కరుణాకర్ నైరాశ్యంలో మునిగిపోయాడు.
కారణం..అతనికి పెళ్లై మూడేళ్ళయింది. భార్య గీత చక్కటిచుక్క. ఆమె అందానికి పెళ్లిచూపుల్లో ఫిదా అయిపోయి..వెంటనే నచ్చినట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఆవెంటనే మెడలో మూడుముళ్ళూ వేసి తన సొంతం చేసుకున్నాడు.
ఆమె ఎంత అందమైనదో అంత పెంకిది. ఆ విషయం మూడురాత్రుల్లో బాగా బోధపడింది. తను అనుకున్నది జరగాలనే తీవ్రమైన మొండి స్వభావం ఆమెది. ‘భగవంతుడు అందమైన తన భార్యకి కాస్త మంచి మనసు కూడా ఇచ్చుంటే ఎంతబాగుండేది?’ అని ఎన్నిసార్లు అనుకునేవాడో.రోజూ సరసాలు, సరాగాలకి బదులు చిర్రు బుర్రులు, చిట పటలు మామూలే. కరుణాకర్ దాదాపు సర్దుకుపోతుంటాడు. కానీ
అతనూ మనిషే..అప్పుడప్పుడూ కోపం అవధి దాటి ఓ మాటనేలా చేస్తుంది. అంతే..ఆమె నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలవుతుంది. మంచం మీద సరిహద్దులు చోటుచేసుకుంటాయి. కరుణాకర్ మనసు బాధతో మూలుగుతుంది.
***
ఎప్పట్లానే..ఆరోజు సాయంత్రం ఆఫీసునుంచి ఆరు గంటలకి ఇంటికి వచ్చాడు కరుణాకర్.
అతను రాగానే, అప్పటికే తలంటోసుకుని, చక్కటి లైట్ బ్లూ కలర్ శారీ, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ కట్టుకుని, చెవులకి జూకాలు, మెడలో మంగళసూత్రం, నల్లపూసలతో, తలలో పూలు తురుముకుని భూమ్మీద నడయాడే అప్సరసలా ఉంది గీత. అతను కొద్దిసేపు పరవశుడయ్యాడు. ఆమె అతని దగ్గరగా వచ్చి చూసింది. తనకి కావలసింది అతని దగ్గర లేదని తెలుసుకుంది. పగబట్టిన నాగినిలా విస విసా లోపలికెళ్ళిపోయింది. అప్పుడు గుర్తుకొచ్చింది తనేం తప్పుచేశాడో.
***
ఆరోజు గీత పుట్టిన్రోజు. పోయిన సంవత్సరం ఇదే విషయం మీద ఒక చిన్న యుద్ధం జరిగింది. అప్పుడూ ఇలాగే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. తనకి ఎదురొచ్చిన భార్య "ఏవండీ, నేను మీ జీవితంలో అపురూపమైన వ్యక్తినన్నారు. భగవంతుడు ఇచ్చిన వరం అన్నారు" అంది ఉక్రోశం మాటల్లో కనబరుస్తూ.
"అవును డాళింగ్, కాదని ఎవరన్నారు, నువ్వు నాకెప్పటికీ అంతే?"అన్నాడు తేలిగ్గా.
"మరి అలాంటప్పుడు నాకు సంబంధించినవన్నీ గుర్తుంచుకోవాలి కదా.."
"అవునూ.."
"మరివాళ నా పుట్టిన రోజన్న విషయం మరచిపోయారేంటి? పొద్దున్నైతే హడావుడిగా ఆఫీసుకి వెళ్లిపోయారు..పోనీ సాయంత్రమన్నా స్వీటూ, హాటూ, గిఫ్ట్ తో వచ్చి సర్ప్రైజ్ చేస్తారనుకున్నాను. కానీ ఉత్తగా చేతులూపుకుంటూ వచ్చారు. అంటే మీ అభిమానం మాటలవరకే, మీ పబ్బం గడుపుకునే వరకే అని అర్ధమైంది’ అంది మాటలూ, కన్నీళ్ళు ఏకధాటిన కురిపిస్తూ.
"ఛ..ఛ..అదేంలేదురా.."అనునయంగా ఏదో అనబోయాడు.
"ఇంకేం మాట్లాడ వద్దు..చెప్పి చేయించుకోవడం నాకిష్టం ఉండదు"అని విసురుగా వెళ్ళిపోయింది.
ఆ పరిస్థితి నెమ్మళించడానికి చాలా సమయమే పట్టింది.
***
మళ్ళీ అదే పునరావృతమైంది.
అయిపోయింది. ఆమె, తనపట్ల అతను నిర్లక్ష్యం వహించాడనుకుంది.
గబ గబ బట్టలు సూట్కేస్లో సర్దుకుని బయటకి వెళ్ళిపోబోయింది.
"గీతా..ఎక్కడికి? ఇంత చిన్న విషయానికి నన్ను వదలి వెళ్ళిపోతావా? పద ఇప్పుడే నిన్ను బజారుకి తీసుకెళ్ళి నీకు కావలసినవి నిస్తా"అన్నాడు ఉద్వేగంగా.
"హుః, ఇప్పుడా? అడిగి కొనిపించుకోవడం నాకు అసహ్యం. నాకు విలువనివ్వకుండా, మీదగ్గర కేవలం భార్య అనే కీలుబొమ్మలా పడి ఉండాలంటే నాకు కుదరదు. నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఇండివిడ్యువాలిటీ ముఖ్యం."అని విస విసా బయటకి వెళ్ళిపోయింది.
ఇది జరిగి మూడు నెలలయింది.
గీతా వాళ్ళ అమ్మా నాన్నలతో, అన్నా వదినలతో మాట్లాడాడు. "గీత సంగతి తెలుసుగా, మొండిఘటం. జరిగిన దాంట్లో తనదే తప్పని మాకు తెలుసు. కానీ ఏం చేయలేం. దాని మూర్ఖత్వానికి కాలమే పరిష్కారం చూపాలి."అన్నారు. సామరస్య ప్రయత్నాలు ఎన్నో చేశాడు. కానీ లాభం లేకపోయింది.
వైవాహిక జీవితంలో నైరాశ్యం చోటు చేసుకుంది. అతని జీవితం పౌర్ణమి నోచుకోని అమావాస్య అయింది. చూస్తూ చూస్తుండగా దసరా వెళ్ళిపోయింది.
***
దీపావళి అమావాస్య. ఆఫీసుకి సెలవు.
ఇంట్లో డల్ గా కూర్చున్నాడు కరుణాకర్.
ఇంటి బయట ఆటో ఆగిన చప్పుడయింది.
తనింటికి ఎవరూ వచ్చేవాళ్ళు లేకపోవడంతో..సోఫాలో అలాగే కూర్చుండిపోయాడు.
కొద్దిసేపటికి కర్టెన్ తొలగించుకుని గీత సూట్కేస్ తో లోపలికి అడుగెట్టింది.
కరుణాకర్ కి అది ‘కలా, నిజమా’ అన్న ఆశ్చర్యం..తన భార్య ఇంటికొచ్చిందన్న ఆనందం కలగాపులగంగా మనసులో కలిగి ఉక్కిరిబిక్కిరిచేస్తుంటే.
అమాంతం లేచి గీతని గట్టిగా కౌగలించుకుని"నన్నొదిలి ఎందుకెళ్ళిపోయావు గీతా?..నేనుండగలనా?..అన్నాడు డగ్గుత్తికతో. ఆమె అంతే గట్టిగా అతన్ని అదుముకుని "జీవితం విలువా, వైవాహిక జీవితం విలువా తెలిసొచ్చాయండీ, చిన్న పిల్ల మనస్థత్వంతో ప్రాణాధికంగా ప్రేమించే మీ మనసుని అర్థం చేసుకోలేక. మిమ్మలి బాధపెట్టి, గడపదాటి తప్పుచేశాను. ఇహ ముందెప్పుడూ అలా జరగదు. భగవంతుడు మనిద్దర్నీ కలిపాడు. ఇహ విడిపోవడమన్నది ఊపిరిపోయాకే"అంది ఆమె చెమర్చిన కళ్ళ తడితో అతని భుజాలను వెచ్చ చేస్తూ.
ఆమె మనసు అంతలా మారడానికి కారణమేమిటో తెలియదు. అది తనకి అనవసరం కూడా. తన గీత తన దగ్గరకి వచ్చింది. అది చాలు. "అందరికీ అమావాస్య అశుభం. కానీ ఒక్క దీపావళి అమావాస్య మాత్రం అందరూ ఆనందంగా జరుపుకునే పండగ. ఈ దీపావళి అమావాస్యనాడు దేదిప్యమానంగా మనింట్లోకి అడుగెట్టి ఇంటినీ, నా మనసునీ శోభాయమానం చేశావు. నా జీవితంలో ఇదే మరపురాని గొప్ప పండగ"అన్నాడు భార్యని మరింత దగ్గరగా పొదువుకుంటూ.