మా మామగారి పూజ అయినట్లుంది, పూజగదిలోంచి గంట వినిపిస్తొంది. పిల్లలు మెల్లిగా తాతగారి పక్కన చేరారు. ప్రసాదం భక్తులు! నేను, మా అత్తగారు వంటింట్లో పని చేసుకుంటూ పని మనిషి కోసం చూస్తున్నాము. రోజూ పొద్దున్నే ఆరు గంటలకు వచ్చే మా పనిమనిషి లక్ష్మి ఏడవుతున్నా ఇంకా రాలేదు. ఇంక రాదేమో. ఈ నెలలో ఇది నాలుగో సారి మానేయటం. పనిమనిషి రాకపోతే ఇంక ఆ రోజు నా అవస్త ఇంతా అంతా కాదు. నాలాంటి వాళ్లకి పనివాళ్లు, పాలవాళ్లే కదా కులదైవాలు!
పనిమనిషిని తిట్టుకుంటూ హడావుడిగా పని చేసుకుని ఆఫీసుకి తయారు అయ్యేటప్పటికి ఎనిమిదిన్నర. టిఫిన్ తినే టైము లేదు. ఎలాగైనా ఈవేళ లేటే అనుకుంటూ బయలుదేరుతుంటే మా అత్తగారు హర్లిక్స్ కలిపి ఇచ్చారు. అందుకేనేమో మా అమ్మమ్మ అనేది “ఎప్పుడైనా ఓ మాట అన్నా, అవసరం వచ్చినప్పుడు విస్తట్లో గుప్పెడు అన్నం పెట్టడానికి ఆడపిల్లకి ఇంట్లో అత్తగారు ఉండద్దుటే” అని.
మా అమ్మమ్మ “ఓ మాట అన్నా” అన్నది కానీ, నిజానికి మా అత్తగారు ఏనాడు నన్ను అన్నది లేదు – నేను పడింది లేదు. మా మామగారైతే, “మాకు పుట్టిన వాళ్లు ఇద్దరు, మా ఇంటికి వచ్చిన వాళ్లు ఇద్దరు, మాకు నలుగురు పిల్లలు” అంటారు. మా అత్తగారికి, మామగారికి బంధుప్రీతి ఎక్కువ. ఎప్పుడూ బంధువుల, స్నేహితుల రాక పోకలతో, మా ఇల్లు పెళ్లివారిల్లులాగా కళకళ్లాడుతూ ఉంటుంది.
ఆఫీసులోకి అడుగు పెట్టానో లేదో రమేష్ “అరుణ్ గారు మీ కోసం రెండు సార్లు ఫోన్ చేసారు” అన్నాడు. అరుణ్ మా రీజనల్ మేనేజర్. అదేంటో నేను లేటుగా వచ్చినప్పుడే ఫోన్ చేస్తాడు. టైముకి వచ్చినప్పుడు ఏ ఫోనూ రాదు. నేను లేటుగా వచ్చినట్టు ఎలా తెలుస్తుందో! పాతళ భైరవి సినిమాలోలా ఆయన దగ్గర దుర్భిణి ఏదన్నా ఉన్నదేమో! ఆలస్యంగా వచ్చిన ప్రతిసారీ ఏదో గిల్టీ ఫీలింగ్. ఆ టైములో ఏదన్నా ఫోన్ వస్తేనో, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటేనో మరీను. ఇదే మాట వారితో అంటే, "ఆ మాత్రం సెన్సిటివిటీ కూడా లేకపోతే ఇక ఉద్యోగం మానేయటం బెటర్” అంటారు.
మధ్యాహ్నం లంచ్ కి బయలుదేరుతుంటే మా వారి ఫోను. “బాబాయికి పొద్దున్న హార్టటాక్ వచ్చిందిట. అక్కడే హస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతానికి ఫరవాలేదు. అమ్మ, నాన్న వెళతామంటే రాత్రి తొమ్మిదిన్నర బస్సుకి టికెట్ కొన్నాను. సాయంకాలం నిన్ను పికప్ చేసుకుంటాను. లేటు చేయకు” అని. సరేనన్నాను.
మా మామగారు, ఆయన తమ్ముడు ఒకరంటే ఒకరు చాలా ఆపేక్షగా ఉంటారు, డెబ్బై యేళ్లు దాటినా కూడా. రోజుకి కనీసం ఒక సారి ఫోనులో మాట్లాడుకోకపోతే ఇద్దరికీ తోచదు. ఇంక కలుస్తే ఆ కబుర్లకి అంతే ఉండదు. మా మామగారికి పెద్ద దెబ్బే. ఎలా తట్టుకుంటారో? ఫోన్ చేసి మా మామగారితో కాసేపు మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పాను.
లంచ్ రూములో సీరియస్ గా “జీవితంలో విలువలు” అన్న విషయం మీద డిస్కషన్ నడుస్తోంది. ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు చెపుతున్నారు. నేను “ఈ రోజుల్లో మనలాంటి వాళ్లకి విలువలు ఎక్కడ ఉన్నాయి?” అన్నాను. నిజమే కదా అని అందరూ నవ్వారు.
రమేష్ మాత్రం ఆశ్చర్యంగా “అదేంటి మేడం అలా అన్నారు? అసలు జీవితంలో విలువలే లేవంటారా” అన్నాడు.
“ఎక్కడి విలువలండీ? అవన్నీ కథల్లోనూ, సినిమాల్లోనే. ఇప్పుడంతా స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్ ఎండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అంతే ”. అన్నాను. అతను ఇంకా పొడిగించలేదు. ఎంతైనా బ్రాంచ్ ఇంచార్జిని కదా!
సాయంత్రం ఆరు అయింది. ఎండ్ ఆఫ్ డే రిపోర్ట్స్ వెరిఫై చేస్తున్నాను. ఇది అయిపోతే ఇంక బయలుదేరవచ్చు. హైవాల్యు విత్ డ్రాయల్ కేసులో ఎర్రర్. ఎవరు చేసారా అని చూసాను. రమణి. పిలిచి “అదేంటండీ, పార్ట్ అమౌంట్ అయితే ఫుల్ అమౌంట్ ప్రోసెస్ చేసారు? పైగా యాభై లక్షలు” ఎక్స్ ప్లెనేషన్ అడిగాను.
“చూసుకోలేదు. దాందేముంది. రివర్స్ చేసి మళ్లీ ప్రోసెస్ చేద్దాము” అంది నిర్లక్ష్యంగా.
కొంతమందితో పని చేయటం ఒక ప్లెషర్, మరికొంతమందితో పని చేయటం పెయిన్. ఈవిడ రెండో కేటగిరి.
అరుణ్ కి మెయిల్ చేసి, ఆయన చేత “అక్షింతలు” వేయించుకుని, ఐటి డిపార్ట్ మెంట్ తో కోఆర్డినేట్ చేసి రివర్సల్ చేయించి మళ్లీ ప్రోసెస్ చేసేటప్పటికి అరగంట పట్టింది.
అఫీసుకి లేటయినప్పుడే బాస్ ఫోన్ చేస్తాడు; ఇంటికి పెందరాళే వెళ్లాల్సి వచ్చినప్పుడే ఆఫీస్ లో ఎమర్జెన్సి వస్తుంది – “మర్ఫీస్ లా”.
ఆఫీస్ బయటకి వచ్చేటప్పటికి మా వారు వెయిట్ చేస్తున్నారు, పాపం అరగంట నుంచీ. అయినా విసుక్కోలేదు. ఆయన సహనానికి నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను.
దారిలో సడెన్ గా “బాబాయిని ఇక్కడికి తీసుకువచ్చి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు.
“ఇది ఎవరి ఐడియా?” చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యాను
“నాకే అనిపించింది. ఆ ఊళ్లో మెడికల్ ఫెసిలిటీస్ అంతగా లేవు కదా” అన్నారు.
“ఏమీ అవసరం లేదు. ఏ బైపాసో చేయాల్సి వస్తే తిరిగి రికవర్ అవడానికి నెలో, నెలన్నరో పడ్తుంది. అన్ని రోజులు మనింట్లోనా? ఏమక్కరలేదు.” మా వారు ఏదో చెప్పబోతే నేను వినిపించుకోలేదు.
ఇంట్లోకి వెళ్లేటప్పటికి మా మామగారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. “వాడు నాకంటే అయిదేళ్లు చిన్నవాడు. బిపి, షుగరు కూడా లేవు. అయినా ఈ హర్ట్ అటాక్ ఎలా వచ్చిందో?” అంటున్నారు.
మా వారు, మామగారు, అత్తగారు మా పినమామగారి గురించి మాట్లాడుకుంటున్నారు. నేను వంటింట్లో పని చేస్తూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాను. ఆయనని ఇక్కడికి తీసుకురావడం గురించి ఏమైనా అంటారేమో అని నా భయం. మావారికైతే “నో” చెప్పగలిగాను కానీ, మా అత్తగారికి, మామగారికి అంత ఓపెన్ గా చెప్పలేను. ఎవరూ ఆ ప్రసక్తి తేలేదు. “హమ్మయ్య” అనుకున్నాను.
భోజనాలప్పుడు మా అమ్మాయి “సాయంత్రం లక్ష్మి వాళ్ల అమ్మాయి వచ్చిందమ్మా” అంది. మా అత్తగారు వెంటనే “లక్ష్మికి జ్వరంట. రేపు కూడా రాదట. వాళ్లమ్మాయి వచ్చి డబ్బులు కావలంటే వెయ్యి రూపాయలు ఇచ్చాను. ఈ హడావుడిలో ఆ సంగతి మర్చిపోయాను” అన్నారు.
“పోనీలెండి. రేపు శనివారం. నాకు శెలవే కదా” అన్నాను చాలా మామూలుగా. మా వారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు. పొద్దున్న పనిమనిషిని ఎంత తిట్టుకున్నానో ఆయనకీ తెలుసు మరి!
మా అత్తగారు, “ఆదివారం సుశీల పిన్ని మనవడి బారసాల. మధ్యాహ్నం ఫోన్ చేసింది. మీరూ, పిల్లలూ వెళ్లి రండి” అని మా వారితో అన్నారు.
మా అబ్బాయి “నాకు కుదరదు” అన్నాడు, పెద్ద ఆరిందాలా.
“ఏం?” అడిగాను, వీడి ఫ్రెండ్స్ అందరూ ఏ క్రికెట్ మ్యాచో ప్లాన్ చేసుకుని ఉంటారు అనుకుంటూ.
“మా ఫ్రెండ్ తరుణ్ టెన్ డేస్ స్కూల్ కి రాలేదు కదా. మా టీచర్ వాడి క్లాస్ వర్క్ కంప్లీట్ చేసి మండే సబ్మిట్ చేయమంది. నేను రెండు సబ్జెక్ట్స్ వ్రాసి పెడ్తానని చెప్పాను. అది కంప్లీట్ చేయాలి ” అన్నాడు.
“క్రికెట్ ఆడడానికి కూడా వెళ్లవా?” మా అమ్మాయి వెక్కిరించింది “వెళ్లను. మా ఫ్రెండ్స్ కి రానని చెప్పేసాను” అన్నాడు. యథాలాపంగా వింటున్న నాకు చెళ్లున కొట్టినట్లైంది. అన్యమనస్కంగా భోజనం ముగించాను.
పిల్లల్ని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చేప్పి మా అత్తగారిని, మామగారిని బస్సు ఎక్కించి రావడానికి నేను కూడా వెళ్లాను. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఏదో మాట్లాడుతుండే మా మామగారు చాలా మౌనంగా ఉన్నారు. నేను సరిగ్గా గమనించలేదు కాని, సాయంకాలం నుంచి అలాగే ఉన్నారు. ఒక్క పూటలోనే పది ఏళ్లు పైబడ్డట్టు కనిపిస్తున్నారు.
నాకు మా అబ్బాయీ, వాడి మాటలూ పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మామూలప్పుడైతే పట్టించుకునేదాన్ని కాదేమో! వాడి ఫ్రెండ్ కి సహాయం చేయడం కోసం వాడికెంతో ఇష్టమైన క్రికెట్ ని కూడా మానేయడానికి సిద్ధపడ్డాడు. ఎంతో సహజంగా! మరి నేను? చదువుకునే రోజుల్లో ఎంత ఉత్సాహంతో, చైతన్యంతో ఉండేవాళ్లం! మా క్లాస్ మేట్ కి ఆక్సిడెంట్ అయ్యి రెండు నెలలు కాలేజికి రాకపోతే, నేను, నా ఫ్రెండ్ కళ్యాణి పోటీలు పడి మరీ రికార్డులు, నోట్సులు వ్రాసి పెట్టాము. పక్కింటి మామ్మగారికి ఓపిక లేదంటే, ధనుర్మాసం అంతా, తెల్లవారుజామున చలిలో, మా వాకిలితో పాటు వాళ్ల వాకిట్లో కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మురిసిపోయాను. అది చిన్నతనమైతే, మరి ఇది?
అప్పడు నా ప్రపంచంలో, మా అమ్మ, నాన్న, తమ్ముడు, మామ్మ, తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య, వాళ్ల పిల్లలతో పాటు, ఫ్రెండ్స్, పక్కింటి మామ్మగారు, ఎదురింటి అత్తయ్యగారు, మా కాలనీ రాములవారి గుళ్లో పూజారి ... ఇంకా ఎంతమందో! సినిమాలూ, పుస్తకాలూ, పాటలూ, గుళ్లో శ్రీరామ కళ్యాణం, కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలూ, పెరట్లో మొక్కలు, పక్కింట్లోంచి రాలి పడే పున్నాగలూ, పారిజాతాలూ, వీధి మొదట్లో ఎర్ర తంగేడు చెట్టు … ఇలా ఎన్నో! మరి ఇప్పుడు?
మనకి కలిగే పరిచయాలు, అనుభవాలు మన ఆలోచనలని విస్తృతం చేయాలి; మనసుని చైతన్యవంతం చేయాలి; జీవితాన్ని వికసింప చేయాలి. లేకుంటే వాటికి విలువా లేదు – వాటి అవసరమూ లేదు. మా మామ్మ కూడా ఎప్పుడూ “మాట సాయం – మనిషి సాయం“ అంటూండేది.
బస్సు బయలుదేరుతుంటే మా మామగారితో “మీరేమీ దిగులు పడద్దు. అవసరమైతే చిన్నమామయ్యగారిని మనింటికి తీసుకురండి. ఇక్కడే మంచి డాక్టర్ కి చూపిద్దాము” అన్నాను. ఆయన మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. బహుశ ఆయన మనసులో కూడా అదే అలోచన ఉండి ఉంటుంది. చెప్పలేదంతే. నాక్కూడా ఎందుకో ఇందాకటి నుంచి ఉన్న చిరాకు, విసుగు పోయి హాయిగా ఉంది.తిరిగి వచ్చేటప్పుడు మా వారు “ఏమిటీ ట్విస్ట్” అన్నారు. ఆయన మొహం కూడా వెలిగిపోతోంది. “ఏం లేదు. ఏదో మన వాళ్లకి మనం” అన్నాను.
“అయినా రాముడు – భీముడు లాగ ప్రతి విషయానికి రెండు రియాక్షన్లు ఉంటాయేంటి నీ దగ్గర” అని నవ్వారు.
నేను నవ్వలేదు. మధ్యహ్నం లంచ్ రూం లో జరిగిన డిస్కషన్ గుర్తుకు వచ్చింది. ఇదేనా విలువలతో జీవించడం అంటే – క్షణం క్షణం మనని మనం సరి చూసుకుంటూ, సరి చేసుకొంటూ? ఏమో?