మిడ్ నైట్ రేస్ - పి.వి.డిఎస్ ప్రకాష్

mid night race

"చచ్చాన్రో" ..నిశ్శబ్ధ నిశీధిని చీలిస్తూ దిక్కులు పిక్కటెల్లేలా గట్టిగా కేక.

జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మెరుపు వేగంగా ముందుకురికి వస్తున్న ఓ బైక్ బలంగా డీకొనడం తో అంతెత్తున ఎగిరి పక్కనే వున్న రోడ్ డివైడర్ పై పడ్డాడో వ్యక్తి. అతడి తల చిట్టినట్లు పెద్ద శబ్ధం. ఆ వెంటనే ధారాపాతంగా స్రవిస్తూ ఎర్రెర్రని రక్తం. హైటెక్ సిటీలో షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని క్యాబ్ లో అదే దారిన వస్తున్న చారుమతి ఆ యాక్సిడెంట్ ని చూసి ఒక్కసారి ఖంగు తింది.

"డ్రైవర్ .. కారాపు" రిక్వెస్ట్ చేసింది.

"ఎందుకు మేడం"

"కళ్ళెదురుగా యాక్సిడెంట్ జరిగింది. కనిపించలేదూ" అడిగింది చారుమతి కోపం గా.

"ఈ ఏరియాలో ఇలాంటి యాక్సిడెంట్స్ కామన్ మేడం. నైట్ టైం కదా.. బైక్ రేసింగ్ యమ జోరుగా సాగుతుంటుంది. క్యాబ్ కి ఏ యాక్సిడెంట్ జరక్కుండా మనం ఇంటికెళ్తే అంతే చాలు " అన్నాడు డ్రైవర్ క్యాబ్ స్పీడ్ మరింత పెంచుతూ తాపీగా.

"ప్లీజ్..స్టాప్. క్యాబ్ ఆపలేదనుకో.. ఇంకో యాక్సిడెంట్ అవుతుంది"

"ఎలా"

"డోర్ తెరిచి క్యాబ్ లోంచి నే దూకేస్తాను" గట్టిగా అరిచింది చారుమతి.

"అంత పనిచేయొద్దు మేడం. కారాపుతాను! అంటూనే క్యాబ్ ని రోడ్డు పక్కకు తీసి ఆపాడు డ్రైవర్.

"మీ మంచి కోసమే క్యాబ్ ఆపనన్నాను. అసలే అది యాక్సిడెంట్ ఆపై బైక్ రైడర్స్ అంతా పెద్ద పెద్దోళ్ళ పిల్లలు, పోలీసులే పట్టించుకోని ఈ విషయాలు మనకెందుకని.." డ్రైవర్ ఇంకా ఏదో చెప్తుంటే.. అవేవీ వినకుండా డోర్ తెరిచి క్యాబ్ లోంచి ఒక్క ఊదుటున కిందకు దూకేసింది చారుమతి. యాక్సిడెంట్ కారణం గా అదుపు తప్పి కిందపడ్డ బైక్ ని పైకి లేపి దుస్తులకంటుకున్న దుమ్ముని దులుపుకుంటున్నాడతడు. ఆ తర్వాత బైక్ పై దర్జాగా ఎక్కి కూర్చున్నాడు. క్షణం క్రితం ఆ పరిసరాల్లో అసలేం జరగనట్లుగా వన్ థౌజండ్ సీసీ స్పోర్ట్స్ బైక్ ఫ్రంట్ వీల్ ని అతి లాఘవం గా గాల్లో పైకి లేపి ముందుకురించాడు.

వరెస్ట్ ఫెలో! అరక్షణం లో ఆ బైక్ నంబర్ ను కళ్ళ కెమెరాతో క్లిక్ మనిపించింది. ఆ వెంటనే డివైడర్ దగ్గరికి చేరుకుంది చారుమతి. అరవై ఏళ్ళ వయసున్న ఆ బాధితుడు అప్పటికే స్పృహ తప్పిపోయాడు. డ్రైవర్ ని పిలిచి క్యాబ్ లో ఎక్కించింది. చారుమతి సూచనల మేరకు క్యాబ్ ఆస్పత్రి వైపు వేగంగా దూసుకుపోతుంది.

"ఇప్పుడీ ముసలాడిని ఆస్పత్రికి తీసుకెళ్ళడం అంత అవసరమా మేడం" అడిగాడు డ్రైవర్.

"ఒక్క క్వశ్చ్చన్ కి ఆన్సర్ ఇవ్వు"

"అడగండి"..

ఈ ఆక్సిడెంట్ నీకే జరిగిందనుకో . రక్తం కక్కుంటున్న నిన్ను నాలా ఎవ్వరూ ఆదుకోకుండా ఆ డివైడర్ మీదనే వుంచేస్తే ఏమవుతుంది? అమ్మో .. భయపెట్టకండి మేడం"

"ఎంతసేపూ మనం బతకడమే కాదు.. మరొకరి బతుకుని కూడా మనం పట్టించుకోవాలి. ఇలాంటి ఆపద సమయాల్లో మరీనూ" అంది చారుమతి.

"నిజమే మేడం.. కానీ, యాక్సిడెంట్ అంటే ఎవరికైనా భయమే కదా! పోలీసులు, కేసులు. ఇబ్బందులే"

"ఆ ఇబ్బందులన్నింటికన్నా మనిషి ప్రాణం మరీ విలువైంది. ఆ సంగతి ముందు గ్రహించాలి" అంటుండగానే సెల్ రింగైంది. స్క్రీన్ పై మమ్మీ.. అనే రెందక్షరాలు కనిపిస్తున్నాయి. టైం చూసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట దాటింది. అంటే దార్లో ఈ ఇన్సిడెంట్ జరక్కపోతే అయిదు నిముషాల క్రితమే తను ఇంటికి చేరాల్సింది. అయితే , ఇంకా ఇంటికి రాలేదేమని గాభరాపడుతూ తల్లి కాల్ చేసింది. ఫోన్ ఎత్తి విషయాన్ని క్లుప్తంగా, స్పష్టం గా విశదీకరించి ..మరేం భయపడాల్సిన పని లేదనే భరోసా ఇచ్చి మరో హాఫెనవర్ లో ఇంట్లో వుంటానంటూ కాల్ కట్ చేసింది చారుమతి. అంతలోనే క్యాబ్ ఆస్పత్రికి చేరుకుంది. ముసలోడిని ముందు ఆస్పత్రిలో చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించారు. యాక్సిడెంట్ కేసంటూ నానా యాగీ చేసారు. "ఇంతకీ ఈ పేషంట్ కి మీరేమవుతారు?" అడిగాడో సీనియర్ డాక్టర్.

హ్యూమన్ రిలేషన్ ఓ మనిషికి వున్న బంధుత్వం చెప్తూ చారుమతి తన ఐడీ కార్డ్ చూపించింది.

"పోలీసులు, కేసులంటూ చికిత్స చేయకుండా తాత్సారం చేస్తే ఇతడి ప్రాణాలు దక్కవు. ప్లీజ్!" రిక్వెస్ట్ చేసింది.

ఇది కార్పోరేట్ ఆస్పత్రి. చికిత్స ఖర్చులు ఎవరిస్తారు?" క్లారిఫై చేసుకోవడానికి అడిగాడో డాక్టర్."చూసారా, మేడం! వద్దని ఎంత మొరపెట్టుకున్నా దారినపోయిన శనిని నెత్తికెక్కించుకున్నారు. ఈ అనుభవాలే ఎదురవుతాయని ఆ దారినపోయిన ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఒక్క మీరే మనిషి ప్రాణాలంటూ ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు"

క్యాబ్ డ్రైవర్ చూపుల్లో వ్యక్తమయ్యే భావం అది. బాధనిపించింది చారుమతికి.

"మనిషి ప్రాణాలకు విలువలేని సమాజం లో వుంటున్నామా?" సిగ్గనిపించిందామెకు.

"వెంటనే పేషంట్ ని ఏ గాంధీ ఆస్పత్రిలోనో జాయిన్ చేయండి. ప్రాణం పోయేదాకా కనీసం ప్రాధమిక చికిత్సయినా అందుతుంది." ఇంకో డాక్టర్ అనాడామాటల్ని.

ప్లీజ్! అలా మాట్లాడకండి. ఈ పేషంట్ కి అయ్యే వైద్య ఖర్చులకి నేను భరోసా. అడ్వాన్స్ గా ఎంత పే చేయాలో చెప్పండి" అంటూ హ్యాండ్ బ్యాగ్ లోంచి ఏటీఎం కార్డు బయటికి తీసింది చారుమతి.

"ఇంకా ఎందుకు డౌట్ పడుతున్నారు. యాక్సిడెంట్ కేస్ అనేనా మీ భయం. ముందు పేషంట్ ని బతికించండి. ఆ తర్వాత మీకెలాంటి భయాలు లేకుండా నేను చూసుకుంటాను. పోలీస్ కమిషనరేట్ లో మా పెద్దనాన్న డీ ఎస్ పీ గా పనిచేస్తున్నాడు" చెప్పింది.

ఆ తర్వాత సెల్ తీసి రింగ్ చేసి.. ఎవరికో యాక్సిడెంట్ వివరాలందించింది. చారుమతి చేసిన హంగామాకి డాక్టర్లు దార్లోకొచ్చారు. ముసలోడిని ఐసీయూ లోకి తరలించారు. హాఫెనవర్ తర్వాత బయటకొచ్చిన ఓ డాక్టర్ ప్రాణాపాయం లేదని నిర్ధారించిన తర్వాత ఊపిరి పీల్చుకుంది చారుమతి. చికిత్స నిమిత్తం అడ్వాన్స్ గా కొంత సొమ్ము చెల్లిస్తుండగా సెల్ రింగైంది. ఇంటి నుంచే మళ్ళీ కాల్.

"ఏమైందే.. ఎందుకింత ఆలస్యం?" అడుగుతోంది మమ్మీ.

"వచ్చేస్తున్నా... హాఫెనవర్లో" చెప్పి క్యాబ్ లో కూచుంది చారుమతి.

"మీరు డీ ఎస్పీ గారి చుట్టమాండి" అడిగాడు క్యాబ్ ను స్టార్ట్ చేస్తూ డ్రైవర్.

అదెవరు చెప్పారు?

"ఇందాక మీరే .. డాక్టర్లతో చెప్తుంటే విన్నాను"

"ప్రాణవిత్త మానభంగమందు బొంక వచ్చన్న శుక్రనీతి ఆ క్షణం లో గుర్తొచ్చింది" అనుకుంది చారుమతి.

ఆ మర్నాడు..

మళ్ళీ ఆస్పత్రికి చేరుకున్న చారుమతి స్పృహ లోకి వచ్చిన ముసలోడిని పలకరించింది.

"నా ప్రాణం నిలబెట్టిన దేవతవు నువ్వేనా?" కళ్ళలో కృతజ్ఞత ప్రతిఫలిస్తుండగా రెండు చేతుల్తో నమస్కరిస్తూ అడిగాడతడు.

"ఔనూ! అంత రాత్రి వేళ .. ఆ రోడ్డెందుకు దాటావు?" అడిగింది చారుమతి.

"అంతా నా ఖర్మ. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క మా పేదోళ్ళ గుడిసెలున్న సంగతి మీకు తెలుసుగా, రోడ్డుకు ఆ పక్క గుడిసెలో కాపురముంటున్న అల్లుడు తాగొచ్చి నా కూతుర్ని తెగ కొడుతుంటే సముదాయించడానికి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది" చెప్పాడతడు.

"ఔనా! అంది

ఆ తర్వాత .. ఈ ఆక్సిడెంట్ కి సంబంధించి పోలీస్ కేస్ పెడదాం. ఖాకీ దెబ్బకు దార్లోకొస్తారు. జనాలు తిరిగే రోడ్లపై రేస్ లా? ఆ యాక్సిడెంట్ లో నీ ప్రాణాలే పోతే ఎవరు భాధ్యులు ?" ఆవేశం గా అడిగింది చారుమతి.

"వద్దమ్మా..వద్దు! వాళ్ళంతా బాగా బలిసినోళ్ళు. ఓసారి ఇలాగే యాక్సిడెంట్ జరిగితే... మావోళ్ళంతా తిరగబడ్డారని డబ్బున్నోళ్ళంతా కూడబలుక్కుని మా గుడిసెలు కాల్చేయబోయారు. అదృష్టవశాత్తూ ఆ రాత్రి భారీ వర్షం పడ్డడం తో ఒక్క గుడిసెకి అగ్గంటుకోలేదు. విషపురుగులకే కాదు.. డబ్బుతో బలిసి కొట్టుకుంటున్న ఈ పెద్దోళ్ళకూ పేదోళ్ళు దూరం గా వుండాల్సిందే" చెప్తున్నాడు ముసలోడు. వాడి కళ్ళల్లో భయం తాండవిస్తోంది."ఇలా క్షణం క్షణం బతికే కన్నా యాక్సిడెంట్ లో చావడమే మేలు" ముందు కోపం గా అనుకున్నా తర్వాత నాలిక్కరుచుకుంది చారుమతి. "కాటేసే పాముల్ని వదిలేసి.. చీమల్ని నిందించడం దారుణం" భాధపడిందామె.

ఫాస్ట్ రేసింగ్ !

బైక్ ని వేగంగా ముందుకురికిస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బైక్ ని పైకి పరిగెత్తించడం. ఒక్కోసారి ముందు టైర్ ని నేలపై వెళ్ళనిస్తూనే .. వెనుక టైర్ ని గాల్లో లేపడం కూడా ఈ రేసింగ్ లో విన్యాసమే.

జీరోకట్.. వున్న చోటే బైక్ ని వృతాకారం లో తిప్పడం. ఎడంకాలిని భూమిపైనే వుంది యాక్సిలేటర్ ను రైజ్ చేస్తూ బ్రేకులు వేయడం ద్వారా బైక్ ని వృతాకారం లో తిప్పడమే ఈ విన్యాసం ప్రత్యేకత. అంతేనా ! టైంలిమిటెడ్ రేసింగ్ కూడా విశేష ప్రాచుర్యం పొందింది. నిర్ణీత కాలం లో ఎక్కువ దూరం ఎవరు బైక్ పరిగెత్తిస్తారో వారే విజేత.

త్విన్సిటీస్ యూత్ లో ఇటీవల పెరిగిన మోజు బైక్ రేసింగ్ సెలబ్రిటీస్, ఇండస్ట్రీయలిస్ట్ లు, పొలిటికల్ లీడర్ల వారసులు బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేసేందుకు తెగ ఉత్సాహపడుతున్నారు. దందాలు చేసో, దగాలు అమ్మానాన్నలు అలుపెరగకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవన్ సంపాదిస్తుంటే.. వారి వారసులు పందాలు కట్టి మరీ సొమ్ములు ఖర్చు చేస్తున్నారు.

పార్క్ లు, పబ్ లలోనే కాకుండా అర్ధరాత్రి వేళల్లో ప్రాణాలు పణం గా పెట్టి మరీ బైక్, కార్ రేసుల్లో మునిగితేలుతున్నారు.

ఒక్కోసారి జరిగే అనూహ్య ఘటనల్లో ఎన్నటికీ తిరిగిరాలేని దూర తీరాలకు తరలిపోతున్నారు.

ప్రతిరోజూ రాత్రి ఎం ఎన్ సీ కారులో జూబ్లీ చెక్ పోస్ట్ దాటుతుంటే చారుమతికి చటుక్కున గుర్తొచ్చేది బైక్ రేసర్లే.

ఒక్కోసారి తను ప్రయాణిస్తున్న కారును కూడా ఓవర్ టేక్ చేస్తూ బైక్ రేసర్లు ఫ్రంట్ టైర్ గాల్లో లేపి సర్రున దూసుకుపోతుంటే అడ్డం పడి ఆపి మరీ చడామడా తిట్టాలనిపించింది. "ఒరేయ్.. రోడ్డుపై విన్యాసాలు ప్రాణాంతకమంటూ అరిచి చెప్పాలనిపించేసి. అదుపు తప్పిన రేసర్లు కారును డీకొట్టబోతే . ఏ యాక్సిడెంట్ జరక్కుండా డ్రైవర్ తప్పించిన ఘటనలూ అడపాదడపా ఆమెకు ఎదురవుతూనే వున్నాయి.

ఆ రోజు రాత్రి..

జూబ్లీ చెక్ పోస్ట్ దాటి వెళ్తుండగా మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది. ఈ సారి బైక్ కింద పడింది ఎవరో అనామకుడైన ముసలోడు కాడు. బైక్ రేసరే వెనుక టైర్ ని గాల్లో లేపి ఫాస్ట్ రేసింగ్ చేస్తున్న రేసర్ బలం గా డివైడర్ ని డీకొన్నాడు.

పాతిక లక్షలు ఖరీదు చేసే వన్ థౌజండ్ సీసీ స్పోర్ట్స్ బైక్ అల్లంత దూరానికి ఎగిరిపడింది. నీరవ నిశీధిని చీల్చుకుంటూ .. చచ్చాన్రో! అన్న కేక వెనుకనించి ఎం ఎన్ సీ క్యాబ్ లో వస్తున్న చారుమతి ఆ ఇన్సిడెంట్ ని చూసింది. ఇటీవల ముసలోడిని డీకొన్న స్పోర్ట్స్ బైక్ ఇదే. అప్పుడెపుడో కళ్ళ కెమెరాతో క్లిక్ మనిపించిన నంబర్ గుర్తొచ్చింది చారుమతికి. డ్రైవర్ క్యాబ్ ని ఆపగానే హుటాహుటిన డివైడర్ దగ్గరికి చేరుకుందామె.

"ప్లీజ్! సేవ్ మీ!" యువకుడి కళ్ళల్లో వేడికోలు. ఇంతకుముందు ఇదే యువకుడి కళ్ళల్లో నిర్లక్ష్యం. ఓ యాక్సిడెంట్ చేస్తానన్న భయం కాస్త కూడా లేకుండా.. తన బైక్ కింద ఏ కోడిపిల్లో పడిందన్నంత తేలిగ్గా ఆ ముసలోడిని తన దారిన తాను వదిలేసి వెళ్ళిన ఈ యువకుడి కళ్ళల్లో ఇప్పుడు ప్రాణభయం.

"ప్లీజ్.. మీరెవరో నాకు తెలీదు.. మీ క్యాబ్ లో వెంటనే నన్నాస్పత్రికి తరలించండి. మా ఫాదర్ కి చెప్పి మీరు కోరినంత డబ్బు ఇప్పిస్తాను" అంటున్నాడా యువకుడు. డివైడర్ డీకొని అతడి తలకు పెద్ద గాయమే తగిలింది. రక్తం బాగానే పోయింది. అయినా .. తట్టుకోగల వయసతడిది. అందుకే , ఇంకా స్పృహ కోల్పోలేదు.

ప్లీజ్ ! నన్నాదుకోండి. మీకు కావల్సినంత మనీ ఇస్తాను"

ఎంతిస్తావ్ ? చుట్టూ ఎవరూ లేని ఈ అర్ధరాత్రి వేళలో ఎంత సొమ్ముతో నీ ప్రాణాన్ని కొనుక్కుంటావ్?

ఒక లక్ష..

చారుమతి మాట్లాడలేదు. వెన్వంటెనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స చేయించాలని మనసు మారుమూల మూలుగుతున్నా దాని గోడు పట్టించుకోలేదు. ముసలోడి యాక్సిడెంట్ గుర్తొచ్చి అతడికి గట్టిగా బుద్ధి చెపాలనుకుంటోంది. సాధారణ సమయాల్లో ఇలాంటి వాళ్ళకి ప్రాణం విలువ తెలీదు. అందులో పేదోళ్ళ ప్రాణాలు వీళ్ళకళ్ళకి గడ్డిపోచలే. తమదాకా వస్తేనే .. అసలు ప్రాణం విలువ తెలుస్తుంది. అందుకే .. క్యాబ్ డ్రైవర్ ని ఏమాత్రం అప్రమత్తం చేయకుండా కావాలనే ఆలస్యం చేస్తోంది.

"రెండు లక్షలు.. మూడు లక్షలు" క్షణక్షణానికి ఇచ్చే డబ్బు విలువ పెంచేస్తుండా యువకుడు.

"ప్లీజ్... నన్నాదుకోండి. మీకు కావల్సినంత మనీ ఇస్తాను.

ప్లీజ్ ... నన్ను కాపాడండి. ఆస్పత్రిలో నే చేరిన వెంటనే అయిదు లక్షలిప్పిస్తాను" దీనంగా అభ్యర్ధిస్తున్నాడు.

"నీ ప్రాణం విలువ కేవలం అయిదు లక్షలేనా?" చీత్కరించింది చారుమతి.

చూడు ఈ క్షణం లో నా ప్రాణం కాపాడలేదనుకో పొలిటికల్ లీడరైన మా ఫాదర్ తో చెప్పి నీ బతుకు బస్టాండ్ చేస్తా ఉక్రోషం తో ఊగిపోతున్నాడు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న తన ప్రాణం కాపాడెందుకు సామధానభేద దండోపాయాల్ని ఆశ్రయిస్తున్నాడు.

"నీకంత సీన్ లేదు. డబ్బుందనే బలుపుతో విర్రవీగుతున్న నువ్వు బతికితే ఎంత? నీ ప్రాణం పాటి విలువ ఆ ముసలోడి ప్రాణం చేయదా?' ప్లీజ్ .. నాకు బుద్దొచ్చింది. బతికి బట్టకడితే మళ్ళీ బైక్ రేసులంటే రోడ్డుపై విన్యాసాలు చేయను. మనిషి ప్రాణాలు తీయను .. చేతులు జోడించి అర్ధించాడతడు.

ఆ మాట మీదనే నిలబడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తా" అంది చారుమతి. జరుగుతున్న సన్నివేశాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్న క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడికి చేయందించాడు. చారుమతి కూడా తానో చేయివేసి అతడికి అండగా నిలిచింది.

వారం రోజుల తర్వాత..

ఆస్పత్రిలో పరామర్శించడానికి వచ్చిన చారుమతితో ఆ యువకుడన్నాడు. థాంక్స్! ఈ బతుక్కి మీరిచ్చిందే. ఇక ముందు ప్రాణాలతో చెలగాటమాడే విన్యాసాల జోలికి వెళ్ళను.

నువ్వు మారావు. నాకెంతో సంతోషం గా వుంది. అర్ధం చేసుకుంటే నిజానికి జీవితమే సాహస క్రీడ మనల్ని చుట్టుముట్టే వేవేల సమస్యలని చాకచక్యం గా పరిష్కరించుకోవడమంటేనే కత్తులపై నడక, మన ప్రాణానికో , పక్కవాడి ప్రాణానికో ప్రమాదం తెచ్చిపెట్టే సాహసాలు మంచివి కావు. నీలాగే మిగతా రేసర్లూ మారాలి" అంది చారుమతి అతడు వేగంగా కోలుకోవాలని పుష్పగుచ్చం ఇస్తూ...

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ