పెద్దమ్మవారి మంచిమాట - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

peddammavari manchimata

అరవైఏళ్ల శ్రీనివాసరావుగారు భార్య వంక చూశాడు. పసిమిఛాయలో, నుదుటన పావలా కాసంత కుంకం బొట్టుతో, ప్రశాంతమైన వదనంతో, ఎఱ్ఱని పట్టుచీరలో అచ్చం కనకదుర్గదేవిలా కళ కళ్లాడిపోతోంది చాముండి.

నిన్ననే షష్టిపూర్తిని వేడుకగా జరిపారు కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవలు మనమరాండ్రు. అందరూ ప్రవాస భారతీయులే! డబ్బుకేం కొదవలేదు. అందరూ సమయం చేసుకురావడానికి మాత్రం చాముండే కారణం. మానవ సంబంధాలు కుంటుపడకుండా బాధ్యతలు నెరపడంలో మాత్రం తనకి నూటికి నూరు మార్కులెయ్యొచ్చు. కుటుంబంలోని పసిపిల్ల లగాయతు పెద్దల వరకు అందరినీ పూలని కలిపే దారంలా అనుబంధంతో కట్టి ఉంచుతుంది. భార్యను అలా చూస్తున్న కొద్దీ ఆయనలో ఆత్మీయత పెల్లుబికింది.

"చాముండీ, అలసిపోయిన పిల్లలందరూ వాళ్ల వాళ్ల గదుల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. బాగా పొద్దుపోయింది. చిన్నా చితకా పనులుంటే రేపుచుసుకుందూ..పద అలా డాబా మీదకెళ్దాం. నిండుపున్నమి వెన్నెలని కాసేపు అనుభూతిద్దాం. ఏవంటావు?"అన్నాడు భార్యవంక మురిపెంగా చూస్తూ.

"అలాగేనండీ, కాస్త ఈ సామాను లోపల పడేసి వస్తాను..ఈలోపు మీరు డాబా పైకెక్కి కుర్చోండి"అంది.

శ్రీనివాసరావుగారు డాబాపై వేసి వున్న కుర్చీలో కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలనీ, పూర్ణ చంద్రుడినీ తదేకంగా చూడసాగాడు.

"అయ్యగారివాల కుర్రవాడైపోయినట్టున్నాడు. చంద్రుడిని తదేకంగా చూస్తున్నారు. భావావేశంతో కవిత్వం చెబుతారేమో"అంది తనొచ్చినట్టుగా తెలియజేస్తూ.

శ్రీనివాసరావుగారు చిన్నగా నవ్వి "చాముండీ, నువ్వు ఎదురుగా ఉంటే ఒక్క కవిత్వమేమిటోయ్, చతుష్షష్టి కళల్లో పరిపూర్ణత్వం వచ్చేస్తుంది. అసలు నిన్నిక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? మగాడి జీవితం నల్లేరుమీద బండి నడకలా ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా, సవ్యంగా సాగాలంటే, భార్య సహకారం ఎంతగానో ఉండాలి. చుట్టాలు, పక్కవాళ్లు, స్నేహితులు, మన పిల్లలు అందరితో నువ్వు నెరపిన సత్సంబంధాలు మనకి పెద్దరికమాపాదించి మనమంటే గౌరవం పెంపొందించాయి. మన వైవాహిక జీవితంలో నీకు నూటికి నూరు మార్కులేస్తాను. నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. అందుకే కృతజ్ఞతలు చెప్పుకుందామని ఇక్కడికి పిలిచాను."అని ఆవిడ చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు.

చాముండి భర్త వంక ప్రేమగా చూసి "ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండీ, మీ మంచితనమూ కారణమే! మీరు నాకు నూటికి నూరు మార్కులేస్తానంటున్నారు..కాని నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది నన్ను భర్తతో సహా అందరూ కొనియాడేలా పరిపూర్ణ స్త్రీలా మలచిన మా పెద్దమ్మకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను"అంది.

"మీ పెద్దమ్మా?"

"అవును. ఆవిడ గురించి నేను మననం చేసుకుంటాను. మీరు తెలుసుకుందురుగాని"

***

"అప్పుడు నా వయసు పదమూడేళ్లు..మా ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చింది పెద్దమ్మ. ఆవిడపేరు విజయదుర్గ. విజయదశమి నాడు పుట్టిందని ఆ పేరెట్టారట. ఆవిడ ఏ ఇంటికొచ్చినా ఆ ఇల్లు కళ కళ్ళాడేది. అందరికీ తలో పనీ పురమాయించీ, తనూ నాలుగు పనులు చేస్తూ ఇల్లంతా తిరగలిరాయిలా కలయతిరిగేది. ఆవిడంటే పిల్లా పెద్దా అందరికీ అభిమానమే. ఆవిడ ఆహార్యం కూడా పార్వతిదేవిలా చూడంగానే చేతులు జోడించాలనిపించేట్టు ఉండేది.

వ్రతం పూర్తయి ప్రసాదం తిని అందరం మండువాలో కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుంటే మా అమ్మ"అక్కా, చాముండికి మంచి సంబంధం ఉంటే చూడు, నీ చేతులమీదుగా పెళ్లి జరిపిద్దువుగాని"అంది.

సంభాషణ నా పెళ్లికి సంబంధించినదవడంతో సిగులమొగ్గనై..ఇంట్లోకి తుర్రున పరిగెత్తాను. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఒక రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నూతి గట్టున కూర్చుని అంట్లు తోముతుంటే మా పెద్దమ్మ వచ్చి "అమ్మడూ..నీ పనయ్యాక నా గదిలోకి రా, నీతో మాట్లాడాలి" అంది.

నేను ‘అలాగే’ అన్నట్టు తలూపి పనయ్యాక పెద్దమ్మ ఉన్న గదిలోకి వెళ్లాను.

నేను గదిలోకి వెళ్లేసరికి మంచం మీద పెద్దమ్మ నడుం వాల్చి వుంది..కానీ నిద్దర పోవడం లేదు. నా కాళ్ల గజ్జెల చప్పుడు విని"రావే అమ్మడూ.."అని కూర్చుంది.

"ఆరోజు నీ పెళ్లి ప్రస్థావన రాగానే సిగ్గుల మొగ్గై భలే పరిగెత్తావే" అంది నా బుగ్గలు పుణికి.

"ఏ కన్నెపిల్లకైనా పెళ్లి అంటే సిగ్గు ముంచుకు వస్తుంది. అది సహజం. పెళ్లి చేసుకోవడానికి వయసు వస్తే సరిపోదు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునుండాలి. పెళ్లంటే అందంగా కనిపించే అడ్డ దిడ్డ దారి. అది ఎప్పుడూ సుగమంగా ఉండదు. వైవాహిక జీవితం సాఫల్యమవాలంటే ఆడా మగా ఇద్దరూ ఎన్నో తెలుసుకునుండాలి. అప్పుడైతేనే అందులోని ఆనందానుభూతి దక్కుతుంది. నీ వ్యక్తిత్వంతో మా అందరి మనసులూ చూరగొన్న నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అవి కొంతవరకూ ఆచరిస్తే చాలు. ఇవన్నీ పుస్తకాల్లో దొరికేవి కావు. ఎంతో కాలంనుండీ, ఎన్నో జంటల్ని శ్రద్ధగా పరిశీలించగా అనుభవంతో మనసులో ఏర్పడిన అభిప్రాయాలు.

ప్రతి పనికి శిక్షణ అవసరమన్నది తెలిసిందే! శిక్షణతోటే పని సానుకూలమై సత్ఫలితాన్నిస్తుంది. అలాంటిది జీవితంలో ముఖ్యమైన పెళ్లి విషయంలో మాత్రం, అందరూ అదేదో గోప్య కార్యమైనట్టు తూ తూ మంత్రపు పెళ్లిచుపులు, హడావుడిగా పెళ్లీ జరిపేస్తారు. ఆడంబరంగా పెళ్లి జరిపించడంలోని శ్రద్ధ, కాబోయే వాళ్లని ‘ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా మెలగాలి’ అన్నది చెప్పడంలో ఉండదు. ఆడపిల్ల పుట్టింటి వారైతే ‘అత్తింటికి, పుట్టింటికి పేరొచ్చేలా ఉండాలి నీ ప్రవర్తన’ అని ఒక బానిసకి చెప్పినట్టు చెబుతారే గాని, మానవ సంబంధాలని వికసితం చేసే మంచి మాటలు చెప్పరు గాక చెప్పరు.

స్నేహాన్ని మించిన బంధం పెళ్లి. రెండు మనసులు పెళ్లి పేరుతో ఏకమై జీవితాంతం కలిసుండడం అనేది ఎంత గొప్ప విషయం? మనకంటూ పిల్లలుండడం, వాళ్ల ఆలనా, పాలనా ఎంత అద్భుతం! భార్యాభర్తల మధ్య ఆకర్షణ శక్తి ఎంత బలంగా ఉండాలంటే ఇద్దరిలో ఏ ఒక్కరూ పక్కదారి పట్టకూడదు. ఎప్పుడైనా తగాదాలు, గొడవలు చోటుచేసుకుంటే అవి ఒక స్థాయి వరకు ముచ్చటగా ఉంటాయి. ఫర్వాలేదు. కాని వాటిని తెగేవరకూ లాగి జీవితాన్ని నాశనం చేసుకోవడం మూర్ఖత్వం. మనసా, వాచా కర్మణా ఒకరిలో ఒకరు ఒదిగిపోవడానికే ప్రయత్నించాలి తప్ప ఆభిజాత్యాలతో, ఆధిపత్యధోరణితో బంధాన్ని కాలదన్నుకోకూడదు. ఒకరి వ్యక్తిత్వాన్ని, అభిరుచుల్నీ మరొకరు గౌరవించుకోవాలి. విడిపోవడం గొప్పవిషయం కాదు, కలసి ఉండండంలోని కమ్మదనం తెలుసుకోగలగాలి. లోకో భిన్న రుచిహిః అన్నది తెలిసిందే! అందరూ ఒక్కలా ఉండరు. కాబట్టి కొన్ని చోట్ల సర్దుకు పోవాలి..తప్పదు. అయితే ఇవన్నీ ఒక నిర్ణీత స్థాయి వరకే అన్నది మరవకూడదు. గొడవలు సాధారణం నుంచి హింశాత్మకం అవుతుంటే..ఎవరూ ఊరుకోకూడదు. పెద్దవాళ్లకి చెప్పి వాళ్లద్వారా పరిష్కారం ఆలోచింఛాలి. అవసరమైతే అప్పుడు విడిపోయి మనదైన స్వతంత్ర జీవితం గడపాలి. అయితే అది చిట్టచివరి ప్రయత్నం అన్నది మాత్రం మరచిపోకూడదు. చివరాఖరుగా చెబుతున్నా మన జీవితం మనకి ముఖ్యం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసుకోకూడదు.

నేను ఈ నాలుగు ముక్కలే నీకు చెప్పలనుకున్నాను. చెప్పేశాను. ఇహ బోలెడంత జీవితం నీ ముందు ఉంది. ఎలా ముందు కెళతావో తెలివైనదానివి నువ్వే ప్రణాళికా బద్ధం చేసుకో. మన జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలనుకుంటామో, అలాగే వైవాహిక జీవితాన్నీ సంపూర్ణం చేసుకోవాలి. మనిషి జీవితంలోని పరిపూర్ణ ఆనందం అనుభవైకవేద్యమయ్యేది అప్పుడే. అదే మన జన్మకి సార్థకత." అని ముగించింది.

ఆవిడ వంక చూశాను. అచ్చం కూతురికి బాగోగులు చెప్పే అమ్మవారిలా కనిపించింది. వెంటనే కాళ్లకి దణ్నం పెట్టుకున్నాను. ఆ తల్లి దయే ఈనాటి మీ ప్రశంసలకి నన్ను పాత్రురాలిని చేసింది.

"మీ పెద్దమ్మ నిజంగా దేవత. ఆవిడ మంచి మాటలు, ఆశీస్సులు మనతో పాటూ ఉండబట్టే సునాయాసంగా సంసార సాగరం ఈదాము..ముఖ్యంగా నీ సహకారంతో" అన్నాను మనస్ఫూర్తిగా.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు