దివ్య దీపావళి - నండూరి సుందరీ నాగమణి

“నాన్నా... మనం వెళ్దాం పదా, టపాకాయలు తెచ్చుకోటానికీ...” పండగ నాలుగు రోజుల ముందే పేచీ మొదలుపెట్టాడు బుజ్జిగాడనబడే ప్రణవ్.


“ఉండరా బాబూ... ఇప్పుడేనా ఆఫీసు నుంచి వచ్చానూ...” ముద్దుగా విసుక్కున్నాడు విశ్వనాథం...

“కాదు నాన్నా, టపాకాయలు తెచ్చుకోవాలా? రేపటి నుండీ అందరం ఎండలో పెట్టుకోవాలా?”

“అవును కన్నా... వెళదాంలే... ఇదిగో నీ కోసమని పదివేలు తీసుకొచ్చాను...” జేబులోంచి తీసి సరికొత్త నోట్లు చూపించాడు విశ్వనాథం...

ఆ ముందు రోజే ఏదో పని మీద వీళ్ళ ఇంటికి వచ్చి, ఆ సంభాషణ వింటున్న విశ్వనాథం ఢిల్లీ బావగారు రాజారావుకు ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది.

“ఏమిటి విశూ, పది వేలా టపాకాయలకి? నీకేమైనా పిచ్చెక్కిందా?” కోపంగా అన్నారు.

చిన్నగా నవ్వి అన్నాడు విశ్వనాథం. “మీ మేనల్లుడిని అడగండి బావగారూ! ఆ విషయం గురించి వివరంగా చెబుతాడు...”

“ఊ, ఊ... అడగాల్సిందే... అడుగుదాం... ఒరేయ్ బుజ్జీ... ఇలా రా నాన్నా, మనం మాట్లాడుకుందాం...” ముద్దుగా జేబులోంచి ఫైవ్ స్టార్ తీసిస్తూ పిలిచారు రాజారావు గారు.

మెల్లగా వచ్చాడు ప్రణవ్.

“టపాకాయలు...”

“ఢిల్లీ మావయ్యా... మరేమో క్రిందటేడు పండక్కి ఏమైందంటే... రండి చెప్తా...”

ఆయన చేయి పుచ్చుకుని బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి తానూ పక్కన కూర్చుని ఊగుతూ చెప్పసాగాడు.

***

‘అబ్బా, నాన్న ఎన్ని టపాసులు కొనిచ్చాడో...చూస్తూ ఉంటేనే, ఎంత బాగున్నాయో...ఇక దీపావళి రోజు... ఫ్లాట్స్ లో నాదే రాజ్యమంతా... పిల్లలందరి కన్నా నేనే ఎక్కువసేపు కాలుస్తాను, పేలుస్తాను... ఇదిగో ఇవేమో తాటాకు టపాకాయలు... ఇవేమో మతాబాలు... ఇవి పెన్సిళ్ళు, ఇవి వెన్నముద్దలు, ఇవి చిచ్చు బుడ్లు... ఇవి విష్ణుచక్రాలు, భూచక్రాలు... ఇవి కాకరపువ్వొత్తులు... ఇవేమో పాంబిళ్ళలు... ఇవిగో.. ఇవే... సీమటపాకాయలు...అమ్మో నాకు భయమే కాని, పక్కింటి రవి అన్న కాలిపిస్తానని ప్రామిస్ చేసాడుగా... ఇవిగో, ఇవి రాకెట్లు... వెలిగిస్తే ఆకాశంలోకి దూసుకుపోయి అక్కడ ఎర్రగా, పచ్చగా, పసుపుగా రంగులదీపాల్లా వెలుగుతాయట. కొత్త ఐటెం అని చెప్పాడుగా ఆ షాప్ అంకుల్... ఇవి సిసింద్రీలు...అగరొత్తి ఒకటి వెలిగించి పట్టుకుని, దాంతో ఈ సిసింద్రీ చివర పంటితో కొరికి అంటిస్తే ఉంటుందీ... ఎటు దూసుకుపోయిందో కూడా తెలియదు... వీటిని పగలు కూడా వేయొచ్చు...

అసలు పండగంటేనే దీపావళి పండగ... అమ్మ గేటుకి రెండు పక్కలా గోడ మీద, బోలెడు దీపాలు వెలిగిస్తుంది... గేటు నుంచి ఇంటి వరకూ ఉన్న దారికి రెండు పక్కలా దీపాలు... అరుగు మీద, మెట్ల మీద... ఎన్ని దీపాలో... డాబా గోడల మీద కూడా... ఇవి కాక నాన్న ఇంటికి కరెంటుతో కూడా నక్షత్రాల లైట్లు పెట్టిస్తారు... నాకన్నింటి కన్నా ఈ పండగంటేనే ఇష్టం...నరకాసురుడిని సంహరించినందుకు, ఆ శ్రీకృష్ణుడికి, సత్యభామకి థాంక్స్ చెప్పాలి... మరందుకే కదా పండగ వచ్చింది!’ తనలో తానే, మురిసిపోతూ మూడు చాటల నిండా దీపావళి సామానులు పెట్టుకొని డాబా మీద ఎండలో కూర్చున్న బుజ్జిగాడి దగ్గరికి ఆపసోపాలు పడుతూ వచ్చింది శ్రీలక్ష్మి, వాడి అమ్మ.

“ఏమిటి కన్నా, అన్నం కూడా తినకుండా ఇక్కడ? పద పద... ఎండలో ఇలాగే నిలబడ్డావంటే... నల్లగా అయిపోతావు... మళ్ళీ పండక్కి జ్వరం వస్తుంది...” బుజ్జగిస్తూ కిందికి తీసుకుపోయింది...

“అమ్మా, ఈ సారి నాన్న చాలా కొన్నారు కదే...” మురిసాడు బుజ్జి...

“నీకూ, చెల్లికీ...” సరిచేసింది...

“అది చిన్నది కదే అమ్మా, ఏం కాలుస్తుందీ? అగ్గిపెట్టెలు ఇస్తా దానికి...” తీర్మానించాడు...

“రెండేళ్ళ క్రితం దాని వయసే నీది కూడా... ఎన్ని కాల్చావో గుర్తుందిరా నీకు?” నవ్వేసి, “దగ్గరుండి, చెల్లికి భయం పోయేలా అన్నీ కాలిపించాలి మరి... సరేనా?” తలనిమిరి చెప్పింది.

అయిష్టంగా తలూపాడు బుజ్జి.

ఆ సాయంత్రం చెల్లిని వెంటబెట్టుకొని దీపావళి సామాన్లు తెచ్చుకోవటానికి మళ్ళీ డాబా మీదికి వెళ్ళాడు బుజ్జి. వాళ్ళ వెనకాలే వచ్చాడు పనిమనిషి కొడుకు నారి.

“బుజ్జి బాబూ, ఇయన్నీ దీపాల పండక్కి మీరు కాలుత్తారా?” విప్పారిన కళ్ళతో టపాసులను చూస్తూ అడిగాడు సంభ్రమంగా బుజ్జిని.

“అవును... మా నాన్న మాకిద్దరికీ కొనిచ్చాడు... కద చెల్లాయ్?” గర్వంగా అన్నాడు బుజ్జి.

“బుజ్జి బాబూ, ఇయన్నీ ఏటో, ఆటి పేర్లేటో సెప్పరా?” ఆసక్తిగా అడిగాడు నారి.

అంతే బుజ్జికి వీరావేశం వచ్చేసింది... ఒక్కోదాన్ని చూపిస్తూ అది ఎలా వెలుగుతుందో, ఏయే రంగుల కాంతుల్ని వెదజల్లుతుందో, ఎలా పేలుతుందో... ఎంత దూరం దూసుకు పోతుందో... వివరంగా చెప్పాడు. చెల్లి చేత ఏమేం కాల్పించాలని అనుకున్తున్నాడో, తానేమి కాలుస్తాడో, రవి అన్నతో ఏమేం కాల్పించుకుంటాడో కూడా చెప్పాడు...

అన్నీ చెప్పి, “నారీ, మీ అమ్మా నాన్నా ఇవన్నీ కొంటారా నీక్కూడా?” అని అడిగాడు అమాయకంగా...

“ఉహు...” నారి ముఖంలో నిరాశ...

“దీపాల పండక్కి ఏం కొనమన్నా... డబ్బులే లేవని అంటారు...” దిగులుగా అన్నాడు నారి.

“అవునా?” ఆలోచనలో పడ్డాడు బుజ్జి...

“బుజ్జి బాబూ... నీ టపాసులు చాలా బాగున్నాయ్...” చెప్పాడు నారి వాటి వైపే ఆశగా చూస్తూ...

బుజ్జికి దిగులుగా అనిపించింది.

***

“నాన్నా... మరేం... మన నారికి టపాకాయలు, కొత్తబట్టలు లేవంట... మనం కొనిద్దామా?”

“నారీ ఎవర్రా?”

“అదేనండి... మన పనమ్మాయి పద్దూ కొడుకు... అదీ, దాని మొగుడూ ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులకే సరిపోవు... ఇక పండగలు ఏం చేస్తారు? ముఖ్యంగా ఈ దీపావళి పండక్కి పిల్లలకే కదా సరదా అంతా... నిన్న నారిగాడు వాళ్ళమ్మతో వచ్చి ఈ టపాసులు అన్నీ చూసాడట... వీడు అప్పటినుంచీ వాడికి సగం ఇచ్చేస్తానని అంటున్నాడు... చెల్లితో పంచుకోవటానికే ఇష్టపడడు, అలాంటిది, నారిని చూస్తే వీడికి చాలా బాధ కలిగిందట...” చెప్పింది శ్రీలక్ష్మి.

“అవునా? బుజ్జీ... అయితే సరే... నీకొక మంచి మాట చెబుతాను... వింటావా?”

“చెప్పు నాన్నా...” ఉత్సాహంగా అన్నాడు బుజ్జి.

“మనం నారికి కొత్త బట్టలూ, టపాకాయలు తప్పకుండా కొందాం. అలాగే నీ పుట్టినరోజు మార్చి నెలలో వస్తుంది కదా... అప్పుడు నువ్వేం సెలబ్రేట్ చేసుకోకుండా, పార్టీలు ఇవ్వకుండా ఉంటే, ఆ ఖర్చు మొత్తం పదివేలు పెట్టి టపాకాయలు కొనిస్తాను. అవన్నీ, నారిలాంటి పిల్లలకి, అనాథ శరణాలయాలలో ఉండే పిల్లలకీ ఇద్దాం... బట్టలు కూడా కొనిద్దాం... నీకలా ఇష్టమేనా?”

“ఓ... అవును నాన్నా... పాపం అనాథలకి అమ్మా, నాన్నలు ఉండరు కదూ? మనమే కొనిద్దాం... నేను పుట్టినరోజుకు ఏమీ అడగనుగా!”

“అయితే ఒక కండిషన్... నువ్వు చక్కగా చదువుకోవాలి... టీవీ చూసే టైము తగ్గించేసి, మంచి మార్కులు తెచ్చుకోవాలి...”

“ప్రామిస్ నాన్నా... అలాగే చేస్తాను... మరిప్పుడు నారిగాడికి...”

“అలాగేరా... నేను వాడికి విడిగా కొనిస్తాను... నువ్వు, చెల్లీ ఇవి ఉంచుకోండి... సరేనా?” నవ్వాడు విశ్వనాథం.

***

“అలా మా నాన్నారు చెప్పారు కదా ఢిల్లీ మామయ్యా... అందుకని నేను నా బడ్డే చేసుకోలేదు... కొత్తబట్టలేసుకుని గుడికి వెళ్లి వచ్చా అంతే... ఆ డబ్బులన్నీ కలిపి ఈరోజు మేము టపాకాయలు కొని తెచ్చి, ‘అమ్మ ఒడి’ హోమ్ లో ఇచ్చి వస్తాము రేపు...” మెరిసే కళ్ళతో చెప్పాడు బుజ్జి.

రాజారావుగారి కనుకొలకులలో నీళ్ళు నిలిచాయి...

“విశూ... ఎంత గొప్ప సంస్కారమయ్యా మీది... మంచి మనసుతో ఇంత ప్రేమను పంచుతున్న మీరు నిజంగా ధన్యులు...” లేచి వచ్చి విశ్వనాథం భుజం తట్టి చెప్పారు.

“ఢిల్లీ మామయ్యా...దీపావళి పిల్లల పండగ కదా... మరి అందరు పిల్లలూ టపాకాయలు కాల్చుకోవాలి కదా... అందరికీ డబ్బుంటే అందరం కాల్చుకోవచ్చు... పాపం డబ్బులేని వాళ్లకి మనం కొనిస్తే వాళ్ళూ కాల్చుకుంటారు... మా నాన్న మంచి ఉపాయం చెప్పారు కదూ...” అన్నాడు బుజ్జి.

“అవునురా... అందరం కలిసి అన్నం తిన్నప్పుడు, కలిసి సంతోషాన్ని పంచుకున్నప్పుడే నిజమైన పండుగ... మీ నాన్న ఆ పండుగను కనుల ముందుకు తీసుకువస్తున్నాడు... నిజమైన దీపావళి అంటే ఏమిటో తెలిసిందిరా... ఇదిగో... విశూ... నేనో ఐదువేలు ఇస్తున్నాను... ఆ పండుగలో నాకూ భాగం పంచరా ...” అన్నారు రాజారావుగారు.

“ఢిల్లీ మామయ్యా... మీరు చాలా గ్రేట్... థాంక్ యు థాంక్ యు... అందరి మామయ్యలూ, బాబాయిలూ, పెదనాన్నలూ ఇలాగే డబ్బులివ్వాలి...అప్పుడు మా పిల్లలకందరికీ పెద్ద దీపావళి పండుగ!” అంబరాన్నంటే సంబరంతో చెప్పాడు బుజ్జి.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ