దేవుడున్నాడు - - కొడాలి సీతారామా రావు

devudunnaadu

మా ఆత్మారాముడు చెప్పిన నిజం ఆత్మ కథే. దేవుడున్నాడు. అయితే పూర్వ కాలంలోలా అసలు రూపంతో ప్రత్యక్షమయ్యి వరాలు కోరుకోమనటం లేదిప్పుడు. ఎవరైనా కిడ్నాప్ చేస్తారనే భయం కావచ్చు. వేరే రూపాలలో -- మనకి తెలిసిన వాళ్ళ లాగో, మరొకలాగో కనపడి మనకి తరుణోపాయం చూపిస్తాడుట! యిది మా ఆత్మారాముడి అనుభవం అంటాడు.

ఆత్మారాముడు ఆత్మహత్య చేసుకుందామని తిరుమల వెళ్ళాడు. తిరుమలే ఎందుకంటే ఆయన మీద కోపంతో. ఆయన్ని చాలా సార్లు వేడుకున్నాడు తన కష్టాలు గట్టెక్కించమని. ప్రతి శనివారం పొద్దున్నే తలంటి పోసుకుంటాడు. వొంటి పొద్దు వుంటాడు. సాయంత్రం ఏమీ ఆహరం తీసుకునే వాడు కాదు. సాయంత్రం గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకునేవాడు. చాలా సేపు గుడిలోనే వుండేవాడు. అక్కడున్నంతసేపు ఒక పక్కన కూచుని కళ్ళు మూసుకుని ప్రార్ధన చేసుకునేవాడు. నిజం చెప్పొద్దూ నేనూ వెళ్ళే వాణ్ని గుడికి అక్కడ పెట్టే ప్రసాదాల కోసం. అయినా వాడి కష్టాలు గట్టేక్కలేదు. పైగా ఎక్కువయ్యాయి అని బాధ పడేవాడు. సరేలే దేవుడు పరీక్షిస్తున్నాడేమో అనుకున్నాడు. నేనూ అలాగే సర్ది చెప్పేను. కష్టాలు కలి కాలమంతా వుండవు అని కూడా చెప్పేను. కలి కాలం కాదు కల కాలం అని ఆ పక్కనాయన చెప్పాడు.

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. తిన్నగా ఆయనకే చెప్పేడు. నా కష్టాలు నేనే కడతేర్చుకుంటున్నాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, ఈ కొండ మీదే. నా గురించి నువ్వేం కష్ట పడొద్దు అని. బైటికి వచ్చి ప్రసాదం లడ్డు తిన్నాడు తృప్తిగా. అలా దూరంగా కొండల చివరకి బయల్దేరేడు. దారిలో తనని గుర్తించే అన్ని వస్తువులని కింద లోయలోకి అక్కడక్కడా విసిరేసికుంటూ ఒక కొండ అంచుకి చేరేడు. చుట్టూ పరికించి చూసేడు. దరి దాపుల్లో జీవ సంచారం లేదు. గాలికి చెట్లు చేసే శబ్దం హాయిగా వుంది. చల్లటి గాలి , అందమైన ప్రకృతి ఆహ్లాదంగా వుంది వాతావరణం. తన కార్యక్రమాన్ని కొద్ది సేపు వాయిదా వేసి ఆ వాతావరణాన్ని అనందించాలనుకున్నాడు. ఒక చెట్టు కిందకి చేరేడు. తనకి తెలియకుండానే నిద్రలోకి జారి పోయేడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక పల్లెటూరి ఆసామి కూచునున్నాడు.

తనని చూసి నవ్వి అన్నాడు. ' నేనిక్కడ ఆవుల్నిమేపుకోటానికొచ్చా. రోజూ వస్తా. తరుచూ యిక్కడ నీ లాంటోళ్ళు కనపడుతుంటారు. చాలా మంది ఆత్మహత్య చేసుకోవటానికే వస్తుంటారిక్కడికి. చాలా మందిని వెనక్కి తీసుకెళ్ళి పోతుంటా. నిన్ను చూస్తే బాగా చదువుకున్నోడిలా వున్నావు. నువ్వూ అందుకోసమే వచ్చావేమో అని అనుమానం వేసి వచ్చా. చాలా సేపటినించీ పడుకున్నావు. ఎప్పుడు తిన్నావో యిదో ఈ ప్రసాదం తిను. మా అయ్యోరు యిస్తాడు నాకు.' అని అంటూ తన మూట విప్పి అందులోని సత్తు గిన్నెలోని చక్కర పొంగలి, పులిహోర ఆత్మారాముడి ముందు పెట్టేడు. అవి చూస్తూనే ఎక్కడ లేని ఆకలి కలిగింది. గబగబా తినేసాడు. అప్పుడు ఆలోచన కలిగింది -ఆతను తినలేదని. అతని వంక చూసేడు తప్పు చేసినట్టు . 'ఫరవాలేదు బిడ్డా. నా కొడుకు లాంటోడివి. నీ ఆకలి తీరింది అంతే చాలు. పద పద కిందకి ఎల్దాం. నీకు మంచి భవిష్యత్తు వుందయ్యా. పిచ్చి ఆలోచనలు చెయ్యబోక.' అని లేచి ముందు నడుస్తుంటే తను వచ్చిన పని మర్చిపోయి అతని వెనకాలే కొండ దిగేడు మంత్ర ముగ్దుడిలా.

తన ఆలోచనల్లో అతన్ని గమనించలేదు. కాసేపయ్యాక గమనిస్తే తన ముందు అతను గాని, ఆవులు గాని కనపడలేదు. సరే ఇక చేసేదేం లేక తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని యింటికి వెళ్ళటానికి సిద్ద పడ్డాడు. జేబులో పైసా లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎదురుగా ఆర్టీసి బస్సు స్టాండు వుంది. అక్కడికి వెళ్ళేడు. సరే ఏమయితే అది అయ్యిందని అక్కడ కంట్రోలర్ని అడిగి డిపో అధికారి దగ్గిరకి వెళ్ళేడు. ఆయనకీ వున్న విషయం చెప్పేసేడు. యిప్పుడు తన యింటికి వెళ్ళాలంటే తనకి ఆర్ధిక సహాయం చేస్తే యింటికి వెళ్ళగానే ఆ డబ్బు పంపించేస్తానని చెప్పేడు. ఆ డిపోలో ఒక ఆచారం పెట్టుకున్నారక్కడి కార్మికులంతా కలిసి. తమ జీతం లోంచి కొంత మొత్తం తీసి ఒక బ్యాంకు అక్కౌంట్లో వేస్తారు. ఎవరైనా డబ్బులు లేక యిబ్బంది పడే భక్తులకి సహాయం చేయటానికి ఉపయోగ పడుతుందది. భక్తులెవరైనా తిరిగి పంపిస్తే ఆ మొత్తాన్ని ఈ అకౌంటులోనే జమ చేస్తారు. ఎందుకంటే రోజూ యిలా యిబ్బంది పడేవాళ్ళని చాలా మందిని చూస్తుంటారు. ఒకడిగా సహాయం చెయ్యలేరు కనుక ఈ ఏర్పాటు చేసుకున్నారు. సహాయం పొందిన భక్తుల ముఖంలో తొంగి చూసే అనందం వారికి ఎంతో తృప్తినిస్తుంది. అలాటి భక్తులు రాసే ఉత్తరాలు అందరికీ చదివి వినిపిస్తారు నెలకోసారి జరిగే సమావేశంలో. అప్పుడే జామా ఖర్చులు చెప్తారు. ఎవరికీ యింత వరకూ ఎటువంటి అసంతృప్తీ లేదు ఆ నిధి నిర్వహణ పట్ల. ఎందుకంటే ప్రతి ఏడాది సభ్యులు మారిపోతుంటారు.

ఆ డిపో మేనేజెర్ గారు అలా ఆత్మ రాముడికి సహాయం చేసేరు. అతను వూరు చేరుతూనే ఆ డబ్బు పంపటమే కాదు ప్రతి నెలా తను కూడా డబ్బు పంపటం అలవాటు చేసుకున్నాడా నిధికి. అతనికి ఎంతో తృప్తిగా వుందలా చెయ్యటం.

గమ్మత్తేవిటంటే, ముప్పైఏళ్ళ తర్వాత యిప్పటి దాక మళ్ళీ ఆత్మ హత్య చేసుకోవాలనుకోలేదు. పై పెచ్చు తను ఉద్యోగ రీత్యా ఎన్నో వున్నత స్థానాలకి ఎదిగాడు. తన భార్యా పిల్లలతో సంతోషంగా వున్నాడు. పిల్లలు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో వున్నారు. తన కథ పిల్లలకి చెప్పేడు - వాళ్ళకి ఇలాంటి ఆలోచన రాకూడదని. యిప్పుడు ఆత్మహత్య చేసుకునే ఆలోచన కలిగిన వాళ్ళని ఆ ఆలోచన నించి మళ్లించేలా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేడు. ఉచిత సహాయం. ఎంతో మందిని ఆ ఆలోచన నించి తప్పించేడు.

యిన్నేళ్ళ తర్వాత యిప్పుడంటాడు - ఆ రోజున నన్ను కాపాడింది ఆ దేవుడే ! పసువుల కాపరి రూపంలో వచ్చేడు. తన ప్రసాదమే పెట్టేడు. ఆకలి తీర్చేడు. ఆలోచన మార్చేడు. నిజమేనేమో అనిపిస్తోంది కదూ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు