అర్ధరాత్రి కావస్తుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీనియర్ కానిస్టేబుల్ వీర భద్రయ్య మరో ఇద్దరు జూనియర్ కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో వున్నారు. నిద్ర రాకుండా వుండేందుకుముగ్గురూ పిచ్చా పాటీ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నంతలో బల్ల మీది ఫోన్ గణగణ మంది.
మంచి జోకుల మూడ్ లోవున్న వీర భద్రయ్య .. యిబ్బందిగా ముఖం పెట్టి, " హలో ... ! " అన్నాడు అసహనంగా. అవతల నుండి . ." హలో .. టూ టౌన్ పోలీస్ స్టేషనేనా ... ? " ఆతృతగా వినిపించింది.
" కాదు..నాంపల్లి రైల్వే స్టేషను ..” ఓ వెకిలి నవ్వు నవ్వి … “ అవును .. టూ టౌన్ పోలీస్ స్టేషనే … ! యేంటి సంగతి .. ? " జవాబులో కాసింత వ్యంగ్యం.
" సార్ .. ! యిక్కడ మర్రిమాను సెంటర్లో యాక్సిడెంట్ జరిగింది. వేగంగా పోతున్న ఓ వ్యాన్ ఒక స్కూటర్ ని గుద్దింది. స్కూటర్ మీది వ్యక్తికి బాగా గాయాలయినట్లున్నాయి. బ్లడ్ బాగా పోతూ వుంది. నేను ఆ ఎదురింటి నుండి మాట్లాడుతున్నాను. యేదైనా వాహనం వస్తే హాస్పిటల్ కి తీసు కెళదామని చూస్తే యేవీ దొరకలేదు .”
“ వూపిరి వుంటే .. 108 కి ఫోన్ చెయ్ .. ! ఆ మాత్రం తెలీదా ..? "
“ ఫోన్ చేస్తే వారు సమ్మెలో వున్నామన్నారు. యేమి చేయాలో తోచక మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు త్వరగా రండి. పాపం అతను చావు బ్రతుకుల్లొ గిలగిలలాడుతున్నాడు ... "
కుండ భళ్ళుమన్న శబ్దం చేస్తూ నవ్వి .. “ పోలీసులు వచ్చేది కేసు పెట్టడానికే గాని ప్రాణాలు పోయడానికి కాదు. జాలి కలిగితే .. యేదైనా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ కిపంపు. లేదా అతని జేబులో యింటి ఫోన్ నెంబర్ వుంటే వారికి చెప్పు! " అంటూ …ఫోన్ కట్ చేసి ... కానిస్టేబుల్స్ వంక చూసి .. " అక్కడేదో యాక్సిడెంటట .. !
వెంటనే మనం పరుగెత్తకెళ్ళాలట .. ! పనీపాటా లేని వాళ్ళంతా అర్ధరాత్రి దాకా తిరిగి, తాగి ఒళ్ళుతెలియక దేనిక ఓ దానికి గుద్దేసుకోవటమ్ ..! యిక్కడ మనకేదో పని లేనట్లు ఫోన్ లు .. " అన్నాడు.
" ఏవడో పాపం వెళదాం పదండి .. ! " ఓ కానిస్టేబుల్ అన్నాడు.
" యాడికోయ్ వెళ్ళేది నోరుమూసుకు పడుకో .. ! " అంటూ … ఫోన్ రిసీవర్ తీసి పక్కన పెట్టి … వారి చూసి ఓ వెకిలి నవ్వు నవ్వి .. పక్కనున్న బల్ల మీద కాళ్ళు బారజాపుకొని పడుకొని, ఓ పది నిముషాల్లో గురకలోకి జారుకొన్నాడు. అర్ద గంట తర్వాత మళ్ళీ ఫోన్ మ్రోగింది.
మంచి నిద్రలో వున్న వీర భద్రయ్య కి నిద్రాభంగమైంది. విసుగ్గా కానిస్టేబుల్స్ వైపు చూస్తూ .. " యెవర్రా రిసీవర్ పైన పెట్టింది.. ? " అన్నాడు.
" లేదు సార్ .. ! మోగేది లాండ్ లైన్ కాదు సార్ .. మీ సెల్ ఫోన్ సార్ .. ! " చెప్పాడు
కానిస్టేబుల్. " నా సెల్ ఫోన్ నెంబర్ యెలా దొరికిందిరా వాళ్ళకి .. ! కట్ చేసి పారెయ్ .. ! " అని, అటు తిరిగి పడుకొన్నాడు. కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని ఎర్ర బటన్ నొక్కి పక్కన పెట్టాడు. అయినా అవతల వూరుకుంటేనా .. పది నిముషాల తర్వాత మళ్ళీ సెల్ రింగయింది.
వీర భద్రయ్య కోపం నసాళానికి అంటింది. లేచి కూర్చుని, " సెల్ యిటివ్వరా .. అర్ధరాత్రి పూట అంకమ్మ సివాలన్నట్లు వాళ్ళకి మరేమీ పని లేనట్లు మన మీద పడ్డారు. మళ్ళెప్పుడూ పోలీసోళ్ళ జోలికి రాకుండా నాలుగు దులిపి పారేస్తా " అన్నాడు.
కానిస్టేబుల్ చేతిలోని సెల్ ను విసురుగా అందుకొని, ఆన్ చేసి .. " హలో .. !
ఒకసారి చెపితే అర్ధం కాలేదా .. ! " అన్నాడు. ఆ వెంటనే .. అవతలి కంఠస్వరం గుర్తు పట్టి " హలో . మాధవీ . నువ్వా ఈ టైములో ఫోనేంటి ... ? " అన్నాడు.
" ఏవండీ .. ! అబ్బాయికి మర్రిమాను సెంటర్లో యాక్సిడెంటయిందట. యిప్పుడే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఆలస్యమైందట. . ! జరగాల్సింది జరిగిపోయిందన్నార్ట డాక్టర్లు. వాడి జేబులోని నెంబర్ ద్వారా ముందే మీకు చేశారట. మీరు ఫోన్ కట్ చేసారట. తర్వాత వాడి సెల్ లోని యింటి నెంబర్ వెతికి నాకు చేశారు.యాక్సిడెంట్ జరిగినప్పుడు… అబ్బాయిని హాస్పిటల్ కి తీసుక వచ్చినతను పోలీసు లకు ఫోన్ కూడా చేశాడట.. అక్కడెవరూ పట్టించుకోలేదట ! " అవతల మాధవి గోల గోలగా యేడుస్తూ చెపుతూంది. వింటున్న వీర భద్రయ్య కి కళ్ళు బైర్లు కమ్మి .. మైండ్ బ్లాకయి పోయి ...
నిలువునా కుప్ప కూలి పోయాడు. *