నిజం చెప్తే మంట _ అబద్ధం చెప్తే తంటా - - నేతి సూర్యనారాయణ శర్మ

nijam cheptee manta - abaddham chepte tanta

నిజం ఎంత నిప్పులాంటిదైనా అబద్ధాల జడివానలో ఆరిపోక తప్పదంటారు. బోరుమని ఏడిపించే నిజాలు చెప్పడం కంటే హుషారుపుట్టే అబద్ధాలు చెప్పడమే హెల్త్ కి మంచిదంటారు. అన్నీ పచ్చినిజాలే మాట్టాడ్డం కంటే పండంటి అబద్ధాలే చెప్పడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు. కానీ ఒట్టేసి చెబుతున్నా కదా! నా నోటంట ఏనాడూ అసత్యం పలికింది లేదు. నిజాలు చెప్పడం మానేస్తానేమో కానీ, అబద్ధాలు మాత్రం చస్తే చెప్పనని ఒట్టేసుకున్నా. మరీ అన్ని సార్లూ కాకపోయినా కొన్ని కొన్నిసార్లు బొంకవచ్చునధిపా అఘము పొందనేరవు అని మభ్యపెట్టే వాక్యాలను ఏనాడూ చెవికెక్కించుకోలేదు నేను.

అలాగని మీరు మరీ ముక్కుసూటిగా మాట్లాడుతారు. మీతో చాలా కష్టం అని ఎవరూ ఇంతవరకూ కంప్లయింటు చెయాలేదు. మీరు భలే లౌక్యులండీ అని ఎవ్వరూ నామీద చురకలెయ్యలేదు. ఆ విధం గా నా నిత్య సత్య వచనా వ్రత దీక్షను ఇన్నేళ్ళనుంచీ గుంభనం గా సాగించుకుంటూ వచ్చాను.

కానీ ఆ రోజు మాత్రం నా నియమం సడలించుకోవాల్సి వచ్చింది.

"ఈ మామిడి కాయ పప్పులో వేద్దామనుకుంటున్నా.. మనిద్దరికీ ఎన్ని గ్లాసుల పప్పు పొయ్యాలంటారు?" కాపురానికి వచ్చాక తొలిసారిగా వంటచెయ్యబోతూ అడిగింది మా ఆవిడ.

"నాకేం తెలుసు?" అన్నాన్నేను టీవీలోకి తీక్షణం గా చూస్తూ..

"ఉద్యోగం వచ్చింది మొదలు ఇన్నేళ్ళనుంచీ ఇంటికి దూరం గా ఉన్నారు. ఆ మాత్రం పప్పువండడం కూడా నేర్చుకోలేదా?" కొత్తపెళ్ళాం వెక్కిరించింది.

"పప్పు వండితే తప్ప ప్రమోషన్ ఇవ్వమని ఎవ్వరూ అనలేదు" అన్నాను నేను రిమోట్ బలం గా వత్తుతూ

"అడపాదడపా అయినా వంటచేసుకోకుండా ఏ మగాడికైనా తప్పుతుందా? అన్నేళ్ళు బ్యాచిలర్ గిరీ వెలగబెట్టి నేర్చుకున్నది ఇంతేనా" అంటూ మూతి తిప్పుకుంటూ వంటగదిలోకి నిష్క్రమించిందావిడ. పెళ్ళానికి ఆ మాత్రం మాటసాయం చేస్తే పరువు తక్కువా అని మీరంతా నన్ను నిలదీస్తారేమో! మళ్ళీ ఒట్టేసి చెపుతున్నా కదా... అబద్దం చెప్పాలని నాకు సుతరామూ లేదు. మరెందుకంత శుద్ధాబద్ధం ఆడేశావ్ అంటారా... ఈ ఒక్క విషయం లో మాత్రం అఘము పొందినా సరే , అబద్ధం ఆడక తప్పదని అనుభవపూర్వకం గా నిర్ణయించుకున్నాను. ఆ చరిత్ర కూడా కొంచెంగా చెబుతాను. అనగనగా మా వాడొకడున్నాడు. ఇంక చస్తే అవ్వదేమో అనుకున్న పెళ్ళి వాడిక్కూడా ఎట్టకేలకు అయ్యింది. పువ్వు లాంటి పెళ్ళాన్ని కష్టపెట్టడం ఇష్టంలేక కాదుగానీ, ఆవిడ చేసే వంటలు తినలేక ... తనకి వంట చెయ్యడం బాగా వచ్చు అనే నిజాన్ని బయటపెట్టేశాడు. అప్పట్నుంచీ రెండుపూటలా భోజనమే కాదు.. ఫలహారాలు, పిండివంటలూ కూడా వాడి మెడకే చుట్టుకున్నాయ్. "లక్ష రూపాయల జీతగాడివి నీ అదృష్టం ఏమిటిరా ఇలా తిరగబడిందీ" అంటే వాడన్నాడు కదా..

"ఒక్క నిజం చెబుతాను రాసుకోరా సూరీ! యవ్వనం లో వున్న భార్య చేతకానీ వార్ధక్యం లో వున్న తల్లిచేత గానీ వంటచేయించనేకూడదు. ఈవిడకి చేతకాక, ఆవిడకి కనబడకా ఇద్దరూ తగలేస్తారు" అన్నాడు వేదాంత ధోరణిలో.

"ఏడిశావ్. అందరూ అలాకాదులేరా" అన్నాను నేను.. ఇప్పటికీ చక్కగా వుండే మా నాయనమ్మ వంటకాలను ఊహించుకుని , ఒకసారి లొట్టవేసి. అప్పుడే ఒక నిష్టూర సత్యం గ్రహించాను.

మగవాడు తనకు వంటచేతనొచ్చు అని ఎట్టిపరిస్థితిల్లోనూ పెళ్ళాంతో చెప్పరాదు. అధవా చెప్పినా ఏదో ఇంత అన్నం వుడకెయ్యడం మినహా ఏదీరాదు అని చెప్పవల్. ఒకవేళ ఈ పూటకి తమరు చెయ్యికాల్చుకోవలిసింది అని పెళ్ళాం గారు ఆజ్ఞాపించినట్లాయెనా, మనం వంట చండాలం చెయ్యవలె. వంటగదిని నానాభ్రష్టూ పట్టించవలె.

ఇందుకు అతిక్రమించి చరించను అని గాయత్రి పట్టుకుని నాలో నేను భీషణ ప్రతిగ్న చేసుకున్న తరువాతే పెళ్ళిపీటల మీద నాతిచరామి అన్నాను. అందులో భాగంగానే కేవలం ఇద్దరు మనుషులకు ఎంత పప్పు పడుతుంది అనే చిన్నపాటి జనరల్ నాలెడ్జీ కొశ్చెన్ కీ కూడా ఆన్సర్ చెప్పకుండా నాకు తెలీదు అని ఘోరమైన అబద్ధం ఆడేశాను.

నిజంగా ఎంత పనిచేశాను? ఎల్లప్పుడూ నిజాలే చెపుతాను. అసత్యం ఆడనే ఆడను అన్న నా వ్రతాన్ని సైతం పక్కకు పెట్టేశాను. ఇదంతా తల్చుకుంటే నాకు దుఖ్ఖం పొంగుకొస్తుంది. కంటివెంట ధారగా కారిన కన్నీళ్ళు ముక్కుకి కూడా పని చెప్పాయి. ఒక్కసారి ఎగబీల్చాను.

మాడు వాసన గుప్పుమంటూ కొట్టింది. టీవీ సౌండ్ తగ్గించాను. ఏం చేస్తున్నావ్" అని వంటింటిని ఉద్దేశించి ఒక్క కేక పెట్టాను.

"ఎన్ని నీళ్ళు పోసినా అడుగంటిపోతోంది. పప్పు ఉడికి చావడంలేదు" అంటూ జవాబు పొలికేక వినిపించింది. పెళ్ళితప్పని పాడుబతుకునిచ్చి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావురా భగవంతుడా అనుకుంటూ, సోఫాలోంచి లేచి వంటింట్లోకి వెళ్ళాను.

మాడిమంగలం అయిపోతున్న మావిడికాయ పప్పుకేసి శూన్యదృక్కులు ప్రసరించాను. ఆవిరి సెగలకంటే వేడిగా గాడం గా ఒక్కసారి నిట్టూర్చి అడిగాను.

"ఎంతసేపైంది... ఆ ముక్కలేసి? అని.

"పప్పుతో పాటే వేశానండీ. ముక్కలు చూడండి చక్కగా ఉడికాయ్. ఈ పప్పుమాత్రం ఉడకడంలేదు ఎంచేతంటారు?" సాశ్చర్యంగా నా సహన్నాన్ని పరీక్షపెడుతున్నట్లుగా అడిగింది తను.

"పుల్లటికాయలు ముందే వేస్తే పప్పు ఉడకదే పిచ్చిదానా... తెచ్చిన రెండు కాయలూ తరిగేశావా? ఏమైనా అట్టేబెట్టావా?" ఆతృతగా అడిగాను.

"బెల్లం వేసి పచ్చడి చేద్దామని ఒక కాయ అట్టేబెట్టానండీ" చెప్పింది బేలగా.

"పచ్చట్లో బెల్లం వేస్తావా? నీ పాకశాస్త్ర జ్ఞానం తగలడ్డట్టే వుంది కానీ, ఆ మామిడికాయ ఇటిచ్చి దయచెయ్" అన్నాను నేను బ్రహ్మ చర్యపు రోజులు మళ్ళీ గుర్తుచేసుకుంటూ,

అంతే... ఒక్కసారిగా కుళాయి విప్పిందావిడ. "మొదటిరోజునుంచీ మొగుడికీ మహా రుచిగా వండేస్తావేమో... అక్కడ్నుంచీ అది చెయ్యి ఇది చెయ్యి అని వేపుకుతినేస్తారు జాగ్రత్త అందండీ సుశీల. నేను మాత్రం దాని మాటలు వినలేదు. నిజం .. మీకు చక్కగా వండిపెడదామనే అనుకున్నాను" తనమానాన తాను ఏదో చెప్పుకుంటూ పోతోంది. నా పాటికి నేను ఆరోప్రాణం లాంటి మావిడికాయ పప్పు దీక్షగా చేస్తున్నాను.

చివ్వరిగా నేతిపోపు పెడ్తుంటే ముక్కుతుడుచుకుంటూ అంటుంది కదా.. "ఏవండీ మీకు చక్కగా వండడం వచ్చు కదా! దాచేస్తే దాగిపోతుందా? పెళ్ళాం దగ్గర నిజాలు దాస్తే ఎన్నాళ్ళు దాగుతాయండీ. పోనీలెండీ.. మీకు నచ్చేలా ఎలా వండాలో నాలుగురోజులు చూపించండి. ఆ తర్వాత.. "ఆవిడింకా ఏదో చెబుతూనే వుంది.

అబద్ధం అనే అడుసులో కాలుజారి .. వంటింట్లో పడ్డ నాకు నాలుగుముద్దలు రుచికరమైన పప్పే గొప్ప ఓదార్పునిచ్చింది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ