తోటలోని కాటేజ్ - తిరుమలశ్రీ

totaloni cottej

"మిమ్మల్ని ఇంతకుమందు ఎక్కడో చూసాను" అన్నాడు అవినాశ్ హఠాత్తుగా.

చటుక్కున తలెత్తి అతని కళ్ళల్లోకి చురుగ్గా చూసాడు భీమారావ్. ఓ క్షణకాలం అలా తేరిపార జూసాక నవ్వేసాడు.. "నెల రోజులుగా నన్ను చూస్తూనే వున్నావుగా!"

"కాదులెండి. మొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే కలిగింది. నాలో ఆ ఫీలింగ్. అయితే ఎక్కడ చూసావో మాత్రం గుర్తుకు రావడం లేదు" అన్నాడు. అవినాశ్ చిరునవ్వుతో.

రమ్మీ ఆడుతున్నారు ఇద్దరూ.

కాసేపటికీ, "షో" అంటూ పేకలు కిందపడేసి ఇవాళ్టి పేక ఆట చాలిద్దాం, అన్నాడు భీమారావ్.

అవినాశ్ విస్తుపోయి, అదేమిటీ? మనం ఆట ప్రారంభించి గంట కూడా కాలేదుగా!? అన్నాడు.

"ఇవాళ ఒంట్లో కొంచెం అనీజీగా వుంది. అందుకే .." భీమారావ్ లేచాడు.

అవినాశ్ కూడా లేచి , "అయితే రెస్ట్ తీసుకోండి. సాయంత్రం కలుద్దాం" అంటూ బైటకు నడిచాడు.

శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఘాట్ రోడ్ పక్కనున్న ఓ హెల్త్ రిసార్ట్ అది.

నగరాలలోని పొల్యూషన్ కు దూరంగా వున్న ఆ ప్రదేశానికి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికో , కొద్ది రోజులపాటు బిజీ లైఫ్ ను మర్చిపోయి ప్రశాంత జీవనం గడపడానికో శ్రీమంతులు కొందరు వస్తూంటారు.అందుకు అవసరమైన వసతి సదుపాయాలు అక్కడ లభిస్తాయి. మెడికల్ డిస్పెన్సరీతో సహా, ఇరవై ఐదేళ్ళ అవినాశ్ హ్యాడ్సం గా వుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన అతను చిత్రలేఖనాన్ని ప్రవృత్తిగా చేసుకున్నాడు.

ఏడాదికోసారిగా ఆ సుందర ప్రకృతిని తన కుంచెతో ఈ సెవ్ల్ లో బంధించేందుకని హైద్రబాద్ నుండి వస్తూంటాడు.తనకు ఇష్టమైనన్ని రోజులు అక్కడ గడుపుతూంటాడు.

అవినాశ్ అక్కడకు వచ్చి నెలయింది, ఉదయం , సాయంత్రం వాకింగ్ .. పగలు ఆ రమణీయ ప్రకృతి అందచందాలను కాన్వాస్ లోకి ఎక్కించి కుంచెతో రంగులు దిద్దడం .. కూడా తెచ్చుకున్న ల్యాప్ ట్యాప్ మ్యూజిక్ సిస్టంస్ , పుస్తకాలతో కాలక్షేపం.. దూరంలో గోచరించే భ్రమరాంభా మల్లిఖార్జునుల ఆలయ శిఖరాల వైపు చూస్తూ మైమర్చిపోవడం - ఇవీ అతని దినచర్యలు..

ఐతే భీమారావుతో పరిచయం అందులో స్వల్ప మార్పులను తెచ్చింది.

ఆ రిస్సార్ట్ లోని కాటేజ్ లలో అందమైన చిన్న పూదోట నడుమనున్న నక్షత్రాకారపు కాటేజ్ కొంచెం విశాలంగా ముచ్చట గొలుపుతూంటుంది.

అవినాశ్ ఎప్పుడు వచ్చినా అందులోనే బస చేసేవాడు. ఈ సారి అది ఖాళీ లేదు.

అందులో భీమారావ్ వుంటున్నాడు. భీమారావ్ దాన్ని ఆర్నెళ్ళకు బుక్ చేసుకోవడం జరిగింది.

భీమారావుకు యాభై ఏళ్ళుటాయి. మనిషి సన్నమైనా దృడంగా వుంటాడు. పొడవూ పొట్టి కాని విగ్రహం , కలకత్తా నుండి వచ్చిన ఓ బిజినెస్ మేన్ అట అతను, నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ జరిగిందట. ఆ రిసార్ట్ గురించి ఎవరో చెబితే, విశ్రాంతి కోసం కూతురు సాగరికతో మూణ్ణెల్ల క్రితం అక్కడకు వచ్చాడట...

మార్నింగ్ వాక్ లో అతనికి పరిచయమయ్యారు ఆ తండ్రి , కూతుళ్ళు.

సాగరికకు ఇరవై ఏళ్ళుంటాయి. తెల్లగా, స్లిం గా , పొడుగా వుంటుంది. కాటుక దిద్దిన కలువ కన్నులు, అందమైన నాసిక, శంఖాన్ని పోలిన నున్నని కంఠం... సాధారణ అందమే అయినా , మళ్ళా మళ్ళా చూడాలనిపించే రూపం ఆమెది.

తొలి చూపులోనే సాగరిక తన మనసును వశపరుచుకోవడంతో వారితో పరిచయం పెంచుకున్నాడు. అవినాశ్. తన ప్రవర్తనతో క్రమంగా అతన్ని ప్రసన్నం చేసుకోగలిగాడు..

సాగరిక బిడియస్తురాలు, మిత భాషీను. తన చిత్రాలను చూసి విప్పారే ఆమె కనులు, ఆనందాన్ని మరుగుపరచలేని ఆమె స్పందన చూస్తే ముచ్చట గొలిపేది అవినాశ్ కు. ప్రకృతి కాంతను అతను వివిధ రూపాలలో చిత్రిస్తూంటే దగ్గర కూర్చుని ఆరాధనగా అతని వదనం లోకి చూస్తూండిపోయేది సాగరిక.

అతను చింత్రించిన తన అందాలను చూసుకుని మురిసిపోయేది. తన చిత్రపటాన్ని భీమారావ్ చూడకుండా బద్రంగా దాచుకుంది.. అప్పుడప్పుడూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆ అందాల ప్రకృతుల మధ్య అడుగులు వేస్తూ, చిన్నపిల్లల్లా కేరింతాలు కొట్టేవారు. ఆమె నవ్వు అతన్ని పరవశింపజేసేది. ఆమె ప్రేమలో పడ్డ అవినాశ్ కు ఆమె మనసేమిటో ఆకళింపు అయ్యేది కాదు.

భీమారావ్ రెండు వేళలా వాకింగ్ కు తప్ప కాటేజ్ వదిలేవాడు కాదు. అతనికి కాలక్షేపం కోసమని రోజుకోసారైనా తోటలోని కాటేజ్ కు వెళ్ళి అతనితో పేకాట ఆడేవాడు అవినాశ్. ఆ వంకను సాగరికను చూడాలన్న ఆలోచన కూడాను అతనిది.

వారు ఆడుకుంటూంటే దగ్గర కూర్చుని చూస్తూండేది ఆమె. మధ్య మధ్య రిఫ్రెష్ మెన్ట్స్ అందించేది. ఒక్కోసారి ఆమె బలవంతం పైన అక్కడ భోజనం కూడా చేసేవాడు అవినాశ్.

ఆ మధ్య భీమారావ్ వాకింగ్ టైమింగ్స్ మారిపోయాయి. ఒంట్లో బాగోలేదంటూ పేకాడడం కూడా తగ్గించుకున్నాడు.

సాగరిక కూడా మునుపటిలా ఎక్కువగా బైట కనిపించడం మానేసింది.

భీమారావును ఎక్కడో చూసాను అన్న భావన అవినాశ్ మదిని వదలడం లేదు.

అదే విషయం సాగరికతో అంటే నవ్వి ప్రపంచం లో ఒకే పోలికలోని మనుషూ ఏడుగురు ఉంటారట! డాడీని పోలిన మరో వ్యక్తిని ఎక్కడో చూసే వుంటారు అంది.

ఓసారి నెట్ సర్చ్ చేస్తుంటే ఆ విషయం గుర్తుకువచ్చింది అవినాశ్ కు సాలోచనగా ఏదో సైట్ ను ఓపెన్ చేసి లింకులు క్లిక్ చేసాడు.

అంతే ఝూం ఝూం మారుతం సోకిన మబ్బులా మిస్టరీ వీడిపోయింది..

స్క్రీన్ పైన భీమారావ్ ఫోటో , అతని పుట్టుపూర్వోత్తారాలూ ప్రత్యక్షమయ్యాయి..

భీమారావ్ అసలు పేరు జగ్గారావ్. ఓ నొటోరియస్ క్రిమినల్ అతను! పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిళ్ళూ, హైవే రాబరీనూ అతని ప్రత్యేకతలు.. నాలుగు మాసాలా క్రితం చెన్నయ్ లోని ఓ జ్యువెలరీ ఎక్జిబిషన్ నుండి సుమారు పాతిక కోట్లు విలువచేసే ఓ అరుదైన వజ్రాన్ని దొంగిలించి అదృష్యమైపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు..

నిర్గాంతపోయాడు అవినాశ్.

అంతకు మునుపు హైద్రాబాద్ లో వుండగా న్యూస్ పేపర్ లో , టీవీ చానెల్స్ లో అతని ఫోటోలు చూసిన విషయం గుర్తుకువచ్చింది. జగ్గారావ్ మారు పేరుతో ఆ మారుమూల ప్రాంతం లో దాక్కుంటాడని ఎవరు ఊహించగలరు!? భీమారావ్ ను కొద్ది రోజులపాటు గమనించి, అతని గురించి మరిన్ని వివరాలు సేకరించి కానీ పోలీసులకు సమాచారాం అందించకూడదనుకున్నాడు. అవినాశ్.

ఐతే సాగరికతో తన ప్రేమ ఏమవుతుందోననన్న బెంగ కూడా పట్టుకుంది.

ఆ రోజు పేకాడుతూ హఠాత్తుగా అన్నాడు భీమారావ్ . రేపు మేము కలకత్తా వెళ్ళిపోతున్నాం.

సాశ్చర్యం గా చూసాడు అవినాశ్. మరో మూణ్ణెళ్ళ వరకు ఇక్కడే వుంటామన్నారుగా?

నిజమే కాని నేను దగ్గర లేకపోవడంతో బిజినెస్ లో ఏవో సమస్యలు తలెత్తాయని మేనేజర్ ఫోన్ చేసాడు. చెప్పాడు భీమారావ్, పేక ముక్కల మీంచి దృష్టి మరల్చకుండానే .

అప్రయత్నం గా సాగరిక వదనం లోకి చూసాడు అవినాశ్.

ముఖం త్రిప్పుకుని లోపలికి వెళ్ళిపోయీంది ఆమె. మన స్నేహానికి గుర్తుగా ఇవాళ రాత్రి కాక్ టెయిల్ పార్టీని ఏర్పాటుచేస్తున్నాను, మళ్ళా అన్నాడు భీమారావ్.

కాక్ టెయిల్ పార్టీ తోటలో అరేంజ్ చేయబడింది. జిన్, చికెన్-65, మటన్ మసాళా, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, వగైరాలు వున్నాయి. అవన్నీ కాటేజ్ అటెండెంట్ ను సమీపం లోని టౌన్ కు పంపించి తిప్పించాడు భీమారావ్. వంటకాలు మాత్రం సాగరిక చేసింది..మగవాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తూంటే , కొంచెం ఎడంగా కూర్చుని ముభావం గా చూస్తోంది ఆమె.అవినాశ్ ఆమె వంక దొంగ చూపులు చూస్తున్నాడు. వారు వెళ్ళిపోయే లోపున ఆమెకు తన ప్రేమను వెళ్ళడించి ఆమె మనసు తెలుసుకోవాలని తహతహలాడుతున్నాడు అతను. కాని, రెండు రోజులుగా ఆమెతో ఏకాంతం లభ్యం కావడంలేదు..

పైగా, భీమారావ్ అక్కడనుంచీ అదృశ్యమయ్యే లోపలే పోలీసులకు ఏదో విధం గా సమాచారం అందించవలిసి వుంది కూడాను. డ్రింక్స్ ఓ రౌండ్ పూర్తయింది. రెండో రౌండ్ ప్రపోజ్ చేసాడు భీమారావ్.

అవినాశ్ వద్దన్నాడు. అరుదుగా డ్రింక్ చేస్తాడు అతను. అదీ, స్నేహితుల బలవంతం పైన..

జిన్ లేడీస్ డ్రింక్. ఎంత త్రాగినా పరవాలేదు అన్నాడు భీమారావ్ నవ్వుతూ. ఈసారి డ్రింక్సు ను తానే స్వయం గా కలుపుకు వస్తానంటూ లేచి లోపలికి వెళ్ళాడు.

సాగరిక అతన్ని అనుసరించింది.

కాసేపటికీ భీమారావ్ తిరిగివచ్చాడు.

అతని వెన్నుకే డ్రింక్ గ్లాసులు పట్టుకుని వచ్చింది సాగరిక.

భీమారావ్ అక్క బిజినెస్ ఊసుల మధ్య డ్రింక్ చేయసాగారిద్దరూ. అతని నోటినుండి తెల్లటి నురగలు వచ్చాయి. అవినాశ్ కంగారుగా లేచి అతన్ని పిలుస్తూ కుదిపి చూసాడు. నాడి పడిపోతున్నట్లు అనిపించడంతో "కాల్ ద డాక్టర్ క్విక్ " అంటూ అరిచాడు, సాగరికనుద్దేంచి. ఆమె కూర్చున్న చోటు నుండి కదల్లేదు. అవసరం లేదు. అతను బ్రతకడు అంది నిర్లిప్తంగా. అతను త్రాగిన డ్రింక్ లో విషం కలిసింది.

అదిరిపడి చూసాడతను.

అవును. విషం కలిసిన డ్రింకును అతనికిచ్చింది నేనే అంది మళ్ళా.

ఏ వై.. షాక్ తిన్నాడు అవినాశ్.

నేను అలా చేసుండకపోతే ఇప్పుడు అతనున్న స్థితిలో మీరుండేవారు. ఆమె గొంతుక స్వల్పంగా కంపించింది. తెల్లబోయాడు అతను. అవినాశ్ తనను గుర్తుపట్టినట్టు గ్రహించిన జగ్గారావు ఉరఫ్ భీమారావ్ తన దారి నుంది తొలగించుకోవాలనుకున్నాడు. అందుకే అక్కడ్నుంచి వెళ్ళిపోతున్నట్టు కాక్టెల్ కు ఆహ్వానించాడు. రెండో రౌండ్ లో డ్రింక్స్ స్వయం గా కలుపుతూ అవినాశ్ డ్రింకులో విషం కలిపాడు. ఆ విషయం చాటు నుండి గమనించిన సాగరిక , తెలివిగా గ్లాసులు మార్చేసింది.

ఆమె చెప్పింది ఆలకించి నిశ్చ్చేచ్చుడయ్యాడు అవినాశ్. భీమారావ్ ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు అవినాశ్. ప్రాణం పోయి చాలాసేపు అయింది. నాకోసం చేతులార చంపేసావంటే నమ్మలేకపోతున్నాం అన్నాడు సాగరికతో. అతను నా తండ్రి కాడు.

చిత్రం గా చూసాడు.

ఆమె చెబుతున్న వివరాలు అతన్ని అచ్చెరుపాటుకు గురిచేసాయి. పదేళ్ళ క్రితం ఓ పడవ ప్రమాదం లో తల్లిదండ్రులను కోల్పోయిన సాగరికను చేరదీసి, పెంచి పెద్ద చేసాడు గజదొంగ జగ్గారవు. తన వృత్తి కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాలలోనే కొనసాగించేవాడు. నాలుగు నెలల క్రితం చెన్నై లోని అన్నాశాలై లో జరిగిన ఓ జ్యువెలరీ ఎక్జిబిషన్ ది విలువైన వజ్రం దొంగిలించాడు అతను. పోలీసులనుండి తప్పించుకునేందుకు ఆ రిసార్టు కు వచ్చి మారు పేరుతో తలదాచుకున్నాడు... అవినాశ్ తనను ఎక్కడో చూసినట్టు చెప్పడంతో, వార్తా పత్రికలలో, టీవీ చానెల్స్ లో తన ఫోటొలను చూసి వుంటాడని ఏక్షణం లోనైనా తన అసలు స్వరూపం గుర్తించవచ్చని భయపడ్డాడు. కాక్టెయిల్ పేరుతో అవినాశ్ ను హతమార్చానుకున్నాడు.

ఆ విషయం పసిగట్టిన సాగరిక అప్రమత్తతో అవినాశ్ ప్రాణాలను కాపాడింది.

కొయ్యబారిపోయాడు అవినాశ్.

నాది కృతజ్ఞతే అయినా మంచిని బ్రతికించడం కోసం చెడును చంపక తప్పలేదు. ముఖం చేతుల్లో కప్పుకుని దుఖ్ఖించింది సాగరిక. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియడంలేదు ఆర్ద్రం గా అన్నాడు అవినాశ్. సాగరికా తొలిచూపులోనే నా హృదయం దోచుకున్న స్థ్రీవి నువ్వు. నీకు సమ్మతమైతే నిన్ను నా అర్ధాంగిని చేసుకోవాలనుకుంటున్నాను.

చటుక్కున తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది సాగరిక. అంతలోనే లజ్జాభారంతో ఆమె కనులు వాలిపోయాయి. కాలిబొటన వ్రేలితో నేల మీద రాస్తూ వుండిపోయింది. `

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ