"నిజంగా నిజమేనా" ఆనందం పట్టలేక మరోసారి అడిగాడు ఆకాష్ మహితను. సిగ్గుతో తలాడించింది మహిత.
“ఇంత అపురూపమైన కానుక నాకివ్వబోతున్నందుకు ఏం కావాలో కోరుకో" మహిని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ఆకాష్. “అవునూ! మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?” ఉత్సుకతతో అడిగింది మహి.
“ప్చ్ అబ్బాయా! అమ్మాయా!” కాస్సేపు ఆలోచించినట్లు నటించి “అమ్మాయి అయితే ఫ్రాకులు వేయోచ్చు, నగలు పెట్టొచ్చు. అమ్మాయే కావాలి. అదీ నీలాంటి అమ్మాయే కావాలి. కనగలిగితే అలాంటి అమ్మాయినే కను” ముద్దులు కానుకగా ఇస్తూ అన్నాడు. అప్పటి వరకూ మనసులో ఏమూలో ఉన్న సంశయం కాస్త తొలగిపోయింది మహికి. దాంతో ఆకాష్ కౌగిలిలో ఆనందంగా కరిగిపోయింది.
“నిజమేనా!” కొడుకు చెప్పిన వార్త విని మరొసారి మహిని అడిగి నిర్ధారించుకుంది రత్నావతి, ఆకాష్ తల్లి. అత్తగారు ఉత్సాహం పట్టలేక నిజమా అని ఆనందంతో తననెంత ముద్దు చేస్తారో అని సిగ్గుతో ఎదురుచూస్తున్న మహి ఆవిడ ఏం మాట్లాడకపోయేసరికి తలెత్తి చూసింది. ఆవిడ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.
ఆకాష్ ఆ విషయం గ్రహించకుండా “అమ్మా! మేము క్రిందికి మారిపోతాము. మహికి మెట్లు ఎక్కడం,దిగడం ఇక అంత మంచిది కాదు కదా!” అన్నాడు.
“చూద్దాంలేరా” అని “ఎన్నో నెల?” మహిని అడిగింది రత్నావతి. “రెండు నిండాయత్తయ్యా" మనసులో ఏదో శంక పొడసూపుతుంది. “ఈ విషయం ఇంకెవరికి తెలుసు?” మహిని అడిగింది రత్నావతి. అప్పటికి ఆకాష్ కు కూడా విషయం ఏదో ఉందని అర్ధం అయింది. “ముందు నీకే చెప్పామమ్మా” మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆకాష్. నిర్ధారణ కోసం ఆవిడ మహిని చూసింది.
“డాక్టరు దగ్గర నుండి వచ్చాక ముందు ఆయనకు, ఇప్పుడు మీకు చెప్తున్నామత్తయ్యా" లోగొంతుతో చెప్పింది మహి. “సరే! అప్పుడే ఇంకెవరికీ చెప్పకు. ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను”. అప్పటికి ఇదేదో మామూలు విషయం కాదని అర్ధం అయింది ఆకాష్ కి.
“అదేమిటమ్మా! అలాగంటావు. ఈ విషయం వింటే అత్తయ్యగారు,మామయ్య గారు ఎంత సంతోషిస్తారో! అన్నాడు ఆకాష్. “ “ఇంత తొందరగా ఎందుకు చెప్పడం. నాలుగు నెలలయ్యాక చెప్దాము.”
“అమ్మా! నాలుగు నెలల వరకూ ఎందుకూ?” సూటిగా అడిగాడు.
“ఆడబిడ్డో మగ బిడ్డో కనుక్కుని” ఆవిడ మాట ఇంకా పూర్తి చెయ్యనే లేదు “అమ్మా!” గట్టిగా అరిచాడు ఆకాష్. మహికి నిలుచున్నపాటు పాతాళంలోకి జారిపోతున్నట్లు అనిపించింది. పది నిముషాల కిందట భార్యా భర్తలిద్దరూ ఆనందంలో తేలిపోయారు. ఇంతలో ఇదేమిటి? ఈ ఆనందం శాశ్వతం కాదా!
“అమ్మా నాకలాంటి పట్టింపులు లేవు. అసలు నాకు కూతురే కావాలి. నువ్వు కూడా ఇంకేం మనసులో పెట్టుకోకుండా మాతో కలిసి ఆనందిస్తే ఆనందించు. లేకపోతే లేదు” గట్టిగా చెప్పాడు. అప్పటికి కాస్త ధైర్యం వచ్చింది మహికి. ఆకాష్ చేయి గట్టిగా పట్టుకుంది.
“నా భయమూ అదేరా ఆడపిల్ల ఎక్కడ పుడుతుందోనని” నెమ్మదిగా అన్నారావిడ.
“అమ్మా! కోపం తెచ్చుకోకుగాని, నువ్వూ ఆడపిల్లవే కదా! మీ నాన్నమ్మ నీలా ఆలోచిస్తే నువ్వు ఉండేదానివి కాదు కదమ్మా” ఒకింత కోపంగానే అన్నాడు ఆకాష్.
“నిజమేరా! కాని అప్పటి పరిస్థితుల్లో ఆవిడకు అలాంటి ఆలోచన వచ్చే అవకాశం లేదురా.”
“ఇప్పుడేమైందమ్మా నేను బాగా సంపాదిస్తున్నాను. నాకూతురికి ఎంతైనా పెట్టగలను.” "నీకు అంతవరకే అర్ధమయింది. కానీ అంతవరకూ నా మనవరాలు ఉండాలికదరా" భారంగా వినవచ్చింది ఆవిడ మాట.
“అమ్మా! నీ మనసులో ఉన్నది సూటిగా చెప్పు” నిలదీసాడు ఆకాష్.
“చెప్తానురా. నట్టింట్లో ఆడపిల్ల తిరుగుతుంటే ఆ ఆనందమే వేరురా. కాని ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందంటే భయంతో వణికిపోతున్నారు తలితండ్రులు. మా నాన్నమ్మ నాలా ఆలోచించలేదంటే ఆవిడకు ఆవిడ మనమరాలి భద్రత గురించి పూర్తి భరోసా ఉండేది. ఇప్పుడు అలా కాదురా. మనవరాలు పుడుతుందంటే భయం వేస్తుందిరా! అప్పట్లో మహా అయితే ఎదిగిన ఆడపిల్లల గురించి భయం ఉండేది. వాళ్ళకు జాగ్రత్తలు చెప్పేవారు. ఇప్పుడో ఊహ తెలియని పసి పిల్లలను సైతం.... వదలడంలేదురా! ఇప్పుడు ఆడపిల్ల అంటే…. ఎప్పుడు ఏ మానవ మృగం వెంటాడుతుందో! ఏనిముషం ఏమాట వినాల్సి వస్తుందో! అని గుండెలు కొట్టుకుంటున్నాయిరా ఆడపిల్లల కన్నవాళ్ళకు. ఇప్పుడు రెండేళ్ళకే ప్లేస్కూల్ కని పంపిస్త్తున్నాము. మాటలు కూడా పూర్తిగా రాని ఈ చిట్టితల్లులు కాముకుల పశుత్వానికి బలి అవుతుంటే…. కంట కన్నీళ్ళు కాదురా! గుండెల్లో రక్తం కారుతుందిరా. ఎప్పుడు అటువంటి వార్తలు విన్నా, చదివినా ఇంకా పుట్టని మన చిట్టితల్లే గుర్తుకు వస్తుందిరా! అందుకే అటువంటి బాధ మన చిట్టితల్లికి ఎప్పుడూ రాకుండా, బాధ అయినా ముందే.... మాట పూర్తి చేయలేక ఆగిపోయింది. ఆవిడ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆవిడ బాధ అర్ధమైన మహి, ఆకాష్ ఆవిడను దగ్గరకు తీసుకున్నారు ఓదారుస్తూ.
***********************************
స్కానింగులో ఏ బిడ్డో చెప్పకూడదు అని చట్టముంది. కాని డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు ఎప్పుడూ కొంతమంది ఉంటారు. కడుపులోని బిడ్డ మగ బిడ్డే అవాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుంది మహి. మగబిడ్డంటే ప్రత్యేకమైన అభిమానంతో కాదు. ఆడపిల్ల అయితే తన చేతులతే తానే .... కానీ ఏ దేవుడూ ఆమె మొరను ఆలకించలేదు. భారమైన మనసుతో ముగ్గురూ డాక్టరు దగ్గరకు వెళ్ళారు. “చెప్పండి? ఏమిటి బాధ? ఎవరికి?” నవ్వుతూ అడిగింది డాక్టరు. మహి,ఆకాష్ మాట్లాడలేక పోయారు. “అబార్షను చేయిద్దామని" రత్నావతే నెమ్మదిగా చెప్పింది. “ఎందుకని? ఎవరూ ఏమీ మాట్లాడ లేదు. మహి తలదించుకునే ఉంది. టప,టపా కన్నీటి బొట్లు కారాయి. ఆకాష్ మహి చేయి పట్టుకున్నాడు ఓదారుస్తున్నట్లు. డాక్టరుకి పరిస్థితి అర్ధమైంది. భార్యా భర్తలిద్దరికీ ఇష్టంలేదు. పెద్దామె బలవంతంతో వచ్చారు. ఇలాంటి కేసులు ఎన్ని చూసిందో తన సర్వీసులో.
“మీ కోడలు ఆరోగ్యంగా ఉంది. బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. మీకేం భయం అక్కరలేదు.” రత్నావతిని చూసి చెప్పింది డాక్టరు. “అదికాదు డాక్టర్”
“ఆ ఇంకో విషయం. తొలి చూలుకి అబార్షను చేయిస్తే , ఏదన్నా అటూ, ఇటూ అయితే మరల గర్భం దాల్చడం కష్టం. ఆలోచించుకోండి" సుందరమ్మ ముఖంలో భయం తొంగిచూసింది. అమ్మో! రేపు మహి గొడ్రాలుగా అయిపోతుందా? వద్దు! వద్దు! అంతలో కామ పిశాచి కళ్ళ ముందు కనిపించింది. అమ్మో! అసలే వద్దు.
“అదికాదు డాక్టర్! స్కానింగులో ఆడపిల్ల అని తెలిసింది” దైర్యం కూడగట్టుకుంటూ అంది రత్నావతి.
“అయితే!” తిరిగి ప్రశ్నించింది డాక్టర్.
“మాకొద్దు” గుండెదిటవుచేసుకుంటూ చెప్పింది రత్నావతి.
“ఏం1 మీరూ ఆడపిల్లే కదా! మీ కోడలూ ఆడపిల్లే కదా!” సూటిగా అడిగింది డాక్టర్.
“మీరన్నది నిజమేనమ్మా. మా పెద్దవాళ్ళు మాలా ఆలోచించి ఉంటే మనము ఉండేవాళ్ళము కాదు. మనం బతికినన్నాళ్ళూ బతుకుతాము అన్న ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు మనలను కన్నారు. ఇప్పుడా ధైర్యం లేదు. ఆడబిడ్డ పుట్టిన నుండి అనుక్షణం భయంతో బతకవలసి వస్తుంది. ఎవడి కళ్ళు చిట్టితల్లి మీద పడతాయోనని. అందుకే డాక్టర్ వద్దు అనుకుంటున్నాము” సూటిగా చెప్పింది రత్నావతి.
ఆమె మాటలకు, అందులోని బావానికి కదిలిపోయింది డాక్టరు. రేపెప్పుడో కట్నం ఇవ్వాల్సివస్తుందని ఆడపిల్లలను వద్దనుకున్నవాళ్ళను చూసింది గాని ఈ కారణముతో వద్దనుకున్న వాళ్ళను ఇప్పుడే చూస్తుంది.
“మీ బాధ నాకు అర్ధమయింది. కాని ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. తప్పు ఒకరు చేస్తుంటే శిక్ష ఇంకొకరికి వెయ్యాలనుకుంటున్నట్టు ఉంది. తప్పు చేస్తున్నది మగవాళ్ళైతే ఆడబిడ్డను గర్భంలోనే చంపెయ్యాలనుకోవడం ఎంత వరకు సమంజసం? ఆడపిల్లల ఈ పరిస్థితికి కారణం మగవాడు. అలాంటప్పుడు వాడు పుట్టకుండా చెయ్యాలనుకోవడం కొంతవరకు సబబేమో గానీ ఆడబిడ్డను చంపెయ్యాలనుకోవడం మూర్ఖత్వం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మనం ఆడపిల్లలకు ఎలా ఉండాలో చెపుతున్నాము గానీ, మగపిల్లలకు ఎలా ఉండగూడదో చెప్పడము లేదు. పుట్టుకతోనేవాడిని ఈ లోకంలోకి రెండు చేతులూ చాచి మరీ ఆహ్వానిస్తున్నాము. మీకేం మగపిల్లలంటున్నాము. అలా వాడికి కనిపించని రెండు అహంకారపు కొమ్ములు మనమే తగిలిస్తున్నాము. ఆడపిల్లలను ఎంక్వైరీ చేసినదానిలో పదోవంతు మగపిల్లలను ఎంక్వైరీ చేస్తే ఈ దారుణాలు జరగకుండా ఆపవచ్చు. మగపిల్ల వాడిని ఏరా! ఇంతవరకు ఎక్కడ తిరిగావు? ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చు చేసావు? అని ఇంటికి రాగానే మనం అడుగుతూ ఉంటే ఆడపిల్లల మీద ఇన్నిన్ని అఘాయిత్యాలు జరగవు. అలాగే మన ఆలోచనా విధానమూ మారాలి. ఎవరిమీదైనా అత్యాచారము జరిగితే వాళ్ళకు ఏ విధముగా మేలు చేయని, పనికిరాని సానుభూతి చూపించడం మాని వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుని మానసిక స్థైర్యం ఇవ్వాలి. అంతేగాని ఇలా మనం గర్భంలోనే ఆడ శిశువులను ఏరి పారేస్తుంటే కొన్నాళ్ళకు ఇప్పటికే తక్కువ ఉన్న ఆడ మగ నిష్పత్తి ఇంకా పడిపోయి ఉన్న ఆడపిల్లలకు మరిన్ని ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది.
అదీకాక ఇంట్లో పిల్లలను ఆడ, మగ తేడా లేకుండా పెంచడం, ఆడపిల్లలను ఇప్పటి పరిస్థితులకు తగట్టు పెంచడం అంటే వాళ్ళకు స్వీయ రక్షణలో ప్రత్యేక తర్ఫీదునివ్వడం ... ఇలాంటివి అందరూ పాటిస్తే రోజూ వార్తల్లో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చదివే పరిస్థితులు కలగవు. అందుకని బాగా ఆలోచించుకుని అవసరమనుకుంటే రేపు రండి. లేకపోతే నెల తరువాత తనిఖీకి తీసుకు రండి."
డాక్టరు గారు ఆవేశంగా,ఒకింత ఆవేదనగా చెప్తుంటే నిశ్శబ్దంగా విన్న రత్నావతి కాస్సేపాగి “డాక్టరు గారూ! మీలా చెప్పేవాళ్ళుంటే మాలాంటి వాళ్ళ ఆలోచనలు ఇలా ఉండవు. రాబోయే కాలంలో గడ్డు పరిస్థితి ఎదురవుతుందేమోనని ఆ పరిస్థితి తమకు రాకూడదని ఎవరికి వారు అనుకుంటే జరగబోయేది ఏమిటో మాకు అర్ధమయేటట్లు చెప్పారు. ఇంత విన్నాక కూడా మూర్ఖంగా ఆలోచించలేము. మా చిట్టితల్లిని రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తాము. అలాగే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేటట్లు పెంచుకుంటాము. నెల తరువాత వస్తాము.” చేతులు జోడించి చెప్పింది రత్నావతి. ఆ మాటలు విన్న మహి, ఆకాష్ ల ముఖాలు ఆనందంతో వికసించాయి.