వసంతకు పెళ్ళి కుదిరింది-ట!
చేతిలో వున్న శుభలేఖ ఆవార్తను దృడపరిచింది. నాకు చాలా సంతోషం కలిగింది. వసంత నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. నేను డిగ్రీ తర్వాత పై చదువులు చదవడం కుదరక టీచర్ ట్రైనింగ్ చేసి టీచరుగా జీవితంలో స్థిరపడిపోయాను. నేను సాధిద్దామనుకున్నది సాధించకుండా జీవితంతో రాజీపడిపోయాను.
కాని వసంత మటుకు పై చదువులు కొనసాగించింది. నిజానికి వాళ్ళింట్లో ఎవరికీ అలా చదవడం యిష్టం లేదు. వాళ్ళ అన్నయ్యలు ఆమె చదువును వ్యతిరేకించారు 'ఆడపిల్ల చదివి ఏం చెయ్యాలి?' అని ఈసడించుకున్నారు.
'ఎంత చదివినా పరాయి యింటికి పోయేదే కదా!' అని ఆమె తల్లితండ్రులు కూడా వాపోయారు.
'ఇలా ఆడపిల్లను చదివిస్తూ వుంటే మాకొచ్చే ఆస్థిపాస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి!' అని ఒక వదిన అనడం కూడా నాకు తెలుసు.
ఎవరు ఎన్ని అన్నా వసంత తన పంతం మానలేదు. అన్నం మానేసింది - మొండికేసింది. చివరికి ఆమె పట్టుదల ముందు ఆమె తల్లితండ్రులు తలవంచక తప్పలేదు. చుట్టు ప్రక్కలవారు జోక్యం చేసుకుని ఆమె అన్నయ్యలకు - తల్లితండ్రులకు కూడా నచ్చచెప్పారు. అలా వసంత పట్టుదలకు మారు పేరుగా చదువుకు అంకితమయి పోయింది. చదువుల సరస్వతి అని మా స్నేహితురాళ్ళు ఆమెను ఎక్కిరించే వాళ్ళు ఈర్ష్యతో.
ఇదంతా పది ఏళ్ళ క్రిందటి మాట!
ఆ తరువాత పెళ్ళి చేసుకుని ఉద్యోగం వెతుక్కుంటూ కర్నూలుకు వచ్చేశాను. వసంత పై చదువులకంటూ బిజీగా ఎక్కడెక్కడో తిరిగేది - ఒకటి రెండు సంవత్సరాలు ఉత్తరాలు రాసింది కాని నేను బిజీగా వుండటం వలన జవాబు కూడా ఇవ్వలేకపోయాను. మరి సంసారం - పిల్లలు!
అందుకే ఇన్ని సంవత్సరాల తరువాత నా అడ్రసు వెతుక్కుంటూ వచ్చిన శుభలేఖ నాకు స్వాతి చినుకులా ఆనందం కలిగించింది.
పెళ్ళి ఎక్కడా అని వెతికాను - కడపలో! ఎప్పుడు అని చూశాను - అరే రేపు ఉదయమే! టైం లేదు. వెంటనే మా హెడ్ మాస్టరు గారిని కలిసి పరిస్థితి వివరించి - సెలవు చీటి యిచ్చి యింటికి బయలు దేరాను.
కడపలో ఆ కళ్యాణ మండపం కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. చాలా ఖరీదైన కళ్యాణ మండపం!
'వసంత వెడ్స్ వెంకట్!' ఆ బోర్డు చదివి ఆమె పెళ్ళి మండపానికే వచ్చినట్లు నిశ్చయించుకుని మెట్లెక్కి మండపంలోకి ప్రవేశించాను. ఎదుర్కోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వసంత రివటలాగా కాలేజీ రోజుల్లో ఉన్నట్లే ఉంది! ఆమె వయసు ముప్పయిదాటిందని నాకు తెల్సు! చూసేవాళ్ళు ఆమెకు పాతిక సంవత్సరాలు ఉంటాయనుకుంటారేమో!
వసంత వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు! కాని అక్కడ చూస్తే పెళ్లి చాలా ఆర్భాటంగా జరుగుతున్నది. బహుశా పెళ్ళికొడుకు వాళ్ళు పట్టుపట్టి ఉంటారు.
ఇంతలో రమేష్ నన్ను గుర్తు పట్టి విష్ చేశాడు.
"మీరు... శాంతి కదండి - చెల్లాయికి క్లాసుమేటు - సంతోషం కూర్చోండి!" ఆహ్వానించాడు నవ్వుతూ.
"ఓ రమేష్ గారా! బాగా కనుక్కున్నారు! బస్సు కొంచెం ఆలశ్యమైంది - వసంత బిజీగా ఉంది." నవ్వుతూ చెప్పాను.
"మీరు ముందు టిఫిన్ తినండి - భోజనాలకు ఆలశ్యం ఉంది!'
"ఒకేసారి భోంచేస్తా లేండి -"
"నో! నో! టిఫిను కాపీ రెడీగా ఉంది... రండి క్రింద డైనింగ్ టేబులు చూపిస్తాను." అంటూ రమేష్ నన్ను బలవంతంగా కిందకు తీసుకొచ్చి వంటల మేనేజరుకు చూపించి వెళ్ళిపోయాడు.
నాముందు ప్లేటులో రెండు రకాల స్వీట్లు - మిర్చి బజ్జీ - వడలు ఉన్నాయి. తినసాగాను పారెయ్యడం యిష్టంలేక.
ఇంతలో కాఫీ తెచ్చియిచ్చారు.
కాఫీ సిప్ చేస్తూ ఉన్నాను.
వంట యింట్లోంచి ఏదో గలాటా వినిపించసాగింది.
కుతూహలం కొద్దీ కొంచెం లోపలికి పోయి చూశాను.
అక్కడ ఒక యువతి ఏడుస్తున్నది... ఆమె వీపు మీద కొట్టారు - అక్కడ వున్నవాళ్ళు - తిడుతున్నారు.
"దొంగది! పోలీసులకు అప్పచెప్పండి... చిన్నవాళ్ళు చిన్న బుద్ధులు - నీకు కడుపునిండా తిండి పెట్టాం కదే - మళ్ళీ ఈ దొంగబుద్ధులెందుకు?" వంట మేనేజరు జుత్తు పట్టుకుని కొడుతూ అడిగాడు.
"తప్పయిపోయిందయ్యా! ఆకలి వేసింది" ఏడుస్తూ చెప్పింది ఆమె.
"కడుపునిండా తిన్నావు గదుటే దెయ్యమా! ఇంకా ఆకలా?" అతను కోపంగా అన్నాడు.
"నాకు కాదయ్యా! నా బిడ్డలకు - ఇంట్లో నాకు నలుగురు బిడ్డలున్నారు - వాళ్ళు ఆకలితో నకనకలాడుతున్నారు - నేను తింటే వాళ్ళ కడుపులు నిండుతాయా? అందుకే ఈ కాస్త పొట్లం కట్టుకుని తీసుకు పోతున్నాను." దీనంగా చెప్పింది ఆమె.
"ముష్టి అడిగితే వేసే వాళ్ళం కదే! అయినా అంట్లు తోమడానికి ఎవరినన్నా మంచివాళ్ళని పట్టుకురమ్మంటే నీలాంటి దొంగవెధవల్ని తెచ్చిందానికి మా వెధవని చెప్పు తీసుకు కొట్టాలి! నీ పేరేంటి!" అతను చిందులు తొక్కుతూ అడుగుతున్నాడు.
"పార్వతి అయ్యా! మేం కూడా బాగానే బతికి నోళ్లమయ్యా! నా మొగుడు జబ్బు పడ్డాడు - లేకపోతే రిక్షా తొక్కి సంపాదించేవాడు -" ఏడుస్తూ చెప్పింది.
వాళ్ళు ఇంకేవో తిడుతున్నారు...
'పార్వతి' అన్న మాట వినగానే నాకేవో ఆలోచనలు తొలుస్తున్నాయి. కొన్ని ఏళ్ళ క్రిందట - నేను స్కూల్లో ప్రవేశించిన కొత్తల్లో అనుకుంటాను ఆ సంఘటన జరిగింది...
"టీచర్! నేను చదువు మానేస్తున్నాను" పార్వతి చెప్పింది... నేను ఉలిక్కిపడి పార్వతివంక చూశాను. పాలుకారే బుగ్గలతో - చిదిమి దీపం పెట్టుకునేటట్లు చాలా అందంగా ఉంది. చాలా అణుకువ కలపిల్ల. చదువులో చాలా చురుకుగా ఉండేది. ఎనిమిదో క్లాసు ఫస్టు క్లాసు మార్కులతో పాసు అయి తొమ్మిదో తరగతి చదువుతున్నది....
"పార్వతి! జోకు చేయడానికి కూడా హద్దూ పద్దూ ఉండాలి! ఎప్పుడూ అలా మాట్లాడకు" కోపంగా చెప్పాను.
"కాదు టీచర్! నిజంగానే మానేస్తున్నాను" ఈసారి పార్వతి కళ్ళల్లోంచి కొన్ని కన్నీటి చుక్కలు చెంపలమీదుగా జారిపడ్డాయి.
"అదేంటి పార్వతి - ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు!" ఆశ్చర్యంగా అడిగాను.
"నేను తీసుకోలేదు టీచర్ - మాయింట్లో వాళ్ళు తీసుకున్నారు - నాకు పెళ్లి కుదిరింది! ఇంక చదువు మాన్పించి పెళ్ళిచేసి అత్తారింటికి పంపిస్తున్నారు" ఏడుస్తూ చెప్పింది పార్వతి.
"ఛీ! ఛీ! ఇంత చిన్న వయసులో పెళ్ళేంటి! నువ్వింకా మైనరువి కదా - తప్పు!" కోప్పడ్డాను - నచ్చచెప్పాను... దానికి సమాధానంగా వాళ్ళ అమ్మ మరునాడు స్కూలుకు వచ్చింది.
"చూడు టీచరమ్మా! మా కులంలో పెద్దమనిషి కాగానే పెళ్లి చెయ్యడం ఆచారం. మేము యింకా ఆలశ్యం చేశాము. నువ్వు లేనిపోని కబుర్లు చెప్పి దాని మనసు విరిచి - దాని జీవితం పాడు చెయ్యకు" కసిరింది ఆమె.
"చూడు కాళి! ఈ కాలం పెళ్లికంటే కూడ ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యం! పెళ్లిదేముంది వయసు రాగానే అవుతుంది. కాని చదువు మటుకు ఎప్పుడు పడితే అప్పుడు రాదు. చదువురాని వాడు రెండు కాళ్ళ వింత పశువు-" అంటూ చెప్పబోయాను.
కాళి నా మాటలు వినిపించుకోలేదు. తీవ్రస్వరంతో అంది. "ఇదంతా మీ పిచ్చి! నేను చదువుకున్నానా? మా అమ్మ చదువుకుందా? మా అమ్మమ్మ చదువుకుందా? మా వంశంలో ఎవరికీ చదువులేదు. కాని మాకేం తక్కువయింది. పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది - ఆతర్వాత గొంతు దాకా చదువుకున్నా ఎవరూ అడగరు."
"వివాహం విద్య నాశాయ - శోభనం సర్వనాశాయ అని వినలేదా? పెళ్ళికి చదువుకు సరిపోదు. సంసార లంపటంలో పడితే చదువు అస్సలు ముందుకు సాగదు. అయినా పార్వతికి వయసేం ముదిరిపోయింది . పధ్నాలుగు యింకా రాలేదు. పద్దెనిమిదేళ్ళ లోపు పెళ్ళిచేయడం నేరం కూడా. బాల్యవివాహాన్ని చట్టం నిషేధించింది." నచ్చచెప్పబోయాను.
" అమ్మా! నే చదువుకుంటానే! టీచరు చెప్పింది నిజం!" పార్వతి చెప్పింది.
"ఛస్! నోర్మూయ్! మన కులాచారం టీచరమ్మకు ఏం తెల్సు! ఇంకా కొన్ని రోజులు నిన్ను ఇలానే వదిలేస్తే మన కులంవోళ్ళు మనల్ని వెలివేస్తారు. చూడు శాంతి టీచరమ్మా! చదువు ఎందుకు చదువుకోవాలమ్మా నాకు తెలియక అడుగుతాను. చదువుకున్నోల్లందరికి కలెక్టరుద్యోగాలు వస్తున్నాయా? చదువుకొని మారాజులు ఎంతమంది లేరు?" కాళి అడిగింది.
"చదువుకుంటే ప్రపంచ జ్ఞానం వస్తుంది. మన తెలివి పెరుగుతుంది. జీవితంలో మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాదు నువ్వన్నట్లు ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఉద్యోగం చేసుకుని గౌరవంగా బ్రతకచ్చు!" అంటూ చదువు ఆవశ్యకత గురించి ఓ పదినిమిషాలు ఉపన్యాసం యిచ్చాను.
కాళి - పార్వతి విన్నారు గాని - నా ఉపన్యాసం ఏ మాత్రం వారిమీద ప్రభావం చూపలేదని - రెండు రోజుల తర్వాత తెల్సింది.
పార్వతి చదువు మానేసి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది... ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను...
"పదండి పోలీసులకు అప్పగిద్దాం" అంటూ ఆమెను ఈడ్చుకు పోతున్నారు - పార్వతి ఏడుస్తున్నా వినకుండా.
"ఆగండి... ఆమెని వదిలి పెట్టండి!" గట్టిగా అరిచాను.
"మేడం - ఇది దొంగతనం చేసింది... మేము చూడకపోతే ఇంకెన్ని దొంగిలించేదో!" మేనేజరు అంటున్నాడు.
"నేనటువంటిదాన్ని కాదన్నా! ఆకలి వేసింది." పార్వతి రోదిస్తున్నది.
"చూడండి... ఆకలి అన్ని అనర్ధాలకు మూలం - ఆమెని వదిలిపెట్టండి... దొరికితే దొంగలు - లేకపోతే దొరలు! మనలో పట్టుపడని దొంగలు చాలామంది ఉంటారు." అంటూ వాతపెట్టాను.
ఎందుకో నన్ను - నా అవతారం చూసి మేనేజరు ఆమెని వదిలేశాడు.
"మీకు ఈమె తెల్సా మేడం?" అడిగాడు కాస్త కోపంగా.
"ఆ! పార్వతి - అని నా స్టూడెంటు ఒకప్పుడు" చెప్పాను.
ఆ మాటకు ఏడుస్తున్న పార్వతి - తలెత్తి నన్ను పరిశీలనగా చూసింది... ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి.
"టీచరు - చాలా థాంక్సు టీచరు!" అంటూ నా కాళ్ళమీద పడింది.
"లే - లే! ఎందుకీపని చేశావు?" ఆమెని పైకి లేపుతూ లాలనగా అడిగాను.
పార్వతి ఏడుస్తూ - నన్ను బయటకు తీసుకువచ్చింది ఆ కళ్యాణమండపం నుండి... ఆమె ఏడుస్తూ చెప్పితే నాకు అర్ధమయింది ఇది.
పార్వతికి రంగడితో పెళ్ళి కుదిరింది. రంగడు మొదట్లో పొలాలకు కూలీకి వెళ్ళేవాడు. అతనికి తోడు తనూ వెళ్ళేది... నలుగురు పిల్లలు పుట్టారు. చివరికి అతన్ని బలవంతాన ఒప్పించి ఫ్యామిలీ ప్లానింగు చేయించుకుంది... కరువు వచ్చి వాళ్ళ ఊరిలో పొలం పనులు ఆగిపోయాయి.
పొట్ట చేత్తో పట్టుకుని కడప చేరుకున్నాను. కడపలో ఓ రిక్షా బాడుగకు తీసుకుని తొక్కుతూ ఉండేవాడు. పార్వతి కూడా అంట్లు తోముతూ నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉండేది.
ఇలా ఉండగా రంగడికి క్షయ వ్యాధి వచ్చింది. రిక్షా తొక్కలేక పోతున్నాడు మంచంమీద పడ్డాడు.
కుటుంబ భారం పార్వతి మీద పడింది... అంట్లు తోమితే ఎంతని సంపాదించగలదు. చాలీచాలని సంపాదనతో ఇల్లు గడుపుకొస్తున్నది...
ఎప్పుడన్నా ఇలా పెళ్ళిళ్ళకు పిలిస్తే - నాలుగు పూటలా అన్నం తినచ్చు. అందుకనే తను తిన్నంత తిని - అన్నం - స్వీటు - కారాలు ఓ ప్లాస్టిక్ బ్యాగులో మూట కట్టుకుని చీరలో దోపుకుని తీసుకుపోతూ పట్టుపడింది.
"దొంగతనం నేరం అని నువ్వు చదువుకోలేదా పార్వతీ!" ఆర్ద్రంగా అడిగాను.
"నిజమే టీచర్! కాని... ఆకలితో నా పిల్లలు - మా పెనిమిటి చచ్చిపోతున్నారు. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆపద్ధర్మంగా ఈ పని చేయవలసి వచ్చింది... ఆరోజు మీరు చెప్పినట్లు చదువుకుని ఉంటే నేను కూడా మీలాగా టీచరుద్యోగం చేస్తూ హాయిగా ఉండేదాన్ని?" పార్వతి వలవల ఏడ్చింది.
నాకు ఆమెను చూస్తే జాలి కలిగింది.
"పోనీ ఇప్పుడన్నా చదువుకోవచ్చు గదా! ఓపెన్ యూనివర్సిటీలో చదువు చదువుకోవచ్చు." పార్వతిని అడిగాను.
"తిండానికే తిండి లేదు - నా చదువుకు డబ్బులు ఎక్కడ్నించి తీసుకురాను - కాని మీరన్నట్లు సంసారంలో పడిన తరువాత చదువుల సారం ఎవరికీ అంటదు - మిగిలేది నిస్సారం - నీరసం మాత్రమే జీవితంలో." బాధగా చెప్పింది.
పర్సు తీసి ఓ అయిదొందల కాగితం ఆమె చేతిలో పెట్టాను. "ఎందుకు టీచరు?" సంభ్రమంతో అడిగింది.
"ఏదో నాకు చేతనైనంత సాయం - దీంతో నీ సంసారం వెళ్ళిపోతుందని కాదు - ఓ నాలుగు రోజులు ఆనందంగా గడువుతావని ఆశ!"
"వద్దు టీచరు - గురువుల దగ్గర తీసుకోకూడదు. నేనే మీకివ్వాలి ఆ రోజు మీరు చెప్పిన మాటలు విని ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు - అన్నట్లు నా స్నేహితురాలు గౌరీ కూడా నాలాగే చదువు మానేసి కూలీకి పోతూ నానా పాట్లు పడుతున్నది - తెల్సా!" అడిగింది.
గుర్తొచ్చింది గౌరీ పార్వతి స్నేహితురాలు. పార్వతి మానేసిన ఓ నెలకు తనుకూడా మానుకుంది. ఏదో ఫ్యాక్టరీలో కూలీకి పోతానని చెప్పి ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ వాళ్ళు వినలేదు.
'ఆడపిల్లకు చదువు ఎందుకు?' అని గొడవ చేసి తీసుకుపోతారు.
"గౌరీ కనిపిస్తుందా?" అడిగాను.
"లేదు ఎప్పుడన్నా రోడ్లమీద తవ్వుతున్నప్పుడు కూలీపని చేస్తూ కనిపిస్తుంది!" చెప్పింది.
"పోనీలే ఆమె అన్నా బాగుందా?"
"ఏం బాగు. అదే బాగు! గుడిసెలో కాపురం - రేపు ఏమవుతుందో తెలియని బతుకులు మావి!"
"చిలక్కి చెప్పినట్టు చెప్పాను - మీ యిద్దరికీ చదువుకోమని - వింటేగా మీరు -" బాధగా చెప్పాను.
"మాకు ప్రాప్తం లేదు టీచరు -" అంటూ నేనిచ్చిన నోటు జేబులో పెట్టుకుని నా కాళ్ళకు నమస్కరించి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయింది.
భారమైన మనసుతో పెళ్లిమందిరంలోకి వచ్చాను.
మరునాడు కాని మనసు విప్పి వసంతతో మాట్లాడ్డం కుదరలేదు.
"వసంతా! ఆలశ్యంగానన్నా పెళ్ళి చేసుకున్నావు - సంతోషం!" చెప్పాను.
"మరి ఏం చెయ్యను - చదువు అయ్యేసరికి పాతికపై పట్టింది. ఆ తరువాత రీసెర్చి -" చెప్పుకుంటూ పోయింది.
"ఇంతకీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు?" అడిగాను.
"భారత ప్రభుత్వం నడిపే ఓ గొప్ప రీసెర్చి ఆఫీసర్ని - నేను చేసిన రీసెర్చికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. రేపు అమెరికాలో జరిపే కాన్ఫరెన్సులో నన్ను పేపరు చదవమని రాయల్ సొసైటీ వాళ్ళు ఆహ్వానించారు." చెప్పింది వసంత.
ఇంతలో వసంత అన్నయ్య వచ్చాడు అక్కడికి.
"శాంతి గారు మేము ఆడపిల్లలకు చదువు ఎందుకని అనుకున్నామా? అలా అని చదువు మాన్పించి ఉంటే చాలా ఘోరమైన పొరపాటు చేసిన వాళ్లమయ్యే వాళ్ళం - ఇప్పుడు చెల్లాయి పేరు తెలియని దేశంలేదు. ఫిజిక్సులో తను చేసిన రీసెర్చికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. తనలో ఇన్ని తెలివి తేటలున్నాయని మాకు తెలియదు." చెప్పాడు వసంత అన్నయ్య.
"నాకు ముందే తెల్సు - వసంత జీనియస్సు అని!" చెప్పాను. "కాని పెళ్ళి చేసుకుని రీసెర్చి చేసి ఉంటే బాగుండేది." ఆమె ఏదో పోగొట్టుకున్నట్లు చెప్పాను.
"తప్పంట - అ యాల పెళ్ళి చేసుకొని ఉంటే ఆమె రీసెర్చి ఇంత బాగా చేసేది కాదు - మీకో సంగతి తెల్సా! బహుళజాతి కంపెనీలో కొన్ని ఆమె రీసెర్చిని తమకు అమ్మమని కోట్లు కోట్లు ఆశ చూపుతున్నాయి - ఆమెపైన ఆ విషయంలో ఎంతో ఒత్తిడి ఉంది." చెప్పాడు.
నేను బిత్తరపోయి నిజమా అన్నట్లు వసంత వంక చూశాను. "అవును శాంతి! ఎన్ని కోట్ల డాలర్లు నాకు ఆశ చూపించినా నా రీసెర్చి ఫలితాన్ని బహుళజాతి కంపెనీలకు అమ్మను. అది భారతదేశానికి మటుకే యిస్తాను. అది ప్రజలకు ఉపయోగపడాలి! స్వార్ధపరులచేతుల్లో పడి డబ్బు సంపాదనకు పునాది వెయ్యకూడదు. నా జీవితాశయం అదే! నా తెలివితేటలు - నా పరిశోధన ఈ భరతజాతికి - ఈ మానవ జాతికి ఉపయోగపడాలి! వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుతురు నింపాలి - అదే నా జీవిత ధ్యేయం!" వసంత చెప్పింది ఆవేశంగా.
నా వసంతలో కొత్త అవతారాన్ని చూశాను.
"భారతప్రభుత్వం ఈమెకు బిరుదు ప్రదానం చేయబోతున్నది. అదీగాక ఏన్నో వసతులు కల్పిస్తున్నది... వసంత మాకు - ఈ దేశానికి గర్వకారణం!"
వసంత తండ్రి చెప్పాడు గర్వంగా.
నాకు గుర్తొచ్చింది - ఆయనే వసంతకు చదువు ఎందుకని నానా యాగీ చేశాడు కొన్ని సంవత్సరాలక్రిందట! వసంత, నేను డిగ్రీలో పోటీ పడి చదివేవాళ్ళం - చాలాసార్లు నేను ఫస్టు వచ్చేదాన్ని - ఆమె నావెనుక ఉండేది. నా తెలివి తేటలకు తను ఈర్ష్యపడేది. అటువంటిది ఇప్పుడు ఆమె తెలివికి దేశం గర్వపడుతున్నది. చాలామంది ఈర్ష్య పడుతున్నారు. నేను కూడా ధైర్యం చేసి ఆమెలా చదువుకుని ఉంటే - నాకూ కీర్తి ప్రతిష్ఠలు గుర్తింపు వచ్చేవి!
వసంత తన భర్తను పరిచయం చేసింది -
"వెంకట్ అని నా కొలీగు రీసెర్చి ఆఫీసరు - నా ఫ్రెండ్ శాంతి!"
అతను నమస్కరించాడు. వసంతకు తగ్గట్టు చక్కని అందగాడు - సంస్కారవంతుడు - తెలివిగలవాడు.
"శాంతిగారు! వసంత లాంటి ఆడపిల్లను కన్న తల్లితండ్రులు ధన్యులు, కన్న దేశం చరితార్ధకమయింది. నేను అందరికి మనవి చేసేది ఒకటే! తెలివి తేటలున్నప్పుడు ఆడపిల్ల అని ఈసడించి చదువు మానిపించకుండా - ఆమెని బాగా చదివించండి - చదువు విషయంలో స్త్రీ పురుష వివక్ష తీసుకురావద్దు -" వెంకట్ చెప్పాడు.
"నిజమే! నా పిల్లల్ని బాగా చదివిస్తాను" అని నిర్ణయం తీసుకున్నాను.