ఓ పిల్లి మనస్తాపం - ..

o pili manastapam

హలో! నేనొక పిల్లిని. నా గోడు వింటున్నందుకు , సారీ, చదువుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు పుట్టెడు దుఖ్ఖంలో వున్నాను. మా పిల్లులందరికీ తెలుసు దానికి కారణం. కొంతమంది మనుషులకి కూడా ఈ విషయం తెలుసు. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు కదా. అందుకే ఇలా మీతో...

అసలు పిల్లులంటే ఈ దేశపు మానవులకు గుర్తొచ్చేదేమిటి? మేమొక చెడ్డ శకునమని. మమ్మల్ని పెంచుకునే వాళ్ళున్నా కూడా సాధారణ ప్రజానీకం మమ్మల్ని లోకువ చేసి చూస్తారు. మా జాతి వైరి అయిన కుక్కల్ని ప్రేమిస్తారు వాళ్ళు, వాటికి పిచ్చిపడితే యజమానిని కూడా కరుస్తాయి. అయినా సరే, మానవులు మమ్మల్ని చులకన చేసి, మా తోకల్లో మహాపాతకాలుంటాయని దుష్ప్రచారం చేస్తుంటారు. మరి మా పొట్టకూటికై బయటకి వెళ్ళేటప్పుడు యీ మానవులు ఎదురుపడతారు కదా! మరి మేమేం కావాలి?

పెళ్ళంటేనూరేళ్ళపంట, పందిళ్ళు , సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, వగైరా అని చెప్పే మనుషులు, పెళ్ళికి వెళ్తూ మా జాతి వాళ్ళని చంకలో పెట్టుకుని వెళ్తే అశుభమని అంటారు. మాకు మాత్రం మీ పెళ్ళిళ్ళు, వాటి భోజనాలు అంటే ఆశ వుండదా..

మా మూతులు చిన్నవిగా వుంటాయి కదా! అందుకు "పిల్లి మూతి" అని మెచ్చుకోలుగా అంటారు మానవులు. ఇది ఇలా వుంటే. ఈ మధ్య ఇ-మెయిల్లో ఒక మెయిలు ప్రాచుర్యం చెందింది. దాని సారంశం ఏమిటంటే ఆడవాళ్ళు ప్రేమించబడడానికి కుక్కని కొనాలట. ఇంట్లో గారాలు పోయే మనిషి కావలంటే పెళ్ళి చేసుకునే బదులు పిల్లిని కొనుక్కోవాలట! ఎంత ఏక పక్ష వాదమో చూశారా! పైగా, పుండు మీద కారం జల్లినట్టు మా శత్రువుని మెచ్చుకోవడం ఒకటి!

మా ఆయువు చిన్నదైనప్పటికీ, మాకు తొమ్మిది ప్రాణాలుంటాయనీ, అంత సులభం గా చావమనీ, గేలీ చేస్తూంటారు ఈ మానవులు. ఏదో ప్రాణభీతితో ఎక్కడో దాక్కుంటే ఇదండీ ఈ మానవుల వరుస! పిల్లి జన్మనెత్తితే జపాన్లో ఎత్తాలని ఈ మధ్య మా సంఘం వాళ్ళు అన్నారులెండి. మా సోదరుడు. "తమ" ని, స్టేషన్ మాస్టర్ గా పని చేయనివ్వడమే కాకుండా ఆయన పరమపదించాక ఆయన పేరులో ఓ స్మారకం కట్టి పూజిస్తున్నారట అక్కడి మానవులు. అంటే పూరవ జన్మ సుకృతం దండిగా వుండాలన్నమాట!

అదెలాగూ ఈ జన్మకు లేదు కాబట్టి నా గోడు కొనసాగిస్తాను. మేము నీళ్ళోసుకుంటే, యీనితే ఏడిళ్ళు మారుతామని ఈసడిస్తారే వీళ్ళు, కానీ భద్రతా దృష్ట్యా మేము ఈ పనులు చేస్తామని గ్రహించరు.

ప్రకృతిపరం గా ప్రాప్తించిన మా దాంపత్యాన్ని "మార్జాల దంపత్య" మని వెక్కిరిస్తారే ఈ మానవులు! నాకు తెలియక అడుగుతాను, వీళ్ళ సినీమాల్లో వుండే దాంపత్యం ఎలాంటిదో గురివింద గింజలు వీళ్ళు!

మాతృత్వానికొస్తే, వీళ్ళ పూర్వీకులైన తల్లి కోతులు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవు: ఆ పిల్లలే స్వజాగ్రత్త కోసం తల్లుల్ని అంటి పెట్టుకుంటాయి. ఆ విషయం చూడండి. పిల్లల్ని, అంటే పిల్లుల్ని, కనేటప్పుడు ఏడిళ్ళు మారుతా కదా! ఇంకా , మేము మా పసివాళ్ళని నోట కరుచుకుని తిరుగుతాం. మా పిల్లలని కాపాడుకునే మనో స్థైర్యం మాకుంది. కొంతమంది మానవులు మాత్రం అమానుషం గా వాళ్ళ పసికందుల్ని కుప్ప తోటల్లో వేస్తారట కదా! ఇంకా కొంతమంది శరణాలయాలలో చేరుస్తారట: మరి కొందరేమో అమ్ముకుంటారుట! కొన్నిచోట్లయితే శిశువుని కడుపులోనే చంపేస్తారుట కూడా! మా మంచితనం ఇప్పుడైనా అర్ధమయిందా.

ఇంకా , మా నడక ఎప్పుడూ చౌర్యం, రహస్యం - ఇలా చెడ్డ వాటితో ముడిపడి వుంటుంది. మా ప్రాణాలు కాపాడుకోవడానికి జాగ్రత్తగా అడుగు చప్పుడు చెయ్యకుండా మేము నడుస్తే మాకు ఇలా చెడ్డ ఉద్దేష్యాలు ఆపాదిస్తారు. మా విషయానికొస్తే ఇలా అనుకునే మనుషులు అమ్మాయిలని మాకులాగా నడిపించి , దానికి ఇంగ్లీషులో "కాట్ వాక్ " అని పేరు పెట్టుకుని, అలా నడిచిన వాళ్ళలో కొంతమందికి ఫలానా సుందరి, అని పట్టం కడుతూ వుంటారట! ఒక్కో జాతికీ ఒక్కో న్యాయం, ఈ మానవులకి.

రెండు పిట్టలు కొట్టుకుంటే న్యాయం చెప్పే నెపంతో మేము అన్యాయం చేస్తామని అంటారు మానవులు. అయ్యా , అమ్మా! మా సంగతి వదిలెయ్యండి. నాగరికులమైన మీ సమాజాల్లో అన్యాయాలు లేకుండా , ధర్మం నాలుగు పాదాలు నడుస్తోందా?

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా జాతి మీద మీకున్న అపోహలు తొలగించడానికి. తొలగిపోయాయండీ? అయ్యయ్యో లేదా? లేకపోతే ఈ కథనంతటితో ముగించకుండా సశేషం , చేస్తాను. దానికి మీరు రెడీనా?

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు