గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue139/3561/telugu-stories/amruta/
.........................................చటుక్కున ఈ లోకం లోకి వచ్చాను. ఒక్కసారిగా తల విదిల్చా. ఛా ! తప్పుచేస్తున్నానా అనిపించింది. వెంటనే గదిలోకి వచ్చేసాను. లాభం లేదని బ్యాగ్ లోన్చి జండుబాం తీసి కళ్ళకు పట్టించి పడుకున్నా. ఎంత పని జరిగింది. ఒకవేళ అమృత చూసి వుంటే? మై గాడ్..! ఒక్కసారిగా పాతాళం లో పడిపోతున్న ఫీలింగ్!
కళ్ళు మూసుకున్నా, మనసు అమృత చుట్టే తిరుగుతోంది. డిగ్రీ మూడేళ్ళు తనను ఎంతగా ఆరాధించే వాణ్ణో నా కన్నా తనకే తెలుసు. క్లాస్ మేట్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ అదేంటో తను నా పై ఆసక్తి కనబరచిన సంఘటన ఒక్కటి కూడా లేదు. అయినా మనసులో ఏదో నమ్మకం. తన మనసులో నేనున్నానని, ఆలోచనలు వెనక్కి వెళుతున్న కొద్దీ జీవితం ఇప్పటి కన్నా పచ్చగా, మధురం గా అనిపించసాగింది . ఈ అయిదేళ్ళలో ఎప్పుడూ ఇంత ఆనందించిన క్షణాల్లేవు. డిగ్రీ కాగానే నాన్న ఆకస్మాత్తుగా కనుమూయడం, కారుణ్య నియామకంగా ఉద్యోగం రావడం .. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ ఒకదాని వెనుక ఒకటి వరుస సంఘటనలన్నీ మహా ప్రవాహం లా వచ్చి నా జీవితాన్ని లాగేసాయి. ఈ సందడిలో పెళ్ళిచేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. రాలేదు అనడం కన్నా అనుకోలేదు అంటేనే బెటర్. అలా అనుకోకపోవడానికి అమృతపై నా క్రష్ కారణమా? అంటే నా వద్ద సమాధానం లేదు. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నా
.
**********************
"కల్యాణ గోపాలం.. కరుణాల వాలం" నారాయణ తీర్థుల తరంగం వున్ని కృష్ణన్ గొంతులోంచి స్వరధారలా వుబికి వస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచాను. పాట ఎంత అద్భుతంగా వుంటుందో, ఎన్ని సార్లు విన్నా గుండె ఇట్టే కరిగిపోతుంది. కిటికీలోంచి చూస్తే... అప్పుడప్పుడే తెల్లారుతున్న మనోహర దృశ్యం కనిపించింది. రూం నుంచి బైటికి వచ్చాను. అమృత లేచినట్టుంది. ఆ మసక వెలుతురులో బ్లూ జీన్స్, జుబ్బా వేసుకుని మొక్కలకు నీళ్ళు పడుతున్న తనను చూస్తుంటే "చీకటి నవ్విన చిన్ని వెలుతురివా... వాకిట వెలసిన వేకువ తులసివా" అన్న తిలక్ పద్యమే గుర్తొచ్చింది. బహుషా తిలక్ మనో ఫలకం పై ఇలాంటి దృశ్యమే మెరిసిందేమో! టీపాయ్ పై వున్న పేపర్ తిరిగేస్తుంటే అమృత వచ్చింది.
"హాయ్.. గుడ్ మార్నిగ్.. త్వరగా ఫ్రెషప్ అయిరా.. అంటూ" లోపలికి వెళ్ళింది. నేరుగా తన మొహం లోకి చూడలేకపోయాను. నిన్న రాత్రి తప్పు చేశానేమోనని మనసులో తెలీని అలజడి. మౌనం గా వెళ్ళి ఫ్రెషప్ అయ్యాను. త్వరగా ఇక్కడ్నుంచీ బైట పడటం అనిపించింది. చకచకా సూట్కేసు సర్దుకున్నాను. "కాఫీ రెడీ" అమృత కేకతో బైటికి వచ్చా. టీపాయ్ పై కాఫీ కప్ పొగలు కక్కుతోంది.
మౌనం గా సిప్ చేస్తుంటే
"ఏంటీ డల్ అయిపోయావు. డిల్లీ గుర్తొచ్చిందా" అంది అమృత.
"ఆ.. వెళ్ళాలిగా పనులు బోల్డెన్ని వున్నాయి" నా గొంతు నాకే కృతకంగా వినిపించింది.
"ఓకే సర్ యాజ్ యూ లైక్. అయితే ఓ కండీషన్ .. ఇవాళ ఊర్లో చిన్న పిల్లల కార్యక్రమం వుంది. అది చూసుకుని వెళ్దువు గానీ సరేనా!అమృత మాటలకు నో చెప్పలేకపోయాను. నా మనసులో భావాలు తెలిస్తే ఎంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యేదో ఊహించుకుంటూనే తలూపాను.
కార్యక్రమం చక్కగా సాగింది. పిల్లలపై అమృతకున్న ప్రేమ కన్నా .. ఆ ఊరి ప్రజలకు ఆమెపై వున్న నమ్మకం అడుగడుగునా కనిపించింది. వారితో తను మమేకమైన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత నన్ను పరిచయం చేసింది. చివర్లో వెళుతూ వెళ్తూ
"అమృతా అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి రావచ్చా?" అడిగా నవ్వుతూ తలూపింది. రెండడుగులు వేసి ఆగాను.
"నీ కాంటాక్ట్ నెం.."
గట్టిగా నవ్వింది.
నాకూ ఇవ్వాలనే వుంది. ఏం చేయను? సెల్ వాడనుగా...! అంటుంటే
పెదాలపై బలవంతం గా నవ్వు పులుముకుంటూ కదిలాను.
...........సరిగ్గా పదిరోజులు తర్వాత .. అమృత నుంచి
నా కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి.
మాధవ్.. ఈ పాటికే నువ్వు బిజీగా మారిపోయి వుంటావని అనుకుంటున్నాను. జీవితం ఇలాగే వుంటుంది మరి. నడుస్తున్న కొద్దీ కొన్ని దృశ్యాలు వెనుకవుతుంటాయి. అవి గతం అనే ఖాతాలో జమవుతుంటాయి. నన్ను కలిసినప్పుడు ఎంత ఉద్వ్వేగానికి లోనయ్యావో నాకు తెలుసు. ఆ రోజు రాత్రి గుమ్మం వద్ద నిలుచుని నా వైపు తదేకంగా చూసింది కూడా తెలుసు. ఓ మాట చెప్పనా... నువ్వు వెనుదిరిగి గదిలో వెళ్ళిన ఆ క్షణాన నీ పై గౌరవం రెట్టింపయింది. మాధవ్ నా గతం మీ కెవరికీ చెప్పలేదు. నేను అనాధగా పెరిగాను. బంధాలు, అనుబంధాలపై పెద్దగా అవగాహన లేదు. డిగ్రీ కాన్వొకేషన్ రోజున నువ్వు ప్రపోజ్ చేయాలనుకున్నట్టు తెలిసే నేను రాలేదు. ఎందుకంటే రెండు రోజుల కిందటే మీ నాన్న లోకం నుంచి నిష్క్రమించడంతో మీ కుటుంబం కుంగి వుంది. నీ పై బాధ్యత వుంది. ఈ వ్యవహారం వల్ల దెబ్బతినరాదనుకున్నా. ఆ తర్వాత కొద్ది కాలానికే నా పెళ్ళి జరిగిపోయింది. కానీ ఇప్పటికీ నా ఆలోచనల్లో వున్నావని తెలుసుకున్నాను. అది వద్దని చెప్పడానికే ఈ ఉత్తరం. బాధ్యతలు ఓ కొలిక్కి వచ్చిన ఈ సమయం లో మంచి అమ్మాయిని జీవితం లో ఆహ్వానించు. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన నాతో నీ ప్రయాణం సాఫీగా సాగదు. బహుశా నాకు కూడా అంతేనేమో! ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ వాత్సల్య . ఓ మాట చెప్పనా.. జీవితం పాతబడిందని ఓ ఎల్ ఎక్స్ లో పెట్టి వదిలించుకోలేం కదా. పాత అనుభవాలను మోసుకుంటూ వున్నాన్నాళ్ళు సాగిపోవాల్సిందే. నాకు నచ్చిన రీతిలో స్వేచ్చగా బతకడానికి అలవాటుపడ్డాను. మళ్ళీ జీవితం లో ఏ రకంగా ఆంక్షలు వచ్చినా భరించే స్థితిలో లేను. మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే. వాత్సల్యకు నీ ప్రోత్సాహం అవసరం. ఈ సారి జంటగా వస్తావని ఆశిస్తున్నా - చిరునవ్వుతో అమృత.
నిశ్శబ్ధం గా ఉత్తరం మడిచాను. ఏదో చెప్పలేని భావన మనసులో ముప్పిరిగొంటోంది. జీవితం పై తనకున్న స్పష్టతకు మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఎవరికైనా వారి జీవితంపై ఎక్స్ పెక్ టేషన్స్ వుండటం సాధారణమే. నాలాగా . అయితే కొందరికే జీవితాన్ని యధాతధం గా స్వీకరించాలన్న వాస్తవ స్పృహ వున్న మనస్థితి వుంటుంది. అమృత లాగా . నిజమే తనకు గతం పై అవగాహన వుంది. భవిష్యత్తుపై స్పష్టత వుంది. స్వేచ్చగా రెక్కలార్చాలనుకుంటున్న అమృతను ప్రేమపంజరం లో బంధించాలనుకోవడం ఎంత వరకు సబబు? మెల్లగా నా భావోద్వేగం చల్లారి, వాస్తవాలోచనలు కుదురుకోసాగాయి. పోలిక సరి అవునో కాదో తెలీదు గానీ, అమృత ఉత్తరం... అయోమయం లో వున్న అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన గీతలా అనిపించింది.