ్చుకున్నారు. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భరత్ ని తీసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు తట్టారు .

తలుపుతీసిన పోలేరమ్మ పోలీసులని చూసి భయపడి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తల్లిదండ్రులని (అలా అని చెప్పుకుంటున్న వాళ్ళని) లేపి తీసుకొచ్చింది.

ముందు వాళ్ళు ఆ నేరారోపణ అంతా అబద్దమని దబాయించినా పోలీసు ఆఫీసరుగారు సాక్ష్యం చూపించి బెదిరించేటప్పటికి నిజం ఒప్పేసుకున్నారు. ఈ హడావిడి అంతా చూసి దివ్య (రోహిత్ సంగీత దంపతుల చిన్న పాప) భయపడి వెక్కి వెక్కి ఏడవసాగింది. పోలేరమ్మ దివ్యని దగ్గరికి తీసుకుని నిలబడింది ఒక పక్కగా.

భరత్ ఫోన్ లో రికార్డు చేసిన మాటల తాలూకు కంఠస్వరం తనదేనని , అదంతా నిజమేనని పోలేరమ్మ ఆఫీసరుగారి ముందు అంగీకరించింది .ఆ తరువాత అన్నీ చక చక జరిగి పోయాయి. ఆ సంబంధిత ఆఫీసరుగారు రోహిత్, సంగీతలని గృహ సంబంధిత బాల కార్మిక నివారణ చట్టం క్రింద నేరస్తులుగా పరిగణిస్తూ అదుపులోకి (Custody) తీసుకున్నారు . దివ్య సంరక్షణని రోహిత్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది.

మరి పోలేరమ్మ సంగతేమిటని భరత్ తల్లిదండ్రులు ప్రశ్నించగా “ పోలేరమ్మ తల్లిదండ్రులని పిలిపించి , వారికి విషయమంతా తెలియజేసి , పోలేరమ్మని వారికి అప్పచెపుతాము. అంతవరకూ పోలేరమ్మని బాలికల సంక్షేమ వసతి గృహానికి పంపుతామని “ అన్నారు ఆఫీసరుగారు.

ఒక అమ్మాయిని వెట్టిచాకిరి నించి తప్పించటంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన భరత్ ని ఆయన ఎంతగానో అభినందించారు. ఆఫీసరుగారితో వెళుతున్న అక్క పోలేరమ్మని చూసి సంతోషంగా చేయి ఊపుతూ టాటా చెప్పాడు భరత్.తనకి వెట్టిచాకిరీనింఛి “విముక్తి “ కలిగించిన భరత్ కేసి ఆప్యాయంగా , కృతజ్ఞతగా చూస్తూ తానూ సంతోషంగా భరత్ కి వీడ్కోలు చెప్పింది పోలేరమ్మ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు