ముసలమ్మ మనోబలం - -దాసరి వెంకట రమణ

musalamma manobalam

కృష్ణరాయపురం అనే గ్రామలో ఒక ముసలమ్మ వుండేది. నా అనే వాళ్ళెవరూ లేని ఆమె ప్రతిరోజూ ఒక గంపనిండా గారెలు చేసుకొని కొండమీద వుండే గుడికి వెళ్లి అమ్ముకునేది. ఆమె గారెలు తీసుకుని మెల్లగా నడుస్తూ గుడి వైపు వెళ్తూ వుంటే దారిలో వాడుకగా ప్రతిరోజూ ఆమె గారెల కోసం జనం ఎదురు చూసేవారు.

అలాగే కొండమీద కూడా ముసలమ్మ అభిమానులు చాలామందే వుంటారు. అక్కడ కూడా ముసలమ్మ గారెల కోసం పిల్లలు పెద్దలు ఎదురు చూసేవాళ్లు. మెట్ల దారిలో కూడా ఆమెకు ఎదురు పడిన వాళ్ళే కాక, ఇతర చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళంతా వర్తనగా ముసలమ్మ గారెలు కొంటుంటారు.

ఒకరోజు కొండమీద దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఒక ధనవంతుడు ముసలమ్మను చూశాడు. ఆ వయసులో గారెలగంప చంకలో పెట్టుకుని ఆయాస పడుతూ మెట్లు ఎక్కుతున్న ఆవిడను చూడగానే ధనవంతుడికి విపరీతమైన జాలి కలిగింది. కిందికి దిగుతున్న ఆయన ఆగి ముసలమ్మ వైపు వచ్చాడు. అతడిని చూసిన ముసలమ్మ గారెలు కొంటాడేమో అని గంప మెట్ల గోడమీద పెట్టి, ఆగింది.

ధనవంతుడు ఒక గారె చేతిలోకి తీసుకొని, "అవ్వా ఈ గంపలోని గారెలన్నీ నేను కొంటాను ఎంతో చెప్పు?'' అన్నాడు.

ముసలమ్మ ఆశ్చర్యంగా ధనవంతుడి వంక చూసింది. ఆయన ముఖంలో తనపట్ల జాలి కనబడింది. "ఎందుకు?" అని అడిగింది. ఆ ధనవంతుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తాను మొత్తం అమ్మమనగానే ఆ ముసలిది సంతోషించి తన పట్ల కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ గారెలు మొత్తం అప్పగిస్తుంది అనుకున్నాడు కానీ, ఈ ప్రశ్నను ఊహించలేదు. ధనవంతుడికి కొద్దిగా కోపం కూడా వచ్చింది. "ఎందుకైతే నీ కెందుకు? నేనే తింటాను. ఇంటికి తీసుకెళ్తాను. ఇక్కడున్న వాళ్ళకు ఉచితంగా పంచుతాను. లేదంటే అదిగో ఆ కనపడే గోడ వెనుక గిరాటేస్తాను. మొత్తం గారెలు గంపగుత్త ఏంతో చెప్పు!" అన్నాడు.

ధనవంతుడు అలా కోపంగా మాట్లాడినా ముసలమ్మ శాంతంగా "నేను మొత్తం అమ్మను. కావాలంటే ఒకటో రెండో ఇస్తాను కొనుక్కో" అన్నది.ధనవంతుడు ఎన్ని రకాలుగా అడిగి చూసినా ముసలమ్మ వినలేదు. చివరికి విసిగిపోయిన ధనవంతుడు "ముసలిదానా! అనాధలకు సేవ చేయడం నాకు అలవాటు. నీకు మంచి చేద్దామనుకుంటున్నాను. ఈ గారెల గంప ఎత్తుకుని ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కుతూంటే చూడలేక జాలిపడి మొత్తం కొంటానంటున్నాను... వినిపించుకోవే!" అన్నాడు మరింత కోపంగా.

ముసలమ్మ అంతకు రెట్టించిన శాంతంతో "నా మీద జాలి చూపించడం నాకు నచ్చదు నాయనా!" అన్నది.

ధనవంతుని కోపం నషాలానికంటింది. అతని భార్యా, సేవకులూ వారిస్తున్నా వినకుండా "ఏం చూసుకుని నీకీ పొగరు. నీవు మామూలుగా ఏం ధరకు అమ్ముకుంటావో చెప్పు... దానికి పది రెట్లు ఎక్కువిస్తాను" అన్నాడు.

ముసలమ్మ చాలా ప్రశాంతంగా వద్దన్నది. ధనవంతుడికి అక్కడ నలుగురిలో తన తల తీసేసి నట్లయింది. తన మర్యాద నిలబడే మార్గం ఏమిటో అర్థం కాలేదు. ఏం చేసినా ముసలిది అమ్మేటట్టు లేదు. ధనవంతుడు ఎదురుగా వున్న మెట్ల గోడమీద కూర్చొని ఆలోచించ సాగాడు. ముసలమ్మ తన దగ్గరికి వచ్చిన వాళ్లకు డబ్బులు తీసుకుని గారెలు అమ్ముతూనే వుంది. కొద్దిసేపు చూడగానే ఒక గారెధర ఏంతో అర్థమైంది. చివరిసారిగా ప్రయత్నిద్దామని చెప్పి ధనవంతుడు ముసలమ్మ దగ్గరికి వెళ్లి డబ్బులు లెక్కపెట్టి తీసి ఇస్తూ ''వాటి మామూలు ధరకన్నా వంద రెట్లు ఎక్కువిస్తున్నాను ఇందా తీసుకో!'' అన్నాడు. అతని గొంతులో ఇందాకటి దర్పం లేదు. ముసలమ్మ వద్దన్నది. ధనవంతుడు తిరిగి వచ్చి మళ్ళీ మెట్లగోడ మీద కూర్చున్నాడు. ఆమె మామూలుగా లేచి గంప తీసుకుని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి పోయింది.

దాదాపు కొండ మొత్తం ఎక్కిన తర్వాత గుడి కాస్త దూరంలో ఉందనగా ఆ ధనవంతుడు మెట్లు ఎక్కి తనవైపు రావడం ముసలమ్మ గమనించింది. వెంటనే గంప దింపి మళ్ళీ మెట్లగోడ మీద కూర్చుంది. ధనవంతుడు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. డబ్బులు ఇచ్చి ఒక గారె కొనుక్కుని తిన్నాడు. చాలా రుచిగా వుంది. ఆ మాటే ఆమెతో అన్నాడు. ముసలమ్మ సంతోషించింది.

మరో రెండు గారెలు కొని తిన్నాక, ధనవంతుడు తన కుతూహలం ఆపుకోలేక "అమ్మా! నిజం చెప్పండి. నేను గారెలు మొత్తం కొంటానంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు?" అని ప్రశాంతంగా అడిగాడు.

ముసలమ్మకు అతని వాలకం చూడగానే జాలి కలిగింది. "అయ్యా! మీరు నామీద జాలిపడి గారెలు మొత్తం కొంటా అంటున్నారని మిమ్మల్ని చూడగానే అర్థమైంది. నేను మీకు మొత్తం గారెలు అమ్మక పోవడానికి నా కారణాలు నాకున్నాయి." అన్నది.

"ఏమిటవి?" తెలుసుకోవాలని ధనవంతుడికి చాలా అత్రుతగా వుంది.

"అయ్యా! మొత్తం గారెలు మీకు అమ్మి తిరిగి ఇంటికి పోయి నేను ఏం చేయాలి? అదీగాక ప్రతీరోజు నా గారెల కోసం ఎదురు చూసే వాళ్ళు కొందరున్నారు. నేను రాకపోయే సరికి వాళ్ళంతా నిరాశ పడరా?"

"నీవు చెప్పేది చాలా వింతగా వుందే! ఈ రోజు నీకు చాతనవుతుంది వస్తావు. రేపు నీకు ఏదైనా జరిగి మంచంలో పడ్డావనుకో ... అప్పటి సంగతి ఏమిటి?"

"ఏది ఎప్పుడు ఎలా జరుగాలని వుంటే అలా జరుగుతుంది. జరుగబోయే దాన్ని ఎవరూ ఆపలేరు, మార్చలేరు. దాని గురించి ముందుగా బాధపడటం మనసుకు సంకటమే తప్ప ప్రయోజనం ఉండదు. కాళ్ళూ చేతులు బాగా ఉన్నంత కాలం నా పని నేనే చేసుకుంటాను. నా గారెలు కొనుక్కుని తినేవాళ్ళ ముఖాల్లో ఆనందం చూడటం నాకు పరమానందం. మీ మూలంగా దానికి దూరం కాలేను. అయినా ఈ రోజు మీరు జాలి చూపిస్తారు. రేపటి నుండి నా గతి ఏమిటి? రేపయినా నా పని నాకు తప్పదు కదా!"

ధనవంతుడు చిన్నగా నిట్టూర్చి లేచి నిలబడి జేబులోంచి పదివేల రూపాయలు తీసి ఇవ్వ బోయాడు. ముసలమ్మ నవ్వుతూ సున్నితంగా తిరస్కరించింది. దాంతో ఆ ధనవంతుడిలో ఏ మూలో ఇంకా మిగిలిన కొంచెం గర్వం కూడా పూర్తిగా తొలగి పోయింది. ఒక్కసారి తనగురించి, తన వ్యాపారం గురించి, తన సంపద గురించి, విలాసవంతమైన తన జీవితం గురించి ఆలోచించాడు. నడవడిలో ఆమెతో పోల్చుకుంటే తన స్థానమేమిటో స్పష్టంగా అర్థమైంది. జీవితంలో ఎన్నడూ తన దరిదాపులకు కూడా రాని ఆలోచన ఇప్పుడు తన మనసునిండా వుంది. ఎందుకో ఇప్పుడు తన శరీరం తెలికయినట్టు అనిపించింది. మనసుకు హాయిగా వుంది. లేచి మారు మాటాడకుండా కిందికి దిగాడు. అతని భార్యా, పనివాళ్ళు మెట్లెక్కి ఎదురు వస్తూ కనిపించారు.

కొంత కాలం గడిచింది. ఒక రోజు ముసలమ్మ హటాత్తుగా జబ్బుచేసి లేవలేక మంచంలో పడింది. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు గంట లోపల అంబులెన్సు వచ్చి ఆమెను ధనవంతుడి ఇల్లు చేర్చింది. అక్కడ ఆమెకు విశాలమైన ఇల్లు. వైద్యం చేయడానికి, సేవచేయడానికి ఏంతోమంది డాక్టర్లు, నర్సులు.

ఆమె కాస్త కోలుకున్నాక ధనవంతుడు ఆమె వద్దకు వచ్చి "ఇప్పుడైనా నీకు సేవ చేసుకునే భాగ్యం కలిగిస్తావా?" అన్నాడు. ముసలమ్మ ధనవంతుడిని గుర్తు పట్టింది."ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నేను అప్పుడే చెప్పాను కదా! ఏది ఎప్పుడు ఎలా జరుగాలని వుంటే అలా జరుగుతుందని." అన్నది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ