మా హనుమంత రావు మహా చాదస్తుడు. దేన్నీ ఒక పట్టాన నమ్మడు, ఎవ్వరి మీదా నమ్మకం లేదు. చిన్న తనం నుంచీ వాళ్ళమ్మా నాన్నల్ని వేధించి బాధించేవాడు. ఆ వాయనాలు అందుకోను ఆ తర్వాత అతడి భార్య నోచుకుంది. ఆవిడకు ఓపికెక్కువైనా ఒక్కో మారు భరించ లేక ప్రజ్వరిల్లి పోయేది . జ్వరం వస్తే మందేసుకోడు. లంకణం పరమౌషధం అంటూ ఏమీ తినకుండా త్రాగకుండా మూడంకేసి పడుకుని , మరునాడు లేచి నడవ లేక చెరో రెక్కా పుచ్చుకు అమ్మా నాయనా నడిపించాల్సి వచ్చేది చిన్నప్పుడు. ఇప్పుడూ అదే తీరు. ఇప్పుడు అతడి శ్రీమతికి వాడి తల తిక్క అర్ధం కాక అవస్త పడుతున్నదని తెలిసింది. ఓ రోజు మార్కెట్లో కనపడి, " అన్నయ్య గారూ! మీస్నేహితునితో కనాకష్టమై పోతున్నదండీ! వాళ్లమ్మగారెట్లా వేగారో కానీ నా ఓర్పు నశించి పోతున్నదండీ! ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నాను. ఈ మధ్య మరీ చాదస్తం పెరిగి పోయింది. కడుపు నొప్పొస్తే కాఫీ కూడా తాగరు, కాలు నొస్తే అడుగైనా వేయరు, తల నొప్పొస్తే ముసుక్కప్పుకు పడుకుంటారు, ఎంత తాలూకాఫీసుదైనా ఉద్యోగమేం కానూ? కాస్త మీరైనా వచ్చి చెప్పి పుణ్యం కట్టుకోండి, బాల్య స్నేహితులు కదా! మీ మాటేమైనా వింటారేమో!" అని మొర పెట్టుకుంది. చెల్లెల్ని చూసి పాపమనిపించింది.“ అలాగే చెల్లెమ్మా ! ఈ ఆదివారం వస్తాగా!" అని చెప్పి పంపాను. ఆదివారం రానే వచ్చింది. నేను మరువకుండా హనుమంతు ఇంటికి పోనే పోయాను. నే వెళ్ళే సరికి వాడు ఈజీ ఛైర్లో అనీజీగా పడుకుని ముందున్నఎత్తు స్టూలు మీద కాళ్ళు బార్లా జాపుకుని ఉన్నాడు.
"ఏమిట్రా! హనుమంతూ అలా ఉన్నావ్?" అని పలకరించగానే చెట్టంత మగాడూ చేతుల్లో ముఖం దాచుకుని భోరుమన్నాడు. మావాడు ఆరడుగుల ఎత్తూ ఎత్తుకు తగిన లావూనూ. మంచి పర్శనాలిటీ "ఛా ఊర్కోరా! ఎవరైనా చూస్తే బాగోదు, ’ఊరికూరికే ఏడ్చే మగాడ్నీ, నవ్వే ఆడ మనిషీనీ ఎవ్వరూ నమ్మరాద ‘ నే పాత సామెత కూడా ఉంది. ఏమైందిరా ఇప్పుడు?" అంటూ ఓదార్చాను."ఏముందిరా ఇహ నా పనై పోయినట్లేరా! నడవలేక పోతున్నానురా! కాళ్ళు నొప్పులు. నా ఉద్యోగం మా ఆవిడకిస్తారేమో కనుక్కోరా! బాబ్బాబూ ఈ సాయం చేసి పెట్టు" అంటూ బ్రతిమాలసాగాడు. నాకు ఆపుకోలేనంత కోపం వచ్చింది.
"ఛ నోర్ముయ్! తిని కూర్చుని తగుదునమ్మా అంటూ ఏడుపొకటి!! ఛీ నిన్ను నా స్నేహితుడనిచెప్పుకోనే సిగ్గుగా ఉందిరా! పద హాస్పెటల్ కెళదాం" అన్నాను. ఇంతలో నేను వచ్చింది గమనించుకున్నట్లుంది. కాఫీ కప్పుల్తో వచ్చింది చెల్లెమ్మ. "అన్నయ్య గారూ ఏం చెప్పమంటారు? కుర్చీ దిగరు, కాలు కదపరు. నొప్పంటారు. అన్నీ ఇక్కడే! ఏం చేయను ? ‘ఆలోపతం’ టే అపనమ్మకం, ’నాటు వైద్య’ మంటే నో అంటారు.’ నాచురోపతం’ టే నాన్చేస్తారు . ‘ఆయుర్వేద‘ మంటే నిర్వేదం. ’న్యూరోపతం’ టే నిర్వీర్యంగాచూస్తారు..." అంటూ ఆమె చెప్తుండగా, నా జేబులో ‘ చరవాణి‘ మోగింది. చూస్తే మా శ్రీమతి. "ఏంటో చెప్పు సంతోషీ!" అన్నాను. "ఏమీ లేదండీ! నా కాలు నొప్పి సగమే తగ్గింది. మరో పక్షం పాటు మందు వాడాలి. హోమియో హాస్పెటల్ అటేగా కాస్తంత మందు పట్టుకు రండి, నా ఫైల్ నెం. 99." అంది నా శ్రీమతి." అలాగేలే" అంటూ ‘చరవాణి ’ని జేబులో వేసుకుని," అన్నట్లు చెల్లెమ్మా! వీడికి హోమియోపతి చేయిద్దాం. నా భార్య అదే వాడుతున్నది చక్కగా తగ్గు ముఖం పడుతున్నాయి మోకాలి నొప్పులు. పదరా వెళదాం నా బైక్ మీద తీసుకెళతాను." అంటూవాడ్ని లేపబోయాను.
"నేను రానురా! నడవలేను. నా వల్ల కాదు." అంటూ మొరాయించ బోయాడు. "రాక తప్పదురా! లే లే!" అంటూ రెక్క పట్టుకుని లేపాను. చెల్లెమ్మ మరో రెక్క పట్టుకుంది.“ ఉండండి అన్నయ్య గారూ! మాకు రోజూ వచ్చే ఆటో తెస్తాను , బయటే ఉంటుంది., మీరొక్కరే ఈయన్తో వేగలేరు " అంటూ ఆమె వెళ్ళి బయట ఉన్న ఆటో పిల్చుకొచ్చింది. వాడిని లోపలికి తోసి ఇద్దరం చెరో పక్కా కూర్చున్నాం. పావు గంట డ్రైవ్ లో ఉన్న మా హోమియో వైద్యశాల చేరాం. ముగ్గురం లోపలికెళ్ళాం. మా అదృష్టం కొద్దీ అప్పుడు ఆయన ఖాళీగా ఉన్నారు. మంచి హస్త వాసి గలవాడు, అనుభవఙ్ఞుడూనూ. నన్ను చూడగానే మహదానంద పడ్డారాయన. "మీ శ్రీమతి మోకాళ్ళ నొప్పులేలా ఉన్నాయండీ! " అని నవ్వుతూ పలకరించాడు. వైద్యునికి ఉండాల్సిన నిదానం, ప్రేమ తత్వం, ఓర్పు, సహనం, రోగి ఆరోగ్యం పట్ల ఆసక్తి, వ్యాధి తగ్గించాలనే పట్టుదలా, వ్యాధి పట్ల అవగాహన ఉన్నవాడని నా సంపూర్ణ విశ్వాసం.
" మా శ్రీమతి కోసమే వచ్చానండీ! ఆమె మోకాలి నొప్పి చాలా వరకూ తగ్గింది, మందు ఐపోయిందని వచ్చాను." అంటూ ఆమె వివరాలన్నీ ఆయన అడుగుతుంటే చెప్ప సాగాను. మాహనుమంతు దగ్గాడు తన ఉనికిని గుర్తించమన్నట్లుగా. నాకు విషయం అర్ధమైంది." డాక్టర్ గారూ! ఇతడు నా స్నేహితుడు, హనుమంత రావు. కొంత కాలంగా కాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నాడు. మీరైతే తగ్గిస్తారనే విశ్వాసంతో తీసుకొచ్చాను.”అన్నాను."చాలా సంతోషమండీ! తప్పక తగ్గించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ మందు మీ శ్రీమతిని పరకడుపున ఐదేసి మింగమనండి. ఈ మందు రోజుకు 3 మార్లు." అని మందు సీసాలు రెండు నాకు ఇచ్చాక, మా స్నేహితుని వైపు చూసి " మీకేస్ షీట్ రాసుకుంటాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి. హోమియో వైద్యం మందిచ్చే వైద్యుని మీదా, మందు మీదా కూడా నమ్మకం ఉంచితే బాధ త్వరగా తగ్గిపోయి ఫలితం చూపుతుంది. ఈ హోమియో అలోపతిలా నేరుగా నొప్పున్న చోటుకు వెళ్ళి తగ్గించడం కాక , అసలు నొప్పి రాను కారణాలేంటో తెల్సుకుని దాన్ని తగ్గిస్తూ నొప్పి రాకుండా నివారిస్తుంది. దాని కోసం మిమ్మల్ని నేను అడిగే ప్రశ్నలకు నిదానంగా సమాధానాలు చెప్పండి." అంటూ వైద్యుడు ముందుగా పేరు, వయస్సూ రాసుకుని, “ మీ స్వగ్రామమేది? “ అనడిగాడు.
మా వాడు ”మా ఊరికీ మీరిచ్చే మందుకూ లింకేమిటండీ!” అన్నాడు ఆశ్చర్యంగా. "అలా కాదండీ! మీరు నేనడిగేవన్నీ చెప్పాలి. మీరు జన్మించిన ఊరేది?". మా వాడు చెప్పాడు."మీ వృత్తి?" " నా వృత్తితో పనేంటండీ! ఐనా నేనేం లంచగొడిని కాను. నిజాయితీగా నిఖార్సైన ఉద్యోగిని." "అలా కాదు చెప్పరా బాబూ!" అంటూ నేను వెన్ను తట్టాను. చెప్పాడు. "మీ చదువు " "అదేంటండీ! చదువుకున్న వారికే మీరు మందులిస్తారా?, ఇంజనీరైతే ఒక మందూ, వైద్యు డైతే ఇంకో మందూ , టీచరైతే మరో మందూ .." అబ్బాబూ! నా మాట వినరా హనుమంతూ.."అని బ్రతిమాలగా, చెప్పాడు. "మీకు ఇష్టమైన రంగు?" ఈ మారు మా చెల్లెమ్మ చెప్పింది. "మీరు ఎక్కువగా ఇష్టంగా తినే పదార్ధం? శాకాహారమా? మాంసాహారమా దేన్నిఇష్ట పడతారు? “అదీ చెల్లెమ్మే చెప్పింది." మీకు ఇష్టమైన పండు.." " ఇదేం ప్రశ్న? ఏది దొరికితే అదే తింటాం? చలికాలంలో మామిడి పండు దొరుకుతుందా తిందామన్నా? " ---“ఒరే ఏంట్రా ఈ పిచ్చి ప్రశ్నలు?” అన్నాడు నా వైపు చూసి మెల్లిగా.. "ఒరే హనుమంతూ! ప్రశ్న బాగా వినరా! వారు అడిగింది నీకు బాగా ఇష్టమైన పండు పేరు మాత్రమేరా!" అని నేను కోప్పడ్డాక చెప్పాడు. "మీకు ఇష్టమైన కూరగాయ? " " ఇదీ ఒక ప్రశ్నేనా? ఐనా ఉద్యోగం ఇంటర్వ్యూలో అడిగినట్లు, ఓ మందు నా ముఖాన కొట్టను ఇవేమి ప్రశ్నలండీ! ఐ.ఏ.ఎస్. వార్ని అడిగినట్లూ?" సహనమన్న సద్గుణం వాడికి ఏ కోశానా లేనే లేదు.
చెల్లెమ్మ కలుగజేసుకుని చెప్పింది. “మీకు ఇష్టమైన పుష్పం ?“. చెల్లెమ్మ “మల్లె “ అనగానే ,” ఆమెను తట్టి, “ అది నీకు ఇష్టమైన పువ్వు, నాకు జాజి పువ్వేగా ఇష్టం ? మన తొలి రాత్రి నాడు మీ వాళ్ళు మల్లెల మాలలు మంచం చుట్టూ కట్టగా నేను అడిగి మరీ జాజి పూల మాలలు మార్పించుకున్నాను. అందుకేగా ముహూర్తం గంట లేటైంది. మొగుడి ఇష్టాలు కూడా మర్చి పోతారు భార్యలు రెండేళ్ళు కాగానే “ అంటూ భార్య వైపు కొర కొరా చూడగా, ఆమె సిగ్గుతో చీర చెంగులో ముఖం దాచుకుంది. నేనూ వైద్యుడూ కూడా నవ్వాపుకున్నాం. 'పిచ్చి కుదిరింది రోకలి మెడకు చుట్టమన్నట్లు 'మా వాడి తిక్క పెరిగిపోయిందని నాకు అర్ధమైంది . “మీరు కోరుకునే జీవన సరళి ?బాధ్యతలూ-బరువులూ లేకండా హాయిగా ఉండాలనా? భాధ్యతలు తప్పనిసరిగా తీసుకోవాలనా? “ “అదేంటండీ! భర్తగా నా బాధ్యత వదిలేస్తానా? మరొకరికి బదలాయిస్తానా? “అంటుండగా నేను ఆ ప్రశ్న వదిలేయమని వైద్యుని వైపు చూసి సైగ చేశాను. “మీ తండ్రి గారికి గానీ, తాత గారికి గానీ, తల్లి, వాళ్ల తల్లికి గానీ ఏవైనా పెద్ద జబ్బులు, లేదా మీ వంశంలో ఎవరికైనా నయం కాని వంశపారం పర్య వ్యాధులేమైనా ఉండేవా? “మా వాడు ఛర్రున లేచాడు, తోక తొక్కిన త్రాచులా. ” అంటే మా కుటుంబం అంటు వ్యాధుల కుటుంబమని చాటుతారా? ఆసలు మీకు మా తాత ముత్తాతలతో పనేంటండీ? మందు నాకా? మా వాళ్ళకా ఇచ్చేదీ? లేక వాళ్ళకు మందులు పంపను నన్ను వాళ్ళ దగ్గరకు పైకి పంపుతారా ఏం? “అంటూ వీర నరసిమ్హ స్వామిలా ఉగ్ర రూపంతో లేచాడు. “అబ్బా ! నీ గోల ఆపి చెప్పరా!” అని గడ్డం పట్టుకోగా, “ నే చెప్పను పో “ అంటూ పసి పిల్లాడిలా నా చేయి విసిరి కొట్టాడు, అది వెళ్ళి గోడక్కొట్టుకుని జివ్వున లాగింది భరించలేని బాధతో, "అయ్యా! వైద్యులు గారూ ఇహ ప్రశ్నావళి ఆపి మందిచ్చి పంపండి ఈ సారికి" అన్నాను, షాక్కొట్టిన నా మోచేయి రుద్దుకుంటూ.
వైద్యుడు నవ్వి "సరిసరి, చివరికి వచ్చేశాం, మీకు ఎలా ఉండాలని ఇష్టం? సరదాగానా? సీరియస్ గానా? “ “అయ్యా! ఇంత దాకా చూశారుగా ? మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకండీ!” అంది చెల్లెమ్మ. “సరే మీరు ఎలాటి సినిమాలు ఇష్ట పడతారు?” “ఆయనసలు సినిమాలే చూడరండీ! పెళ్ళయ్యాక మేము సినిమా కెళ్తే ఒట్టు” అంది చెల్లెమ్మ. “లాస్ట్ బట్ లీస్ట్, మీరు ఎటు వైపు తిరిగి పడుకుంటారు? కుడి వైపా?ఎడమ వైపా? “ “పెళ్లైన మగాళ్ళను అడిగే ప్రశ్న కాదిది? ఐనా అడిగారు గనుక చెప్తున్నా మా ఆవిడ వైపు తిరిగి పడుకుంటాను, మీకేమైనా అభ్యంతరమా?” అన్నాడు గుడ్లు మిటకరించి. చెల్లెమ్మ అక్కడ ఉండలేక బయటి కెళ్ళి పోయింది. నేను “సార్! ఈహ కేస్ స్టడీ ఆపేసి ప్రస్తుతానికి మందివ్వండి.” అని ఈ మారు వైద్యుని నేను బ్రతిమాలాను, అక్కడింకా కొంత సేపు ఉంటే, ఏమి ప్రశ్నలూ, ఏమి సమాధానాలు వినాల్సి వస్తుందోనే భయంతో. "సరేనండీ! మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ఈ మందు మాత్రం సరిగ్గా నేను చెప్పినట్లు వాడాలి, ఇది టీ.వీ. యాడ్స్ లో చూపేట్లు, అలోపతి ‘ఆస్పిరిన్ ‘ బిళ్ళ వేసుకోగానే "అయ్యో పోయిందే!" అన్నట్లు పోదు, అసలు మీకు కాలు నొప్పి ఎందుకు వస్తున్నదో ఆమూలం నుంచీ పని చేసి తగ్గిస్తుంది. " అంటూ తీపి గుళ్ల సీసాలు3 ఇచ్చాడు వైద్యుడు. వాటినెలా వేసుకోవాలో వేసుకునే మూందూ తర్వాతా ఏం చేయాలో వివరాలు చెప్తే నేనే అన్నీ వ్రాసుకున్నాను. అతడికి నేనే ఫీజిచ్చి, మా వాడ్ని బయటికి రెక్క పట్టి లాక్కొచ్చి, వైద్యుని సలహా మేరకు రోజూ నడిపిస్తూ, మందులేయించాక, రెండు నెలల్లో మా వాడు, ఎంతో కాలంగా తీసుకుంటున్నకాలు నొప్పి మటు మాయమై, వాడి టూ వీలర్ అమ్మేసి, కాలి నడకన కార్యాలయానికి రాసాగాడు.