చింతతీర్చిన చిత్రపటం. - హైమాశ్రీనివాస్

chinta teerchina chitrpatam

కూజింతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కావ్యం రామాయణం సీతాయాశ్చ చరితమ్ మహత్పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

కమ్మని కంఠంతో మాధుర్యంగా రామాయణ శ్లోకాలు చదువుతున్న తాత గారి వద్ద కెళ్ళి కూర్చు న్నాడు తనయ్ ."తాత గారండీ! చాలా మధురంగా చదువుతున్నారండీ! ఇవి ఏం శ్లోకాలండీ!" అని అడిగాడు . తాత గారు తెల్ల మీసాల చాటు నుంచీ మెల్లగా నవ్వుతూ " ఒరే మనవడా ! ఇవి రామాయణం లోని శ్లోకాలురా! "

" తాత గారండీ ! మీరీ వయస్సులో ఇలా రామాయణ శ్లోకాలను వెల్లె వేయటం చాలా ఆశ్చర్యంగా ఉందండీ! అసలు రామాయణం చదవటం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉంటే ఏంటో చెప్తారా!"

"సంతోషం రా! కనీసం నీకు రామాయణం గురించీ తెల్సుకోవాలనే కోరిక కలగడం నాకు సంతోషంగా ఉందిరా! ఈ రోజు మన టవున్ హాల్లో రామాయణం మీద ఒక చిత్ర ప్రదర్శన ఉంది. నాతో రావోయ్ తీసుకెళ్తాను, నాకూ కాస్తంత సాయంగా ఉంటావు.."

"ఎన్ని గంటలకు తాత గారండీ ?" ,చేతుల్లోని క్రికెట్ బ్యాట్ వైపు చూస్తూ అన్నాడు తనయ్.

" మనం ఒక్క అర గంటలో బయల్దేరాలిరా!..తయారవు మరి..." అంటున్న తాతతో..." మరీ… మరీ… తాతగారండీ ! ..క్రికెట్ ..స్నేహితులు.."అంటూ నసగ సాగాడు.

"తనయ్! తాత గారు దగ్గరుండి రామాయణం చిత్ర ప్రదర్శనకు తీసుకెళ్తానంటే క్రికెట్ అని నసుగుతావేరా! నీ క్రికెట్ మూకనూ తీసుకెళ్ళు అంతా ఒక్క రోజైనా కాస్తంత మంచి విషయాలు తెల్సుకుంటారు.!"పమిట చెంగుకు చేయి తుడుచుకుంటూ వచ్చి చెప్పింది దమయంతి.

"అలాగేలేమ్మా!"అని తనయ్ అంటుండగానే " ఒరేయ్ తనయ్! తనయ్!" అంటూ బయట్నుంచీ అరుపులు వినిపించాయి. తనయ్ బయటి కెళ్ళి వాళ్ళకు చెప్పి క్రికెట్ సరంజామా అంతా ఓ చోట భద్ర పరచి అంతా తాత గారితో బయల్దేరారు.

"మామ గారూ! జాగ్రత్త పెళ్ళి కెళ్తూ పదకొండు పి[ల్ల]ల్లుల్ను తీసుకెళుతున్నారు.." అంటూ నవ్వింది దమయంతి. "పిల్లులకంతా రామ సుధ పోస్తాన్లేమ్మా! చప్పుడు చేయవు." అంటూ బయల్దేరారు తాత గారు. అంతా నడుస్తుండగా తనయ్ అడిగాడు.
“తాతగారూ! మనం టౌన్ హాల్ కు అర్ధగంట సేపు నడవాలి కదా! మాకందరికీ అసలు రామాయణం గురించే తెలీదు. మీరు ఈలోగా కాస్తంత చెప్తారా?" అని తనయ్ అడిగాడు. తాత గారు నవ్వి" మంచిదిరా! పిల్లలూ మీకు తెల్సుకోవాలనే శ్రధ్ధ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందిరా! భారతీయ వాఙ్మయం లో రామాయణాన్ని ‘ఆది కావ్యం’ అంటారు. సంస్కృతము లో దీన్ని వాల్మీకి మహర్హి రచించారు. దాని వల్ల ఆయన ఆది కవిగా సుప్రసిధ్ధు లయ్యారు. రామాయణ మహా కావ్యం ఆరు కాండములు (భాగములు)గా విభజింపబడి ఉంది. దీన్లో 24,000 శ్లోకాలున్నాయి. రామాయణము భారత దేశము, హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అమిత ప్రభావం చూపుతుంది. రామాయణం లో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింప బడింది. ఈ మహా కావ్యం తండ్రీ కొడుకులు, భార్యా భర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - మధ్య గల సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తనా విధానాలు చక్కగా తెలియజేస్తుంది. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనానికి ప్రమాణంగా స్వీకరింప దగినవని. ఈ కాలంలో చాలా మందికి రామాయణం గురించిన అవగాహన లేక ఏదేదో అనుకుంటుంటారు. పదండి వచ్చేశాం. ముందు మీరు చిత్ర ప్రదర్శన చూడండి. ఆ తర్వాత మీ సందేహాలు అడగండి. జాగ్రత్తగా పరిశీలిస్తేనే మీకు సందేహాలు వస్తాయి. సరా!" అంటూ తాత గారు హాలు లోపలికి దారి తీశారు.

హాల్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా హనుమత్ సహిత సీతా రామ లక్ష్మణుల పెద్ద ఆయిల్ పెయింటింగ్ మనస్సును ఆకట్టుకుని, ఆహ్వానించింది. రంగుల సమ్మేళనం, అందం మనస్సులను దోచుకోగా తాత గారితో పాటుగా పిల్లలంతా కూడా అక్కడే చాలా సేపు అయస్కాంతానికి అతుక్కున్న ఇనప ముక్క ల్లా కదలకుండా నిల్చిపోయారు. ముందుగా తేరుకున్న తాతగారు ," చూశారుట్రా పిల్లలూ! ఇదిరా రామ మహత్వం! కదలండి అన్నీ చూద్దాం."అంటూ ముందుకు సాగారు. ఒక్కో చిత్రం వీక్షకులను ఆకట్టుకుంటున్నది. ఒక చిత్రం దగ్గర అంతా ఆగి పోయి ఉన్నారు గుంపుగా. "ఈ చిత్రన్నిగురించిన విషయం తెల్సుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తిగాఉంది. అంతా ఆ స్టేజ్ ముందుకు వస్తే అక్కడ చిత్రకారులు ఉన్నారు. ఆయన అందరికీ వివరిస్తారు" అని నిర్వాహకులు చెప్పగానే అంతా వెళ్ళి, అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. “రామాయణ మహాకావ్యంలో శత కోటి అక్షరాలని చెబుతారు. కాండము అనగా చెరకు గడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు. వాల్మీకి మహర్షి ఆది కవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త. రామ నామము సకల పాప హరమనీ, మోక్ష ప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందు పరచ బడి యున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభిస్తుందని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే ----రామాయణం మానవ జీవనానికి ఆదర్శం, అదెలాగో సవివరంగా చెప్తాను..పూర్వం రామగిరి అనే గ్రామంలో చంద్రమణి, రామశేఖరుడు అనే దంపతులకు ఇరువురు కుమారులు ఉండేవారు, విద్యాభ్యాసం పూర్తి చేసి యుక్త వయస్కులయ్యారు. ప్రధమ పుత్రునికి తగిన భార్య కోసం ఆ దంపతులు గ్రామాలన్నీ గాలించి’ రమామణి ‘ అనే ఒక మంచి కుటుంబంలోని కన్యతో వివాహం జరిపించారు. రమామణి కాపురానికి వచ్చింది. ఆమె మంచి విద్యావంతురాలే కాక మంచి చిత్రకారిణి కూడా.

ఆ రోజుల్లో ప్రతి ఇంటా రామాయణ గాధలు ఉండే చిత్రాలు అలంకరించుకుని ఉండేవారు. రమా మణి కూడా తాను స్వయంగా చిత్రించిన రామాయణ దృశ్యాలున్న చిత్రపటాలు తనతో తెచ్చుకుని ఇంటి గోడలపైన అలంకరించింది .ఆమె మరిది కొంత అల్లరి వాడు. అల్లరి మూకతో స్నేహం చేస్తూ రమామణి అందానికి ఆకర్షితుడైనాడు. ఆమెను చాటు నుంచీ చూస్తూ, ఒక్కో మారు ఆమె గమనిస్తే ఏదో సైగలు చేస్తూ , కొంత చిత్రంగా, అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అన్న భార్య అనీ, వదిన తల్లితో సమానమనే గౌరవం లేకుండా అతడి ప్రవర్తన కొంత మనస్సుకు కష్టంగా ఉంది రమామణికి. రమామణి సందిగ్ధంలో పడింది. తన భర్తకు తమ్ముడంటే అమిత ప్రేమ. అత్తా మామలు కొత్త. తాను కొత్త కోడలు, వారి మనస్సులు తనకూ తన మనస్సు వారికీ, ఇంకా అర్ధం కాలేదు. భర్తతోనూ ఇంకా చనువు ఏర్పడలేదు. పగలంతా కచేరీలో నౌకరీ లో ఉండే భర్త సూర్యాస్తమయం తర్వాత అలసి పోయి ఇంటికి వస్తాడు. మరిది ఇంకా కొలువులో చేరలేదు. అందుకే పని లేక ఈ అల్లరి. ఏమి చేయాలో రమామణికి అర్ధం కాలేదు. మరిది ప్రవర్తన గురించీ ఇంట్లో ఎవరికి చెప్పినా పెద్ద చిక్కు వచ్చి కూర్చుంటుంది, కొత్తగా ఆ ఇంట కాలు పెట్టిన తనను ఏమనుకుంటారో అనే వేదన! మనస్సంతా భయంతో నిండిపోయింది.మరిది ప్రవర్తన రోజు రోజుకూ భరించ లేని విధంగా ఔతున్నది. సమయం చిక్కితే శరీరాన్ని తాకుతూన్నట్లే నడుస్తున్నాడు."సీతా రామా! మీరే నాకు దిక్కు." అని ప్రార్ధించుకుంటూ క్షణమో యుగంలా గడప సాగింది. సాయంకాలం అత్త మామలు దేవాలయానికి వెళ్తారు. భర్త ఆ సమయానికి తిరిగి రాడు. ఆ సమయంలో మరిది ఇంటికి వస్తాడు.

భయంతో బిక్క చచ్చి పోతున్న రమామణి ఆ సాయంకాలం దీపం వెలిగించి అన్ని గదుల్లో ఉంచింది. మరిది గది లోనూ దీపం పెట్టి బయటికి వస్తుండగా అతడు గదిలోకి వచ్చాడు. తనకు దారి ఇవ్వకుండా అడ్డుగా నిలిచాడు.ఏం చేయాలో పాలుపోక గోడ మీద తాను చిత్రించిన రాముని చిత్రపటం వద్ద కెళ్ళి నిలిచింది రమామణి. మరిది దగ్గర దగ్గరగా రాసాగాడు, భయంతో ఆమె శరీరం కంపించింది. శరీరం స్వేదమయమైంది. అతడు మరీ మరీ దగ్గరకు రాసాగాడు. వెంటనే రమామణి గోడ మీద ఉన్న చిత్రం లోని సీతను చూపి, తనను చూపుకుంది. ఆ తర్వాత సీతారాములకు కాస్త దూరంగా పెడ తిరిగి నిలుచున్న లక్ష్మణుని చూపి మరిది వైపు చూపింది. అంటే నేను సీతను ,నీ వదినను, నీవు లక్ష్మణుడివి మరిదివి. అనే సూచన చేసి చేతులెత్తి నమస్కరించింది. కొంతసేపు ఆ చిత్రాన్నీ, వదిననూ చూసిన మరిదికి చమటలు పట్టాయి, మనస్సు మారిపోయింది. తన తప్పిదం తెలిసింది. వెంటనే ఆమె పాదాలు పట్టుకుని నమస్కరించాడు. రమామణీ ఆ గది వదలి చావిట్లోకి వచ్చి అక్కడ ఉన్న సీతారాముల పట్టాభిషేక చిత్ర పటానికి నమస్కరించి పూల మాల అలంకరించింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు.,ఆ తర్వాత అత్త మామలు వచ్చారు. చూశారా! రామాయణ చిత్ర పట దృశ్యం అల్లరి మరిదిని మార్చేసింది. అందుకే ప్రతి ఇంటా తప్పక సీతారాముల చిత్ర పటాలు ఉండటం శుభ కరం.ఆ కధా దృశ్యమే అందరూ వివరణ కోరిన ఆచిత్రం." అంటూ ముగించాడు చిత్రకారుడు. అంతా అభినందించారు.

తాతగారు పిల్లలందరితో కల్సి ఇంటి దారి పట్టారు." తాత గారూ రేపటి నుండీ మాకు రామయణ శ్లోకాలు నేర్పుతారా? మేమందరం వస్తాం." అని అడిగారు పిల్లలు."చాలా సంతోషమయ్యా! మీ కోసమే’ బాల రామాయణం’ అని రామాయణం మొత్తం 108 శ్లోకాల్లో ఏర్పరచారు, దాన్నిమీకు నేర్పుతాను. మీ అందరికీ ఇష్టమైతే." అన్న తాత గారితో "తప్పక చెప్పండి తాత గారూ రేపు సాయంకాలం ఐదింటికంతా వచ్చేస్తాం." అన్నారు పిల్లలు. తాత గారు సంతోషంగా --

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్ ఏకైక మక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్ – అని పాడారు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ