స్వామి రా..! రా..!! - --చెన్నూరి సుదర్శన్.

svamirara..

గీత బడికి బయలుదేరడానికి తయారయ్యింది. తనకు కావాల్సినవన్నీ ఉన్నాయో.. లేదో..! అని మరొక సారి స్కూల్ బ్యాగు తెరచి చూసుకుంది. కనులు మిల మిలా మెరిసాయి. పెదవులపై చిరునవ్వు.. అన్నీ ఉన్నాయనే చెబుతోంది.

“అమ్మా నేను వెళ్ళొస్తా..” అనుకుంటూ ప్రధాన గుమ్మం దాటింది. ఎలాగైనా అమ్మ ‘సరే’ అంటుందనే ధీమాతో..

గీత ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. తనకు ఆ పాఠశాల అంటే ఎంతో ఇష్టం. యింకా తెలుగు మాస్టారు పాఠాలతో బాటు దైవభక్తిని ప్రభోదించే సూక్తులు మరీ మరీ యిష్టం.

ఒక రోజు తెలుగు మాస్టారు పాఠం చెబ్తుంటే వరండా గుండా ఒక కోతి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడప్పుడు అలా వెళ్లడం మామూలే.. దాన్ని చూడగానే పిల్లలంతా కేరింతలు కొడుతూ ‘కోతి.. కోతి..’ అంటూ అరవడం కూడా మామూలే.. కాని అది తెలుగు మాస్టారి క్లాసు కావడమే విశేషం..

మాస్టారు ‘సైలెన్స్..! సైలెన్స్..!!’ అంటూ విద్యార్థుల వంక చిరు కోపం ప్రదర్శించాడు.

‘‘మీకో కథ చెబుతాను” అని మాస్టారు అనగానే క్లాసు సద్దుమణగింది.

మాస్టారు గొంతు సవరించుకొని కోతిని ‘వానరము’ అని పిలవాలని.. అలనాడు శ్రీరామ చంద్రునికి అత్యంత ప్రీతి పాత్రమైన సేవకుడు అయిన ఆంజనేయ స్వామి వారసులు.. అని చెబుతూ వానరులు శ్రీరామ చంద్రనికి చేసిన సహాయము, వారి స్వామిభక్తి, భుజశక్తి గురించి వివరించాడు. గీత మనోఫలకంపై వానరం ముద్ర బలంగా నాటుకు పోయింది.

ఆనాటి నుండి వానరాన్ని మచ్చిక చేసుకోవాలనుకుంది.

ఆమరునాడు దానికి అత్యంత ప్రీతిపదమైన అరటి పండు తన స్కూల్ బ్యాగులో దాచుకొని తెచ్చింది. దారిలో బడి ప్రక్కనే ఉన్న చెట్టు మీద కూర్చునే వానరాన్ని చూసి ‘స్వామి రా..! రా..!!’ అంటూ పిలిచింది. అరటి పండు చెట్టు మొదట్లో పెట్టింది. అది చెట్టు దిగి వచ్చి తింటూ వుంటే దాని బుగ్గలు ఉబ్బటం చూస్తూ ఎంతగానో మురిసి పోయింది.

కొద్ది రోజులకు ‘స్వామి రా..! రా..!!’ అంటే తననే పిలుస్తున్నట్లు గీత వద్దకు వానరం ఛెంగు, ఛెంగున పరుగెత్తుకు రావడం.. గీత యిచ్చే అరటి పండు తినడం.. అలా వారి స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది.

వీరి స్నేహం చూసి ఈర్ష్యపడే వాడు రాజు. ‘ముందు వచ్చిన చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లు తాను ఎన్నాళ్ళుగానో గీత కు బెస్ట్ ఫ్రెండ్.. గీత, తాను ప్రతీ రోజూ చాక్లెట్లు యిచ్చి పుచ్చుకుంటారు.. పైగా క్లాస్‍మేట్ కూడానూ.. అయినా వానరాన్ని చూసి సంతోషించినంతగా తనను చూసి సంతోషించడం లేదనే అపోహ రాజు మనసులో అంకురించింది. గీత తఱచుగా వానరం గురించి చెబ్తుంటే ‘పిచ్చి బాగా ముదిరి పోతోంది..’ మనసులో అనుకుంటూ నుదురు సుతారంగా బాదుకునేవాడు.

ఒక రోజు గీత ఎప్పటిలాగే వానర స్వామిని పిలిచి అరటి పండు ఒలిచి యిచ్చింది. అది తింటూవుంటే మైమరచి చూస్తోంది.. వెనుక నుండి పిల్లిలా వచ్చిన ఒక దొంగ పిల్ల వాడు గీత మెడలోని బంగారు గొలుసును తెంపుకొని పరుగెత్త సాగాడు. రాజు భయపడిపోయి చెట్టు వెనకాలకు వెళ్ళి దాక్కున్నాడు. గీత గజ గజ వణక సాగింది. నోట మాట రావడం లేదు.. భయం భయంతో లేని శక్తిని కూడగట్టుకొని బడి వైపు పరుగు తీసింది. ఎదురుగా తెలుగు మాష్టారు కనబడగానే అమాంతంగా రెండు కాళ్ళనూ చుట్టేసుకుని బిగ్గరగా ఏడ్వసాగింది.. మాస్టారు ధైర్య వచనాలతో కాసేపయ్యాక తేరుకుని జరిగిన విషయం చెప్పింది. తన పుట్టిన రోజున అమ్మ కానుకగా యిచ్చిన ఆ గొలుసు అంటే తనకు ఎంతో యిష్టమని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్వ సాగింది. పిల్లలంతా గీత చుట్టు గుమిగూడారు.

‘‘నీ వెంట రాజు ఉండాలిగా.. ఏమయ్యాడు?’’ అని మాస్టారు అడుగుతుండగా వచ్చాడు రాజు.

‘‘వాని చేతిలో కత్తి ఉంది సార్..’’ అంటూ తాను చూసిన భయోత్పాదక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాడు.

యింతలో వానర స్వామి బడి ప్రహరీ గోడ మీదుగా మూడు కాళ్ళతో గెంతుకుంటూ వస్తోంది.. దాని చేతిలో గీత గొలుసు..

పిల్లలంతా చప్పట్లతో కేరింతలు..
వానర స్వామి తన చేతిలోని గొలుసును గీత పైకి విసిరేసి తనూ చప్పట్లు కొట్టసాగింది. గొలుసు యాదృచ్చికంగా గీత మెడలో పడింది.
మాస్టారు స్వామిని రెండు చేతులా నమస్కరించడం చూసి పిల్లలంతా అనుసరించారు..
ప్రణమిల్లుతున్న గీత కళ్ళళ్ళో కృతజ్ఞతాశృవులు జల, జలా కారసాగాయి...
‘గీతకు నిజమైన స్నేహితుడను కాను.. కనీసం దొంగ.. దొంగ.. అంటూ కూడా తాను అరవలేదు... యికముందు అలా చేయగూడదు..’ అని రాజు మనసులో బాధ పడుతుంటే.. గీత, వానర స్వామిల స్నేహంపై వున్న ద్వేషము క్రమేణా తొలగి పోసాగింది...
వెళ్ళిపోతున్న వానరాన్ని చూస్తూ “స్వామీ.. రా..!..రా..!!” అంటూ రాజు గంతులు వేస్తూ పిలువ సాగాడు.
బడి గంట మోగింది..
పిల్లలంతా రాజు పిలుపును వల్లె వేస్తూ ప్రార్థనకై పరుగులు తీశారు. ***

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు