ప్రియ శిష్యుడు - డా.భారతి .

priyashishyudu


“ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం వెంకటరాజు మాష్టారు గారే” వేదిక మీద రాజు ఉపన్యాసం సాగుతోంది. వింటున్న నాకు ఒళ్ళు మండిపోతుంది. వేదిక మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి అందరూ పెద్దమనుషులే! చేతల దగ్గరే ముఖం చాటేస్తారు. ఎన్నిసార్లు వాడితో దూరవాణి ద్వారా మాట్లాడారు? “మాష్టారి ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. సన్మానం పేరుతో పూర్వ విధ్యార్ధులమంతా కలిసి ఏదైనా చేస్తే మాష్టారికి కొంత వెసులుబాటుగా ఉంటుంది. నువ్వేం చేయ్యగలవు?” అంటే “చూద్దాం వస్తాను కదా!” అనేసాడు. వాడుండేది అమెరికాలో. ఇదిగో, అదిగో అనీ ఆరు నెలల కాలం గడిచిపోయింది. అయినా వాడంటేనే మాష్టారికి వల్లమాలిన అభిమానం.

“వాడు ఇక్కడకు వచ్చినప్పుడే సన్మానం కార్యక్రమం పెట్టుకుందాము” అనేసారు. “మనందరికన్నా వాడు పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా! వాడూ కలిస్తే కాస్త పెద్ద మొత్తం అవుతుంది. వాడు వచ్చినప్పుడే ఈ సన్మానం పెట్టుకుందాము” అని మిగిలిన వాళ్ళూ అనేసారు. దాంతో ఇదిగో అనుకున్న పదినెలల తరువాత .... ఎప్పుడు? పెద్ద పండుగ అప్పుడు అనుకున్నారు తనూ, వాసూ. పండక్కి సొంత ఊరు వెళ్ళినప్పుడు, మాష్టారి దగ్గరకు వెళితే..... మాష్టారిని చూసి చాలా కష్టమనిపించింది. అద్దె ఇంట్లో.. వచ్చిన కొద్ది మొత్తం పెన్షన్ తో భార్యా భర్తలిద్దరూ.... ఇప్పుడు మాష్టారి ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. చూడడానికి మాష్టారికి పిల్లల్లేరు. జీతం వెనకేసుకోకుండా అందరి కిందా ఖర్చు పెట్టేసారు. అప్పుడనిపించింది. శిష్యులమంతా కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని. ఆ ఆలోచనను వాసు బలపరిచాడు. అప్పటి నుండి అందరి చిఱునామాలు సంపాదించడం, వాళ్ళకు విషయం చెప్పడం... కొంతమంది వెంటనే అలాగే అంటే, కొంతమంది ఎటూ తేల్చకుండా... మరికొంతమంది సాధ్యం కాని ఆలోచనలు చెప్పడం. ఒకడైతే ఏకంగా ఇల్లు కట్టించేద్దాము అన్నాడు. మాష్టారిమీద వాడికున్న అభిమానానికి సంతోషమే కానీ... సరే నువ్వు ఎంత ఇస్తావు అంటే, “మనం ఓ వందమందిమి ఉండమా! తలా ఐదు వేలు వేసుకుంటే ఇల్లు కట్టించొచ్చు” అని లెక్కలు వేసాడు.

శిష్యులైతే ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అందులో ఎంతమంది కలుస్తారు? కలిసినా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇవేవీ ఆలోచించకుండా మాటాడేస్తే ఎలాగ? ఎవరిని అడిగినా “రాజుకి విషయం చెప్పారా! మనందరికన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా! వాడైతే బాగా ఇవ్వగలడు” అన్నవాళ్ళే. మాకా విషయం తెలియదా! ఎంతో ప్రయత్నం మీద ఫోనులో దొరికాడు. “నేనొచ్చాక చూద్దాం” అనేసాడు. “ఎప్పుడొస్తావు?” అంటే “ఈ మధ్య వద్దామనుకొంటున్నాను” అనడమే అప్పటినుండి. అప్పటికీ వాడి దగ్గరి స్నేహితుడు రవితో కూడా చెప్పారు. “వాడికి తీరిక లేదురా” అనేసాడు వాడు కూడా. ఇదిగో వారం క్రిందట వచ్చాడు. వాడితో మాట్లాడదామంటే ఫోనులో కూడా దొరకలేదు. వాసు వాడి దగ్గరకు వెళితే “చూద్దాం ఆ రోజు వస్తాను కదా!” అనేసాడట. వాసు చాలా బాధ పడ్డాడు. కోపం కూడా వచ్చింది. ఎంత అంటే “ఇంక వాడిని అడగొద్దురా” అనేసాడు. అందరిదీ కలిపి లక్షా ఏభయ్ వేలు అయింది. వాడు ఇచ్చినది ఆ మొత్తానికి కలుపుదాము అనుకున్నాము ముందు. ఇప్పుడు “వాడి సంగతి మర్చిపో. డబ్బు కూడా నువ్వే ఇవ్వు. వాడి చేత ఇప్పించకు” అనేసాడు వాసు. పోనీ తనేమన్నా మాట్లాడదామన్నా ఆ అవకాశం కూడా దొరకలేదు. కార్యక్రమము మొదలుపెట్టే సమయానికి వచ్చాడు. మాష్టారితో పాటు వేదిక మీద కూచున్నాడు. ఇంకేం చేసేది? వాసు చెప్పినట్లే చేయాలి.

అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుంటే ఆ శబ్దానికి ఈ లోకం లోకి వచ్చాను. అంత బాగా ఏం చెప్పాడో! ఇంత గట్టిగా చప్పట్లు కొట్టారు. అవునులే మాట్లాడడానికి మదుపేమిటి? ఎన్నన్నా చెప్పొచ్చు. వాడి ఉపన్యాసం అయిపోయింది కాబోలు. తరువాత వారిని పిలవాలి మాట్లాడడానికి, అని లేవబోతున్నవాడిని వాడు ఇంకా మాట్లాడుతుంటే కూచున్నాను. “సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఈ రోజే...... డిశెంబరు పదో తారీఖు .... శ్రీను, వాసు, రవి, రాజేశ్వరి, దుర్గ, లక్ష్మి, శ్యామల, చందూ, శ్యాం, నాయుడూ... మీ అందరికీ గుర్తుండే ఉంటుంది? ఆ రోజు మాష్టారు మన కోరికలను రాసుకు రమ్మన్నారు. గుర్తుందా! మన జీవితాలను ముఖ్యంగా నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు."
ఎందుకు గుర్తు లేదు? మరల గతం లోకి వెళ్ళిపోయాను.

“మాష్టారూ రేపటికి హోం వర్కు ఏమిటి?” ప్రతి రోజూ హోం వర్కు ఇవ్వడం అలవాటు మాష్టారికి. మేము ఓ పదిమందిమి పాఠశాల అయిన వెంటనే మాష్టారి ఇంటికి వెళ్ళి చదువుకునే వాళ్ళము. మాష్టారు ఓపికగా మాకు రానివి అన్నీ వివరంగా చెప్పేవారు. “జాగ్రత్తగా వినండిరా! మీ కోరికలు ఏమిటి? అవి ఎలా తీరుతాయి? రాసుకురండి. రేపటికి అదే మీకు హోం వర్కు.” ఇదేం వర్కు? అందరమూ ముఖాలు చూసుకున్నాము.” మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. మరోసంగతి. ఒకరితో ఒకరు చర్చించుకోకూడదు. బాగా ఆలోచించి రాయండి.” మాష్టారు లోపలకు వెళ్ళిపోయారు. “ఒరే నీ కోరిక ఏమిటిరా!” నెమ్మదిగా అడిగాను వాసుని. “నా కోరికేమిటంటే...” ఆగిపోయి “మాష్టారు చెప్పొద్దు అన్నారు కదరా! నేను చెప్పను” అనేసాడు వాడు. అందరమూ పుస్తకాలు సర్దుకుని ఇళ్ళకు వెళ్ళిపోయాము. మరునాడు.. “అందరూ రాసారా! ఏవీ! మీ పుస్తకాలు ఇలా ఇవ్వండి” మాష్టారు. అందరికీ కుతూహలమే! మిగిలిన వాళ్ళు ఏం రాసారా అని. మాష్టారు అందరి పుస్తకాలూ ఓసారి చూసి “ఒరే కోరికలు ఎప్పుడూ పెద్దవి, గొప్పవి గానే ఉండాలి. ఉదాహరణకి.. నాకు చాక్లెట్ తినాలని ఉంది. ఓ పది రూపాయలు ఉంటే ఆ కోరిక తీరుతుంది. ఇక్కడ కోరిక చాక్లెట్ తినడం. తీరే మార్గం పదిరూపాయలు ఉండడం. జాగ్రత్తగా వినండి. పది రూపాయలు ఉంటే అప్పటికి మాత్రమే ఆ కోరిక తీరుతుంది. ఎప్పుడూ కోరిక తీరాలంటే ? చాక్లెట్ తయారు చేసే ఫేక్టరీ పెట్టాలి. అర్ధమవుతుందా! అంటే కోరిక ఎలాగ ఉండాలంటే నేను ఒక చాక్లెట్ తయారు చేసే ఫేక్టరీ పెట్టాలి. అదీ కోరిక. అర్ధమయిందా!” అందరూ ఎవరికి వాళ్ళే గతుక్కుమన్నారు. అందరూ అలాగే రాసారు.

“ఇప్పుడు బాగా ఆలోచించి మరీ, చెప్పండి మీ కోరికలు ఏమిటో?” అరగంట తరువాత.. “వాసూ నీ కోరిక ఏమిటిరా?” “నాకు బడికి వెళ్ళడానికి కారు కావాలి.” అందరూ పుసుక్కున నవ్వారు. వాడికి సైకిలు కూడా లేదు. మాష్టారు మాత్రం మెచ్చుకున్నారు. “కోరిక అంత బలంగా ఉండాలిరా! అప్పుడే మనకు దానిని సాధించాలనిపిస్తుంది. లక్ష్మి నీ కోరిక?” “నాకు ప్లాటినముతో ఉన్న వజ్రాల నెక్లెస్ ....... కాదు, కాదు మొత్తం వజ్రాల సెట్ కావాలి.” తనకి మెడలో వేసుకోడానికి రోల్డ్ గోల్డ్ చైను కూడా లేదు. అయినా ఈ సారి ఎవరూ నవ్వలేదు. “నాకు పెద్ద డాక్టరిని అవాలని ఉంది.” “విమానాలు నడపాలి.” “బోలెడు డబ్బు సంపాదించి పెద్ద ఇల్లు కట్టాలి.” ఇలా ఒకరి తరువాత ఒకరు కోరికల చిట్టా విప్పారు. “శభాష్. విషయం మీకు బాగా అర్ధమయింది. ఇప్పుడు మీకు పుస్తకాలు ఇస్తాను. మీరు చెప్పిన మీ కోరికలు ఏమిటో ఈ రోజు తారీఖు వేసి మీ పుస్తకాల్లో రాయండి. అయితే ... కోరికలు బాగా ఉన్నాయి. అవి తీరాలంటే?” మాష్టారి ప్రశ్న. “డబ్బు ఉండాలి” అందరూ కోరస్ గా చెప్పారు. “అది కావాలంటే ఉద్యోగం చెయ్యాలి” ఈ సారి గొణిగారు ఒకరు. “ఉద్యోగం చేస్తే అంత పెద్ద కోరికలు ఎప్పటికి తీరుతాయి. వ్యాపారం చెయ్యాలి.” ఇంకొక పక్కనుండి, వాళ్ళ మాట మీద వాళ్ళకే నమ్మకం లేక నెమ్మదిగా అన్నారు ఎవరో.

“గరిష్టంగా రెండు కోట్లు ఇచ్చి ఐ ఐ టి విధ్యార్ధిని ఉద్యోగము లోకి తీసుకున్న బహుల జాతి సంస్థ. ఈ సారి అంతే మొత్తాలతో ఉద్యోగంలో చేరిన ఐ ఐ ఎం విధ్యార్ధులు.” వార్తా పత్రిక తీసి చదివారు మాష్టారు గారు. “రెండు కోట్లా!” అందరూ నోళ్ళు వెళ్ళ బెట్టారు. “మాష్టారూ రెండు కోట్లు ఎన్ని సంవత్సరాలకు?” సందేహం వెలిబుచ్చాడు రవి. “ఒక్క సంవత్సరానికేరా.” “ఒక్క సంవత్సరానికి రెండు కోట్లా!” “ఇప్పుడు అర్ధమయిందా! మీ కోరికలు తీరాలంటే ఏం చెయ్యాలో?” అర్ధమయీ , కానట్టు ఉంది. “ఇప్పటికి ఏడెనిమిదేళ్ళ తరువాత మీ గురించి అలాగే వార్తల్లో రావాలి తెలిసిందా!” ఇంకా ఏడెనిమిదేళ్ళా! ఉత్సాహం చల్లారిపోయింది అందరిలో. మాష్టారు అందరినీ కలయచూసారు. నవ్వుకుంటూ “ఒరే రాజూ నువ్వెప్పుడు గోళీలు మొదటిసారి ఆడావు?” అడిగారు. “ఒకటో క్లాసులో మాష్టారూ.” “నీకెప్పుడు నేర్చుకున్నట్లు అనిపిస్తుంది.” “నిన్న కాక మొన్నే నేర్చుకున్నట్లు అనిపిస్తుంది” నెమ్మదిగా తల గోక్కుంటూ చెప్పాడు వాడు. “ఒరే శ్యాం మీరు ఈ ఊరు ఎప్పుడొచ్చారురా?” “ఆరేళ్ళయింది గానీ నాకూ అలాగే అనిపిస్తుంది” అనేసాడు వాడు కూడా. “కాలం ఎప్పుడూ ఒకేలా నడుస్తుంది. మనం పనిలో ఉంటే కాలం తొందరగా గడిచి పోతుంది. మనకు నచ్చిన పనులైతే కాలం ఇంకా తొందరగా గడిచి పోతుంది. అదే మనకు ఇష్టం లేనిదైతే కాలం భారంగా కదలనట్లు అనిపిస్తుంది.” “అవును మాష్టారూ! మా బామ్మ ఏమో ఇంకా పొద్దు గడవ లేదు అంటుంది. మా అమ్మ ఏమో అబ్బా! అప్పుడే సాయంకాలం అయిపోయిందా అంటుంది. మా బామ్మకు చేసే పనిలేక కాలం గడవదు. మా అమ్మకు పనిలో కాలం అయేది తెలియదు” అంది శ్యామల.

ఇప్పుడు అందరికీ బాగా అర్ధమయింది. “మీరు చదువు పై శ్రధ్ధ పెడితే ఏడెనిమిదేళ్ళు ఇట్టే గడిచి పోతాయి. మీరు ఎలా చదువుతారు అన్నదానిని బట్టి మీ కోరికలు తీరే మార్గం ఉంటుంది అర్ధమయిందా!” అందరూ తలూపారు ఒక్క రాజు తప్ప. పదో తరగతి తరువాత వాడిని చదివించననేశాడు వాళ్ళ నాన్న. అసలు వాడు ఇక్కడ వరకూ రావడమే గొప్ప. “నీ బాధ అర్ధమయిందిరా కానీ దానికీ ఒక ఉపాయం ఉంది.” మరల వాడిలో ఆశ. “నువ్వు మంచి మార్కులు తెచ్చుకుని మన స్కూలికి ఫస్ట్ వచ్చావనుకో, ఇంకా బాగా చదివి మన జిల్లాకే ఫస్ట్ వచ్చావనుకో నిన్ను ఫ్రీగా చదివించడానికి ప్రైవేటు కాలేజీలు పోటీ పడతాయి.” “నిజంగానా మాష్టారూ!” “నిజమేరా.” “ ఒరే అయితే స్కూలు ఫస్ట్ నాదేరా. మీరెవరూ ఆశలు పెట్టుకోకండి. నేనే మన స్కూలు ఫస్ట్” చాలా నమ్మకంగా చెప్పాడు. మాష్టారి కళ్ళల్లో వెలుగు. “శిష్యుడంటే ఇలాగ ఉండాలి. కోరిక తీరాలనే ధృడమైన సంకల్పం, తన మీద తనకి చెదరని విశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇంకా మూడు నెలలు ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు. మన స్కూలులో మొదటి పది రేంకులూ మీకే రావాలి. ఈ రోజు నుండీ చదవడం మొదలుపెట్టండి.” రాబోయే రేంకులు ఊహించుకుని అందరూ గాలిలోనే ఉన్నారు ఆ రోజు.

రాజు లాంటి వాళ్ళే గురువుల పేరు నిలబెడతారు అని ఆ రోజు నుండి వాడంటే మాష్టారికి ప్రత్యేకమయిన అభిమానం. వాసు పక్కనుండి పొడుస్తుంటే జ్ఞాపకాల నుండి బయటపడ్డాను. “చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడో. మాష్టారు అంటే వాడికి చాలా గౌరవమని" లోగొంతుతో అన్నాడు వాసు. “ఆ రోజే అనుకున్నాను నా గురించి కూడా వార్తల్లో రావాలని. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు గొప్ప కలలు కనండి. అవి నిజమయ్యే వరకూ ప్రయత్నించండి అని. కాని కలలు కనాల్సిన వయసులో ఆ విషయం తెలియదు, మా మాష్టారు చెప్పే వరకూ. కలలు కనడం సహజం. అవి తీరాలనుకోవడం ఇంకా సహజం. మీరు చేయాల్సిందల్లా ఇష్టం మీద చదవడం అని చాలా సులువుగా అర్ధమయేటట్లు మాష్టారు ఆ రోజు చెప్పకపోయుంటే ఈ రోజు నేను నాకున్న ఎకరం పొలం దున్నుకుంటూ ఉండే వాడినేమో! మనలో మాష్టారు కోరికలను రగిలించారు. అవి తీరే వరకూ పోరాడడం నేర్పించారు. మాష్టారే లేకపోయుంటే నా జీవితం ఇంకోలా ఉందేది. నా జీవితం అద్భుతమైన మలుపు తిరగడానికి కారణమైన మాష్టారు గారికి నేను ఏం చేసినా ఆ ఋణం తీర్చుకోలేను.” అందుకే కాబోలు ఏం చెయ్యకుండా ఉపన్యాసం దంచుతున్నాడు వాసులో కోపం. “చదువనే తాళం చెవి ద్వారా నీ కలల సౌధాన్ని తెరువు అని నాకు ఉద్భోదించి నా ఉన్నతికి కారణమయిన మా మాష్టారికి ఉడతా భక్తితో నా వందనం” అని మాష్టారికి పాదాభివందనం చేసి మాష్టారి పాదాల దగ్గర తాళాలు పెట్టాడు రాజు. చప్పట్లు మోగుతూనే ఉన్నాయి వాడు మాట్లాడుతుంటే. ఏమిటా తాళాలు? అందరిలోనూ ప్రశ్న.

అప్పుడు లేచాడు రవి. “క్షమించాలి. ఈ విషయం ఎవరికీ చెప్పనందుకు. నేను మాష్టారి సన్మానం గురించి చెప్పినప్పుడు మాష్టారి పేరున ఒక ఇల్లు తీసుకో అని రాజు నాకు చెప్పాడు. ఆ ఇల్లు పూర్తికాకపోవడంతో రాజు ఇండియా వచ్చే తేదీ పొడిగించాల్సి వచ్చింది. అనుకోకుండా రాజు అన్నట్లు మనందరి జీవితాలనూ మలుపు తిప్పిన ఆ తేదీ నాడే ఈ రోజు మనం మన మాష్టారినీ సన్మానించుకోవడం మన అదృష్టం. రాజుకి ఈ విషయం ఎవరికీ తెలియడం ఇష్టం లేదు. కానీ గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలో ఇప్పటి పిల్లలకు తెలియ చేయడం కోసం నేను రాజుని బలవంతంగా ఒప్పించాను. తరగతి గది దాటినవెంటనే గురువులను ఎవరో అన్నట్లు చూస్తున్న ఇప్పటి విధ్యార్ధులకు, గురువులు శిష్యులను ఎంత ఉన్నతంగా చూడాలనుకుంటారో, పాటిస్తే గురువుల ఉద్భోద శిష్యులను ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో, గురువులను ఏ రకముగా మన్నించుకోవాలో తెలియచెప్పడం కోసం ఈ రకముగా చేయాల్సి వచ్చింది.” రవి మాట్లాడుతున్నాడు.
వీడిలాంటి వాళ్ళే గురువుల పేరు నిలబెడతారు అని రాజు అంటే మాష్టారికి వల్లమాలిన అభిమానం. గురువుకి శిష్యులందరి మీద అభిమానం ఉంటుంది. కాని కొంతమంది మీద కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది ద్రోణునికి అర్జునినిలా. అలాగే నాకు రాజు అంటే కొంచెం ఎక్కువ అభిమానం. అందరిలా కాదు వాడు ప్రత్యేకం రా అనే వారు. అప్పుడు ఆ మాటలకు అర్ధం తెలియలేదు. ఇప్పుడు తెలిసింది మాష్టారికి రాజు మీద అంత నమ్మకం ఎందుకో. ఎందుకంటే వాడు మిగిలిన వాళ్ళమీద ప్రత్యేకమే కాబట్టి. నేను, వాసు, మాలాగే రాజుని అపార్ధం చేసుకున్న మరికొందరు రాజుని ఎత్తుకుని గాలిలోకి ఎగరేసాము ఆనందంగా.

అంకితం: మనుషులను డబ్బుతో కాకుండా మమతలతో కొలవడం నేర్పించిన నా తల్లితండ్రులకు ఈ కధ అంకితం.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ