సుగంధి పురం పరిసర ప్రాంతాల్లో దినుసుల వర్తకం చేసేవాడు వర్ధనయ్య. కొన్నాళ్ళుగా అక్కడ కరువు కాటకాలు తాండవించడంతో వ్యాపారం కోసం దూరప్రాంతం బయల్దేరాడు. నెల రోజుల ప్రయాణం తరువాత పచ్చని పొలాల మధ్య ఒక ఊరును చూసిన వర్ధనయ్య కొన్నాళ్ళు ఆ వూళ్ళో వ్యాపారం చేయాలనుకున్నాడు.
ఊరుకి వెళ్ళే దారిలో పశువుల మంద వెనుకనే నడిచి వస్తున్న కాపరిని చూసాడు వర్ధనయ్య. ఊళ్ళో ఎంత మంది వ్యాపారులున్నారని అడిగాడు కాపరిని. ఊరికి చెందిన వాళ్ళు లేరని, పొరుగూరు నుంచి పంట కాలంలో వచ్చి కొనుగోళ్ళు జరుపుతారని చెప్పాడు కాపరి. అతడి మాటలు విన్న తరువాత అక్కడే తన వ్యాపారం సాగించాలని నిర్ణయించాడు వర్ధనయ్య.
తనకి కొన్నాళ్ళ పాటు ఆశ్రయం ఇవ్వగల వ్యక్తుల కోసం కాపరిని అడిగాడు వర్ధనయ్య. కనకయ్య, కాంతయ్యలని కలిస్తే తప్పక పని జరుగుతుందన్నాడు కాపరి. అతడి పశువులు దారి ప్రక్కన వున్న పంట పొలాల్లోకి దిగి మేతకు సిద్ధమవడంతో వాటిని ఆపడానికి పరిగెత్తాడు కాపరి.
తరువాత వర్ధనయ్యకు ఒక పండితుడు ఎదురయ్యాడు. ఆయనకు నమస్కరించి కనకయ్య కాంతయ్యలు మీకు అనడిగాడు వర్ధనయ్య.
ప్రతి నమస్కారం చేసిన పండితుడు "బేషుగ్గా తెలుసును. వ్యక్తిత్వంలో కనకయ్య కొబ్బరికాయ. కాంతయ్య రేగుపండు " అని సమాధానం చెప్పి , పద్యమేదో పాడుకుంటూ వెళ్ళిపోయాడు.
మరో ప్రశ్న అడిగే అవకాశం రాలేదు వర్ధనయ్యకు. పండితుడు చెప్పిన కాంతయ్య, కనకయ్యల వ్యక్తిత్వాలను మనసులోనే విశ్లేషించుకున్నాడు వర్ధనయ్య. కాంతయ్యను రేగుపండుతో సరిపోల్చాడు కనుక రేగు పండు రూపం లో ఎర్రగా రుచిలో తియ్యగా వున్నట్టు అతడూ మంచి మనసుతో , సహాయ బుద్ధితో వుండొచ్చుననుకున్నాడు. కాంతయ్య ఇంటికే వెళ్ళాడు వర్ధనయ్య.
కాంతయ్యను కలుసుకుని తన గురించి పరిచయం చేసుకుని కొన్నాళ్ళు వసతి సౌకర్యాలు కోరాడు వర్ధనయ్య. సంతోషంగా అంగీకరించాడు కాంతయ్య. మర్యాదలు జరిపించాడు. తమ పని వాళ్ళ ద్వారా పొరుగునున్న గృహంలో వసతి ఏర్పాటు చేసాడు. చక్కటి భోజనం పెట్టించాడు. తమ ఊరిలో పండించే దినుసులు మొదలు వాటి ధర వరలు, రవాణా సౌకర్యాల సమాచారం చెప్పి, తనని కూడా వ్యాపార భాగస్వామిగా చేర్చుకోమన్నాడు కాంతయ్య. గ్రామస్తుడు తన భాగస్వామి అయితే తనకీ ప్రయోజనమేనని సరే అన్నాడు వర్ధనయ్య.
కాంతయ్య వ్యక్తిత్వం రేగు పండుతో సరిపోదనుకున్నాడు వర్ధనయ్య.
రెండు రోజులు గడిచాక కాంతయ్య నిజ స్వరూపం నెమ్మది నెమ్మదిగా బోధపడింది వర్ధనయ్యకి. ఉడికీ ఉడకని అన్నం , ఉప్పు లేని కూర , పులుపు లేని కలవని చారు, నాసి రకం పెరుగులు మాత్రమే భోజనంగా పెడుతూ రుసుములు భారీగా కోరేవాడు కాంతయ్య.
వ్యాపార భాగస్వామ్యం కోరినా సరే పెట్టుబడి వాటా ధనం ఇవ్వలేదు కాంతయ్య. మూడు మాసాల తరువాత వర్ధనయ్యకు లాభం వచ్చిందని తెలిసి తన వాటా పంచమన్నాడు కాంతయ్య. అదెలా కుదురుతుందని అడిగిన వర్ధనయ్య మాటలు వినకుండా గ్రామ పెద్దల ముందు వివాదం తెచ్చాడు. భాగస్వామిగా చేర్చుకుంటానన్న వర్ధనయ్య మాట ప్రకారమే లాభాన్ని పంచమన్నారు పెద్దలు.
గ్రామస్తులతో తనకు జరిగిన అన్యాయం వర్ధనయ్య చెప్పినప్పుడు కాంతయ్య లాంటి ఆశ బోతు, పిసినారి , స్వార్ధపరుడు మరొకరు లేరు అన్నారు వాళ్ళు. అప్పుడు మాత్రం వర్ధనయ్యకు పండితుడి మాటలు గుర్తొచ్చాయి. అతడి గురించి వాకబు చేసిన వర్ధనయ్యకు పండితుడు దేశ సంచారంలో గడుపుతూ ఏడాదిలో ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంటాడని చెప్పారు గ్రామస్థులు.
కాంతయ్య ఇంటిలో ఇమడలేక బయటపడిన వర్ధనయ్య నేరుగా కనకయ్యను కలిసాడు. జరిగింది చెప్పి కొన్నాళ్ళ పాటు తనకు ఆశ్రయం ఇవ్వమన్నాడు.
ముందుగా కలవనందుకు కోపంతో బుసలుకొట్టాడు కనకయ్య. ససేమిరా కుదరదన్నాడు. తెలియక తప్పుచేసానని, పెద్ద మనసుతో సాయం చెయ్యమన్నాడు వర్ధనయ్య. కాసేపటికీ శాంతించిన కనకయ్య సాధారణ స్థితిలో మాట్లాడాడు. తన ఇంట్లో వర్ధనయ్య వుండాలంటే ఏయే నిబంధనలు పాటించాలో చెప్పాడు. వర్ధనయ్య అంగీకరించాడు.
కాంతయ్య అడిగినట్టే వ్యాపార భాగస్వామ్యం కోరిన కనకయ్య సరిపడినంత ధనం అందజేసాడు. న్యాయంగా వచ్చేదే లాభం పంచమన్నాడు. వర్ధనయ్య వున్నన్ని రోజులూ సౌకర్యాలతో తేడా రానీయలేదు కనకయ్య. వ్యాపారం సజావుగా జరిగి లాభాలు వచ్చినప్పుడు , న్యాయమైన వాటాను కనకయ్యకు అందించాడు వర్ధనయ్య.
సుగందిపురం లో పరిస్థితులు చక్కబడ్డట్టు వర్తమానం వచ్చింది వర్ధనయ్యకు. ఇక్కడి లావాదేవీలు పూర్తిచేసుకుని తమ ఊరికి బయలుదేరాడు వర్ధనయ్య. కనకయ్య మనుషులు చూపించిన ఆదరణకు సంతోషపడిన వర్ధనయ్య కొంత ధనం ముట్టజెప్పబోయాడు. దానిని సున్నితంగా తిరస్కరించాడు కనకయ్య.
తమ ఊరు వెళ్ళే దారిలో పండితుడు ఎదురయ్యాడు వర్ధనయ్యకు. కాంతయ్య సంగతి గుర్తొచ్చి పండితుడిని నిలదీశాడు వర్ధనయ్య. "రేగుపండు వ్యక్తిత్వమన్న కాంతయ్యలో మచ్చుకైనా మానవత్వం లేదు. అనేక కష్టాలు పడ్డాను. కొబ్బరికాయ వ్యక్తిత్వమన్న కనకయ్యలో బంగారం లాంటి బుద్ధి , గుణం వున్నాయి. మనుషుల్ని అంచనా వేయడంలో సాధారణ మానవులు పొరపాటుపడడం సహజం. మీలాంటి పండితులు సరైన అంచనా వేయకపోవడం ఘోరం అన్నాడు వర్ధనయ్య.
పండితుడికి పాత సంగతి గుర్తు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. తరువాత గట్టిగా నవ్వి పొరపాటు నాది కాదు మీది అన్నాడు. వస్తున్న కోపాన్ని తమాయించుకుని పండితులైన మీరే అసత్యము పలకవచ్చా? కాంతయ్య వ్యక్తిత్వం రేగుపండుతో తమరు పోలచలేదా? అని అడిగాడు వర్ధనయ్య.
పొరపాటు మీలోనే వుంది. మంచి మనసు గల ఉత్తములు కొబ్బరికాయ వంటి వారు. పైకి కటుగ్గా వున్నా వారి అంత:కరణ రసమయంగా వుండి, లోకోపకార దృష్టి కలదిగా వుంటుంది. కొందరు మనుషులు పైకి తీయని మాటలు చెబుతూ, లోపల కటువుగా స్వార్ధబుద్ధితో వుంటారు. రేగు పండు ఎర్రగా పైకి కనబడుతుందేగానీ, దానిలో వున్నది కఠినమైన గింజ అన్నది గుర్తుపెట్టుకోవాలి. నేను అదే భావంతో చెప్పాను. మీరు అన్వయించుకోవడం లోనే పొరపాటు జరిగింది వివరణ ఇచ్చాడు పండితుడు.
పండితుడి మాటలు విన్న వర్ధనయ్యకు పొరపాటు తన లోనే వుందని బోధపడింది.