తారు రోడ్ మీద రయ్ మంటూ వెళుతున్న ఆర్టీసీ బస్సు రామాపురం స్టాపింగ్ రాగానే ... గీరుమని శబ్దం చేస్తూ ఆగింది. '' రామాపురం ... రామాపురం ...! '' కండక్టర్ కేకేశాడు.
బస్సు వూరి లోపలకు రాదు. దిగి ఓ అర కిలోమీటర్ లెఫ్ట్ రైట్ కొట్టాల్సిందే... ! దిగి ఊరి వైపు నడక సాగించాడు రవి. తలొంచుకొని నడుస్తున్న రవికి వెనక నుండి '' బాబూ .. ! '' అని పిలుపు వినిపించగా వెనక్కి తిరిగి చూశాడు.
'' రామాపురం వూరిలోకి దారి ఇదేనా .. ? అడిగాడు ఆయన.
'' ఊ ... ! '' అన్నట్లు తలూపాడు రవి.
పదడుగులు సాగాక ... '' యేం చేస్తున్నావు బాబూ ... ! '' అడిగాడాయన.
“ బి. టెక్ . అయింది. హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. పండగ కదా నాలుగు రోజులు ఉండి పోదామని వస్తున్నాను .. '' చెప్పాడు రవి.
“ హైదరా బాదులోనా ... మావాడు నాగేశం కూడా అక్కడే వున్నాడు. అదేదో కంపినీలో పని చేస్తున్నాడు... '' చెప్పాడాయన.
అవునా అన్నట్లు తలూపాడు రవి. కొంచెం సేపు మౌనంగా సాగింది వారి ప్రయాణం. ఆయన వూరికి కొత్త అని అర్ధమైన రవి '' ఎవరింటికి వెళ్ళాలి .... ? ” అని అడిగాడు. చెప్పాడాయన.
ఆశ్చర్య పోయాడు రవి .... కారణం ఆయన వచ్చేది తమ యింటికే .... ! “ ఆయన మీకెలా తెలుసు '' వుండబట్ట లేక అడిగాడు రవి.
'' యింతకు ముందు పరిచయం లేదు. యిప్పుడే పరిచయం కాబోతుంది ... '' అన్నాడాయన.
తమ యిల్లు వచ్చింది. అప్పటికే వీధిలో ఆడుకుంటున్న అన్నయ్య పిల్లలు తనను గమనించి “ బాబాయ్ ” అంటూ పరుగెత్తుకొచ్చారు. వారి కేకలకు వరండాలో కూర్చో నున్న రవి నాన్న తలెత్తి పైకి చూసి ...రవితో పాటు వస్తున్న ఆయన వంక చూస్తూ లేచి వెలుపలకు వచ్చాడు.
'' నాన్నా.... ! ఈయన వచ్చింది మీ కోసం. '' అని ఆయనను నాన్నకు ముక్తసరిగా పరిచయం చేసి లోపలికెళ్ళాదు రవి. రవిని చూడగానే జానకమ్మ కళ్ళు మెరిశాయి. ఒళ్ళంతా తడుముతూ.. '' యేంటి నాన్నా యిలా తగ్గిపోయావు. అక్కడి తిండి నీకు ఒంటబట్టినట్లు లేదు .. ! '' అంది. నిజానికి తనేమీ తగ్గలేదు. మరో నాలుగు కేజీలు పెరిగాడు. కాకపోతే తల్లిప్రేమకు అలా అనిపిస్తుంది... అనుకొని నవ్వి సరిపెట్టాడు రవి.
'' యెవరన్నయ్యా ఆయన ... వెంటేసుకొచ్చావ్ ... ? '' అంటూ వచ్చింది రజని.
'' నా కేసు కాదు. నాన్న కోసం వచ్చాడు . అడ్రసు అడిగితే కూడా తీసుకొచ్చాను. అయినా ఆయనెవరైతే నీకెందుకు.... ! ''
'' దీనికన్నీ కావాలిరా ... పెద్ద ఆరిందాలా ... ! '' నవ్వుతూ అంది జానకమ్మ.
ఒక ప్రక్క అమ్మ, మరో ప్రక్క చెల్లాయి, యింకో ప్రక్క వదినా పిల్లలు రకరకాల ప్రశ్నలతో రవిని వుక్కిరిబిక్కిరి చేస్తుంటె ... "' వాడికి నీళ్ళూ, తిండీ చూడరా ... ! చుట్టూ చేరి తినేస్తున్నారు ... ! '' వరండాలోంచి నాన్న కేక వేయడంతో తనను వదిలేశారు.
స్నానం చేసి చల్లగా వుంటుందని మేడ మీదికి చేరాడు రవి. వెనకాలే .. రజని కూడా వచ్చి, '' అన్నయ్యా ... నాకో డౌటు ... ! " అంది. రజనికి అన్నీ డౌట్సే.
అందరూ ఆమెను ‘డౌట్ మేడం .. '’ అని ఆట పట్టిస్తూ వుంటారు.
''డౌటా .. యేంటది .. ? '' అడిగాడు రవి.
''అదే ... నీతో పాటు వచ్చినతను యెవరు..? ఆయన నాన్నతో యేదో చెప్పాడు. నాన్న వచ్చి అమ్మతో గుసగుసలాడాడు. అసలు విషయం నాకు అంతుపట్టలేదు. యేమై వుండొచ్చు... ! " అంది.
''ఆ.. యేముంది ... నీ పెళ్ళి సంగతై వుండొచ్చు. '' నవ్వుతూ చెప్పాడు రవి.
''వూ .. చాల్లే ... ! '' అంటూ విసవిసా దిగిపోయింది రజని.
రజనికి అసలు విషయం తెల్సుకోందే నిద్ర పట్టదు. అదేదో తనకి చెప్పిందాకా వదలదు. పిట్ట గోడ ఆనుకొని అలా ఆలోచిస్తూ నిల్చొన్నాడు రవి. కొంతసేపుటి తర్వాత రజని మళ్ళీ వచ్చింది. రాగానే '' డౌట్ క్లియర్.. '' అంది.
నాకు తెలుసుగా డౌట్ క్లియర్ కాందే నీకు నిద్ర పట్టదని .. '' విషయం చెప్పింది రజని. ఆమె చెప్పిన దానిని బట్టి ఆ వచ్చినతనికి ఒక కొడుకు, ఒక కూతురు వున్నారట. తనకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం కావాలట. అంటే తమ అమ్మాయిని ఇచ్చిన ఇంట్లోంచే కోడలు కావాలట. అందుకు తమతో సంబంధం కలుపుకోవటానికి వచ్చాడట. రజనికి అనుకొన్నాను ఇది తనకూ తగిలేట్లుందే ... ! అయినా తనకి సమ్మతం కాకుండా నాన్న ఒప్పుకోడు. తనకా నమ్మక ముంది… అని రవి తనలో తాను ఆలోచించుకొంటూండగా . . “ రవీ .. ఆ మంచులో యెందుకు వచ్చి భోజనం చేసి పడుకో '' అంటూ క్రింద నుండి జానకమ్మ పిలిచింది.
క్రిందికి వచ్చి భోంచేసి .. తనకు యేర్పాటు చేసిన మంచం పై పడుకున్నాడు రవి. అప్పటికే ఆ వచ్చినతను తన పక్కనే మంచం మీద పడుకొని .. గురక పెడుతున్నాడు.
రవి నవ్వుకుంటూ మేను వాల్చాడు. ప్రయాణ బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది.
అర్ధ రాత్రి దాటాక మెలుకవ వచ్చిన జానకమ్మ నీళ్ళు త్రాగుదామని లేచి వంటగది వైపు రెండడుగులు వేసింది. రవి పడుకున్న గది తలుపులు, మెయిన్ డోర్ తలుపులూ తెరచి వుండటం గమనించి గదిలోకి తొంగిచూసింది.
గదిలో ఆయన మంచం ఖాళీగా కనిపించింది. యెదురుగా తెరచిన బీరువా చిందరవందరగా గుడ్డలు... '' కొంప మునిగిందండీ .. " బిగ్గరగా అరుస్తూ భర్తను లేపింది. లేచిన అతనికి పరిస్థితి అర్ధమైంది.
జానకమ్మ లబోదిబో మంటూ అరవటంతో అందరూ నిద్ర లేచారు. పరిస్థితి అర్ధమైంది. బీరువాలోని నగలు, ఖరీదయిన బట్టలు కనిపించలేదు. చుట్టుప్రక్కల వాళ్ళను లేపి ఊరికి నాలుగు ప్రక్కలా వెతికారు. ఫలితం లేదు. అపరిచితుడు యెప్పుడో వుడాయించాడు.