“అమ్మడూ, “లైక్’ అంటే ‘ఇష్టం’ అనే కదా అర్ధం?” అంటూ మా నానమ్మ ఓ ప్రశ్న సంధించింది భోజనాల దగ్గర.
“ఎందుకమ్మా ఇంటర్ వరకూ చదువుకున్న నీకు అంత పెద్ద డౌటొచ్చింది?” అన్నారు మా నాన్న.
“ ఏం లేదురా వాడుకను బట్టి ఒక్కోసారి భాష లోని పదాల అర్దాలు మారుతూ ఉంటాయని చదివాను. అలా ఈ ‘లైక్” కి కూడ అర్దం మారిందేమోనని..” అని మా నానమ్మ చెపుతూండ గా…
“వాట్’! వర్డ్స్ మీనింగ్స్ చేంజ్ అవుతాయా? అదెలా/ ఎప్పుడేనా అలా జరిగిందా నాన్నమ్మా? ఎగ్జాంపుల్ ప్లీజ్?” మా తమ్ముడు ప్రశ్న మీద ప్రశ్న వేసేసాడు.
“అవును నానా! వెనకటి కాలంలో తెలుగులో “కంపు” అంటే ‘సుగంధం’ అనే అర్ధం ఉండేదంట.” ‘Nervous’ అనే ఇంగ్లీష్ పదానికి ‘ బాగా బలవంతుడు’ అనె అర్ధం ఉండేదిట.
“Oh my God!’ నేను ఎగ్జామ్ లో ఆన్సర్ రాసేసిన తరువాత ఇలా అర్ధం మారిపోతే నాకు మార్క్స్ ఇస్తుందా మా టీచర్? మాకెలా తెలుస్తుంది ఇలా meanings మారిపోయయని?” అంటూ నాల్గవ తరగతి చదివే మా తమ్ముడు గగ్గోలు పెట్టాడు.
“ ఒరేయి, ఆపరా నీ గోల అలా ఏం జరగదులే,” అంటూ మా తమ్మున్ని గదమాయించి, ఇంతకీ ఈ ‘లైక్’ కి అర్ధం మారిందని ఎందుకనుకున్నారు అత్తయ్యా?” అంటూ మా అమ్మ ప్రశ్నించింది.
మా నానమ్మ ఏదో చెప్పేలోగా మా తమ్ముడు, “నాన్నమ్మా, I am very nervous,” అంటూ వాడి చెయ్యి మోచేతి వరకు ఎత్తి, కండరాలు బిగించి చూపించసాగాడు. అదేంట్రా అన్నాము అందరమూ ఒకేసారి. “అదే nervous అనే పదానికి అర్దం ఇప్పటి strong గా ఉండి ఉంటే ఇలాగే కదా అనాలి అని.” అందరమూ ఘొల్లుమని నవ్వాము.
“వాడి ఆటలకేం గానీ మీరు చెప్పండత్తయ్యా,” అంది అమ్మ
“ఆ ముఖ పుస్తకంలో, అదేమ్మా ఫేస్ బుక్ లో ఒకమ్మాయిపై యాసిడ్ పోసారనీ, ఆ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉందనీ, కుటుంబ సభ్యులు దయనీయంగ ఏడుస్తున్నారనీ ఎవరో పోస్ట్ పెట్టారు. దానికి ౨౦౦ పైగా లైకులు. మన రాజారావు లేడూ అంటూ మా నాన్న వేపు తిరిగింది. “అవునూ, మొన్న హార్ట్ సర్జరీ అయింది కదా” అన్నారు నాన్న. ఆ ఆయనే, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇలా జరిగిందీ అని పెట్టారు. దానికి ఒక యాభై రెండు మంది లైకు పెట్టారురా. మరో దగ్గర ఒక ముసలి వాళ్ల ఆశ్రమంలో వారికి సరి అయిన వసతులు లేవనీ, ఆ కార్యకర్తలు డబ్బు తీసుకుని కూడా వాళ్ళని సరిగా చూడడం లేదని పెడితే దానికో వెయ్యి పైగ లైకులు. ఇలాంటి వాటిని ఇష్టపడటం ఏమిటి. జనాలు అంత సాడిస్టులవుతున్నరా, లేక ఈ ‘లైక్’ అనే పదానికి అర్దం వేరేనా అని అనిపించి అడుగుతున్నాను,” అంది నాన్నమ్మ.
“అదా విషయం,” అని నవ్వెసారు అమ్మ, నాన్న.
(ఏమీ తోచట్లేదు అంటుందని ఈ మధ్యే మా నానమ్మకి ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేసి అది వాడటం నేర్పించాను.)
“ఓహ్, ఫేస్ బుక్ లైకులా! ఆ లైకులకు, అంటే ఫేస్ బుక్ కి సంబంధించిన వరకు చాలా అర్దాలు ఉన్నాయి నాన్నమ్మా,” అంటూ మొదలుపెట్టాను నేను. ఈరోజుల్లో అందరూ ఈ ఫేస్ బుక్ వాడుతున్నారు. కానీ అందరూ చాలా బిజీ, బిజీ. తమ పోస్టులు పెడతారు, కొన్ని పోస్టులకు స్పందిస్తారు కూడా. కానీ , అందరివీ చూసి అన్నిటికీ స్పందించాలంటే చాలా కష్టం. అలాటి వారికి ఈ లైక్ బటన్ ఒక వరం.
ఎవరైనా పెట్టిన పోస్ట్లకు దాన్ని చూసిన వారు లైకులు పెడుతూ ఉంటారు. అలా పెట్టిన్ కొన్ని లైకులకు అ పోస్ట్ మేము చూసాము అని అర్దం అయితే, మరికొన్ని లైకులకు ‘మీ పోస్ట్ బాగుంది అని అర్దం. ఏవేనా మంచి విషయాన్ని తెలియచేసేదైతే మంచి విషయాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అని అర్దం. ఒక విమర్షనాత్మక రచనకు లైకులు పెడితే మీ అభిప్రాయంతో మేమూ ఏకీభవిస్తున్నాము అని, ఒక విచారకరమైన వార్తకైతే ఇది మాకూ చాలా విచారకరం అనీ, ఒక అభినందనీయ విషయమైతే మిమ్మల్ని మేము అభినందిస్తున్నామని అర్దం. అదే ఇందాక నువ్వు చెప్పినట్టు యాసిడ్ వార్తో లేదా ఆశ్రమం వార్తో ఐతే దీన్ని మేము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక అర్దమైతే, ఇలాటి వార్తలు అందరికీ తెలిసేలా చేసినందుకు మీకు దన్యవాదాలనీ అర్ధమూ రావచ్చు. ఇదిగో ఈ రాజారావు అంకుల్ లాంటి విషయమైతే, అయ్యా విషయం తెలిసింది త్వరలో మిమ్ముల కలుస్తాము అనీ అవ్వచ్చు, లేదా మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తున్నామనీ అవ్వొచ్చు. అదే ఒక మరణ వార్త ఐతే వారి ఆత్మకు శాంతి కలుగు గాక అని కూడ అర్దం చేసుకోవచ్చు.”
“అమ్మో ఇన్ని అర్దాలే! మరి, కొన్ని సార్లు మనం పెట్తిన కామెంట్లను కూడా లైకుతారు కదా కొందరు?” అంది నానమ్మ ప్రశ్నార్దకంగా. అదీ అలాగే. మీ కామెంటు మేము చుసామనీ కావచ్చు, మీతో మేము ఏకీభవిస్తున్నామనీ కావచ్చు, మీరు బహు బాగా చెప్పారనీ కావచ్చు. అవి అభినందనలు లేదూ శుభాకాంక్షలు లాటివైతే, మీకు మా ధన్యవాదాలు అనీ, ఎవరి దన్యవాదాలకైన లైకు పెడితే, మీ దన్యవాదాలు మేము స్వీకరించమనీ, అదే ‘ యు ఆర్ వెల్కమ్’ అనీ అని అర్దం చేసుకోవచ్చు.
ఓహ్ అలాగా! లైకుకి అర్దం మారలేదు కాని అది చాలా అర్దాలను సంతరించుకుందన్నమాట. జయహో లైకు బటన్! అంది మా నానమ్మ.
‘ఉయ్’ అంటూ అందరమూ చెయ్యెత్తాము ఇంగ్లీష్ వింగ్లీష్ లో శ్రీదేవి లాగా.