విరుగుడు - రాచమళ్ళ ఉపేందర్

virugudu

తూర్పు ఎరుపు వర్ణంలో మెరుస్తుంది. రాముడి బుర్ర తట్టెడు ఆశలతో తడుస్తోంది. దారి పొడుగుతా ఆలోచనలు పరుచుకుంటూ ఉదయిస్తున్న సూర్యుడిపై దండయాత్ర చేయబోతున్నట్లు నడుస్తున్నాడు.

* * *

వాన చినుకుల్లేవు. చెమట చుక్కల్లేవు. ఆవుల అడుగుల్లేవు. ట్రాక్టర్ టైర్ల అచ్చుల్లేవు. లేగదూడల గంతుల్లేవు. పక్షుల అరుపుల్లేవు. పచ్చని గరికల్లేవు. శిథిలమైన భవనంలా మారిన ఐదెకరాల భూమిని చూస్కొని కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. రెండేళ్ళుగా వానలు కురవలేదు. పంటలూ పండలేదు. కోరలు చాచిన కరువు కరాళ నృత్యం చేస్తూనే వుంది. ఊళ్లన్నీ విషాద గీతాలను శృతి చేయలేక తలలు తెగిన మొండెల్లాగున్నాయి. ఏ ఇల్లు చూసినా కన్నీటి గాథలు, బరువెక్కిన గుండెలు, అప్పుల అరుపులు, ఆకలి ఆక్రందనలు. అందులో రాముడి పరిస్థితి దీనాతిదీనం.

రాముడు శ్రమైక జీవుడు. కష్టాల్లోనే పుట్టి, పెరిగాడు. ఆప్తమిత్రునిలా తోడుంటున్న కష్టాల గుండానే రోజులు గడుపుతున్నాడు. ముగ్గురు పిల్లలు. ఆడ పిల్లలిద్దరిని అత్తారింటికి పంపే సరికి పదెకరాలు కాస్తా ఐదెకరాలైంది. మిగిలింది ఒక్కడు. వాడ్ని బాగా చదివించాలని రాత్రి, పగలూ వ్యవసాయం చేస్తూనే వచ్చాడు. రాను రాను గడ్డు కాలం ఎదురైంది. ఏరువాక లేదు. ఎసట్లోకి బియ్యమూ లేవు. కొడుకు మాత్రం రాముడు చెప్పింది చేయడు. వాడికి నచ్చిందే చేస్తాడు. కాలేజీకి ఎప్పుడెళ్తాడో, ఎప్పుడొస్తాడో తెలియని పరిస్థితి. ఇదే విషయంపై తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు జరిగాయి. కానీ వాడిలో మార్పు రాలేదు. క్రికెట్ మ్యాచ్ ఉంటే టి.వి.కి అతుక్కుపోతాడు. లేదంటే వూరి చివర చెరువులో క్రికెట్ ఆడతాడు. వాడికి క్రికెట్టే ప్రపంచం. తండ్రికి కొరకరాని కొయ్యలా మారాడు.

సగం ఊరు సిటి అడ్డాలపై పని కోసం సద్ది మూటల్తో పడిగాపులు గాస్తుంది. రాముడి మాత్రం వూరొదల్లేదు. అసలు తనకు వ్యవసాయం తప్ప మరే పని రాదు. నేల తల్లిని నమ్ముకున్న మట్టి బిడ్డడు తను.

నడి చేలో నిలబడి సూర్యున్ని మింగేసిన మేఘాల వైపు తలెత్తాడు రాముడు. నింగి నిండా దట్టంగా అల్లుకుంటున్న మేఘాలు. చల్లని గాలులు. 'సినుకులు రాల్తాయా? లేదా?' అతని అనుమానపు చూపులపై చిరుజల్లులు కురవసాగాయి. అనందానికి అవధుల్లేవు. కాలం కనికరించబోతుంది అనుకున్నాడు. పంచెను సరి చేసుకున్నాడు. తలకు తువాలు చుట్టాడు. పొడవాటి వేప చెట్టు మండను విరిచాడు. ఎండిన ముళ్ళ చెట్లను, పిచ్చి మొక్కలను కుప్పలు చేయసాగాడు.

తెల్లారింది. వాన్లేదు. అయినా రాముడు నిరాశ పడ్లేదు. మేఘాలు కదూల్తూనే వున్నాయి. పోగు చేసిన కుప్పలన్నీ తగులబెట్టాడు. ఆగమేఘాల మీద దుక్కిదున్నాడు. ఆ ఊరు మండలానికి సెంటర్. ఆ వూర్లో బాగా పలుకుబడి ఉన్నోడు గంగారాం. రాజకీయంగానూ, ఆర్థికంగానూ అతనికు ఎదురులేదు. పదేళ్ళ క్రితం విత్తనాలు, పురుగుమందుల వ్యాపారం పెట్టి, బాగా వృద్ధి చెందాడు. అందుబాటులో ఉండటంతో చుట్టుప్రక్కల వూళ్ళ వారు ఆ షాపులోనే కొంటారు. అప్పు క్రింద విత్తనాలిస్తాడు. కానీ ఒక్క షరతుంది. పంట చేతికి రాగానే తనకే అమ్మాలి. అప్పు పోను మిగిలిన డబ్బు రైతులకు ఇస్తాడు. తూకంలో అవకతవకలున్నా ఎవరూ నోరెత్తరు. పొరపాటున ఎదురు మాట్లాడితే వారికి ఇబ్బందులు తప్పవు.

రాముడు ప్రతీసారి గంగారాం దగ్గరే విత్తానాలు కొంటున్నాడు. అవి సగం చచ్చి, సగం మొలుస్తున్నాయి. 'ఈసారి విత్తనాలు సిటిలో తెచ్చుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.' చేన్లో ఉన్న వేప చెట్టు కింద కూర్చుని కాసేపు కంటతడి పెట్టాడు.

రైతు క్షణం క్షణం చస్తూ... బ్రతుకుతున్నాడు. దుక్కి దున్నాలంటే భయం. వానొస్తుందో లేదోనని? విత్తనాలు చల్లాలంటే భయం. మొలుస్తాయో? లేదోనని? ఎదిగిన మొక్కను చూస్తే భయం. చీడ సోకకుండా దిగుబడి ఇస్తుందో? లేదోనని? ఇంటికొచ్చిన పంటను చూస్తే భయం. రేటుంటుందో? లేదోనని? ఇలా... నిత్యం సంఘర్షణ పడ్తూనే వున్నాడు. లోలోపల కుముల్తూనే వున్నాడు. ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ... మట్టినే దున్నుతున్నాడు. తన జీవితం పత్తికాయల్లా పగుల్తున్నా పసిడి పంటలను రాశులుగా పోస్తున్నాడు. వాసి లేకుండా వాడిపోతున్నాడు. రైతే రాజు అందరివి పైపై మాటలే. రైతును పట్టించుకునేదెవరు?

కాసేపు కన్నీటితో తడిసిన రాముడి మనసు కుదుటపడింది. గంగారాం మోసగాడని తెల్సు. 'అయినా వూరంతా కొంటున్నారు? కాలం పోతే విత్తు మొలవదు!' పలు విధాలుగా సతమతమయ్యాడు.

చేతులు పిసుక్కుంటూ.... నీళ్ళు నముల్తూ... గంగారాం ముందు తల దించుకొని నిలబడ్డాడు. ఆవులిస్తే పేగులెక్కెట్టే గంగారాం "ఏరా! రాముడు! విత్తనాలు కావాలా?" కుర్చీలో కాలు మీద కాలేసుకొని దర్పంగా ఊపుకుంటూ అడిగాడు.

"తమరు దయ సూపెట్టాలి! ఈసారి డబ్బు లేదు" మెల్లగా అన్నాడు రాముడు.

"ఇంత వరకు నువ్వు అప్పు చేయలేదు. ఐనా డబ్బెక్కడికి పోయిద్ది! పంటొస్తది గదరా!" స్టాంపు కాగితాలపై వేలిముద్ర తీసుకున్నాడు. మరో కాగితం ముక్కపై తన సంతకం చేసి, తేది వేశాడు. "ఇదిగో! ఈ కాగితం షాపులో ఇచ్చేసి, విత్తనాలు పట్టుకపో!" అన్నాడు.

"యిత్తనాలకెంతైంది బాబు?"

"పదిహేను వేలయిందిరా?" అన్నాడు గంగారాం.

"ప్చ్!" నిట్టూర్పు విడుస్తూ దారి పట్టాడు. ఇవే విత్తనాలు సిటిలో పది వేలు. ఒక్కోసారి ఒకరి అవసరం మరొకరికి వరమవుతుంది. 'పంటొచ్చే సరికి పదేనేలు దానికి వడ్డీ!' మనసులోనే లెక్కలేసుకుంటూ షాపుకెళ్ళాడు. విత్తనాలు సంచులను తీసుకొని, దిగుబడి వచ్చినంత సంబరంగా ఇంటికెళ్ళాడు.

"సీతా! యెలాగోలా యిత్తనాలు దొరికినయ్! కూలోల్లను తీసుకొని, తొందరగా చేనుకొచ్చేయ్!" అంటూ అరక తోలుకెళ్ళాడు. స్కేలుతో గీత గీసినట్లే సాలు వెంబడి సాలు అరక తోలాడు. ఉల్లాసంగా పరుగులు తీసాడు. కూలోల్లను పరుగులు పెట్టించాడు. నాటే ప్రతి విత్తనం పది రెట్లు దిగుబడి రావాలని అనుకున్నాడు. రెండ్రోజులు కష్టపడి పత్తి విత్తనాలు నాటాడు. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

* * *

వారం... పది రోజులు గడిచాయి. ఒక్క గింజా మొలవలేదు. ఉత్సాహానికి ఉరి పడ్డట్లయింది. చుట్టుప్రక్కల చేలల్లో సగానికి పైగానే మొలకలు. రాముడికేం అంతుబట్టడం లేదు. ఇరుగు పొరుగు రైతులకు తన చేను చూపెట్టాడు. ఐదెకరాల్లో ఒక్క మొలకా లేదు. రాముడికి జరిగిన మోసంపై రైతులంతా నానా రకాలుగా ఆవేదన వెలిబుచ్చారు.

"యాపార మన్నంక మంచీ, సెడుంటాయి. గానీ యింత దగానా? సాంతం నకిలీ యిత్తనాలే యిచ్చిండు. అన్నాడో రైతు.

"గంగారాం గాడు పెద్ద దొంగ. మన కర్మకాలి వాడి దగ్గర యిత్తనాలు కొంటున్నాం. పంటకు మంచి ధరలుంటే మనకీ నాలుగు రూపాయలు చేతిలో ఆడ్తాయి. మనమే సిటికెల్లి మంచియేవో తెల్సుకొని మరీ తెచ్చుకుంటాం. యెదేమైనా రాముడికి పెద్ద అన్యాయమే జరిగింది. గంగారాం గాడ్ని నిలదీయాల్సిందే!" కోపంతో ఊగాడో రైతు.

"సాల్లే ఆపరో నీ మాటలు. గంగారాంతో డీ అంటే సావుకు ఎదురుబోవడమే. వాడేమన్నా తెలివితక్కువోడా? కంపెనోళ్లు పంపిన్రు. నేనమ్ముతున్నా. కాదు కూడదంటే కంపెనోళ్లపై కేసు యేయ్యమంటడు. కేసులు, కోర్టులు మన బోటోల్లతో అయ్యే పనేనా?" మరో రైతు అనగానే తలో దిక్కుకు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.

వేల ప్రశ్నలను వెంటేసుకొని ఇంటికి చేరాడు రాముడు. "యేమయ్యా! సేనెట్లుంది? మొలకలొచ్చాయా?" ఆతృతగా అడిగింది సీత. వచ్చాయని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు. బెల్లం కొట్టిన రాయిలా కూలబడ్డాడు. కళ్ళ నిండా కన్నీటి ఊటలు. రాముడి తీరుకు సీతలో అనుమానం మొలిచింది. "యేం సెప్పవేంది? యేమైందయ్యా?" తనూ పక్కనే కూలబడ్తూ అంది సీత. "ఒక్క మొలకా లేదే! మనం నిండా మునిగాం. సేతుల కట్టం బూడిదలో పోసిన పన్నీరైంది" గూడు చెదిరిన పక్షిలా రోదించసాగాడు రాముడు.

సీత గుండెల్లో ప్రకంపనలు. క్షణకాలం షాక్ తగిలినట్లైంది. ఆమె విన్నది నిజమా? అబద్దమా? ఎటూ తేల్చుకోలేకపోయింది. తన్నుకొచ్చిన దు:ఖాన్ని కళ్ళల్లో పొంగించింది. క్రికెట్ ఆడి... ఆడి.. వచ్చాడు కొడుకు. ఏం జరిగిందో తెల్సుకునే ప్రయత్నము చేయలేదు. వాళ్లూ చెప్పే పరిస్థితిల్లో లేరు. చడీ, చప్పుడు లేకుండా మంచంలో కూలబడ్డాడు.

ఆమె అణువణువు ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కారుతున్న కన్నీటిని కొంగుతో తుడ్చుకుంటూ "లండీ కొడుకు... యెంత దగా చేసిండు? కడుపుకు బువ్వ దింటుండా? గడ్డి దింటుండా? నీతి లేని కుక్క! వాంబో! వాంబో! పైసలేమన్నా సెట్లకు గాస్తున్నయా? పొద్దుగాల్నే యేదొకటి తేల్సుకోవాలి!" గుండెలు బాదుకుంటూ గంగారాంను తిట్టసాగింది. సీత మాటలకూ రాముడిలోనూ పౌరుషం పెరిగింది.

"ఆ దొమ్మరొడ్ని నిలదీయాల్సిందే!" అనుకుంటూ సిటికెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ.ని కలిశాడు. జరిగిన సంగతంతా చెప్పాడు. గంగారాం మాటినగానే ఎస్.ఐ.కు ఒళ్లు కంపించింది. "చూడు రాముడు! ఆయన పలుకుబడున్నోడు. తిమ్మిని బొమ్మిని చేస్తాడు. ఆయనతో పోట్లాటెందుకు? ఆయనతో నెమ్మదిగా మాట్లాడండి. నీకు జరిగిన నష్టానికి ఎంతో కొంత సాయం చేయకపోడు" ఎస్.ఐ. తప్పుకున్నాడు.

రాత్రైంది. పుట్టెడు దు:ఖంలో ఇంటిల్లిపాది. మెతుకు ముట్టలేదు. చేను మొలకలు రాలేదనే పచ్చి నిజం మింగుడుపడటం లేదు. కునుకు రావటం లేదు. జాగరణలతోనే రాత్రంతా గడిపారు.

ఉయ్యాల్లో ఊగుతూ ఓ చేత్తో పేపరు చూస్తూ, మరో చేత్తో టీ తాగుతున్నాడు గంగారాం. ఎదురుగా రాముడు, సీత్. ఏంటన్నట్లు కనుబొమ్మలెగరేసాడు. "అయ్యా! మీరిచ్చిన పత్తి యిత్తనాలు నకీలీవి కాబోలు మొలవలేదు. నాకు చానా నట్టం జరిగింది. మంచి యిత్తనాలన్నా యియ్యండి! లేదంటే బాకీ కాగితమన్నా సింపేయండి!" చేతులు కట్టుకొని ప్రాధేయపడ్డాడు రాముడు.

"ఏందిరో! నోరు లేస్తంది. కష్టాల్లో ఉన్నారు ఆదుకుందామని దయ చూపిస్తే నాపైనే రివర్సు అవుతునారే. అందరికి ఇచ్చినట్లే నీకూ ఇచ్చాను. మొలవడమా? మొలవకపోవడమా? నా చేతిలో ఏముంది? నేనేమన్నా విత్తానాలు తయారు చేసేటోడ్నా? కంపెనీవే అమ్ముతున్నాను. చాల్లే! ఎవ్వారం బాగానే వుంది. పోండి! పోండి!" గెదుముతున్నట్లు మాట్లాడాడు గంగారాం.

గంగారాం జవాబు సీతలో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. సివంగిలా లేచింది. "మంది సొమ్ము పున్నానికొస్తుందా? మీరంతా తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు. మా ఉసురు తగలకపోదు.... మీ కొంపలు కూలకపోవు... సదుఫు, బలం లేదని, అడిగెవాడెవడు లేడని మమ్మల్లెంత కాలం మోసం చేస్తరు... మాకు నాయం సేయాల్సిందే!" ఎగిరెగిరి పడసాగింది సీత.

అవినీతి సామ్రాజ్యం ప్రమాదంలో పడ్తున్నప్పుడు, నిజ స్వరూపం బట్ట బయలు కాబోతున్నపుడు ఎలాగూరుకుంటాడు. గంగారాం కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. "ఎవడి కొంపలే కూలేది ఆడముండ! ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావ్! నా దగ్గరే నాటకాలా?" సీతను కొట్టబోయాడు.

కళ్ళెదుటే పరాయి మగాడు భార్యను కొట్టబోతుంటే ఎంత చేతకాని వాడైనా చూస్తూ ఎలా ఊరుకుంటాడు. రాముడిలో కట్టలు తెగిన ఆవేశం... ఏం జరుగబోతుందో కూడా తెలియని వీరావేశం. గంగారాం పన్నిన వలలో అమాయకంగా చిక్కుకున్నాడు. గంగారాంను వెనక్కి నెట్టాడు. ఉయ్యాల తగిలి కిందపడ్డ గంగారాం 'వామ్మో! వాయ్యో!" అంటూ కేకేలేయసాగాడు. హఠాత్ పరిణామానికి నిశ్చేష్టురాలైంది సీత. జరిగిందేమిటో తెల్సేసరికి రాముడికి ముచ్చెమటలు పట్టాయి.

బొడ్రాయి దగ్గర పంచాయితీ మొదలైంది. మొగుడూ, పెళ్లాం కల్సి నన్ను కొట్టారన్నాడు గంగారాం. రాముడు, సీతలను దోషులుగా తేల్చాడు. సమస్యను సామరస్యంగా మాట్లాడుకోకుండా ఊరి పెద్ద గంగారాంపై చేయి చేసుకున్నందుకు పది వేల్ రూపాయల జరిమానా విధించారు పంచాయితీ పెద్దలు.

రాముడు, సీతలకు దెబ్బ మీద దెబ్బ... పులి పంజాలాంటి దెబ్బ... బలహీనుడిపై అనాదిగా పడ్తున్న బలవంతుడి దెబ్బ. మాడిపోయిన ముఖాలతో ఇంటికి చేరారు.

గంగారాం ఆలోచనలకు రెండువైపులా పదునే. కావాలనే వాళ్ళను రెచ్చగొట్టాడు. తదుపరి సొంతంగా తయారు చేస్తున్న నకిలీ విత్తనాల గుట్టు బయటకు రాకుండా... మరొకరు నోరెత్తకుండా... ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టాడు. దాంతో తన అక్రమ సంపాదనకు గట్టి బందోబస్తు చేసుకున్నాడు.

సాయంత్రమైంది. పచ్చి మంచినీళ్ళూ ముట్టడం లేదు రాముడు, సీత. మోసం... తరతరాలుగా జరుగుతున్న మోసం... విత్తనాలు కొనడం. అవి మొలవకపోతే అప్పు మీద అప్పు చేసి, మళ్ళీ విత్తనాలు తెచ్చి నాటడం. వచ్చిన పంటను దళారులు చేతుల్లో పెట్టడం. రైతు శ్రమను దోచుకుంటూ పైశాచికానందంతో రాబందులు చేస్తున్నా వికట్టహాసం... వారి కాళ్ళనిండా మెదులుతోంది...

వేడినీళ్ళలా సలసల మరుగుతోంది వారిలో కోపం...

కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి!

చీకటి పడింది. ఒక్కసారిగా వూరంతా అలజడి. "బాగా తాగి బైపాస్ రోడ్డులో వస్తున్న గంగారాం బండి బ్యాలెన్స్ తప్పి పడిపోయాడట. పెద్ద రాయి తలకు బలంగా తగలటంతో అక్కడికక్కడే చచ్చిపోయాడట" చెప్పుకుంటూ పరుగులు పెడ్తున్నారు జనం. అర్థం కాక, ఆశ్చర్యంతో ఒకర్నొకరు చూసుకున్నారు రాముడు, సీత.

చాలా రాత్రైంది. ప్రమాద స్థలం నుంచి గంగారాం శవం ఇంటికి చేరింది. శవం దగ్గర ఏడ్పులు తగ్గుతున్నాయి. ఊరంతా సద్దు మనిగింది.ఇంటికొచ్చాడు కొడుకు. చేతిలో క్రికెట్ బ్యాట్. దానిపై అక్కడక్కడా రక్తపు మరకలు. ఇన్నాళ్లూ కొరకరాని కొయ్య... ఇప్పుడు కొండంత అండలా కనిపిస్తున్నాడు. రాముడి కళ్ళల్లో మెరుపు. "యేమన్న గానీ మొత్తానికి వూరికి పట్టిన చీడ యిరగడైందిరా కొడకా!" కొడుకును మెచ్చుకుంటూ... బ్యాట్ను కట్టెలపొయ్యిలో వేసి నిప్పు రాజేసాడు. ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ తలుపులు మూసింది సీత.

* * *

(రంజని - నందివాడ భీమారావు 2015 కథానికల పోటీల్లో చతుర్థ బహుమతి పొందిన కథ.)

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు