మున్నీ - ఆదూరి హైమావతి

munni

ముసునూర్ లో కొత్తగా పెట్టిన కాన్వెంట్ లో ప్లేక్లాస్ లో చేరాడు మూడేళ్ళ మున్నీ. ఆరోజు వాళ్ళమ్మ లంచ్ కోసం ఇచ్చిన పెరుగన్నం తినబోతుండగా ఒక తెల్లని కుక్క పిల్ల వచ్చి తోకాడిస్తూ మున్నీ ముందు నిల్చుంది. వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది మున్నీకి. తినేప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకు కాస్త పెట్టి తినమని. వెంటనే మున్నీ ఒక స్పూన్ పెరుగన్నం ఒక ఆకులో పెట్టి దాని ముందుంచాడు. అది మున్నీ వైపు ప్రేమగా చూసి ,ఆ పెరుగన్నం తినింది. మున్నీ కూడా గబగబా తినేసి చేయి కడుక్కున్నాడు. ఆ కుక్క పిల్లవాడి దగ్గర నిల్చుని తోక ఊపి వెళ్ళింది. అలా రోజూ వాడి లంచ్ టైం కు ఆ తెల్లకుక్క వచ్చేది.

మున్నీ దాన్ని ’రాజూ!’ అని పిలుస్తూ రోజూ దానికి కొద్దిగా పెరుగన్నం పెట్టి తాను తినే వాడు. అలా ఆ రాజు మున్నీకి మంచి స్నేహితుడైంది. ఆ ఊర్లో ఉండే భైరవాలయంలో ప్రతి ఏడాదీ జరిగే తిరునాళ్ళు వచ్చింది. చాలా అంగళ్ళు రోడ్డుకు రెండు వైపులా తాత్కాలికంగా వెలిశాయి. మున్నీ వాళ్ళమ్మ దీపావళి సరంజామా కొత్త బట్టలు మున్నీకి ఆట వస్తువులు కొందామని మున్నీ ని తీసుకుని తిరునాళ్ళు కు వెళ్ళింది. వాడికి కావల్సినవి కొని తాను గాజులు కొక్కుంటుండగా, అక్కడికి రాజు వచ్చింది. మున్నీ తన చేతిలోని బిస్కెట్ ఒకటి దానికి ఇచ్చి, అక్కడున్న రంగుల రాట్ణం చూస్తూ అక్కడికి వెళ్ళి , అక్కడున్న బొమ్మ గుఱ్ఱాలనూ, తోలు బొమ్మలనూ చూస్తూ అమ్మ నుంచీ తప్పి పోయాడు. వాడికి భయమేసింది. అంత మంది జన్నాన్ని వాడేప్పుడూ చూడలేదు. వారిలో తన అమ్మ ఎక్కడుందో ఆ చిన్నారి కనుక్కోలేక పోయాడు.

ఏడుస్తూ అటూ ఇటూ తిరగ సాగాడు. మున్నీ అమ్మ గాజులు చేతికి వేయించుకుని తిరిగి చూస్తే మున్నీ కనిపించలేదు. వాళ్ళమ్మ కూడా భయంతో ' మున్నీ మున్నీ' అని పిలుస్తూ అటూ ఇటూ తిరగ సాగింది. ఇంతలో ఆమె పమిట ఎవరో పట్టుకుని లాగుతున్నట్లు అనిపించి, చూడగా ఒక తెల్ల కుక్క పిల్ల ఆమె పమిట కొంగు పట్టుకు లాక్కు పోసాగింది. ఆమె ఆ కుక్క పిల్ల వెంట వెళ్ళగా అక్కడ ఒక చెట్టు క్రింద నిల్చుని ఏడుస్తున్న మున్నీ కనిపించాడు. అమ్మ వాడిని చూడగానే పరుగుతో వెళ్ళి వాడ్ని ఎత్తుకుంది.

మున్నీ అమ్మ పక్కనే ఉన్న రాజును చూసి ,"అమ్మా! ఈ రాజూకే నేను రోజూ లంచ్ సమయంలో పెరుగన్నం పెట్టేది." అన్నాడు. అమ్మ ఆ రాజూను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, "చూశావా! మున్నీ! నోరు లేని ఒక ప్రాణికి ఇంత కొంచెం అన్నం పెడితే ఈ రోజు మనకెంత సాయం చేసిందో చూశావా! ఎల్లప్పుడు అవసరమైన వాళ్ళకు మనమూ సాయం చేస్తూనే ఉండాలి నాన్నా!" అంది.


నీతి - హెల్ప్ ఎవర్. హర్ట్ నెవర్.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు