నేస్తం.. నీవే సమస్తం - అశోక్ పొడపాటి

nestham neve samastham telugu story

‘ఏరా... నలుగురు ఎప్పుడూ అతుక్కుని తిరుగుతుంటారు. కనీసం పెళ్లిళ్లయినా విడివిడిగా చేసుకుంటారా... లేకపోతే ఒకే దానికి ముడేస్తారా...’ మా ఊరి వాళ్లు అనే మాటలు విన్న ప్రతిసారీ తెలియని ఆనందం. మా స్నేహాన్ని చూసి అసూయతో వాళ్లంటున్న మాటలు వింటే ఒకింత గర్వం.

మా స్నేహం ఎప్పుడు మొదలైందో గుర్తులేదుగానీ ఊహ తెలిసినప్పటి నుంచి కలిసే ఉన్నాం.

ఒకే రకం ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వారి స్నేహం శాశ్వతంగా నిలిచి ఉంటుందనే సిద్ధాంతం మా విషయంలో అక్షరాలా అబద్ధం. నిజానికి మా నలుగురి వ్యక్తితాలు వేరు. నేపథ్యాలు వేరు. ఇద్దరు పదోతరగతితోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఒకరు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, మరొకరు ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డారు. నేను రేయింబవళ్లు కష్టపడి చదివి ముప్పయ్ ఐదు మార్కులకు ఒక్కటి కూడా ఎక్కువ కాకుండా మార్కులు తెచ్చుకుంటూ డిగ్రీ వరకూ వచ్చాను. కానీ వాడు బిట్స్ లో ఇంటర్‌ చదివాడు. ఇప్పుడు అహ్మదాబాద్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. మా కన్నా తెలివైనవాడు, అందగాడు, ఆస్తి బాగా ఉన్నవాడు. వాడితో స్నేహానికి ఊరుఊరంతా వెంట పడుతుంటే వాడు మాత్రం మా వెంటే ఉంటాడు. వాడికి సెలవులిస్తే మాకూ ఇచ్చినట్లే. మా అందరి మకాం ఊరి చివర చింతతోపులోనే. వాడు ఉన్నన్ని రోజూలూ మాకు వేడుకే. సినిమాలు, షికార్లతో సమయమే తెలిసేది కాదు.

కాలేజీ నుంచి వాడి స్నేహితులు ఎవరైనా ఫోన్‌ చేస్తే వాళ్లతో చక్కని ఇంగ్లీష్, హిందీల్లో మాట్లాడతాడు. ఊరిలో గేదెలు కాసుకునేవాళ్లు, కూలి పనులకు వెళ్లే వాళ్లు ఏదైనా అడిగితే వాళ్లకు అర్థమయ్యేలా సమాధానం చెబుతాడు. సైంటిఫిక్‌ డెవలప్‌మెంట్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... వాడికి తెలియని విషయం లేదు. వాడు మాకో ఆశ్చర్యం, ఓ అద్భుతం. మాకు తెలిసిన చిన్న ప్రపంచానికి ఐన్‌స్టీన్‌.

ఏరా...నీ స్థాయిలో చదివే వాళ్లతో స్నేహం చేస్తే రేపు నీకేదైనా ప్రయోజనం ఉంటుంది కానీ, ఆ గాలి ఎదవల్తో తిరిగితే ఏం లాభం... అని అమ్మనాన్న ఒకరోజు వాడ్ని అడిగారు. దానికి వాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా... లాభాలు, నష్టాలు బేరీజు వేసుకుని చేయడానికి ఇది వ్యాపారం కాదు... స్నేహం. ఇక మళ్లీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. నిజానికి దేవుడు మాకు పెద్దపెద్ద చదువులు, చదివే తెలివి తేటలివ్వలేదు. అందచందాలు, ఆస్తిపాస్తులు... ఏవీ ఇవ్వకుండా భూమి మీదకు తోసేశాడు. పాపం దేవుడు అంతలోనే జాలిపడి, తన తప్పుకు తానే పశ్చాత్తాప్పడి ‘మిల్లీగ్రామ్‌ మెదడు కూడా లేని వీళ్లు ఎలా బతుకుతారో అని ఆలోచించి, మాకు తోడుగా వాడ్ని పంపాడని’ మేమెప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అంటే దీనర్థం వాడి మీద పడి బతికేద్దామని కాదు... వాడు తోడుగా బతికేద్దామని.

కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా. నేనొకణ్ని ఉన్నాను అని గుర్తు చేయడానికి దేవుడు అప్పుడప్పుడు చిన్నచిన్న పరీక్షలు పెడుతుంటాడు. ఇప్పుడు అలాంటి పరీక్షే వాడికి ఎదురైంది. ఏదో చిన్న అనారోగ్యంతో ఊరికి వచ్చాడు. అమ్మానాన్నలతో కలిసి టౌన్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి పెద్దాస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అక్కడా పరీక్షలు చేశారు. ఎక్సరేలు, స్కానింగ్‌లూ తీశారు. చివరకు స్టమక్‌ క్యాన్సర్‌ అని తేల్చేరు. వ్యాధి రెండో దశలోనే ఉందని కీమోథెరపీతో ప్రయోజనం ఉండొచ్చని చెప్పారు.

ట్రీట్‌మెంట్‌ ప్రారంభమైంది. ఆరునెలలు గడిచాయి. మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. జుట్టు ఊడిపోయింది. చర్మం నల్లబడింది. కళ్లు, చెక్కిళ్లు పీక్కుపోయి... చర్మం కప్పుకున్న అస్తిపంజరంలా తయారయ్యాడు. పాతికేళ్లు కలిసి తిరిగిన మాకే వాడ్ని గుర్తుపట్టడానికి పావుగంట పట్టింది.

లోకంలో ఇంతమంది ఉంటే ఈ జబ్బు మా కొడుక్కే రావాలా... వెక్కివెక్కి ఏడుస్తున్నారు వాడి అమ్మానాన్న. అంతటి విషమ పరిస్థితిలోనూ వాడు నిబ్బరాన్ని కోల్పోలేదు. నాకొచ్చింది కాబట్టే బతికున్నా. అదే ఇంకెవరికైనా వచ్చుంటే జబ్బు ముదిరిపోయే వరకూ గుర్తించేవాళ్లు కాదు. మూడు నెలల్లో ట్రీట్‌మెంట్‌ పూర్తవుతుంది. ఏడాదిలో మళ్లీ మామూలు మనిషినవుతానని అందరికీ ధైర్యం చెప్పేవాడు. ఆస్పత్రికి వెళ్లిన మాతోనూ సరదాగానే మాట్లాడేవాడు. ఎవరైనా సానుభూతిగా మాట్లాడితే ఒప్పుకునే వాడు కాదు. వాడికి చెస్‌ ఆడాలని ఉందంటే కాసేపు ఆడి ఇంటికి వచ్చాం. కొద్ది సేపు ఆడి మేము ఆట ఆపాం. మరుక్షణం ఆట దేవుడు మొదలు పెట్టాడు... బ్రెయిన్‌ స్ట్రోక్‌ రూపంలో. అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన తలనొప్పితో విలవిల్లాడిపోయాడు. డాక్టర్లు వచ్చి చూసేలోపే తలలో నరాలు చిట్లి చ..ని..పో..యా..డు.

ఆ వార్తను నమ్మడం మావల్ల కాలేదు. వాడికి క్యాన్సర్‌ అని తెలిసినా మేము భయపళ్లా. కాన్సర్‌ మీదున్న భయం కన్నా వాడి మీదున్న నమ్మకం మాకెక్కువ. క్యాన్సర్‌ పిరికిది. మనల్ని చంపే దమ్ము ఆ క్యాన్సర్‌ గాడికి లేదులే అని వాడే సరదాగా అంటుండే వాడు. కానీ ఇప్పుడు ఇలా..! మృతదేహాన్ని ఉదయాన్నే ఊరికి తీసుకొచ్చారు. చూసేందుకు ఊరుఊరంతా కదలి వెళ్లింది. విగతజీవిగా పడి ఉన్న వాణ్ని చూసి కన్నీటి సంద్రమైంది. బాడీ డీకంపోజ్‌ అవుతుండటంతో మధ్యాహ్నమే అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మేళతాళాలతో వాడి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు...సాయంత్రానికి గుప్పెడు బూడిదగా మిగిలిపోయాయి. ‘ఇన్నాళ్లూ కలిసి తిరిగి ఇప్పుడు కనీసం చూడ్డానికి కూడా రాలేదు చూడు...ఏం స్నేహితులో ఏమో..!’ ఊళ్లో రకరకాల వ్యాఖ్యానాలు.

నిజమే మేము వాడ్ని కడసారి చూసేందుకు వెళ్లలేదు. వాడ్ని అలా చూసే శక్తి లేదు. చూసి తట్టుకునే ధైర్యం లేదు. ఊళ్లోవాళ్లకి మాట్లాడుకోవడానికి రెండు రోజుల్లో కొత్త టాపిక్‌ దొరుకుతుంది. మిగిలిన ఇద్దరు పిల్లల్ని చూసుకుని వాడి అమ్మానాన్న నెమ్మదిగా బాధను మర్చిపోతారు. అలా చూసుకుని మర్చిపోవడానికి మాకు మరో స్నేహితుడు లేదు. అయినా ఎప్పుడూ కళ్లముందు ఉండేవాడ్ని కడసారి చూడ్డమేంటి. అర్థం లేని మాట. వాడు మాతో మాట్లాడిన మాటలు, నవ్వుకున్న నవ్వులు, కలిసి తిరిగిన రోజులు, చూసిన సినిమాలు, తాగిన వన్‌ బై టూ చాయ్‌లు, చింతతోపులో గంటలకు గంటలు చెప్పుకున్న కబుర్లు మా స్మృతిపథంలో సజీవంగా ఉంటే... వాడు లేడని నమ్మేదెలా. ఇక ముందూ చింతచెట్టు కొమ్మమీద మేమున్నప్పుడు మధ్యలో వాడికి చోటుంటుంది. సినిమాహాల్‌కు వెళితే నాలుగు టికెట్లు. హోటల్‌కి వెళ్తే టూ బై ఫోర్‌ ఛాయ్‌. పండగోస్తే నాలుగు జతల బట్టలు. దేనిలోనూ మార్పుండదు. ప్రతి మనిషి గుండెలో నాలుగు గదులుంటాయంటా. ఒకదాంట్లో ఎప్పటికీ వాడే...పదిలంగా. మా ప్రతి వ్యాపకంలో, జ్ఞాపకంలో వాడుంటే.. చనిపోయింది ఎక్కడ... దేవుడు గెల్చింది ఎక్కడ.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు