అచ్చు వినాయకుడు - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

acchu vinayakudu

పార్వతీదేవి వినాయకుణ్ణి వెదకుతూ కైలాశం అంతా కలయ తిరిగి చివరాఖరికి ఒక మంచు శిఖరం మూల దిగులుగా కూర్చున్న కొడుకుని సమీపించి "నాయనా! వినాయక చవితి అతి తొందరలో సమీపిస్తోంది. ముల్లోకాల్లోనూ సంబరాలు మొదలయ్యాయి. నువ్వలా దిగులుగా కూర్చున్నావేల?" మాతృ మమకారాన్ని మాటల్లో కనబరుస్తూ అంది.

"ఏం చెప్పమంటావమ్మా? ఒక తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇంతకుముందు అతి విశాలమైన రాష్ట్ర ప్రజలు నా నవరాత్రులు, పూజలు, నిమజ్జనం ఘనంగా చెసేవారు. ఇప్పుడు చూడు-"అని భూలోకం లోని తెలంగాణ-వైపు చూపించాడు.

"అన్నా గణేశన్నా, ప్రతి ఏడాది మేము ఎంత గొప్పగా నీకు పూజలు చేస్తమె, యాదున్నాయా? ఖైరతాబాదుల పెద్ద గణేశుణ్ణి పెట్టి ఎట్ల దూమ్..దాం చేస్తామ్, మన హుస్సేన్ సాగర్ల నిన్ను నిమజ్జనం చెయ్యనీకి ఎంత ఘనంగా ఏర్పాట్లు చేస్తామ్. రోడ్లన్నీ జామ్ చేసి గులాల్ చల్లుకుంటా ‘గణపతి పప్ప మోరియా..’ అంటూ ఎంత లొల్లి చేస్తామ్. అన్నీ యాద్ తెచ్చుకో, గా ఆంద్రోల్లు మనకాడి కెంచి ఎళ్లిపోయిన్రు. గిది మొదటి పండుగ మాకు. కొత్త రాష్త్రంల ఈసారి మరింత మస్తుగా నీ పూజ చేస్తామ్. నువ్వీసారి మొదాలు మా తెలంగాణకు రావాలె. యాదుంచుకో..ఆఁ.." అన్నాడు భక్తిప్రపత్తులతో నృత్యం చేస్తూ.

పార్వతీదేవి కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది.

‘ఇప్పుడు ఇటు చూడు-’అని ఆంధ్రవైపు చూపించాడు-

"అయ్యా, విఘ్ననాయక వినాయకా! ప్రతి సంవత్సరం నీ పూజలు మాకు తోచినంతలో ఎంత ఘనంగా చేస్తామయ్యా? ఈసారి ఇదిగో ఇలా ఉమ్మడికుటుంబం కాస్తా ముక్కలు చెక్కలయ్యింది. తెలంగాణ, ఆంధ్రపదేశ్ గా విడిపోయింది. కారణమేమయితేనేం కలిసుండలేకపోయాం. అయినా నీ పూజలో ఏలోటూ రానివ్వం. ఎప్పట్లానే విశాఖతీరంలో పేద్ద వినాయకుడిని పెట్టి, గొప్పగా పూజ చేస్తాము. కొత్తగా ఏర్పడింది మా రాష్ట్రం. అంచేత విఘ్ననాయకుడివి..వినాయకుడివి ముందుగా మా వద్దకే రావాలి. మా పూజలు గైకొనాలి. అర్ధమైందా స్వామీ" అన్నాడు కళ్లు మూసుకుని తాదాత్మ్యతతో.

పార్వతీదేవి మరోసారి ఆశ్చర్యపోయింది.

"నువ్వున్నదొక్కడివి. రెండు చోట్లకి ఒక్కసారే ఎలా వెళ్లగలవు? ఒకరి దగ్గరకి వెళితే మరొకరికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇద్దరూ నీకు కావాలి. వాళ్లకీ నువ్వు కావాలి. నీది నిజంగా విపత్కర పరిస్థితేనయ్యా. ఏం చేయాలో నాకూ పాలు పోవడం లేదు."అంది కొడుకు పక్కన చతికిలబడి కూర్చుని.

కొంత సేపటికి పరమ శివుడు పార్వతినీ, వినాయకుణ్నీ వెదకుతూ అక్కడికి వచ్చి పార్వతి చూసినవే, దివ్య దృష్టితో చూసి"హా కుమారా! ఎటువంటి సమస్య వచ్చిందయ్యా నీకు." అని బాధపడ్డాడు.

అలా అలా దేవతలందరూ అక్కడకు వచ్చి చింతాగ్రస్తులై కూర్చున్నారు.

సరిగ్గా అప్పుడొచ్చాడు విష్ణుమూర్తి.

"మీరందరూ మీ మీ కార్యకలాపాలు సాగించకపోతే సృష్టి ఎలా సాగుతుంది? అందరూ ఇక్కడ చేరారేమిటి?"అడిగాడు విసుగ్గా. శివుడు జరిగింది చెప్పాడు.

"శివా! నీ ఫ్యామ్లీవల్ల నాకెప్పుడూ చీకాకులే. సరే సరే ఈ సమస్యను ఎలా అధిగమించాలో ముందు ఆలోచిద్దాం"అని "అన్నట్టు నాకో ఉపాయం తోస్తోంది. మీరూ వినండి." అని తనకు తోచింది చెప్పాడు.

దానికందరూ ఆమోదముద్ర వేశారు.

అదేమిటంటే-

పార్వతీదేవి స్నానాల గదిలోకెళ్లి నలుగు పిండితో బొమ్మ తయారు చేసి బయటకు తీసుకొచ్చింది. దానికి తలలేదు. వెంటనే శివుడు ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగుని చూసి ’ఈ గజ జాతికింకా బుద్ధి రాలేదు. తాతల కాలంనాటి తప్పులే మళ్లీ చేస్తున్నాయి. అయినా అదంతా నాకెందుకులే’ అనుకుని దాని శిరసు ఖండించి కొత్త బొమ్మకి అతికించి ప్రాణం పోసి, ‘అచ్చు వినాయకుడు’ అని నామకరణం చేశాడు. ఈయన కూడా అచ్చం మొదటి వినాయకుడి లాగానే ఉన్నాడు. అది చూసి వినాయకుడు "అమ్మా! నువ్వూ, నాన్నా భూలోకానికి వెళ్లి ఎప్పుడు క్లోనింగ్ శాస్త్రం నేర్చుకున్నరే, అచ్ఛం వీడు నాలాగానే ఉన్నాడు" అన్నాడు ఆశ్చర్యంగా.

"నారాయణ, నారాయణ, అవునవును దీనినే భూలోకంలో డబల్ యాక్షన్ అందురు"అన్నాడు నారదుడు.

"నాయనా, మీరిద్దరూ మాకు రెండు కళ్లు. ఒక శక్తికి రెండు రూపాలు. అచ్చు వినాయకోత్పత్తి రహస్యం మన లోకం దాటి బయటకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. వ్రతకల్పంలో అస్సలు చోటు చేసుకోకూడదు. మీరిద్దరూ బాధ్యతలు సమానంగా పంచుకుని ఆనందంగా ఉండండి. రెండు రాష్ట్రాలకీ ఒకే సమయంలో వెళ్లి, వాళ్లకి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలూ పంచండి. చల్లగా చూడండి. ఆ రాష్ట్రాల ప్రజలు ఒకరివంక మరొకరు చూసుకోరు కాబట్టి ఎవరికి వారు తమ వినాయకుడే తమ దగ్గరకి మొదట వచ్చాడు. తామే గ్రేట్ అనుకుంటారు. మనకు కావలసింది జనావళి క్షేమం. వెళ్లిరండి. సమస్త సన్మంగళాని భవంతు"అన్నాడు శివుడు.

అందరూ ఆ మాటలు విని ఆనందంగా తమ తమ సృష్టి కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లిపోయారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు