మూడో చపాతీ - నండూరి సుందరీ నాగమణి

moodochapati

అప్పుడే నిద్ర లోంచి లేచి కూర్చున్నాడు, చలపతి. కంటినిండా నిద్రపోవటం వలన ప్రశాంతంగా ఉంది. లేచి, అటాచ్డ్ రెస్ట్ రూమ్ లోనికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని, పళ్ళూ వళ్ళూ బరబరా తోమేసి, కడిగిన ముత్యంలా బయటికి వచ్చి ఉతికిన లాల్చీ పైజామా వేసుకున్నాడు.

‘హమ్మయ్య, ఆత్మ ఒక శరీరం వదిలి మరో శరీరంలో చేరినట్టు, ప్రతీ రోజు స్నానం చేయగానే మరో జన్మ ఎత్తినట్టు ఉంటుంది...’ హాయిగా నిట్టూర్చి, హాల్లోకి వచ్చాడు. పిల్లలిద్దరూ టీవీలో కార్టూన్స్ పెట్టుకుని, వాటిని చూడకుండా వార్తాపత్రికలతో పాటుగా వచ్చే ఆదివారం అనుబంధాలు చెరోటీ పుచ్చుకుని పజిల్స్ చేసుకుంటున్నారు.

“చంద్రమతీ... ఏం చేస్తున్నావోయ్?” అని పిలుస్తూ వంటగదిలోకి వెళ్ళాడు. మూకుడులో కాగుతున్న నూనె, దానిలో వేగుతూ, పొంగిపోయి తేలుతున్న పూరీ దర్శనమిచ్చాయి... మరోప్రక్క ఆలూ ఉల్లి కూర కొత్తిమీరను అలంకరించుకుని మగ్గుతోంది.

‘ఊ...’ దీర్ఘంగా నిట్టూర్చి, “చంద్రా...ఎక్కడ నువ్వూ?” అంటూ కళ్ళజోడు సవరించుకున్నాడు.

“ఆ... ఇక్కడే ఉన్నా... ఇంకా పనిమనిషి రాలేదుగా, మధ్యలో గరిటె అవసరమైతేనూ... అయ్యో పూరీ మాడిపోతోంది... జరగండి...జరగండి...” అని చేతులు కడుక్కుని వచ్చి, ఆ పూరీని తీసేసి, మూకుడులో మరో పూరీని వేసింది.

“స్నానం పూర్తై పోయిందా? ఈ రోజు మనం మా కాత్యా పిన్నింటికి వెళ్ళాలి గుర్తుందా? మా బాబాయి పుట్టినరోజు సందర్భంగా మనందరికీ లంచక్కడ... కాఫీ ఇవ్వనా, టిఫిన్ తో పాటుగా తీసుకుంటారా?”

ఆదివారంనాడు ఆటవిడుపు చలపతికి. రోజూ చేసే వాకింగ్ కి ఈరోజు సెలవన్న మాట! హాయిగా ఎనిమిదింటికి లేస్తాడు. ఆఫీసు హడావుడి ఉండదు కాబట్టి ఇంటిల్లిపాదీ కలిసి టిఫిన్ చేస్తారు.

“టిఫిన్ తో పాటే... త్వరగా కానీవోయ్... ఆకలేస్తోంది... ఈలోగా పేపర్లు చదూకుంటా...” అంటూ మళ్ళీ హాల్లోకి వచ్చి పిల్లల పక్కనే కూర్చున్నాడు. “నాన్నారూ, ‘మతి కాని మతి’ ఏమిటి?” పుత్రరత్నం సందేహం...

“అదేరా... అనుమతి...” చెప్పింది పుత్రికామణి.

“అదిగో వస్తోందిగా... చంద్రమతి... మీ అమ్మ...” ముసిముసిగా నవ్వాడు చలపతి.

“నా పేరు మీద సెటైర్లు చాలు పతి దేవా... ఇక రండి...” డైనింగ్ టేబుల్ సర్ది, అందరినీ పిలిచింది.

“పూరీ, ఆలూ కూరనా? అమ్మా, పూరీలోకి హల్వా చేయవచ్చుకదా...” గునిసింది మణి.

“చేసానే తల్లీ... ఇదిగో...” డిష్ లోంచి రవ్వకేసరి తీసి ప్లేట్ లో పెట్టి ఇచ్చింది... మణి ముఖం పున్నమి చంద్రుడిలా విప్పారింది.

“అన్నీ అక్కకేనా... నాకేమీ లేదా?” సణగటం మొదలుపెట్టాడు రత్నాకర్.

“నీకేం కావాలి తండ్రీ?” బుజ్జగించాడు చలపతి.

“నాకు తెలుసులెండి... వాడికి ఏం కావాలో... ఉండు...తెస్తా...” ఫ్రిజ్ తలుపు తెరిచి ఒక బౌల్ పట్టుకు వచ్చింది చంద్రమతి. దాన్నిండా నూజివీడు రసాల జ్యూస్... కుమారరత్నం పూరీతో తింటాడన్న మాట!

“ఊ, అందరికీ అన్నీ ఇస్తావ్... నాకే...” చిన్నగా గొణిగాడు చలపతి.

“ఏంటిటా, మీకేం తక్కువైంది? పూరీలు చేసాను, బంగాళా దుంప కూర చేసాను. చక్కగా తినండి... కావాలంటే ఆ హల్వా, ఈ ఆమ్ రస్ కూడా కలిపి తినండి, బావుంటుంది... ఏం?”

“ఊ...” నిరాసక్తంగా ప్లేట్ ముందుకు లాక్కున్నాడు, చలపతి.

“పతీ... ఏంటమ్మా ఏం కావాలీ? అదేనా?”

“ఆ... అదే...ఎర్రగా, గుండ్రంగా, క్రిస్పీగా ఎంత బాగుంటుందో... హు... అనవసరంగా వద్దని అన్నాను ఆరోజు...” బాధగా నిట్టూరుస్తూ మొహం ఎర్రగా చేసుకున్నాడు, చలపతి.

పిల్లలిద్దరూ టిఫిన్ తినగానే చంద్రమతి వాళ్ళ స్కూలు సంగతులు అడుగుతూ వాళ్ళకి బూస్టు కూడా కలిపిచ్చి, ట్యూషన్ కి పంపించేసింది. భర్తకి కాఫీ ఇస్తూ, “అయితే, పెళ్లై పదేళ్ళు దాటేసినా మీ మూడో చపాతీ ఇంకా మీకు దొరకలేదన్న మాట!” అంటూనే కిసుక్కున నవ్వింది.

కినుకగా చూస్తూ కప్పు అందుకుని పేపర్లో తలదూర్చాడు, చలపతి...

పేపర్లో వార్తల బదులుగా పన్నెండేళ్ళనాడు జరిగిన పెళ్లి చూపుల దృశ్యం అతని మనసులో కదలాడసాగింది.

***

“మరీ చిత్రం... ఎవరైనా పెళ్లి చూపులు ఉదయం ఎనిమిదిన్నరకి పెడతారుటండీ?” బుగ్గలు నొక్కుకుంది రాజేశ్వరమ్మ.

“ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు కదే... ఉన్న పెద్ద దిక్కల్లా అతని బామ్మ ఒక్కతే... వాళ్ళ సిద్ధాంతిగారు ఈ ఘడియలు బాగున్నాయని చెప్పారట... పాపం ఫోన్ లో రిక్వెస్ట్ చేసింది...పెద్దావిడ... కాదంటే ఏం బాగుంటుంది మరీ... అందుకనే ఉదయం ఫలహారానికి ఆహ్వానించాను ఆ అబ్బాయిని...” తాపీగా చెప్పారు పశుపతి గారు.

“ఎంతైనా పెళ్ళికొడుకు... ఉదయమే ఏం మర్యాదలు చేయాలో ఏమో... ముందుగా తెలిసి ఉంటే మన చంద్రను ఈ రోజు బ్యూటీపార్లర్ కి పంపించే దాన్ని... అయ్యో, అసలే ఇవి మొదటి పెళ్లిచూపులు కూడానూ...” కంగారుగా అందావిడ.

“అవేమీ అక్కరలేదు. ఓ గంట ముందుగా అది మామూలుగా తయారైతే చాలు. సరదాగా ఫ్రెండ్లీ విజిట్ కి వస్తున్నాడు. స్నేహంగా మాట్లాడుకుంటారు. అన్నీ కుదిరితే పెళ్లి... లేకపోతే చిన్న మీటింగ్ అవుతుంది అంతే కదా...”

“ఊ... రాత్రి తొమ్మిదిన్నరకి చెబుతున్నారీ మాట! గారెలు, పూరీలు, చపాతీలు తప్ప ఎమెర్జెన్సీగా ఏమీ చేయలేము కదా... మినప్పప్పు నానబోస్తున్నాను...”

“అలాగే, చపాతీ, ఆలూ కర్రీ కూడా చేయి... స్వీట్స్ తీసుకువచ్చాను... సరిపోతుంది... చంద్రకి చెప్పు...”

అకస్మాత్తుగా మర్నాటి ఉదయమే తనకి పెళ్లి చూపులన్న విషయం తెలియగానే చంద్రకి చాలా కంగారుగా అనిపించింది. కాలేజీకి వెళ్లి చదువుకుంటోంది... ఇంకా ఫైనల్ పరీక్షలు కాలేదు... అతను ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో తెలియదు... పెళ్లి పట్ల ఒక అవగాహన కానీ, కాబోయే వరుడి పట్ల కలలు కానీ లేవింతవరకూ...

ఆరు గంటలకల్లా తయారయింది చంద్రమతి. రాజేశ్వరమ్మ కూడా గారెలు తయారుచేసి హాట్ పాక్స్ లో పెట్టేసింది. చపాతీకి కూర తయారు చేసి, చపాతీ పిండి కలిపి అట్టే పెట్టింది.

సరిగ్గా ఎనిమిది కల్లా వచ్చేసాడు, చలపతి. తాను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని, సిటీలో ఒంటరిగానే రూమ్ తీసుకుని ఉంటున్నానని, తనకి బామ్మ తప్ప వెనకా ముందూ ఎవరూ లేరని, తనను బామ్మను చక్కగా చూసుకునే అమ్మాయి అయితే చాలని, కానీ కట్నం కూడా తాను ఆశించనని, తల్లిదండ్రులు లేని తనకు కాబోయే అత్తామామలే తల్లిదండ్రులని, పశుపతి గారితో ఎంతో వినయంగా చెప్పాడు. పెద్దల పట్ల అతనికి గల వినయానికి, గౌరవానికి మంత్రముగ్ధులైపోయారు, పశుపతి దంపతులు.

చంద్రమతిని తీసుకు వచ్చి అతని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టింది, రాజేశ్వరమ్మ. అతని ముఖంలోని సౌమ్యత, కళ్ళల్లోని స్వచ్ఛత ఆమెను ఆకట్టుకున్నాయి... తనకి తెలియకుండానే అతని ఆకర్షణలో పడిపోయింది ఆమె మనసు. ఇద్దరినీ ఏకాంతంగా వదిలేసారు.

కాసేపు మామూలు ప్రశ్నలు అయ్యాక, “మీరు నాకు చాలా నచ్చారు చంద్రా...” అని చెప్పేసాడు, చలపతి... చంద్రమతిని అకస్మాత్తుగా సిగ్గు కమ్మేసింది... “థాంక్ గాడ్!” అనేసింది అప్రయత్నంగా...

విస్మయంగా ఆమె వైపు చూసిన చలపతికి విషయం అర్థమై గలగలా నవ్వేసాడు... “హమ్మయ్య... ఇందాకటి నుంచీ మథన పడుతున్నాను... నేను మీకు నచ్చానో లేదో అని...” సిన్సియర్ గా చెప్పాడు...

“సరే, మరి టిఫిన్ తినండిక... కతికితే అతకదు అన్న సామెత మనకి వర్తించదుగా.. అతికేసాక కతకవచ్చు...” నవ్వింది, చంద్రమతి. ప్లేటులో గారెలు చూడగానే, “ప్లీజ్ చంద్రా... నాకు గారెలు సయించవు...వద్దు...” అన్నాడు ముఖం ఇబ్బందిగా పెట్టి.

“ఓ, ఓకే... మరి చపాతీ?”

తలపంకించి, ఆమె ప్లేటులో పెట్టిన రెండు చపాతీలు తినేసరికి అతని కడుపు నిండిపోయింది...

“ఇంకోటి...” మూడో చపాతీ వేయబోయింది అతని ప్లేటులో... చక్కగా నూనెలో వేగిన అంచులు మెరుస్తూ, మధ్య భాగమంతా లేత ఎరుపురంగులో దోరగా కాలిన ఆ చపాతీ ఎంతో టెంప్ట్ చేసింది అతన్ని... కాని, పొట్టలో ఖాళీ లేదు...

“సారీ చంద్రా... నేను ఇంక తినలేను...” అన్నాడు ఎలాగో...

“ఫర్వాలేదు... ఒక్కటే కదా...”

“అమ్మో, వద్దు వద్దు...” అతను గట్టిగా చెప్పటంతో దాన్ని తిరిగి హాట్ పాక్ లోకి వేసేసి, కాఫీ ఇచ్చింది. కాఫీని సిప్ చేస్తున్నా అతని దృష్టి అంతా హాట్ పాక్ లోని చపాతీ మీదనే ఉంది... ఎంత అందంగా ఉంది... టేస్ట్ కూడా భలేగా ఉండి ఉంటుంది... చక్కగా కరకరలాడుతూ... అయ్యో... అనవసరంగా వద్దన్నానా? మనసులోనే తన మొహమాటానికి తనను తాను తిట్టుకున్నాడు, చలపతి.

కాఫీ తాగేసి, లేచాడు చలపతి, ‘బామ్మతో ఫోన్ చేయిస్తానంటూ...’ అప్పటివరకూ ఎంతో సరదాగా మాట్లాడిన చలపతి కొద్దిగా అన్యమనస్కంగా తయారైనట్టు అనిపించటంతో... “ఎనీ థింగ్ రాంగ్?” అని అడిగింది చంద్రమతి.

“నో... నాటెటాల్. టిఫిన్ బాగుంది... ఆ మూడో చపాతీ ఉందే, అది మరీను... నీలాగే ఎర్రగా, నోరూరించేలా...” చిలిపిగా అన్నాడు... చంద్రమతి బుగ్గలు ఎర్రబడిపోయాయి.

***

“చపాతీ చేసావా, ఆ మూడో చపాతీలాగానేనా?” ఆశగా అడిగాడు, చలపతి పెళ్ళయిన ఐదో ఏట ఓ ఆదివారం ఉదయం.

“అబ్బా, అన్ని చపాతీలు అలాగే చేసానండి... మీరేమో రెండు కన్నా ఎక్కువ తినరు...”

“ఉహు, ఏమైనా ఆరోజు ఉదయం నాటి ఆ మూడో చపాతీయే వేరబ్బా... ఇంతకీ ఎవరు తిన్నారు దాన్ని?”

“మూడు వందల ముప్పై మూడో సారి... తమరు అడగటం, నేను చెప్పటం... ఎవరు తిన్నారో గుర్తు లేదండి... ఇదిగో ఈ చపాతీలు చూడండి, అన్నీ ఒకేలా, ఎర్రగా వేగలేదూ?”

“ఉహు... మామూలుగానే ఉన్నాయి... ఆ మూడో చపాతీ వేరు... సరే, రెండు పెట్టివ్వు...”

“ఊ...” నిట్టూర్చింది, చంద్రమతి.

***

‘అందమైన బావా... ఆవు పాల కోవా...’ సెల్ ఫోన్ పాడటంతో టక్కున ఈలోకంలోకి వచ్చి, ఫోన్ మాట్లాడి చెప్పాడు, చలపతి - “చంద్రా... కాంప్ కి వెళ్ళాలి, బాగ్ సర్దు...”

***

కరెంట్ ఫెయిల్ అయి, చిమ్మచీకటి. రాత్రి పదకొండు దాటిపోయింది. బయట హోరున గాలివాన... గాఢ నిద్రలో ఉన్న చంద్రమతి ఉలిక్కిపడి లేచింది. లీలగా బయట తలుపు కొడుతున్న శబ్దం. సెల్ ఫోన్ లో టార్చ్ వెలిగించి, హాల్లోకి వచ్చి, “ఎవరూ?” అని అడిగింది. “చంద్రా... తలుపు తియ్యి...” భర్త గొంతును గుర్తు పట్టి తలుపు తెరిచింది. వానజల్లుతో పాటే లోపలి వచ్చాడు, చలపతి. మనిషి ముద్దగా తడిసిపోయి ఉన్నాడు. ఎంతో నీరసంగా కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని వచ్చిన భర్తను చూడగానే ప్రాణం నీరైపోయింది చంద్రమతికి.

“అయ్యయ్యో...” అంటూ గబగబా లోపలినుంచి పొడి బట్టలూ, టవలూ తెచ్చిచ్చింది. అతను తడిసిన బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకుని నిస్త్రాణగా సోఫాలో కూలబడ్డాడు. “మీరు రేపు కదా బయలుదేరతానని అన్నారు...” అతని తల తుడుస్తూ అంది చంద్రమతి.

“అలాగే అనుకున్నాను. కానీ రేపు నీ పుట్టినరోజు కదా... సర్ ప్రైజ్ గా ఉంటుందని, పని అయిపోయిందని రేపటికి రిజర్వేషన్ ఉన్నా సరే, బస్ లో బయలుదేరాను. బస్ దారిలో పాడై పోయింది. మరో బస్ వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని సగం దూరం వచ్చేసరికి ఈ తుఫాను. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి... ఊరవతలే ఆపేసాడు. అక్కడినుంచి ఆటో పట్టుకుని వచ్చేసరికి... ఇంత టైం అయింది. సరే కానీ చంద్రా, నేను లంచ్ కూడా చేయలేదు... అన్నం ఉందా?”

“అయ్యో, లేదండి... అసలు ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయి... సరే, ఒక్క అయిదు నిమిషాలు ఆగండి...” ఎమెర్జెన్సీ లాంప్ వెలిగించి, వంటింట్లోకి తీసుకు వెళ్ళింది చంద్రమతి. ‘ఇంటికి వచ్చేసాను’ అన్న నిశ్చింతతో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు, చలపతి.

“అయ్యో, ‘ఆకలి ఆకలి’ అని అలా పడుకున్నారేమిటి? లేవండి లేవండి...” టీ పాయ్ ని దగ్గరగా లాగి పళ్ళెం పెట్టి, మంచి నీళ్ళ గ్లాసు పెట్టింది చంద్రమతి. పళ్ళెంలో రెండు వేడి వేడి చపాతీలు. పక్కనే ఆవకాయ పచ్చడి...

“సారీ అండీ... తడిపిన పిండి కొద్దిగానే ఉంది ఫ్రిజ్ లో... గబగబా రొట్టెలు చేసి తెచ్చాను... తినండి...”

ఆ చపాతీల పళ్ళెం వళ్ళో పెట్టుకుని గబ గబా తినసాగాడు, చలపతి, “కొత్తావకాయా? అదిరిపోయింది... చపాతీలు భలేగా ఉన్నాయోయ్...” అంటూ...

పళ్ళెంలో చపాతీలు అయిపోయాయి... కాని చలపతి కడుపులో ఆకలి ఇంకా అలాగే ఉంది. సాధారణంగా రెండు చపాతీల కన్నా ఎక్కువ తినడు... కాని ఈ రోజు పరిస్థితి వేరేగా ఉంది... చంద్ర ముఖంలోకి చూసాడు... ఆ చూపులను తప్పించుకుంటూ, “కొద్దిగా పాలున్నాయి, వేడి చేసి తెస్తాను...” అని వంటింట్లోకి వెళ్ళింది. ముఖం ముడుచుకుని కూర్చున్నాడు, చలపతి...

“అరె, కోపమా, ఇటు చూడండి... మీ పళ్ళెంలో...” అటువైపు చూసిన చలపతి ముఖంలో సంభ్రమాశ్చర్యాలు... ఎర్రగా నోరూరించేలా కాలిన, అంచులు వేగిన చపాతీ... ఘుమ్మని నేతి వాసనతో నోరూరిస్తూ... “మీ మూడో చపాతీ...మీ కోసం ప్రత్యేకంగా నెయ్యి వేసి ఎర్రగా కాల్చాను...” ముక్క తుంచి అతని నోటికి అందించింది... ఆమె తినిపిస్తుంటే స్వప్నావశిష్టుడిలా తినేసాడు చలపతి...

“థాంక్ యు చంద్రా... అదే మూడో చపాతీ... మళ్ళీ ఇన్నేళ్ళకు నా పళ్ళెంలోకి వచ్చింది... అదే రంగు... బహుశా అదే రుచి... ఎంత బావుందో నీ ప్రేమలాగానే... నా ఆకలి కూడా తీరిపోయింది... థాంక్ యు చంద్రా...” ప్రేమగా ఆమె నుదుట చుంబించాడు చలపతి...

“రేపటినుండీ మూడు చపాతీలు తినండి... ‘మిస్సయిన మూడో చపాతీ’ అంటూ ఇకపై నన్ను సాధించకండి మరి!” హెచ్చరిస్తూ అతని జుట్టు చెరిపేసింది చంద్రమతి అల్లరిగా...

గడియారం పన్నెండు కొడుతూ ఉంటే ఆమె చేతులు పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ, ‘హాపీ బర్త్ డే చంద్రా...’ అని పాడసాగాడు చలపతి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు