రాము వార పత్రిక చదువుతూ వున్నాడు. ఒక పేజీ దగ్గర తన ఆలోచనలు ఆగిపోయాయి. ఆ పేజీ లో సాహస కథల పోటీ కి ఆహ్వానం అని వుంది. తను వృత్తి రీత్యా కంప్యూటర్ ఇంజినీర్. వారం రోజులు పని ఒత్తిడితో నే గడిచిపోతుంది. వారాంతం కుటుంబం తో సరిపోతుంది. తన కోసం కొద్దిగా సమయం దొరికితే ఎంతో ఇష్టం అయిన పుస్తక పఠనం కి కేటాయిస్తాడు. జీవిత భాగ్య స్వామి సౌమ్య కాఫీ కప్ తో అక్కడకి వచ్చింది. “ఏంటి సారు ధీర్గాలోచన లో వున్నారు?” పక్కన కూర్చుంటూ అంది. తను చదువుతున్న పత్రిక సౌమ్య చేతికలో పెట్టాడు. చాలా రోజుల నుంచి వార పత్రిక కి కథ రాద్దాం అనుకుంటున్నాను. “ఈ పోటీ తో మొదలు పెడితే ఎలా వుంటుంది?” సౌమ్య కళ్లలోకి చూస్తూ అన్నాడు. “ప్రతీ సోమవారం పొద్దున నుంచి శుక్రవారం సాయంత్రం దాకా మీ ప్రాజెక్టు పనుల తో చేస్తున్న సాహసం గురించి రాస్తారా?” నవ్వుతూ సమాధానం చెప్పింది.
మార్నింగ్ వాక్ పూర్తి చేసుకొని అప్పుడే రాము అమ్మ, నాన్న గిరీశం, వసుంధర వచ్చారు. “మీ అబ్బాయి సాహస కథ రాస్తారు ఆట!” నవ్వుతూ వాళ్ళ తో అంది. సౌమ్య చేతిలోంచి వార పత్రిక ని తీసుకొని అక్కడే కూర్చొన్నాడు గిరీశం. కాఫీ తీసుకొస్తాను అని సౌమ్య అక్కడ నుంచి లోపలకి వెళ్లింది. సౌమ్య వెనుకే వసుంధర కూడా కిచెన్ వైపు నడిచింది. మంచి ఆలోచనే! కానీ దీని గురించి నీకు అనుభవం లేదు కదా! ఎవరివైనా సాహస కథలు చదువు. లేదంటే అలాంటి వాళ్ళని ఎవరినైనా పర్సనల్ గా కలిసి వాళ్ళ అనుభవం గురించి తెలుసుకుంటే మరీ మంచిది. గిరీశం తన కొడుక్కి సలహా ఇచ్చాడు. అలాగే ఆలోచిస్తాను అని రాము సమాధానం చెప్పాడు.
మళ్ళీ సోమవారం మొదలు. ప్రాజెక్టు పని లో మునిగిపోయాడు రాము. కథ గురించి ఎంత ఆలోచిస్తున్నా కొత్తగా ఏమి ఆలోచన రావడం లేదు. పని లో పడి అస్సలు ఆలోచించడమే కుదరడం లేదు. ఆఫీసు లో లంచ్ చేస్తూ వున్నాడు. తన వెనుకే కూర్చున్న నలుగురి మాటలు విని వాళ్ళ వైపు చూసాడు. తనకు పరిచయస్తులే, ఈ వీకెండ్ ఏదో ట్రిప్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక కొండ ని ఎక్కడానికి స్కెచ్ వేస్తున్నారు. వాళ్ళ మాటల్ని వింటుంటే ఒకటి అర్ధం అవుతోంది. ఆ కొండ ఎత్తులో చిన్నదే. కానీ ప్రమాదం లో చాలా పెద్దది. వందేళ్లు గా ఎవరూ దాన్ని ఎక్కలేదు. దాని చరిత్ర భయపెడుతుంది. అస్సలు ఆ చరిత్ర నిజమా కాదా అని ఎవ్వరూ ట్రై చేయలేదు అనేది విచిత్రమే. అయిదుగురు వెళ్లడానికి ఒక దళారి కి డబ్బులు కట్టేసారు. వాళ్ళలో ఒకరు ఇప్పుడు డ్రాప్ అంటున్నాడు. కట్టిన డబ్బులు వృధా అని వీళ్ళు బాధ పడుతున్నారు.
రాము వాళ్ళని చూస్తూ అలానే కూర్చున్నాడు. రాము ఇంట్లో వాళ్ళతో తన మనస్సులో మాట చెప్పాడు. అందరూ చుట్టూ నిలుచున్నారు. సౌమ్య కళ్ళు ఏడ్చి ఏడ్చి చాలా ఎర్రగా వున్నాయి. పుస్తకాలు చదవమని చెప్పాను. ఎవరైనా కొండలు ఎక్కిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నాను. నిన్నే ఈ సాహసం చేసి స్వీయ అనుభవం తెచ్చుకొని కథ రాయమని చెప్పలేదు. మా అందరికీ నువ్వే అన్నీ. ఇద్దరు పిల్లల్లో ఒకటి ప్రేమ కోసం గుండెల్లో తన్ని వెళ్లిపోయింది. ఈ వయస్సులో నీ పైనే మా ఆశలన్నీ, నీ ఆశయం కోసం ఏడిపించకు. ఈ పిచ్చి ఆలోచనలు మానుకో అని గట్టిగా చెప్పాడు గిరీశం. నా దృష్టి లో కథ అంటే జీవితం. నా తొలి కథ వేరే వాళ్ళ జీవితం లోంచి కాకుండా నా జీవితం లోంచి పుట్టింది అయితే బాగుంటుంది అనేది నా నమ్మకం అన్నాడు రాము. కథ అంటేనే కల్పన. ఊహించి ఏదైనా రాసుకోండి. మిమ్మల్ని ఆ కొండలెక్కుతాను, సముద్రం ఈదుతాను అంటే ఒప్పుకొనేదే లేదు అని ఏడుస్తూ అంది సౌమ్య.
ఆ కొండకి దెయ్యాల కోన అని పేరు. మా నాన్న నాకు ఆ కొండ మీద జరిగిన విషయాలు నా చిన్నప్పుడు కథలు కథలు గా చెప్పేవాడు. అక్కడకి వెళ్లడానికి వీల్లేదు అంటూ బోరుమంది అమ్మ వసుంధర. ఈ సాహసాలు కథల్లో చదవడానికి, టివి లో చూడ్డానికి బాగుంటాయి. మన ఇంటిలోనే జరగడానికి మేము ఒప్పుకోము అని కుటుంబం మొత్తం వ్యతిరేకించింది.
దెయ్యాల కోన కి పది మైళ్ళ దూరం లో వుంది ఒక కుగ్రామం. ఆ గ్రామం లో కొందరు మాత్రమే కర్ర పుల్లలు ఏరుకోడానికి కొండ మొదలు దాకా వెళ్తుంటారు. కొండ పై నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తుంటాయి. రకరకాల ధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆ గూడెం దొర చెప్తూ వుంటే ఆశక్తి గా వింటున్నాడు రిషి, శ్వేత, జాన్, షీనాలతో కూర్చున్న రాము. ఆశయం కోసం వచ్చేసాను. మొదటి సారి నాన్న మాట కాదని నా మాట కోసం వచ్చేసాను. మొదటి సారి నా వైఫ్ కన్నీళ్లని దాటేసి నా ఆశయం కోసం అడుగేసాను. నేను అడుగేసిన ఈ ప్రయత్నం వీళ్ళ మాటల్లో భూతం లా కనిపిస్తుంది. అయినా భయం కలగడం లేదు. సాహసం చెయ్యాలి అనుకున్న వాడికి వుండకూడని తొలి లక్షణం భయం. వుండవల్సిన లక్షణం గుండె ధైర్యం. ఈ సాహస యాత్ర విజయవంతం గా పూర్తి చేసి. నా తొలి కథ ని నా కుటుంబానికి అంకితం చేసే అవకాశాన్ని కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇలా తనతో తెచ్చుకున్న పుస్తకంలో రాము చేతి నుంచి అక్షరాలు పరిగెడు తున్నాయి. వేకువ జాము తొలి ఘంటకే పయానం. సిద్ధం గా వుండండి. మా మనిషి కొండ మొదలు దాకా తోడొస్తాడు. అక్కడ నుంచి మీ దారి మీదే. మీకు ఇంకా ఆలోచించకోడానికి టైమ్ వుంది. వెనక్కి వెళ్ళి బ్రతికిపోతారో , పైకి ఎక్కడానికి వెళ్ళి పైకే పోతారో ఆలోచించుకోండి. గూడెం పెద్ద మాటలు భయపెట్టాయి. శ్వేత, షీనాలు రిషి, జాన్ ల చేతులు గట్టిగా పట్టుకొని గుండెల్లో ధైర్యం నింపుకున్నారు. పుస్తకం గుండెలకు హత్తుకొని తన ఆశయాన్ని గుండెల్లో నింపుకున్నాడు రాము.
అడుగులు మెల్లగా ముందుకు పడుతున్నాయి. మాటలు తడపడుతున్నాయి. అంత చలి లో కూడా చెమటలు పట్టేస్తున్నాయి. ఒకరి వెనుక ఒకరు. వీళ్ళకి దారి చూపిస్తూ చాలా ముందు గా గూడెం మనిషి లింగన్న. పైన ఏదో నిధి వుంది. వంద సంవత్సరాలు గా ఎవరూ ఎక్కలేదు అనేది అబద్దం. నిధి కోసం చాలా మంది వచ్చారు. పోలీసులకి తెలీకుండా వాళ్ళందరికీ దారి నేనే చూపించాను. కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. చచ్చి దెయ్యాలు అయ్యారు అని ఈ గూడెం జనం అంటున్నారు. రిషి, శ్వేత, జాన్, షీనాల అడుగులు ఆగి పోయాయి. వాళ్ళ కోసం రాము ఆగిపోయాడు. వీళ్ళందరి కోసం లింగన్న. ముఖాల్లో భయం చూసి పంచె లోంచి తాయత్తులు తీసాడు. ఇవి ఈ కొండ పై చావులు ఓ స్వాములోరికి వివరంగా చెప్పి చేయించిన మహిమ గల తాయత్తులు. ఒక్కోటి అయిదు వందలు. భూత ప్రేత పిశాచాలు ఏ ఒక్కటి మీ దగ్గరకి రావు. నమ్మకం వుంటే తీసుకోండి. బలవంతం లేదు. మరు నిమిషం లింగన్న చేతుల్లో డబ్బులు అయిదుగురి చేతులకి తాయత్తులు. భయంతో తాయత్తు కట్టించుకోలేదు. ఆ లింగన్నకి నాలుగు డబ్బులు వస్తాయి అని కట్టించుకున్నాను. రాము తనలో తాను అనుకున్నాడు. కొద్ది దూరం నడిచాక లింగన్న ఆగి పోయాడు. ఇక నేను ఎనక్కి పోతాను. ముందుకు పోవాల్సింది మీరు. ఆ దేవుని దయ వుంటే మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త చెప్పి లింగన్న వెనక్కి పోడానికి సిద్ధం. మీరు కూడా వెళ్లిపోండి.
నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను భయపడుతూ వున్న నలుగురి తో రాము అన్నాడు. మేము ప్రేమించుకున్నాం. మా పెద్దవాళ్ళు బ్రతకలేం అన్నారు. అందుకే ఈ భయంకరమైన కొండ ఎక్కి మా ప్రేమలో ఎంత సాహసం వుందో చూపించి మరీ పెళ్లి చేసుకుంటాం. అస్సలు ఈ కొండ ఎక్కే ప్లాన్ వేసిందే మేము. మమ్మల్ని వెళ్లిపో అంటున్నావు అని రిషి, శ్వేత, జాన్, షీనా జంటలు నవ్వుతున్నారు. ఈ నవ్వులు మీరు తిరిగి వచ్చేదాకా అలానే వుండాలి. లింగన్న కనిపించనంత దూరం వెళ్ళిపోయినా వెళ్తూ వెళ్తూ అన్న ఈ మాట అందరి చెవుల్లో ఇంకా మ్రోగుతూనే వుంది. సూర్యుడు వీళ్ళ సాహసాన్ని చూడాలని తొందర పడుతున్నాడు. మేము కూడా చూడాలి అని మేఘాలు పోటీ పడుతూ అడ్డుగా వస్తున్నాయి. పాటలు పాడుతూ హుషారు గా ముందుకు నడుస్తున్నారు. గంట గడిచింది. ఒక కోన దగ్గర నిలబడి ప్రకృతి ని చూసారు. ఆనందం ఎక్కడ వుంటుంది అనేది చాలా మంది ప్రశ్న. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అభిప్రాయం. కానీ వీళ్ళు నిలబడిన చోటు నుంచి చూసిన దృశ్యం. అందరిదీ ఒకే మాట. ఆనందం అంటే ఇదే. అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు. వీళ్ళ ఆనందం చూసి మేఘాలు కరిగి పోయాయి. కన్నీళ్ళ తో చినుకులు కలిసిపోయాయి. చల్లని పిల్లగాలి మైమరిపిస్తోంది. అప్పటికే ఆనందం అంచుల్లో వున్నారు. ఇక కొండల్ని కలుపుతూ ఆకాశం లో ఏర్పడిన హరివిల్లు. ఆనందం అంచుల నుంచి హుషారు గా కేరింతలు. దూరం నుంచి కోయిల పాట. మరికొంత దూరం లో నెమ్మళ్ళ నాట్యం. జలపాతాల హోరు. వర్షం జోరు. అందరూ పక్కనే వున్న గృహలలో దాక్కున్నారు. వర్షం తగ్గింది. ప్రతాపుడు బయటకి వచ్చి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తన పక్కనే వున్న ఆస్తి పంజరం చూసి షీనా కెవ్వున కేక పెట్టింది. భయటకి పరిగెట్టింది. మిగతా వాళ్ళు భయటకి వచ్చారు. రాము మాత్రం అక్కడ వున్న రాళ్లని ఒక్కొక్కటి పక్కకి తోస్తూ వున్నాడు.
రిషి, జాన్ సాయం చెయ్యడానికి మళ్ళీ వచ్చారు. లోపల ఒక్కటి కాదు వందల కొద్ది పుర్రెలు, ఎముకలు. వాసన భరించలేక భయటకి వచ్చేసారు. ఆనందం అంచులు చూసిన వీళ్ళు మళ్ళీ భయం మొదల్లులో నిలబడ్డారు. భయపడుతూ నిలుచున్నారు. ఇప్పటికైనా వెనక్కి వెళ్లిపోతారా రాము వాళ్ళ భయాన్ని గుర్తుచేస్తూ అన్నాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వారు. ఇక్కడ ఈ చివర నిలబడి చూస్తేనే ప్రకృతి ఇంత అందం గా వుంది. అదిగో ఆ కొండ పైన కూర్చొని చూస్తే వచ్చే ఆ ఆనందం మాకు కావాలి అందరూ కలిసి ఒకే సారి అన్నారు. అలా చాలా సేపు నడుస్తూనే వున్నారు. మధ్య మధ్య లో తమతో తెచ్చుకున్నవి తింటున్నారు, తాగుతున్నారు. నీడ లో కూర్చొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. మేమంటే ప్రేమ కోసం వస్తున్నాం. మీరు కథ కోసం ఈ సాహసం చేస్తున్నారు అంటే నవ్వొస్తోంది అన్నారు. నాకు కథ అంటే ప్రేమ. ఆ ప్రేమ కోసం నేను ఈ సాహసం. సో అందరం ప్రేమ కోసమే చేస్తున్నాం అని రాము చెప్పిన సమాధానం తో తెరిచిన నాలుగు నోళ్ళు ఒకేసారి మూత పడ్డాయి. మళ్ళీ నడవడం మొదలు పెట్టారు. కెమెరాతో ఫోటో లు, సెల్ఫిలు. చీకటి పడుతోంది. అనువైన ఒక ప్రదేశం చూసుకొని టెంట్ లు వేస్తున్నారు. మొత్తం మూడు టెంట్ లే వేసారు. ఒకటి రాము కోసం. మరో రెండు రిషి, శ్వేత మరియు జోహ్, షీనా ల కోసం. పెళ్ళికి కి ముందు ఒకే టెంట్ లో వుండడానికి అమ్మాయిలు నో అన్నారు.
రిషి, జాన్ కలిసి వుండండి. శ్వేత, షీనా కలిసి వుంటాం అన్నారు. అమ్మాయిలు కలిసి వుంటే ఏమనుకోరు, ఇద్దరు అబ్బాయిలు కలిసి వుంటే ఈ సమాజం కోడై కూస్తుందే అన్నాడు రిషి. మనం సమాజం కి దూరం గా అడవి లో వున్నాం. ఎవరూ ఏమి అనుకోరు లే అని అమ్మాయిల తెలివైన సమాధానం. మీ సాహసం ఈ కొండ ఎక్కే దాంట్లో చూపించండి. ఒకే టెంట్ లో మాతో సాహసం చెయ్యడానికి ఇంకా కాస్త వైట్ చెయ్యాలి. ఆ మాట చెప్పి ఇద్దరూ అమ్మాయిలు నవ్వుతున్నారు. వాళ్ళని చూస్తూ రాము కి కూడా నవ్వొచ్చింది. ఆ నవ్వులోంచి సౌమ్య గుర్తొచ్చింది. పెళ్లి తర్వాత తమ మొదటి రాత్రి అయ్యాక తను పక్కన లేకుండా ఒంటరి గా వున్న మొదటి రాత్రి ఇది అనుకున్నాడు. ఎవరో ఒకరు కాపలా వుండాలి. అందరూ పడుకుంటే కష్టం. శ్వేత, షీనా మీరు నా టెంట్ లో పాడుకోండి. రిషి, జాన్ మిగతా రెండు టెంట్ లో విడి విడి గా మీ ఇద్దరూ రాము నవ్వుతూ అన్నాడు. నేను మొదట కావలా కాస్తాను. తర్వాత రిషి, జాన్ కంటిన్యూ చేస్తారు. అందరూ టెంట్ లో దూరారు.
పౌర్ణమి కావడం తో వెలుతురు బాగానే వుంది. తన తో తెచ్చుకున్న రేడియం బుక్ లో తమ అడుగుల్ని మాటల గా మారుస్తున్నాడు. ఏదైనా మరచిపోతే గుర్తుకు వస్తుంది అని కెమెరా తీసుకొని ఫోటో లు చూస్తున్నాడు. ఒక ఫోటో దగ్గర ఆగిపోయాడు. బాగా జూమ్ చేసి చూసాడు. దూరం గా చెట్టు మీద ఏదో ఆకారం. మనిషి లాగే కనిపిస్తోంది. వెనక్కి వెళ్ళి ప్రతీ ఫోటో లో చూసాడు. అదే ఆకారం ప్రతీ ఫోటో లో వుంది. అలారం మ్రోగింది. రిషి లేచి కూర్చున్నాడు. రాము పడుకోడానికి వెళ్ళాడు. రిషి భయపడుతూ కాపలా కాస్తున్నాడు. కొంత సేపటికి జాన్ లేచాడు. జాన్ కూడా భయపడుతూనే కాపలా కాస్తున్నాడు. మరికాసేపటికి సూర్యుడు లేచాడు. దాంతో అందరూ లేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. తమతో తెచ్చుకున్న ఫుడ్ తో పాటు ఈ అడవి లో దొరికిన ఫలాలు తింటున్నారు. మధ్య మధ్య లో మాట్లాడుతూ పోట్లాడుతూ వున్నారు. చాలా సరదాగా వున్నారు. రాము బాగ్ లోంచి కెమెరా తీసి ఒక ఫోటో జూమ్ చేసి చూపించాడు. అందరూ దూరం గా కనిపిస్తున్న ఒక ఆకారాన్ని కళ్ళు దగ్గరకి పెట్టి మరీ చూశారు. లైటింగ్ సరిగా లేక ఏదైనా ప్రాబ్లం వల్ల కెమెరా లో వచ్చిన మార్క్ లా వుంది అన్నారు. వెనక్కి వెళ్ళి అన్నీ ఫోటో లు జూమ్ చేసి చూడండి. ఒక్కో ఫోటో లో ఒక్కో దగ్గర వుంది ఆ ఆకారం. అంటే అది కెమెరా లో ప్రాబ్లం కాదు. మనల్ని ఎవరో గమనిస్తున్నారు రాము అన్నాడు.
నలుగురి లో భయం మొదలయ్యింది. ఒక వేల అది దెయ్యామో బూతమో కాదు కదా అమ్మాయిలు ఇద్దరూ కలిసి ఒకే సారి అన్నారు. ఏమో దెయ్యం అయ్యే వుండొచ్చు. తాయత్తులు జాగ్రత్తగా వుంచుకోండి అన్నాడు రాము. షీనా గట్టిగా కేక వేసింది. తన చేతి కి కట్టిన తాయత్తు పోయింది. భయం తో షీనా ఏడుస్తోంది. రాము తన చేతికి వున్న తాయత్తు తీసి షీనా కి కట్టాడు. నాకేం కాదు లే పర్లేదు అన్నాడు తన వైపు చూస్తున్న జాన్ తో. అందరూ మళ్ళీ కొండ ఎక్కుతున్నారు. ఇంక రెండు ఘంటల్లో చీకటి అవుతుంది. కొండకి దగ్గర లోనే వున్నారు. కాస్త కష్టపడితే సూర్యుడి అస్తమయాన్ని కొండ పై నిలబడి చూడొచ్చు. అందరి లో జోష్ ని పెంచాడు రాము. షీనా అలసి పోయింది. తెచ్చుకున్న వాటర్ అయిపోయింది. కొంచెం దూరం లో చెట్ల మధ్య లోంచి నీరు పారుతున్న శబ్దం వినిపిస్తోంది. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మీరు ఇక్కడే వుండండి అని బాటిల్ తీసుకొని రామ్ అటువైపు వెళ్ళాడు. అయిదు నిమిషాలయ్యింది. పది నిమిషాలయ్యింది. అరఘంటయ్యింది. రాము తిరిగి రాలేదు. నిమిషం నిమిషం కి భయం పెరుగుతూ వచ్చి వణికి పోతున్నారు రిషి, శ్వేత , జాన్ , షీనా లు. ఆ దెయ్యమే రాము ని ఏదో చేసింది. ఇదంతా నా వల్లే. నా తాయత్తు పోగొట్టుకున్నాను. తన తాయత్తు నాకు ఇచ్చి నా ప్రమాదం తాను తీసుకున్నాడు. షీనా ఏడుస్తూ అంది. మీ ఇద్దరూ ఇక్కడ నుంచి కదలొద్దు అని చెప్పి రిషి, జాన్ నీటి శబ్దం వెతుకుతూ అటువైపు వెళ్లారు.
రాము అంటూ పెద్దగా అరుస్తున్నారు. కాసేపు వెతికి వెనక్కి తిరిగి వచ్చారు. శ్వేత, షీనా అక్కడ లేరు. చుట్టూ చూసారు. వెనక్కి తిరిగే లోపల తల మీద గట్టిగా ఎవరో కొట్టారు. కళ్ళు మూతలు పడుతూ చూసిన ఆకారం ఫోటో లో చూసిన అకారమే. చీకటి పడింది. నీళ్ళ కోసం వచ్చిన రాము కి ఒక చిరుత ఎదురయ్యింది. దాన్ని తప్పించుకొని పరిగెత్తి జలాశయం లో దూకేసాడు. నీళ్ళ వేగం కి అదుపు తప్పి ఒక బండ కి తల తగిలి స్పృహ కోల్పోయాడు. ఒడ్డుకి వచ్చి అలానే చాలా సేపు వున్న తనకు ఇదంతా గుర్తుకొచ్చి మెల్లగా కళ్ళు తెరిచాడు. అలాగే పాక్కుంటూ వెళ్ళి ఒక రాయికి అనుకోని కూర్చున్నాడు. తల కి దెబ్బ. మోకాలి నుంచి రక్తం కారుతోంది. అప్పుడు తన వాళ్ళు గుర్తొచ్చారు. తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. మెల్లగా లేచి నడవడం మొదలు పెట్టాడు. అక్కడకి వెళ్ళి చూస్తే ఆ నలుగురూ లేరు. బాగ్ లు చెల్లా చెదురు గా క్రింద పడిపోయి వున్నాయి. నేల మీద రక్తం మరకలు వున్నాయి. రాము మొదటి సారి భయపడ్డాడు. షీనా కి తాను ఇచ్చిన తాయత్తు లో తాను ఒక పరికరం పెట్టాడు. లాప్ టాప్ ఓపెన్ చేసి ఆ తాయత్తు కో కనెక్ట్ చేసి చూసాడు. ఒక మైలు దూరం లోనే వున్నారు. అది చూపిస్తున్న డైరక్షన్ లో ముందుకు కదిలాడు. తాయత్తు సిగ్నల్ వస్తున్న ప్లేస్ లోనే వున్నాడు.
కానీ అక్కడ ఏమి కనిపించడం లేదు. ఏమి తోచడం లేదు. కాళ్ళ క్రింద ఆకులు. కానీ ఆ ఆకులు చుట్టూ వున్న ఏ చెట్టు కి సంబందించినవి కాదు. అనుమానం తో ఆకులు పక్కకి తోసి చూసాడు. ఏదో డోర్ వుంది. ఓపెన్ చెయ్యబోయి ఆగాడు. తన బాగ్ లోంచి ఒక సెన్సర్ తీసి దానిపై వుంచాడు. డోర్ ఓపెన్ చేస్తే ఎవరికో సిగ్నల్ వెళ్తుంది. తన దగ్గర వున్న మాగ్నెటిక్ ఎక్విప్మెంట్ తో ఆ కనెక్షన్ బ్రేక్ చేసాడు. మెల్లగా లోపలికి వెళ్ళాడు. ఒక పక్కగా నిలబడి అక్కడ ఏమి జరుగుతుందో అని తొంగి చూశాడు. అక్కడ జరుగుతోంది మారణహోమం. జంతువుల్లా మనుషుల అవయవాలు వ్రేలాడదీసి వున్నాయి. ఒక నలుగురు డాక్టర్ లు మరి కొన్ని డెడ్ బాడీ ల మీద పని చేస్తూ వున్నారు. మరో ఇద్దరు ఒక్కొక్క అవయవాన్ని ఒక్కోరకం గా భద్ర పరుస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనిని పర్యవేక్షిస్తూ కొందరు మనుషులు. చాలా భలం గా భయంకరం గా కూడా వున్నారు. అక్కడే గోడ కి వున్న బెల్ మ్రోగింది. ఆ రోజు కి పని ముగింపుకు అది సంకేతం. డాక్టర్ లని పట్టుకెళ్లి ఒక కేజ్ లో వేసారు. ముఖానికి వున్న ముసుగు తీసారు ఆ డాక్టర్ లు. నలుగురు మగ వాళ్ళు. ఇద్దరు ఆడవాళ్ళు. ముసుగు తీసి ఒక లేడి డాక్టర్ ఏడ్వడం మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు ఓదారుస్తున్నారు. నన్ను ఇక్కడకి తీసుకొచ్చి సంవత్సరం అయ్యింది. ఈ నరకం నుంచి ఎప్పటికీ భయటకి వెళ్లలేం. భలవంతం గా మనలో ఎవరైనా చచ్చిపోతే మిగతా వాళ్ళకి నరకం చూపిస్తారు.
వాళ్ళు భలవంతం గా మనుషుల్ని ఎత్తుకొచ్చి చంపేస్తున్నారు. వాళ్ళ అవయవాలు వేరు చేసి వాళ్ళ వ్యాపారానికి సాయం చేస్తూ ఈ పాపానికి మూల కారణం మనమే అంది ఏడుస్తూ వున్నా డాక్టర్. మనం ఈ పాపం చెయ్యక పోతే వాళ్ళు మన వాళ్ళని ఎత్తుకొచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ గుర్తుంది కదా అంది మరో డాక్టర్. అందరూ బాధ పడుతూ అలా గోడ కి అనుకోని కూర్చున్నారు. ఆ అమ్మాయి ని దూరం నుంచి చూసి రాము కి ఆనందం వేసింది. తను వీణా. తన గారాల చెల్లెలు. కష్టపడి డాక్టర్ చదివించాం. డాక్టర్ డిగ్రీ తో పాటు ఒక అబ్బాయి ని వెంటపట్టుకొని ఇంటికొచ్చింది. నాన్న కి అది నచ్చ లేదు. వీణా ని భలవంతం గా గది లో పెట్టేసాడు. అబ్బాయిని భయటకి గెంటేసి ముఖం మీదే తలుపులేసాడు. పొద్దున సూర్యోదయం తో సూర్యుడు కనిపించాడు. కానీ గది తలుపులు తెరిస్తే వీణా కనిపించ లేదు. ప్రేమ కోసం వెళ్లిపోతున్నాను. మీకు ప్రేమ ని ఆశీర్వదించే మనస్సు కలిగినప్పుడు మీ ముందుకు వస్తాను. లెటర్ వ్రాసి పెట్టి ప్రేమించిన వాడి కోసం మమ్మల్ని వదిలి వెళ్లింది. రాము చాలా వెతికాడు. వీణా ఆచూకీ దొరకనే లేదు. చాలా రోజుల తర్వాత వీణా ప్రేమించిన అబ్బాయి డెడ్ బాడీ ఈ కొండ చివరే దొరికింది. ఆ డెడ్ బాడీ ని పరీక్షించిన డాక్టర్ ని కలిసాడు. ఆ డెడ్ బాడీ లో ముఖ్యమైన అవయవాలు లేవు. అవి చాలా నైపుణ్యం గా వేరు చెయ్యబడ్డాయి అని ఆ డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పిన విషయం రాము కి ఆశ్చర్యం తో పాటు అనుమానం కలిగించింది.
అలా అప్పటి నుంచి ఈ కొండ మీద తన రిసర్చ్ మొదలు పెట్టాడు. తన అనుమానం నిజం అయ్యింది. తన చెల్లెలు వీణా ఇక్కడే బంధీ గా వుంది. గతం లోకి వెళ్ళిన ఆలోచనల నుంచి మళ్ళీ ప్రస్తుతం కి వచ్చాడు. పోలీసు లకి చెప్పినా నమ్మలేదు. అందుకే తానే కష్టపడి ఇక్కడ దాకా చేరుకున్నాడు. చెల్లి ని కాపాడుకోడం తో పాటు ఈ గుట్టు ని రట్టు చేస్తే తన సాహసం కి విజయం చేకూరినట్టే. ఇంత లో డాక్టర్ కేజ్ కి భోజనం పట్టుకొని వచ్చారు. త్వరగా తినేసి పడుకోండి. కొత్త మనుషులు వచ్చారు. వాళ్ళకి పొద్దునే ఆపరేషన్ చెయ్యాలి. కొత్త మనుషులు అనగానే రాము మైండ్ లో ఋషి, శ్వేత, జాన్, షీనా వచ్చారు. వాళ్ళ కోసం వెతికాడు. ఏ మాత్రం చప్పుడైనా , తొందరపడినా తను కూడా ఆ కొత్త డెడ్ బాడీ జాబితా లో చేరిపోతాడు. వాళ్ళు ఒక గది లో కనిపించారు. స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వున్నారు. నాడీ పట్టుకొని చూసాడు. బ్రతికే వున్నారు కానీ స్పృహ లో లేరు. మొత్తం ఈ గాంగ్ ఇరవై మంది వున్నారు. ఏదైనా అవకాశం కల్పించు అని రాము దేవుణ్ణి ప్రార్ధించాడు. అప్పుడే దూరం గా బిర్యానీ పాకెట్ లు కనిపించాయి. వాటిని ఇద్దరు అక్కడ సర్దుతూ వున్నారు. మనం ఈ రోజు కొత్త మనుషుల్ని పట్టుకున్నాం. బాస్ మన కోసం బిర్యానీ పంపించాడు. బీర్ లు పంపించాడు. మనం ఈ రోజు పట్టిన అమ్మాయిలు సూపర్ గా వున్నారు. బాస్ కి ఇద్దరే దొరికారు అని చెప్పాం. అబ్బాయిల బాడీ లు బాస్ కి. ఆ అమ్మాయిల బాడీ లు మనకి. ఆ ఇద్దరి మాటల్ని రాము బాగా గమనించాడు. మిగతా వాళ్ళని తీసుకొని వద్దాం అని అక్కడ నుంచి వెళ్లారు .
రాము దగ్గర రెండు నిమిషాలే టైమ్ వుంది. తన బాగ్ లోంచి ఒక బాటిల్ తీసి అది అక్కడ పాకెట్ లలో కలిపేసాడు. పక్కకి వెళ్ళి దాక్కున్నాడు. వాళ్ళందరూ వచ్చి తిన్నారు, తాగారు. కాసేపటికి మొత్తం అక్కడే కుప్పకూలి పోయారు. ఆ మందు ఎంత సేపు పని చేస్తుందో తెలీదు. వెంటనే తన చెల్లెలు వుండే కేజ్ దగ్గరకి పరిగెట్టాడు. రాము ని చూసి షాక్ లోంచి బయటకి రాడానికి డాక్టర్ లకి చాలా టైమ్ పట్టింది. తన మాటల తో వాళ్ళని అలెర్ట్ చేసాడు. ఆ డాక్టర్ లు ఆ గాంగ్ కి మరో డోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేశారు. గాంగ్ లో అందరినీ తాడు తో ఒకరిని ఒకరు లింక్ చేస్తూ కట్టేసారు. ముఖానికి ముసుగులు వేసారు. రాము తో పాటు వచ్చిన ఆ నలుగురికీ డాక్టర్ లు విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చారు. వాళ్ళు అర ఘంటకి స్పృహలోకి వచ్చారు. జరిగింది తెలుసుకొని, అక్కడ జరుగుతుంది చూసి భయపడి పోయారు. సూర్యోదయం అయ్యింది. రాము ఆ కొండ చివర కూర్చొని ప్రకృతి ని చూస్తున్నాడు. వెనుకనే ఋషి, శ్వేత, జాన్, షీనా. వాళ్ళ వెనుక డాక్టర్ లు. అందరి ముఖాల్లో భయంకరమైన భయాన్ని చూసిన తర్వాత వచ్చిన సంతోషం. రాము లాప్ టాప్ కి మెసేజ్ వచ్చింది. POLICE AND MEDIA ARE ON THE WAY!
కొన్ని రోజులకు రాము ఇదంతా కథ గా వ్రాసి పంపించాడు. తన కథ చూసి ఆ పత్రిక ఎడిటర్ నుంచి ప్రశంస పత్రం. కరుడుగట్టిన గాంగ్ ని పట్టించినందుకు గవర్నమెంట్, పోలీసు ల నుంచి అవార్డ్ లు రివార్డ్ లు . చెల్లెల కోసం ఇంత త్యాగం చేసిన కొడుకు ని గుండెలకు హత్తుకొని అమ్మ, నాన్న. అన్నయ చూపించిన ప్రేమ కి పాదాల మీద పడి ఏడుస్తూ చెల్లెలు. భర్త సాహసం చూసి లో లోపలే మురిసిపోతూ సౌమ్య. వీళ్ళందరినీ చూస్తూ హాపీ గా రాము. టేబుల్ మీద మరో పత్రిక. గాలికి పేజీ లు కదిలి ఒక పేజీ దగ్గర గాలి, రాము చూపు ఆగిపోయాయి. దెయ్యాల కథ ల పోటీ అని వుంది ఆ పేజ్ లో. రాము కి ఆ వీధి చివరనే వున్న దెయ్యాల కోట గుర్తుకొచ్చింది.