అమ్మ మీద అలక - నండూరి సుందరీ నాగమణి

amma meeda alaka

‘నానీ’ అని అమ్మానాన్నలతో ముద్దుగా పిలవబడే సుధీర్ ఏడవ తరగతి చదువుతున్నాడు.

ఆ రోజు సాయంకాలం స్కూలు వదిలాక తొమ్మిదో తరగతి చదివే రణధీర్ పిలిచాడు.

“ఆటో వెళ్ళిపోతోంది అన్నా...నేను వెళ్ళాలి...” చెప్పాడు నాని.

“వెళుదువు లేరా... నీకో మంచిది చూపిస్తా... ఉండు...” అని నానీ ఫ్రెండ్, పక్కింటి అబ్బాయి అయిన శేషు తో “నేను వీడిని ఇంటి దగ్గర దింపేస్తా... నువ్వు వాళ్ళమ్మా వాళ్ళతో చెప్పు...” అన్నాడు రణధీర్.

ఏమనాలో తెలియక తలూపి వెళ్ళిపోయాడు శేషు.

రణధీర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పదహారేళ్ళు నిండాయి. చదువంట లేదు, కానీ దురభ్యాసాలు బాగానే అలవాటు అయ్యాయి. తండ్రికి ఒక్కడే కొడుకు కావటం చేత వీడు ఆడింది ఆట, పాడింది పాటగా జరుగుతున్నా, ఈ మధ్య డబ్బుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు...

“అరేయ్ సుధీర్, ఇదిగో ఈ సిగరెట్ కాల్చరా...” అని బలవంతంగా నోట్లో వెలుగుతున్న సిగరెట్ పెట్టాడు.

వద్దు వద్దంటున్నా. ముందు ఉక్కిరి బిక్కిరి అయినప్పటికీ ఆ పొగ లోపలి వెళుతూ ఉంటే ఏదో మజాగా అనిపించింది నానీకి.

“ఏరా, బాగుందా?” అడిగాడు రణధీర్.

అమాయకంగా తలూపాడు నాని.

“మరింకా కావాలా?”

“నో, వద్దు... మా నాన్న స్మోక్ చేస్తే చంపేస్తారు...” భయంగా అన్నాడు నాని.

“సర్లే, నిన్ను ఫోర్స్ చేయను కాని, రేపు వచ్చేటప్పుడు రెండు వందలు పట్రా?”

“డబ్బులా? నాకు మా నాన్న ఇవ్వరు..” చెప్పాడు నాని.

“స్కూల్లో ఏదో ఫీజు కట్టాలని చెప్పి తీసుకురారా...”

“నేను వెళిపోతాను...”బయటకు కదలబోయాడు నాని.

“ఎక్కడికిరా...” బలంగా షర్టు పట్టుకుని ఆపాడు రణధీర్...

“నన్ను వదిలెయ్యి...” కోపంగా విడిపించుకుని బయటకు పరుగుతీసాడు నాని.

వెనకాలే రాబోయి, అటుగా ఎవరో రావటం వలన ఆగిపోయాడు రణధీర్.

***

నానీ నడుచుకుంటూ ఇల్లు చేరే సరికే బాగా ఆలస్యం అయిపోయింది.

ఆలస్యానికి కారణమడిగిన తల్లితో నోట్స్ రాసుకోవటానికి వేరే క్లాస్ మేట్ ఇంటికి వెళ్లానని చెప్పాడు.

మర్నాడు స్కూల్ టైం అయి బయలుదేరే ముందు అడిగింది సుమతి.

“ఏరా, రణధీర్ తో నీకేం పని? వాడు ఆగమంటే ఎందుకు ఆగాల్సి వచ్చింది? స్కూలు అయ్యాక వాడితో పనేంటి, తిన్నగా ఇంటికి వచ్చేయక?” గట్టిగా నిలదీసింది.

గుమ్మం చాటుగా తొంగి తొంగి చూస్తున్నాడు శేషు.

“నేను వచ్చేస్తుంటే....” చెప్పబోయాడు నాని.

“వాడు, వాళ్ళ గాంగ్ అంతా కలిసి స్కూలు అయ్యాక సిగరెట్లు కాలుస్తారట... ఇంకా పిచ్చి పనులు ఏవేవో చేస్తారట... అలా ఎప్పుడైనా వెళ్తావా?” పట్టలేని కోపంతో వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది సుమతి. శేషు ఎదురుగా అలా కొట్టేసరికి పట్టరాని కోపం వచ్చేసింది నానీకి. తల్లినుంచి తప్పించుకుని పక్కకి జరిగి నిలబడ్డాడు ఎర్రబడ్డ ముఖంతో.

“అసలే అంతంత మాత్రం జీతాలతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు మీ నాన్న... ఉదయమే వెళ్ళిపోయారు ఫ్యాక్టరీకి... ఎందుకింత కష్టపడుతున్నారు? నీ భవిష్యత్తుకే కదా...” ఇంకా ఏదో చెప్పబోతున్న సుమతి మాటల్ని ఖాతరు చేయకుండా బయటికి నడిచాడు కోపంగా తలెగరేస్తూ....

“ఒరేయ్ నానిగా... సిగరెట్లు కాల్చటం నేర్చుకోకురా... ఇల్లూ వళ్ళూ గుల్లవుతుంది. బడినుంచి తిన్నగా ఇంటికి రా నాయనా!” తల్లి మాటలు వెనుకనుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

***

“నానీ, నానీ...” శేషుగాడి మాటలు వినిపించనంత దూరం పరుగుతీసి గుడిలోకి వెళ్ళిపోయాడు నాని. గుడి వెనకాల మంటపంలో కూర్చుని ఏడవసాగాడు. ‘అసలేం జరిగిందో తెలియకుండా అమ్మ కొట్టింది. అదీ శేషుగాడి ఎదురుగా... వాడు తన మీద నేరాలు చెప్పాడు...’ ఉడుకుమోత్తనంగా అనిపించింది. కాసేపు ఏడ్చి, తెలుగు వాచకం తీసుకుని చదువుకున్నాడు. ఇంగ్లీష్ పోయెం రఫ్ బుక్ లో నాలుగు సార్లు రాసాడు, నోటికి వచ్చేదాకా. లెక్కల అచ్చు పుస్తకం తీసి, రఫ్ బుక్ లో కొన్ని లెక్కలు చేసుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేసాడు. గుడి మూసే సమయం అయిందేమో, పూజారి గారు అటువైపు వచ్చారు.

“ఎవరబ్బాయివి బాబూ... యూనిఫారం లో ఉన్నావు, బడికి వెళ్ళలేదా?” ఆరా తీసారు.

నానీ మౌనంగా ఉండిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో ఆ పూజారి గారు ఒక అరిటాకులో ప్రసాదం పెట్టి ఇచ్చారు. ఉదయం నుంచీ ఏమీ తినలేదేమో, ఆవురావురుమంటూ తినేసి బయట పడ్డాడు.

మూడయ్యే సరికి అటూ ఇటూ తిరిగి ఊరి చివర పార్కు దగ్గరికి వెళ్ళాడు.

“మంచి పనైంది... ఒక్క రోజు ఇంటికి వెళ్ళకపోతే అమ్మా, నాన్నా కంగారు పడాలి... ఇక్కడికి వచ్చి బ్రతిమాలి ఇంటికి తీసుకుపోవాలి... అంతే...” శపథం చేసుకుని స్కూల్ బాగ్ తలకింద పెట్టుకుని బెంచీ మీద పడుకున్నాడు.

***

అకస్మాత్తుగా మెలకువ వచ్చింది నానీకి. ఒక్క క్షణం తాను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. చీకటి పడిపోయింది. పార్కులోని బెంచీ మీద సాయంత్రం పడుకున్నాడని గుర్తు వచ్చింది. ఊరి చివర ఉన్న పార్కు కాబట్టి ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంది అక్కడ. ఒక్క క్షణం భయమేసి ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించినా అమ్మ బాగా తిట్టిన విషయం గుర్తు వచ్చి కోపం వచ్చింది. అవును వెళ్ళకూడదు... తాను లేకపోతే ఎలా ఉంటుందో అమ్మకీ నాన్నకీ తెలియాలి బాగా... లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? మళ్ళీ కోపం వచ్చేసింది నానీకి.

బెంచీ మీదనుంచి కిందికి చూస్తే ఆ మసక చీకట్లో, గడ్డిలో ఏదో పాకినట్టు అనిపించింది. ‘అమ్మో పామేమో...’ కెవ్వున అరవబోయి ఆపుకున్నాడు నానీ... ఇంతలో మాటలు వినిపించాయి. కొంచెం దూరంగా ఉన్న చెట్టు చాటు నుంచి యేవో మాటలు...

“ఏరా...ఎంత మంది దొరికారు?” కర్కశంగా వినిపించిందో మగ గొంతు.

“ఈరోజు ఎవరూ దొరకలేదు అన్నా...” వినయంగా చెబుతున్నాడు మరొకతను.

“ఏమ్మాయ్ నీకూ?”

“నాకూ దొరకలేదన్నా...” మరింత వినయంగా చెప్పిందో ఆడ గొంతు.

“బడి నుంచి ఇంటికి వెళ్ళే పిల్లలు ఎవరూ దొరకలేదా?”

“ఎక్కడన్నా, ఒంటరిగా వెళ్ళటం లేదు ఎవరో గాని... ఆటో లోనో, స్కూలు బస్సులలోనో, తల్లిదండ్రుల స్కూటర్ల మీదో వెళుతున్నారు. పిల్లల్ని మాయ చేసి తీసుకురావటం కష్టం గానే ఉంది.”

“ఎలాగరా ఇలా అయితే? పిల్లలు దొరికితే వాళ్లకి కళ్ళు పొడిచేసో, కాళ్ళు విరిచేసో వేరే రాష్ట్రాలకు తీసుకుపోయి, బిచ్చగాళ్ళుగా తయారు చేసే స్కీం పెట్టుకున్నాడు కదా మన బాసు? మీరు వాళ్ళని తీసుకురాకపోతే ఎలా? ఎంత బిజినెస్ లాసు మనకి? ఊ... సరే... ఎవరైనా మనల్ని గమనిస్తే ప్రమాదం కానీ, రేపు మీరు ఎవర్నైనా పట్టుకురండి. ఇప్పటికి వెళ్ళిపోదాం...రేపు ఇక్కడే కలవాలి...” బీడీ వెలిగిస్తూ బయటికి వచ్చి గేటు లోంచి వెళ్ళిపోయాడు నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న ఒక రౌడీ లాంటి అతను. అతని వెనకాలే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు.

మందార చెట్టు గుబురు అడ్డం రావటం వలన నానీని వాళ్ళెవరూ గమనించలేదు.

నానీకి గుండె గొంతులోకి వచ్చిన భావన కలిగింది. వళ్ళంతా చెమటలు పట్టేసాయి. గుండె దడదడా కొట్టుకోవటం మొదలైంది. మొన్న టీవీలో చూపించారు. బడి పిల్లల్ని మాయచేసి వాళ్లకి బలవంతంగా అంగవైకల్యం కలిగించి భిక్షాటన లోకి దించే ముఠా తిరుగుతోంది, తస్మాత్ జాగ్రత్త అని... వీళ్ళే కాబోలు...

మెల్లగా లేచి గేటు తెరచుకుని బయటికి వచ్చాడు. చీకట్లో ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. పైగా సరైన తిండీ తిప్పలూ లేక ఒళ్ళంతా నీరసంతో తూలుతోంది...

అటుగా ఒక ఆటో వస్తే ఆపాడు. తన ఇంటి అడ్రెస్ చెబుతూ ఉంటే, “ఎవరూ, నానీ బాబా? నువ్వు దక్షిణామూర్తి గారి అబ్బాయివి కదా... నేను సూరిబాబును. మీ ఇంటి వెనకాలే ఉంటానయ్యా... రా ఎక్కు...” అని ఆటో ఎక్కించుకుని, “ఎక్కడికి పోయావయ్యా, మీ అమ్మా, నాన్నా నువ్వేమయ్యావో తెలియక ఎంత దిగులుగా ఉన్నారో తెలుసా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇస్తానన్నారు మీ నాన్నగారు...” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, బావురుమని ఏడ్చేశాడు, నాని. ఉదయం నుంచీ జరిగిన అనుభవాలు గుర్తు తెచ్చుకుంటూ.

“పెద్దోళ్ళు మీకోసమే కదయ్యా చెబుతారు? పిల్లలు చెడు సావాసాలు పట్టి పాడై పోకూడదని వాళ్ళు తాపత్రయ పడతారు. అమ్మా నాన్నలు తిట్టినా కొట్టినా వాళ్ళమీద కోపం పెట్టుకోకూడదు...” అనునయంగా చెప్పాడు ఆటో సూరి.

“అవును అంకుల్...” దిగులుగా అన్నాడు నాని.

ఇల్లు చేరే సరికి గుమ్మంలో ఏడుస్తూ కూర్చుని కనబడింది తల్లి.

“ఇన్స్పెక్టర్ నాకు తెలిసినాయనే... తెల్లారే సరికల్లా బాబు మన దగ్గరుంటాడు... ఏడవకు సుమతీ...” తనకూ బెంగగా ఉన్నా మెల్లగా చెబుతున్నాడు దక్షిణామూర్తి.

“అనవసరంగా చేయి చేసుకున్నానండి పిచ్చి వెధవని... ఉక్రోషంగా వెళ్లి ఆటో ఎక్కాడని అనుకున్నానే కాని... ఎంత అశ్రద్ధగా ఉన్నానో, అసలేం తల్లినండీ నేను?” వెక్కుతూ అంది సుమతి.

ఆటో దిగి ఒక్క ఉదుటున “అమ్మా...” అంటూ ఎగిరి దూకి సుమతి ఒడిలో తల దాచుకున్నాడు నాని.

“నానీ, వచ్చావా నాన్నా.. ఎక్కడికి వెళ్ళిపోయావురా..?” ఆర్తిగా వాడిని గుండెకు అదుముకొని తలమీద ముద్దుల వర్షం కురిపించసాగింది సుమతి.

“సారీ అమ్మా, సారీ డాడీ...” కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు నాని.

***

మర్నాడు స్కూల్లోంచి అకస్మాత్తుగా సస్పెండ్ అయ్యాడు, రణధీర్. దానికి ముందు వాడిని సోదా చేస్తే వాడి దగ్గరున్న సిగరెట్లలో డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది. వాడికి అవి ఎవరు సప్లై చేస్తున్నారో కూపీ లాగటం మొదలైంది.

అదే రోజు సాయంత్రం ఊరి చివరి పార్కులో కిడ్నాపర్స్ ముఠా అడ్డంగా దొరికిపోయారు పోలీస్ వారి రైడ్ లో...

ఇన్స్పెక్టర్ నానీని అభినందిస్తూ ‘థాంక్స్’ చెబుతూంటే, సిగ్గుపడి, అమ్మా నాన్నల వంక అపరాధభావనతో చూసాడు, నానీ.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ