నాన్నత్త కోరిక - కర్రా నాగలక్ష్మి

naannatta korika

" అమ్మా పనిమనిషిని మాన్పించేయ్ నేను ఆలోచించుకున్నాను " ఆరేళ్ళ చిన్ని అమ్మ నుద్దేశించి అంది .

" నాన్నకి కూడా చెప్పేయ్ ". తలుపు మూలనున్న చీపురు చేతిలోకి తీసుకుంటూ మళ్ళా అంది చిన్ని .కూతురు మాటలకి సన్నని దరహాస రేఖ కనబడింది అమ్మ మోములో .

... సరే ..... " అంటూ మూతి ముడిచింది . విరుపుకి ముక్కుపుడకలోని వజ్రం తళ్లుక్కు మని మెరుస్తూ మెరుపు చెంపలలో ప్రతిఫలించింది . అమ్మ చెంపల మెరుపుని , ముక్కెర తళుకుని చూడడం ఎంతో యిష్ఠమ్ చిన్నికి .

" బుచ్చన్నయ్యా , నువ్వేంనాకు బలపాలు , పెన్సిళ్లు యివ్వఖర్లే , యించక్కా నువ్వోక్కడవే వాడుకోవచ్చులే " .

" ఏం నాన్నారు నీకు కొత్తవి కొంటున్నారా ? , అమ్మా నాకూ కొత్తవే కావాలి యిప్పుడే చెప్పేస్తున్నా ? " అరిచేడు గోపి .

" సరే ..సరే స్కూలుకి టైం అవటంలే బయలు దేరు " తొందర పెట్టింది అమ్మ .

" చిన్నీ ఇస్కూలు బడికి " పెరటి తలుపు దగ్గర నుంచి కేక వినబడింది .

" మీ ఫ్రెండు తార కూడా వచ్చింది పద " గోపి చిన్నిని తొందర పెట్టేడు .

" అది రేపొస్తుందిగాని మీరు వెళ్ళండి " . అమ్మ కల్పించుకొని అంది .

గోపి పుస్తకాల సంచి చేతికి తగిలించుకొని రెండో చేత్తో పలక పట్టుకొని నోటితో బుర్ ...... మని శబ్దం చేసుకుంటూ వీధిలోకి పరుగేత్తేడు . అమ్మ స్టేట్ మెంట్ తో సందేహానికి లోనయ్యింది చిన్ని . నిన్న నాన్నగారు క్లాస్ పుస్తకంలో పెన్సిల్ తో చుక్కల ముగ్గు వేస్తే , చదువు మీద శ్రద్ధలేదు యిలాఅయితే పనిమనిషిని మానిపించేస్తాను యింట్లో కూచొని అంట గిన్నెలు తోముకో , లేదా ముగ్గులు , సినిమా పాటలు కట్టిపె ట్టి బుద్దిగా చదువుకో , ఆలోచించి యేవిషయం చెప్పు అని అనలేదూ ? యిందాక అదే విషయం అమ్మతో చెప్పాగా ! మరి అమ్మేంటి రేపు స్కూలుకి వెళ్లమంటోంది . ఏంటో యీ పెద్దవాళ్ళు యేదీ అర్ధమయ్యేటట్లు చెప్పరు మనం యేమైనా అంటే అదోలా చూసి ముసి ముసిగానో , పకపక మనో నవ్వేయడం . పనిమనిషిని మాన్పించమని చెప్పాగా ? యిల్లు కుడా వూడుస్తున్నాగా ? తరవాత గిన్నెలు ... గిన్నెలు అనుకోగానే అరటి చెట్ల పక్కన బురదలో పడేసిన అంట గిన్నెలు నల్లని ముఖాలతో నవ్వుతున్నట్లు కనిపించేయి . అమ్మో బురదలో .... కంపు ...... గిన్నెలు ... తోమేటప్పుడు చేతులకి నలుపు అంటుకుంటుందేమో ? మల్లెపూవు కి తేనె కలిపింట్టుండే రంగులో వున్న తన చేతుల వైపు చూసుకుంది . గిన్నెల నలుపు అంటుకొని తన చేతులు కూడా ఆదెమ్మ చేతుల్లా అయిపోతాయా ? అమ్మో యింకా వోగది వూడ్వడమే పూర్తి కాలేదు చేతులు నెప్పెడుతున్నాయి . పొనీ పని మనిషిని మానిపించ కుండానే చదువు మానీసె మార్గం వుందా ?

" వోలమ్మ వోలమ్మ ... మాలచ్చిమి తల్లి సీపురొట్టుకుందేటి ? నివ్వేటి మహారానీ నాగా కూకోని పని సేయించుకోవాల గాని యిదేటిదేటి .... జల్లి .... జల్లి.... సీపురు జల్లి " .

" నీ పేరేంటి ఆదెమ్మా ? , అంటే మీ అమ్మా నాన్నా పెట్టిన పేరు " చిన్నన్న విస్సు అడిగేడు .

" ఆది లచ్చిమి "

" వొకవేళ నీ పేరు రత్న ప్రభ అనుక్కో అప్పుడు నిన్ను యేమని పిలుస్తారు రత్తీ అనా రత్త్తమ్మా అనా ? "

" మరంతే గదేటి అనాగే పిలుత్తారూ "

చిన్నన్నయ్య చిన్ని వేపు చూసి కళ్లెగరేసేడు .

అమ్మో తనని అందరు రత్తీ ... రత్తమ్మా ....అని పిలుస్తారా ? పొనీ నాన్నకి తెలియకుండా ముగ్గులు నేర్చుకుంటూ , కొంచెం చదువుకుంటూ వుంటే బాగుంటుందేమో .

అమ్మో , చిన్నన్నో స్కూలుకి పో చిన్నీ అంటారని , అనాలని ఎదురు చూస్తోంది చిన్ని .యింతలో వంటింట్లోంచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నాన్నత్తొచ్చింది . యింట్లో యెంత పెద్ద గొడవ జరిగినా ప్రేక్షకురాలిలా వుండి పోయే నాన్నత్త , రాత్రి తొమ్మిదింటి వరకు మడిని , వంటిల్లుని వదలని నాన్నత్త " చిన్నీ పద బడికి " అంటూ చిన్ని రెక్క పుచ్చుకొని గోర గొరా యీడుస్తున్నట్టుగా తీసుకు వచ్చి స్కూల్లో దింపి " బాగా చదువుకో " అంది .

" చెయ్యినొప్పి నాన్నత్తా " అంటూ నాన్నత్త వైపు చూసిన చిన్ని గతుక్కు మంది కాశ్మీరీ ఆపిల్ రంగులో వుండే నాన్నత్త ముఖం కోపంతో మరింత యెర్రబడి ముక్కు పుటాలు వెడల్పుగా అయి అదురుతున్నాయి . నాన్నత్తని రూపంలో ఎప్పుడూ చూడలేదు . నాన్నత్తకి కోపం యెందుకొచ్చిందో అర్ధం కాలేదు చిన్నికి .

నాన్నత్త తో సమానంగా నడవలేక పరుగెత్త వలసి వచ్చింది చిన్నికి . నాన్నత్త అలా యీడ్చుకొని తెచ్చినట్లు తీసుకురావడం ఎంతమాత్రం నచ్చలేదు . ఎలాగూ స్కూలికి వెళ్ళడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చేను కదా ! అంతలోనే యిలా యీడ్చుకు రావడం బావుందా ? వీధిలొ అందరూ చూస్తూవుండగా నాన్నత్త అలా యిడ్చుకొని రావడం కొంచెం అవమానంగా కూడా అనిపించింది . ఏమిటో యీ పెద్దవాళ్లు పిల్లలని యెప్పుడూ అర్ధం చేసుకోరు . ఏమిటో యివాళ పొద్దున్న నుంచి అన్నీ యిలాగే జరుగుతున్నాయి . స్కూలు మానెయ్యొచ్చు కదా అనే ఆనందం లో ప్రొద్దున్నే అర చేతులు చూసుకొని లేవాలన్నిది మరచి పోయినందుకా అనుకొంది .

" ఏంటి పిల్లా ఆలీసంగా ఒచ్చినావూ " అంటున్న తోటి అమ్మాయి మాటలు వినబడనట్టుగా పుస్తకంలోకి చూస్తూ కూర్చుంది . ఆలోచనలు మాత్రం నాన్నత్త చుట్టూ తిరగసాగేయి .

నాన్నత్తకి యెందుకంత కోపం వచ్చిందో ?

నాన్నత్త టే ఎంతో యిష్ఠమ్ చిన్నికి . అమ్మలాగే పచ్చని శరీర ఛాయా , పావలా బిళ్ళంత బొట్టు , చేతులనిండా బంగారం గాజులు మధ్య మధ్యలో గాజుగాజులు , ముడివేసిన పెద్దజుట్టు లో యెప్పుడూ యెర్రని మందారపువ్వు . పసుపు రాసిన పాదాలని ముద్దాడు తున్నట్లుండే పాంజేబులు , వాటి పైన అందెలు కచ్చ పోసి కట్టిన చీరలోంచి నడిచేటప్పుడు కనిపించేవి . అందగత్తెలలోకి అందగత్తెగా వుండేది .

" మీ నాన్నత్త మీ యింట్లోనే ఎందుకుంటుంది " అనే దోస్తుల మాటలకి ఏం చెప్పాలో అర్ధం అయేదికాదు .

అమ్మని అడిగితే " మీ తాతయ్య నిర్వాకం తల్లీ " అనేది . తాతయ్య అంటే నాన్నగారికి తాత . నాన్నత్తని అడిగితే " ఖర్మ తల్లీ ఖర్మ ఏ జన్మలోనో, యే జంటనో విడదీసి వుంటాను యీ జన్మలో యిలా ..." వెక్కుతూ కళ్లు తుడుచు కొనేది . తల్లి మాటలు గాని నాన్నత్త మాటలు గాని అర్ధం అయేవి కావు . అర్ధం చేసుకునేంత వయసు కుడా లేదు చిన్నికి .

చిన్ని స్కూలు ఫైనల్ పాసయేక పై చదువులకి పంపాలా , పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలా అనే విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు " పై చదువులకు పంపరా విద్య వివేకాన్నిస్తుంది , దాని మంచి చెడ్డ అది తెలుసుకోగలుగు తుంది " అంటున్న నాన్నత్త మాటలలో మళ్లీ అదేకోపం ముఖం యెర్రబారడం చూసింది చిన్ని .

కాలేజ్ కి వెళ్తుతున్న ఆనందంలో నాన్నత్త మాటలు అర్ధం కాకపోయినా పట్టించుకోలేదు , ప్రభ గా మారిన చిన్ని . కాలేజ్ చదువు ప్రభకి జ్ఞానం అనే ఖజానా కి తాళంగా వుపయోగ పడింది . అప్పుడు నాన్నత్త మాటలకి అర్ధం తెలియసాగింది .

పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వుండగా నాన్నగారి రిటైర్మెంట్ కి ప్రభ అన్నయ్యలు అంతా యింట్లో చేరి హడావిడిగా వున్నప్పుడు వో చిన్న మాటతో నాన్నత్తకి మళ్ళా కోపం వచ్చింది .

యీ సారి నాన్నత్తకి కోపం రావడానికి కారణం ప్రభ కాదు , నాలుగేళ్ల ప్రభ మేనకోడలు లాస్య .

తాతగారికి పూలదండలు వేసి అభినందిస్తున్న దృశ్యం చూసిన లాస్య తనవొంతుగా పుట్టిన రోజు పాటని శ్రావ్యంగా వినిపించింది .

" పుట్టిన రోజు కాదే పిచ్చిపిల్లా తాతగారు రిటైర్ అయ్యేరు " లాస్యని ముద్దుగా హత్తుకుంటూ అంది ప్రభ .

"రిటైర్ అంటే " కుతూహలంతో చారడేసి కళ్లు చేసుకొని అడిగింది లాస్య .

" పొట్టనిండా ప్రశ్నలేనే నీకు . రిటైర్ మెంట్ అంటే రేపటి నుంచి ఆఫీస్ కి వెళ్లఖ్ఖర లేదన్నమాట ".

" వెంటనే అత్త దగ్గర నుంచి నాన్న దగ్గరకి వెళ్లి " నాన్నా నేను కుడా రిటైర్ అయ్యేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళను " అని డిక్లేర్ చేసింది .

" అలేగే నువ్వు రిటైరు సరేనా " అంటూ అంతా ముద్దు చేస్తూవుంటే ,

" తోటకూర కాడ సెప్పనయితిని కొడకా అని ఏడ్చిందిట మునుపటికి మీలాంటిదే వొకర్తి అలా వుంది మీ వరస , యిలాంటి వన్నీ మొగ్గలోనే తుంచెయ్యాలి " అంటూ విసవిసా లాస్యని లోపలి తీసుకెళ్లిపోయింది నాన్నత్త .

రెండు నిముషాల తరువాత నాన్నత్త చెయ్యి పట్టుకొని వచ్చిన లాస్య చేతులతో చెవులు పట్టుకొని "సారీ నాన్నా యింకెప్పుడూ చదువుకోను అననుగా " అంది .

ఎన్నాళ్ళగానో నాన్నత్తని అడగాలను కున్న సందేహాలు యివాళ తీర్చుకొవాలని నిశ్చయించుకుంది ప్రభ .

అసమానమైన అందం , ముర్తీభవించిన మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లా వుండే నాన్నత్త భర్తకి ఎందుకు దూరమయ్యింది ? , యీ వయసులో యింత అందంగా వున్న నాన్నత్త వయసులో వున్నప్పుడు యింకెంత అందం గా వుండేదో ? , యింతటి అందాల రాశిని నాన్నత్త భర్త వద్దను కున్నాడా ? నాన్నత్తే భర్తని కాదనుకుందేమో అని అనుకుందామంటే యిన్నేళ్లుగా నాన్నత్తని చూస్తున్న ప్రభ మనస్సు అంగీకరించలేదు .

ఎప్పటిలాగే ప్రభ మంచం పక్కన కొంగు పరచుకొని నిద్రకి వుపక్రమిస్తున్న నాన్నత్తని వారించి " మంచం మీద పడుకో నాన్నత్తా , కింద పడుకుంటే వాతం చేస్తుంది " . అంది ప్రభ .

" మొండి ప్రాణం వాత నొప్పులికి పోదులే , అంత సున్నితమైతే ఆ మహానుభావుడు పత్రాలు పంపినప్పుడే పోదూ ? " .

అదే అదనుగా గబుక్కున లేచి నాన్నత్త పక్కన కూర్చొని " యిప్పుడు పెద్దదాన్ని అయేనుగా ? నువ్వు చెప్పేవన్నీ అర్ధం అవుతాయిగా ? నాన్నత్తా మావయ్య నిన్నెందుకు వదిలేసాడు ? చెప్పవా ? "

" నీకు కాక యింకెవ్వరికి చెప్తానే భడవా ? ముద్దు ముర్ఖంగా మారకూడదు అనేదానికి నా జీవితమే వుదాహరణ . మా అయ్య కి ( నాన్నత్త వాళ్ల తండ్రిని అలాగే పిలిచేది ) ముగ్గురు మొగపిల్లల తరవాత పుట్టిన దాననని ఏంతో ముద్దు . నన్ను వో మంచి ముహూర్తమో చెడు ముహుర్తమో స్కూల్లో వేసేరు . మేష్ఠారి చేతిలో బెత్తం చూస్తే భయం వేసి , బడికి పోను అంటే మా అయ్య ' నీకు చదువుకునే ఖర్మమేమిటమ్మా , బడికి పొవొద్దులే ' అంటే నా ఖర్మ బాగుంది కాబట్టి నేను చదువుకో అక్కరలేదు అనుకున్నా . చదువు కోకపోవడం వల్ల నా బతుకు యిలా తగల బడుతుందని అనుక్కోలేదే ? . తన ముద్దుల కూతురుకి పెద్దింటి సంబంధం చెయ్యాలని చెన్నపట్నం సంబంధం చేసేడు అయ్య . పెళ్ళప్పుడు పట్టా చదువుతున్నారు ఆయన . తరవాత యింకా యేవేవో చదివేరుట . వివాహం విద్యా నాశయః అంటారు , అందుకని చదువు అయేకా నన్ను తీసుకు వెళ్తారు అని ఎదురు చూస్తున్నాను " .

" చదువు రాని దానివని నిన్నొదిలేసి మరో పెళ్లి చేసుకున్నారా మావయ్య " కోపంతో మొహమంతా ఎర్రబడగా అంది ప్రభ .

" తప్పు తప్పు ఆ మహానుభావుడిని గురించి అలా అనుకుంటే కళ్లు పోతాయి . వుండు నిరుడు వచ్చిన యీ వుత్తరం , యీ కాయితాలు చదువు . మీ నాన్న చెప్పడం ఆ మహానుభావుడు ఆస్తి నా పేర రాసి ఏదో ఆశ్రమం లో చేరి సన్యాసం పుచ్చుకున్నారుట , పాపిష్ఠి దాన్ని భర్త సేవ చేసుకోవడం మాట అలా వుంచు పెళ్లి లో తప్ప అతనిని చూడనైనా లేదు . నాకెందుకే యీ ఆస్థి ? , నేనేం చేసుకుంటానే ? యీ ఆస్థి నీకిస్తున్నాను . నాలాగ యెవరూ చదువులేక అన్యాయం అయిపోకూడదు . నువ్వు చదువుకున్న దానివి ఎలా యీ ఆస్తిని వుపయోగిస్తే బాగుంటుందో అలా చెయ్యి " అంటూ వోపెద్ద కవరు ప్రభ చేతిలో పెట్టి , యింక మాట్లాడేది ముగిసింది అన్నట్లుగా గోడవైపు తిరిగి పడుకుంది నాన్నత్త .

గబగబా కాయితాలు చదివిన ప్రభకి అర్ధమయ్యింది యేమిటంటే నాన్నత్తంటే మావయ్య గారికి యెంతో యిష్టమని , వుద్యోగ విరమణ వరకు నాన్నత్త తో కలిసి ఉండడానికి యెన్నో ప్రయత్నాలు చేసేరని తెలుసుకుంది . నాన్నత్తంటే మావయ్యగారికి యిష్టం , మావయ్యగారంటే నాన్నత్తకి యిష్టం మరి యీ కధలో విలన్ యెవరు . అదే విషయం నిద్రకి వుపక్రమిస్తున్న నాన్నత్తని లేపి అడిగింది .

" నా బతుకు యిలా తెల్లవారడానికి కారణం ' విధి ' అని సరిపెట్టు కోవాలేమో ? మా అయ్యకు నామీద వున్న పిచ్చి అభిమానం వొక కారణమైతే , నేను చదువుకోకపోవడం మరో కారణం . నన్ను వదిలి వుండలేని మా అయ్య ప్లీడరు గుమస్తా యిచ్చిన సలహాతో విడాకుల కాయితాలమీద వేలిముద్రలు వేయించేడు అవేమిటో వాటి వల్ల జరిగే అనర్ధం ఏమిటో తెలిసే సరికి నా బతుకు తెల్లారి పోయింది . మోడులా యిలా బతికే బదులు చచ్చిపోవాలని చాలాసార్లు అనుకున్నాను కాని బలవంతపు చావు చస్తే ఆత్మ నరకానికి పోతుంది అంటారు . అలా జరిగితే ఆలోకంలో నైనా నాదేవుడిని కలిసే అవకాశం పోగొట్టుకుంటాను కదా ! అందుకని అ ఆలోచన విరమించుకుని యిలా రాయిలా బతికేస్తున్నా " .

" నీ కధకి మీ అయ్య విలన్ అన్నమాట " .

" మా అయ్య మూర్ఖుడే , అతను కుడా నిశానివే , అత్తవారింటికి పంపితే తన పిల్ల అలసిపోతుందని అనుకున్నాడే గాని , కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలుసుకోలేని అమాయకుడే . విలనో గిలనో అంటూ వుంటే అది ' అజ్ఞానం ' మాత్రమే , యీ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టడానికి విద్య అనే దీపం కావాలి , ఆ దీపాన్ని అందుకొని వెలుగుని అందరి జీవితాలలోకి తీసుకొని వెళ్ళే చేతులు నీవి కావాలి . అందుకే నీకా భాధ్యతని వొప్ప జెప్పుతున్నాను . నువ్వు యీ బాధ్యతని సమర్ధ వంతంగా నిర్వర్తించ గలవని నాకు తెలుసు . ఇప్పటికే చాలా రాత్రయింది యింక నిద్రపో " అంటూ కొంగు కప్పుకొని నిద్రకి వుపక్రమించింది .

నాన్నత్త కోపానికి అర్ధం తెలుసుకున్న ప్రభ నాన్నత్త ఆశయాన్ని నెరవేర్చాలని తనకు తానే వాగ్దానం చేసుకుంది . తరతరాలుగా తమ యింట్లో పని చేస్తున్న ఆదెమ్మ మనవరాలు లక్ష్మే తన మొదటి దివ్వే కావాలి . రేపే వాళ్ల వాడకి వెళ్లి లక్ష్మి వయసు వాళ్లతో నాన్నత్త ఆశయానికి నాంది పలకాలి . మంచి పనికి ముహూర్తం చూడవలసిన పని లేదు . భారత దేశం నుంచి నిరక్షరాస్యతను పారద్రోలినట్లు , దేశ ప్రజలు విధ్యావంతులు గాను వివేక వంతులుగాను అయినట్లు , నాన్నత్త కౌగలించుకొని అమ్మలూ నా కోరిక తీర్చేవే అంటూ వెన్ను నిమురుతున్నట్లు ఏవేవో కలలతో కలత నిద్ర పోయింది ప్రభ .

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ