ఒక గ్రామంలో గణపతి అనే చిన్న వ్యవసాయ దారుడు ఉండేవాడు. తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన ఫలసాయంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఆ ఏడు పంటలు బాగానే పండి డబ్బులు బాగానే వచ్చినాయి. ఆ డబ్బులతో అతని భార్య ఇంట్లో పాడికోసం ఒక గేదె వుంటే బాగుంటుందని, వెళ్లి గేదెను కొనుక్కు రమ్మన్నది.
గణపతి గేదెను కొనుక్కురావడానికి తమ వూరికి కాస్త దూరంగా వుండే మరో వూళ్ళో పశువుల సంత జరుగుతూ వుంటే వెళ్ళాడు.
గణపతి మంచివాడే కానీ ఆశపరుడు. నిజం చెప్పాలంటే కాస్త దురాశా పరుడు. పది రూపాయల సొమ్ము అయిదు రూపాయలకే వస్తే బాగుండు అని ఆలోచించే రకం.
గణపతి మంచి గేదెకోసం సంత అంతా తిరిగాడు. గేదెల దగ్గర గణపతి బేరమాడే విధానం ఇద్దరు మోసగాళ్ళు కనిపెట్టారు. వెంటనే వాళ్ళల్లో ఒకడు తన మాటలతో గణపతికి గాలమేశాడు. 'నా వద్ద చాలా మంచి గేదె వుంది. నీకు చాలా సరసమైన ధరకు ఇప్పిస్తా రా!' అంటూ తనతో తీసుకు పోయాడు. అతను గణపతిని పక్కనే వున్న ఒక చెరువు చెంతకు తీసుకు పోయాడు. దూరంగా చెరువులో పెద్ద కొమ్ములు కనపడే గేదెను చూపించాడు. పైకి కొమ్ములు మాత్రమే కనపడుతున్నాయి. "నీవు చాలా తెలివైన వాడివి కొమ్ములు చూస్తే చాలు ఆ గేదె రకం ఏమిటి ఎన్ని పాలిస్తదో ఇట్టే చెప్పగలవు. నీకు చెప్పేదేముంది బ్రహ్మాండమైన గేదె. చూస్తే మంచివాడిలా వున్నావు. ఇందాకటి నుండి నీ బాధ చూస్తున్నాను. వెళ్తే నా గేదె నీ లాంటి వాడి ఇంటికే వెళ్ళాలి. ఆ గేదె నీదే తీసుకుపో" అన్నాడు. గణపతికి ఆశ కలిగింది. దాని కొమ్ములు చూస్తే బాగానే ఉన్నట్టు కనపడుతోంది. ఒక్కసారి కూడా పైకి రాలేదేమి? అనుకుంటూ అదే మాట అడగబోయాడు. అది కనిపెట్టినవాడల్లా ఆ మనిషి " చాలా దూరం నుండి కొనుక్కొచ్చాను. ఎండాకాలం కదా! మూడు రోజులు ఎండలో నడిచింది. బాగా సేదదీరాలని నేనే నీళ్ళల్లో విడిచి పెట్టాను. పాపం నీళ్ళల్లోంచి రాలేక పోతోంది."
"ధర ఎంత ?" గణపతి అడిగాడు.
"వాస్తవానికి దాని ధర రెండువేల రూపాయలు పై మాటే. కానీ నీకని వేయి రూపాయలకే ఇస్తాను." అన్నాడు వాడు. గణపతికి ఆశ కలిగింది. వాస్తవానికి దాని ధర ఎంత లేదన్నా మూడు నాలుగు వేలు వుంటుంది.
"ఎనిమిది వందల కయితే నేను ఒప్పుకుంటా. నీకు ఇష్ట మైతే దాన్ని ఒడ్డుకు తీసుకు రాపో!" అన్నాడు గణపతి.
"సరే! ఏం జేస్తా! నా అవసరం అలాంటిది. నీవు చాలా తెలివైన వాడివయ్యో! నా అవసరం మీద ఆడుకుంటున్నావు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశావో ఏమో శుభమా అని బంగారం లాంటి గేదెను కారుచవుకగా కొట్టేశావు. మళ్ళీ నా లాంటి దరిద్రుడి చేయి దాని మీద ఎందుకు పడాలి గానీ... నువ్వే వెళ్లి తోలుకు రాపో!" అన్నాడు.
గణపతి ఆ మాటకు పొంగి పోతూ పొద్దున్న తను లేవంగానే తన భార్య మొఖమే చూశాడు. ఆ సంగతి గుర్తుకు తెచ్చుకుంటూ, తనను ఎప్పుడూ తెలివి తక్కువ దద్దమ్మా అని ఎకసక్కేలు ఆడుతుంటది. ఇప్పుడు తను ఈ గేదెను తీసుకు వెళ్ళగానే తన భార్య మొఖంలో తిరిగే రంగులు గుర్తుకు వస్తున్నాయి. ఇలా ఆలోచిస్తూ గణపతి గేదెను తోలుకు రావడానికి చెరువులోకి దిగ బోయాడు.
" ఇదిగో పెద్ద మనిషీ!" అన్నాడు వాడు. తనను పెద్దమనిషీ అని సంబోదించగానే గాలిలో తేలిపోయాడు గణపతి. వెనక్కు తిరిగి ఏమిటన్నట్టు చూశాడు. "నేను ఈ మనిషికి అయిదు వందలు ఇవ్వాల. పొద్దున్నుండి నిలబడనిస్తలేడు కూచోనిస్త లేడు. ఓ అయిదు వందలు ముందుగా ఇస్తే వీడి మొఖాన కొడతా!"
గణపతి వెనుకా ముందు ఏమీ ఆలోచించలేదు రొండిన వున్న డబ్బుల సంచిలోంచి అయిదు వందలు లెక్క పెట్టి ఇచ్చి గేదె వైపు కదిలాడు. సగం దూరం పోయాక ఒకసారి వెనుక్కు తిరిగి చూశాడు. గేదెను అమ్మినవాడు నవ్వుతూ చేయి ఊపాడు. గణపతి మరింత ఉత్సాహంగా ముందుకు కదిలాడు. తన గేదె కొమ్ముల వంక చూశాడు. పాపం పిచ్చోడు కొమ్ములకు రంగులు వేయించి నట్టున్నాడు... నిగనిగ లాడుతున్నై. అనుకుంటూ తన గేదెను చేరుకొని ఒక చేత్తో దాని కొమ్మును పట్టుకొని పలుపుతాడు కోసం వెతక బోయాడు. అంతే! కొమ్ములు చాలా తేలిగ్గా చేతిలోకి వచ్చాయి. అక్కడ చెక్కతో చేసిన రంగేసిన కొమ్ములు తప్ప ఏమీ లేదు. గణపతి హతాశుడయ్యాడు. గిరుక్కున వెనక్కు తిరిగి వొడ్డుకు చూశాడు. వాళ్ళిద్దరూ లేరు.
జరిగిన మోసం అర్థం అయింది. చెప్తా వాళ్ళ పని అనుకుంటూ కొమ్ములు తీసుకొని ఒడ్డుకు వచ్చి వాళ్ళ కోసం వెతికాడు. వాళ్ళ జాడ లేదు. ఇక చేసేది లేక చక్కగా సంతను నిర్వహించే అధికారి వద్దకు వెళ్లి జరిగింది అంతా వివరించి వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు. "ఏమిటీ! నీవు ఎనిమిది వందలకు గేదెను కొన్నావా? నాలుగు వేలకు తక్కువ గేదెలు ఎక్కడా లేవే. ఎనిమిది వందలకు ఇస్తానంటే ఎలా నమ్మావయ్యా? వాళ్ళెవరో గుర్తించి ఇలా తీసుకురా నేను విచారిస్తా!" అన్నాడు సంత అధికారి. అంతే కాకుండా అక్కడ గుమికూడిన వాళ్ళు తలా ఒక మాట అన్నారు. గణపతికి డబ్బులు పోయినదానికన్నా కూడా ఆ మాటలు చాలా బాధ కలిగించాయి.
మారు మాటాడకుండా అవమాన భారంతో వెనుతిరిగిన గణపతికి వెనుక నుండి సంత అధికారి మాట ఒకటి వినిపించింది. "మోసపోవడానికి మన అమాయకత్వం కన్నా మన దురాశ ఎక్కువ కారణం అనే విషయం ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!"