ఉండ్రాళ్ళూ- ఉమేశమూ - హైమాశ్రీనివాస్

undrallu.umeshamu

మా ఉమేశానికి ఉండ్రాళ్ళంటే మహాఇష్టం. వాడూ-నేనూ బాల్య మిత్రులమే గాక, ఒకే కార్యాలయంలో ఉద్యోగం నెరపుతున్నాం. మా ఉమేశం వినాయక చవితి నాడే పుట్టాడు. వాడి పుట్టుక పెద్ద ప్రహసనం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాడి పిన్నికీ అంటే బాబాయ్ భార్యకూ, వాళ్ళ అమ్మకూ ఒకే మారు కానుపు ఐందిట. మంత్రసాని పుట్టగానే ఇద్దరు పిల్లల్నూ తీసుకెళ్ళి శుభ్రం చేసి వీడ్ని పిన్ని పక్కనా, పిన్నికి పుట్టిన ఆడపిల్లను వీడి అమ్మ పక్కనా పడుకో బెట్టిందిట! వీళ్ళమ్మ లబోదిబో నాకు పుట్టింది పిల్లాడు, పిల్ల కాదు అని ఒకటే గొడవట! పిన్నేమో ' కాదు కాదు నాకే పిల్లాడు పుట్టింది.’ అది నీ పిల్లే ' అనీనీ, చివరకు ఇంటిల్లిపాదీ వచ్చి పిల్ల ల్ని చూసి, వీడి అమ్మ ముక్కు పొడవుగా కొనదేలి ఉండటాన, పసి గుడ్డు ముక్కూ అలానే ఉందని పిల్లాడ్ని కనింది వీళ్ళమ్మేనీ, పిన్ని ముక్కు చిన్నది గా ఉండటాన ఆ పాపాయి ముక్కు చిన్నది గనుక పాపాయిని కనింది పిన్నేననీ తీర్పు ఇచ్చాక, బాలింతలు ఇద్దరూ గమ్మునై పోయారుట! అప్పటికీ చాటు మాటుగా వాళ్ళ పిన్ని వీడికి తన చనుబాలు పట్టి తృప్తి పడేదిట ! కాస్తంత పెరిగాక వీడి రూపు అచ్చం వాళ్ళమ్మలా ఉన్నట్లు కార్బన్ కాపీ అని తెల్సి వాళ్ళ పిన్నిగమ్మునై పోయిందిట! అలా వాడు ఇద్దరు తల్లుల చనుబాల ముద్దుల కొడుకై బాగా బలంగా పెరిగాడు. వినాయక చవితి నాడు పుట్టి నందున వినాయకుని లాగే ఉంటాడు. వాళ్ళ బామ్మ చాలా రోజులు వీడి పుట్టుక ప్రహసనం చెప్పి, చెప్పీ బోసి నవ్వు నవ్వుతుండేది.

వినాయక చవితి నాడు పుట్టడంతో నైవేద్యానికి చేసే ఉండ్రాళ్ళే వీడి పుట్టిన రోజు ఫలహారాలయ్యాయి. అందుకేనేమో మా ఉమేశానికి ఉండ్రాళ్ళంటే మహా ఇష్టం.అప్పుడప్పుడూ ఉండ్రాళ్ళు ఫలహారానికి చేయమని వాళ్ళమ్మని గొడవ చేసేవాట్ట. ఆమె అవి తినీ తినీ వీడి పొట్టా గణపతి పొట్టలా అవుతోందని భయపడి, "తప్పు బాబూ! ఉండ్రాళ్ళు వినాయక చవితి నాడే చేయాలి, గణపతికి నివేదన చేసి మనం తినాలి." అని చెప్పేదిట! మా ఉమేశానికి 'ఉండ్రాళ్ళ' పిచ్చి ముదిరి పోయింది. ఎక్కడైనా కొనుక్కు తిందామన్నా ఉండ్రాళ్ళు ఏ స్వీట్ షాపులోనూ దొరకవాయె!. వినాయక చవితి వెళ్ళగానే "అమ్మా! మళ్ళా వినాయక చవితి పండుగ ఎప్పుడొస్తుందే?" అని అడిగేవాట్ట! రాను రానూ వీడి ఉండ్రాళ్ల పిచ్చి అందరికీ తెల్సి ‘ఉండ్రాళ్ళ ఉమేష్‘ గా ఇంటి పేరే మారిపోయింది. ఎలాగో చదువు పూర్తై ఇద్దరమూ ఒకే కార్యాలయోజ్యోగులమయ్యాం. మా ఇరువురికీ వివాహాలయ్యాయి. నాకు ముందు, ఒక నెలకే మా వాడికీనీ.

పెళ్లి చూపుల్లో వాళ్ళ అమ్మతో మెల్లిగా "ఉండ్రాళ్ళు చేయటం వచ్చో-రాదో, కనుక్కోమని“ చెవిలో గుసగుసలాడగా, ఆమె గుడ్లురిమి చూసిందిట! నోరు మూసుకోమని. పెళ్ళాయ్యాక , తమాషాగా వినాయక చవితి రోజే వీడి ఖర్మ కాలి మొదటి రాత్రైంది. అందంగా ఉంటుంది ఉమేష్ భార్య సత్యభామ. పాల గ్లాసుతో గదిలోకొచ్చిన భామతో ముందుగా మావాడు అడిగిందేంటో వింటే ఎవరికైనా నవ్వాగదు.

"ఈరోజు వినాయక చవితి కదా ! మీఇంట్లో ఉండ్రాళ్ళు చేసుకోరా?" అని. పాపం సత్యభామ పిచ్చిచూపు చూసిందిట! ఐనా మావాడు "అదే వినాయకునికి ఉండ్రాళ్ళు నివేదన చేయరా? మా అమ్మ ప్రతి వినాయక చవితికీ చేసి నివేదన చేస్తుంది. "అన్నాట్ట మళ్ళానూ. ఆమె వెంటనే గది బయటి కెళ్ళి "అమ్మా! ఆయనకు వినాయక చవితి ఉండ్రాళ్ళు కావాలిటే!" అనిఅడిగిందిట వాళ్ళమ్మను. ఆమెకు ఏమీ అర్ధం కాక " ఈరోజు అల్లుడు వస్తున్నాడని వినాయక చవితి ప్రత్యేక వంటలు చేయకుండా మామూలు స్వీట్స్ చేశానే ! ఉండు అన్నను స్వీట్ షాపుకు పంపి ఉన్నాయేమో చూడమంటాను." అని వాళ్ళబ్బాయిని స్వీట్ షాపుకు పంపిందిట. కాలం మారిపోయిందాయె, ఈ రోజుల్లో చదువుకున్న చాలా మంది అమ్మాయిలకు 'ఉండ్రాళ్ళు' చేయటం రాదనేమోని 'పుల్లారెడ్డి’ స్వీట్ షాపులో ఉండ్రాళ్ళూ దొరుకుతున్నాయి! ఉండ్రాళ్ళు ఒక కిలో తీసుకు వచ్చాట్ట పెళ్ళికూతురు అన్నగారు. పెళ్ళి కూతురు తల్లి అవన్నీ ఒక ప్లేట్ లో సర్ది లోపలికి పంపిందిట! " చాలా థాక్స్ సత్యా! నాకు వినాయక చవితికి ఉండ్రాళ్ళు తినే అలవాటు చిన్నతనం నుండీ, పైగా ఈ రోజే నా పుట్టిన రోజు కూడానూ. నీకు ఉండ్రాళ్ళు చేయటం వచ్చుగా ? రాకపోతే నేర్చుకో మీ అమ్మ దగ్గర.." అంటూ ఉండ్రాళ్ళు లాగి స్తున్న తన భర్త ఉమేష్ ను చూస్తూ లోలోపల నవ్వుకుందిట తొలి రేయి కొత్త పెళ్ళి కూతురు.
అదండీ మా ఉండ్రాళ్ళ ఉమేష్ కధా కమామీషూనూ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు