సద్వినియోగం - ఆచంట హైమవతి .

sadviniyogam

సరస్వతి , జగదంబ చిన్ననాటి సహాధ్యాయులు . పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అత్తవారిళ్ళు... ఒకరికొకరు బంధువుల కావటం వల్ల వాళ్ళ 'స్నేహం' సాగుతూనే ఉంది .

పక్కఊరిలో పెళ్ళికి వచ్చారు సరస్వతి కుటుంబం ! అందర్నీ పంపేసి తను మాత్రం జగదంబ దగ్గర నాలుగు రోజులు గడుపుదామని ఆగింది సరస్వతి . అదే పెళ్ళికి జగదంబ , భర్త వెళ్ళటం - సరస్వతిని తనతో వచ్చి, ఉండమని బతిమాలటం కుడా కొంతకారణం!

" నువ్వు ఆ పెళ్ళికి రాకపోయినా నేనొచ్చి నీ దగ్గర నాలుగు రోజులుండి వెళ్ళేదాన్నే! మొదటినించీ నేననుకుంటున్నదేనే ఈ పెళ్ళికి వెళ్ళటం జరిగితే నీతో గడిపి వెళ్లాలని ! " నవ్వుతూ అంది సరస్వతి .

అలా -అలా మాట్లాడుకుంటూ 'పూజ గది' లోకి వెళ్ళారిద్దరూ! జగదంబ మనుమడు ఐదేళ్ళ వాడు బామ్మతో కలిసి పూజ చెయ్యాలని కాచుక్కూచున్నాడు . వాడి శ్రద్ధ చూసి , చాలా ముచ్చట పడింది సరస్వతి .

" ఇంకా ముద్దమాటలు తగ్గలేదని ఊరుకున్నాను గాని...లేకపోతె ఈపాటికి అంగపూజా - అష్టోత్తరం నేర్పెద్దును .. " అంది మనుమడి తలనిమురుతూ జగదంబ .

" అయ్యో నీ అసాధ్యంకూలా...ఏమిటంత అర్జంటు?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి .

"చిన్ననాటినించే పిల్లలకన్నీ నేర్పాలి సరసూ! లేకపోతె పెద్దైన తర్వాత నలుగురిలో 'అభాసు' పాలౌతాం దీక్షితులుగారి మనుమడిలా!" పాక పకా నవ్వుతూ అంది జగదంబ

******** ********** ********** ********** **********

హడావిడి పనులు పూర్తయ్యాక సావధానంగా కూచున్నారిద్దరూను .

" ఇప్పుడు చెప్పు ఏదో చెప్తానన్నావుగదా ! దీక్షితులుగారి మనుమడు... " అందించింది సరస్వతి .

" ఓహ్...అదా... ?" అంది జగదంబ కిల కిల నవ్వుతూ.

" అబ్బ... ఊరించి చంపకే.... చెప్పు... " అన్న సరస్వతితో ---------------

" నాలుగిళ్ళ అవతల ఎవరో కొత్త జంట అద్దెకొచ్చారు ! చుట్టుపక్కల మా నలుగుర్నీ తాంబూలానికి పిలిస్తే వెళ్లాను. పూజకేమీ సిద్ధం చేసుకోలేదు వాళ్ళు ! వెళ్ళిన నలుగురం అన్నీ అమర్చసాగాం... హరివాణం, ఉద్దరిణి ఉన్నాయి...కాని-పంచపాత్ర లేదు.... అనగానే దీక్షితులుగారి భార్య - తెమ్మని వారి మనుమణ్ణి పంపింది . ఆ కుఱ్ఱ్రాడు తెచ్చినవి చూశాక - అక్కడ చాలామందికి వవ్వాగలేదు ! "

పది లీటర్లు ...పట్టే ఒక పెద్ద ష్టీలుగిన్నె , అరచేతి వెడల్పున్న 'జరీ అంచు పంచ' తెచ్చాడు . నవ్వుతున్నవాళ్ళను చూస్తూ తనేదో 'తప్పు' చేసినట్లు ఫీలయ్యాడాకుఱ్ఱాడు - " ఓహో...పంచ -అంటే ఐదు కదా? ఔనౌను ... ఇంకా నాలుగు పాత్రలు తేవాలన్నమాట... సోరీ... తెచ్చేస్తానుండండి" అంటూ మళ్లీ పరుగెత్తబోయాడు .

" వాళ్ళెక్కడో 'ఢిల్లీ ' లో ఉంటారు . వాళ్లకి 'పూజా - పునస్కారాలు' తక్కువ . నేనెళ్ళి తెస్తానుండండి !" అంటూ దీక్షితులు గారిభార్యే బయలుదేరి వెళ్ళింది . "యజ్ఞాలూ -యాగాలూ చేయించే ' ఆహితాగ్ని' దీక్షితులు గారి మనుమడికి 'పంచపాత్ర'అంటే... తెలియదా??? "అక్కడందరూ అదే మాట..." ఏం చేస్తాం- చెప్పండి ఇప్పటి సంసారాల్లో ఎవరిష్టం వారిది కదా? పెద్దవారే అనుసరిచకపొతే... ఇంక పిల్లలకెలా తెలుస్తాయ్?" నవ్వుతూనే అన్నా - దీక్షితులుగారి భార్యకిది కొంచెం అవమానంగానే అనిపించి ఉంటుంది పాపం ! ఎందుకంటే అస్తమానం అందర్నీ 'తప్పు'పడుతూనే ఉంటుందావిడ"

" నువ్వు చెప్పింది నిజమే జగదంబా! చిన్ననాటి నుంచీ మన సంప్రదాయాలు పిల్లలికి నేర్పించాలి. మంచి - చెడు వివరించి చెప్పాలి . సాధ్యమైనంతవరకూ వాళ్ళని 'సుపధం' వైపు మళ్ళించాలి! చక్కని వ్యక్తిత్వంతోబాటు మన వేదధర్మాలను, మన సంస్కృతినీ కూడా అర్ధమయ్యేలా బోధించాలి! " మనస్ఫూర్తిగా అంది సరస్వతి .

"ఇంకో వింత చెప్పమన్నావా సరసూ...! నేనిందాకా చెప్పిన కుఱ్ఱాడే 'డిగ్రీ' పూర్తయాక తాతగారి దగ్గరకి వచ్చేశాడు . వేదాలూ -శాస్త్రాలు , ఉపనిషత్తులూ- పురాణాలూ ,మీమాంసలూ... ఒకటేమిటి అన్నీ పుక్కిట పట్టేశాడు! పండితుడైపోయాడు... పామరజన్నాన్ని చేర్చి విద్యావంతుల్ని చేస్తున్నాడు . అన్ని విధాలా 'ఉద్దండుడు' అనిపించుకున్నాడు తెలుసా ? ఒక్కోసారి ఆనాటి 'పంచపాత్ర' సంగతి చెప్పి... 'నిజంగా ఆనాడు

ఆ సంఘటన జరగకపోయి ఉంటే - దాన్ని నేను సీరియస్ గా తీసుకోకపోయి ఉంటే , ఈ 'సంపన్నిధి' ని నేను తెలియకుండానే - కోల్పోయి ఉండేవాణ్ణి!" అని ఉదహరిస్తూ... విద్యార్ధులను ప్రోత్సహిస్తుంటాడు .

" నీ దగ్గిరకి వచ్చినందుకు ఒక చక్కని విషయం గ్రహించాను జగదంబా! నేనుకూడా మా మనుమరాలికి స్తోత్రాలూ - స్తవాలూ నేర్పటం మొదలెడతాను" అంది సరస్వతి!

" వాళ్ళు చదువుతుంటే నేర్పిన మనకెంత తృప్తిగా ఉంటుందో గమనించు" మెరుస్తున్న కళ్ళతో అంది జగదంబ . స్తోత్రాలు నేర్చుకునే పిల్లలు గుంపుగా రావటంతో లేచి వెళ్ళింది జగదంబ .

" తను కూడా 'ఇలా' కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు" అనే నిర్ణయానికి వచ్చింది సరస్వతి .

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు