శాంతమ్మ - లాస్య రామకృష్ణ

shanthamma telugu story

"నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు. నేనింకా ఆ జ్ఞాపకాలలోంచి బయటపడలేదని రొజూ నన్ను నిద్రలేపే ఈ పాట గుర్తుచేస్తోంది. అవును మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళని ఎలా మరచిపోతాము. నా ఈ జీవితమే ఆ తల్లి దయ. ఆవిడే శాంతమ్మ.

శాంతమ్మ.... శాంతమ్మ..... నా ఈ జీవితం ఆవిడ కృపే. ఏ జన్మ రుణానుబంధమో ఇది.

**** **** **** ****

"మా మాట వినకుండా ఇలాంటి సమయం లో నువ్వు దూరంగా వెళుతున్నావు. అయినా నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాము. అక్కడ జాగ్రత్తగా ఉండు. వేళకి భోజనం చెయ్యి. వేళకి నిద్రపో" అని మా అమ్మ ఇప్పటికే ఒక వెయ్యి సార్లు చెప్పుంటుంది.

ఇప్పటివరకూ నేను మా ఊరు దాటి ఎక్కడికీ వెళ్లి ఉండలేదు. ఉద్యోగ రీత్యా వెళ్ళవలసి వస్తోంది. ఈ ఊరు, అమ్మా, నాన్నా వీటన్నిటికీ దూరం గా వెళ్ళవలసి వస్తోంది.

"అలాగే నమ్మా, నువ్వూ నాన్నా జాగ్రత్త. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పి బయలుదేరాను.

నాన్న నన్ను దిగపెట్టడానికి రైల్వే స్టేషన్ వరకు వచ్చి "అంకుల్ వాళ్ళకి చెప్పాను నీకు ఇల్లు ఏర్పాటు చేస్తారు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి వచ్చి నిన్ను పిక్ అప్ చేసుకుంటాడు. ఏమైనా అవసరం అయితే మొహమాటపడకుండా అంకుల్ వాళ్ళని అడుగు. జాగ్రత్త" అని చెప్పి రైలు బయలుదేరినా నాకోసం అక్కడే ఉన్నారు. కనుచూపుమేర వరకు మేమిద్దరం ఒకరికొకరం చేతులు ఉపుతూనే ఉన్నాము.

మొదటసారి ఇలా నేను ఒంటరిగా వేరే ప్రదేశానికి వెళ్ళడం కొంత థ్రిల్లింగ్గా కొంత భయంగా ఉంది. అక్కడి వాతావరణం అలవాటు అవుతుందో లేదో. అక్కడ మనుషుల మనస్తత్వాలు ఎలాంటివో. ఇలా ఆలోచనలతో నా మెదడు నిండిపోయింది.

నేను ఉద్యోగ రీత్యా మా ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. మా ఊర్లోని పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పల్లెటూరి ఆడపడుచుల సందడులు ఇక్కడ ఉండకపోయినా తప్పదు కాబట్టి ఇక్కడే కొన్నాళ్ళు ఉండాలని డిసైడ్ అయ్యాను.

ఆ సిటీ కి చేరగానే మా అంకుల్ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను పిక్ అప్ చేసుకుని ముందుగా వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు.

అంటీ నాకోసం టిఫిన్ రెడీ చేస్తోంది. నేను వాళ్ళని పలకరించి ఫ్రెష్ అప్ అయి వచ్చాను.

"అయ్యో అంటీ మీకెందుకండీ శ్రమ"

"శ్రమ ఏమిటయ్యా. నువ్వూ మా అబ్బాయిలాంటివాడివే మొహమాటపడకుండా తిను" అని కొసరి కొసరి వడ్డించారు.

అంకుల్ కూడా సరదా మనిషి వాళ్లతోటే ఉండమని కూడా అడిగారు. కానీ నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనిపించలేదు. వాళ్ళ కే ఈ సిటీ నుండి కొన్ని కిలోమీటర్ల దూరం లో అందమైన ఇల్లు ఉంది. నేను అందులో ఉండబోతున్నాను.

టిఫిన్ చేసాక అంకుల్ నన్ను వాళ్ళ కారులో ఈ ఇంటికి తీసుకువచ్చారు. ఇల్లు అద్భుతంగా ఉంది. ఎలా అయితే నేను ఊహించానో అంతకి ఎన్నో రెట్లు అందంగా ఉంది. వీళ్ళు సిటీ లో ఉండాలని ఎంత అందమైన ఇంటికి దూరం గా ఉంటున్నారు అని వాళ్ళని చూస్తే కొంత జాలి వేసింది.

కాసేపయ్యాక అంకుల్ వెళ్ళిపోయారు. ఆ ఇంటి అందాన్ని, చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రపోయాను.


**** **** **** ****

ఉదయమంతా కృత్రిమ నవ్వులతో ఉండే ఆఫీసు వాతావరణం లోంచి కొంచెం ఉపశమనం లభించేది ఇంటికి చేరుకున్నప్పుడే కదా. అందుకని అందరిలాగా ఏదో ఒక హాస్టల్ లో ఉండకుండా నాకంటూ ఒక ప్రశాంతమైన ఇల్లు ఉంటే మంచిదని ఎంతో జాగ్రత్తగా ఏరి కోరి ఇక్కడకు వచ్చాను.

మా ఆఫీసుకి చాలా దూరంగా ఉన్నా సహజంగా ప్రకృతి ప్రేమికుడిని కాబట్టి దూరంగా పట్టుమని పది ఇల్లు కూడా లేని ప్రాంతంలో ఈ ఇంటిని అద్దెకి తీసుకున్నాను. నాన్నగారికి తెలిసిన వారు కావడం వల్ల అద్దె కూడా ఎక్కువ అడగలేదు. అసలేం ఇవ్వద్దని అన్నారు. కానీ ఉరికే నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. అందుకే నేను అద్దె తీసుకుంటేనే ఈ ఇంట్లో దిగుతానని చెప్పడంతో మొహమాటానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఈ సిటీలోనే ఉంటారు. నా ప్రైవసీ ని గౌరవిస్తూ నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడే మాట్లాడతారు. నేను ఫ్రీగా ఉన్నానా అని అడిగి వాళ్ళ ఇంటికి రమ్మంటారు. అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను.

ఈ ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ తన బైక్ ని అమ్ముతున్నాడని తెలుసుకుని నాకు ఎలాగో ఉపయోగపడుతుంది కదా అని తీసుకున్నాను. జీవించే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఎప్పుడో సంతోషంగా ఉందాం ఇప్పుడు డబ్బులు దాచుకుని అనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే నాకు నచ్చిన ప్రదేశంలో ప్రకృతి ఒడిలో సేద దీరెందుకు ఒక చక్కటి ఇంటిలో అద్దెకుంటున్నాను.

నగర జీవనంలో ఉన్న గజిబిజి గందరగోళం, కలుషిత ప్రాంతాలకి దూరంగా హాయిగా అనిపించింది ఈ ప్రాంతం. చుట్టూ మావిడికాయ, సపోటా, బొప్పాయ, జామ చెట్లు. దారిపొడుగునా పూల చెట్లు రోజూ పలకరిస్తాయి. మా ఊర్లోని మా ఇల్లు తరువాత నాకు నచ్చిన ప్రాంతంగా ఈ ఇల్లు మారిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు.

ఇంటి ముందు పెద్ద వాకిలి. వాకిలిలో ఒక వరసగా చక్కటి డిజైన్ లో ఏర్పాటు చేసిన పూల మొక్కలు. చిన్న సైజు గార్డెన్ లా ఉంటుంది మా వాకిలి. ఆ మొక్కల మధ్య ముచ్చట గొలిపే శ్రీ కృష్ణుడి బుల్లి విగ్రహం. నాకు చాలా ఇష్టమైన ప్రదేశాలలో ఈ వాకిలి ఒకటి. హాయిగా చల్లటి సాయంత్రం వేళ ఈ వాకిటిలో రేడియోలోని అచ్చ తెలుగు పాటలు వింటూ మైమరచిపోవడం అంటే నాకు ఇష్టం.

మా నాన్నగారి స్నేహితుడు ఇంటిపని కోసం ఒక పనిమనిషిని ఏర్పాటు చేసారు. ఆవిడకి ఎభయి అయిదేళ్ళు ఉంటాయి. ఆవిడే శాంతమ్మ. తన స్వంత కొడుకులా చూసుకుంటుంది. వంట కూడా చేసిపెడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఆరుగంటల కల్లా ఇంటికొచ్చి పనులన్నీ చేసిపెట్టి వంట చేసి నాకోసం కాఫీ చేసిపెడుతుంది శాంతమ్మ. చాలా కొద్ది రోజులలోనే ఆవిడంటే అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి.

ఆవిడ స్వంత విషయాలు ఎప్పుడూ నేను అడగలేదు. ఆవిడ కూడా చెప్పలేదు. హాయిగా పాటలు పాడుతూ పనులు చేస్తుంది. ఆదివారం కూడా వచ్చి పనులు చేసి వెళ్తుంది. ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను కదా సెలవు తీసుకో శాంతమ్మ అంటే "పరవేలేదయ్యా, మా అబ్బాయి అయితే నేను చేసిపెట్టనా" అని నవ్వేసేది. ఆవిడ నవ్వులోని ప్రశాంతత కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకి కూడా రాదు. అంతటి స్వచ్చమైన నవ్వు ఆవిడది.

ఈ ఊర్లో నాకు కొత్తగా స్నేహితులు కూడా ఏర్పడ్డారు. వాళ్ళు కూడా బ్యాచెలర్స్. హాస్టల్ లో ఉంటారు. హాస్టల్ లో డ్రింక్స్ అనుమతించరనీ నా ఇంటికి వచ్చి వీకెండ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తామని చేరినప్పటి నుండి గోల పెడుతున్నారు.

నాన్నగారి క్రమశిక్షణ నాకు బాగా అలవరడం, ఇంకా భగవంతుని దయ వలన నాకు తాగుడు అలవాటు లేదు. తాగుడు వంటి కార్యక్రమాలు ఇక్కడ చెల్లవు అని నిర్మొహమాటంగా చెప్పేసాను. నాకు నచ్చని విషయాలు సూటిగా చెప్పే మనస్తత్వం నాది. అందువల్ల నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. నన్ను అర్ధం చేసుకునే అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే కలరు. వారి సంఖ్యని వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. అందరికీ బోలెడు మంది స్నేహితులు ఉంటారు. ఎలా సాధ్యం అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది.

నాతో ఎల్లప్పుడూ ఉండే నా స్నేహితులు నేను అమూల్యంగా సేకరించుకున్న పుస్తకాలు. నాకు లాలి పాడే అన్నమయ్య కీర్తనల పుస్తకాలు. నాకు ఏదైనా బాధ కలిగినా ఓదార్చి నాకు తిరిగి ప్రేరణ కలిగించే Motivational బుక్స్. నాలోని రచయితను నిద్రలేపే నా డైరీ. సరదాగా ఉండే నవలలు. ఇవే ప్రస్తుతానికి నా లోకం. ఊర్లో ఉన్న అమ్మమీద, నాన్నమీద బెంగని త్వరగా నయం చేసిన ఇవే నా స్నేహితులు.

అలా కొద్ది రోజులలోనే నా జీవితంలో ముఖ్య పాత్రలుగా ఈ ఇల్లు, కొత్తగా చేరిన ఆఫీసు, నా నేస్తాలైన పుస్తకాలు ఇంకా శాంతమ్మ ప్రవేశించారు.

అలా రోజులు ప్రశాంతం గా గడిచిపోతున్నాయి. ఆ మర్నాడు క్లైంట్ విసిట్ ఉందని త్వరగా ఆఫిసు కి రావాలని మా మేనేజర్ ఫోన్ లో మెసేజ్ పెట్టాడు.

త్వరగా లేచి వెళ్ళబోతున్న సమయం లో శాంతమ్మ వచ్చింది. శాంతమ్మ కి జ్వరం వచ్చి రెండు రోజులు ఇంటికి రాకపోవడం చేత ఇంట్లో అంట్లు అలాగే వాసన వేస్తున్నాయి.

"శాంతమ్మ, నువ్వు అంట్లు తోమేసి వెళ్ళు. మళ్ళీ సాయంత్రం రా" అని తాళం చెవులు ఇచ్చాను. అప్పుడప్పుడు నేను ఆఫీసుకి త్వరగా వెళ్ళాల్సినప్పుడు తాళం చెవులు శాంతమ్మకి ఇవ్వడం నాకు అలవాటే.

ఆఫిసు పని ముగించుకుని ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు సడెన్ గా గుర్తొచ్చింది. ఈ ఊర్లో నేను తీసుకోబోతున్న స్థలం రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బులు డ్రా చేసి ఇంట్లోనే కప్ బోర్డులోఉంచిన సంగతి. ఆ సంగతే మరచిపోయాను. ఇంట్లో ఏమీ విలువైనవి లేనప్పుడు తాళాలు ఇవ్వడం వేరు. ఇప్పుడు వేరు. మనుషుల ప్రవర్తన మన ముందు ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుందనుకోవడం మంచిది కాదు అనుకుంటూ హడావిడిగా ఇంటికి బయలుదేరాను.

ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అవసరం అనుకున్నప్పుడే అన్నీ ఇబ్బంది పెడతాయి అనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవగానే వేగంగా బయలుదేరాను.

**** **** **** ****

కళ్ళు తెరవడం చాలా కష్టంగా ఉంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచాను.

హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. నా చుట్టూ ఏడుస్తూ అమ్మా నాన్నా.

"ఎందుకురా అంత హడావిడి. కొంచెం మెల్లగా రావచ్చు కదరా" అని అమ్మ ఏడుపు గొంతు.

"డబ్బు, డబ్బు" అని అతి కష్టం మీద మాట్లాడగలుగుతున్నాను

"ఏమైందిరా ఎలా అయిపోయావో చూడు. అదృష్టం బాగుండి హెల్మెట్ వేసుకున్నావు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో సరిపోయింది" అని నాన్నగారు మాట్లాడుతున్నా వినిపించుకోకుండా

"డబ్బు, అమ్మ డబ్బు ఏమైంది" అని అడుగుతూనే ఉన్నాను

"డబ్బా, ఏ డబ్బు" అని నాన్న గారు అడిగారు

"ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు ఇంట్లో పెట్టాను"

"ఇంట్లో పెడితే ఇంట్లోనే ఉంటాయి" అని ఏమాత్రం కంగారు లేకుండా ఉంది అమ్మ జవాబు

"అది కాదు నాన్నా, ఆ రోజు ఆఫీసు హడావిడిలో డబ్బులు ఇంట్లో ఉన్న సంగతి మరచిపోయి తాళాలు శాంతమ్మకి ఇచ్చాను"

"ఎంత డబ్బు" నాన్నగారి ప్రశ్న

"మూడు లక్షలు"

"అవునా, నిన్ను ఇవాళ డిశ్చార్జ్ చేస్తారు కదా వెళ్లి చూద్దాం" అని నాన్న నన్ను సముదాయించడానికి ప్రయత్నం చేసారు.

అమ్మా నాన్నా, ఇంట్లో డబ్బు కంటే నేను వాళ్ళకి దక్కినందుకు దేవుడికి నమస్కరించుకుంటున్నారు. వాళ్ళకి అస్సలు డబ్బు గురించే బెంగ లేదు.

"ఏంటమ్మా కష్టపడి సంపాదించిన మూడు లక్షల రూపాయలు ఉన్నాయా లేవా అని నేను బాధపడుతుంటే మీకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదు" అని గట్టిగా అరిచేసరికి

"అంటే ఏంట్రా నీ ఉద్దేశ్యం. నువ్వు శాంతమ్మ ని అనుమానిస్తున్నావా" అని అప్పటి వరకు నా గురించి ఏడుస్తూ ఉన్న అమ్మ ఒక్కసారిగా కోపంగా మారింది

"అంటే........"

"అసలు నువ్వు బ్రతకడానికి కారణం ఆవిడే...." అని అమ్మ ఏదో చెప్పబోతుంటే నాన్న అడ్డుకుని

"ఒరేయ్ నువ్వు విశ్రాంతి తీసుకో. అన్ని సంగతులు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం" అని అన్నారు

"అమ్మా, ఏమైంది చెప్పు, నాకేమైంది అసలు"

"మీరు ఉండండి దేవతలాంటి శాంతమ్మ ని అనుమానిస్తున్నాడు. నన్ను చెప్పనివ్వండి అని నాతో జరిగిన విషయం చెప్పసాగింది

"ఆ రోజు నీకు ఆక్సిడెంట్ అయితే కొందరు మానవతా మూర్తులు నిన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. నీ పర్స్ లో ఉన్న అడ్రెస్ ప్రకారం నీ గురించి సమాచారం ఇవ్వడానికి నువ్వుంటున్న ఇంటికి వెళితే అక్కడ శాంతమ్మ కనబడిందట. ఆవిడకి చెప్పారు. మాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ అంత దూరం లో ఉన్నాం, రావాలంటే కనీసం ఆరేడు గంటలు పడుతుంది. ఈ లోపు హాస్పటల్ కి వచ్చిన శాంతమ్మకి డాక్టర్లు నీకు జరిగిన ఆక్సిడెంట్ గురించి వారు నిర్వహించిన టెస్ట్ ల ప్రకారం నీకు ఇదివరకే ఉన్న గుండె సమస్య గురించి చెప్పారు. ఆవిడ...."

"అమ్మా ఏడవకు ఏమయింది"

"నీకు ఆవిడ గుండె సరిపోతే అమర్చమని ప్రాధేయపడింది. డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. బ్రతికున్న వ్యక్తుల గుండెలు తీసుకోవడం అనాగరికం అని వాదించారు. ఆవిడ ఒక ఉత్తరంలో

"గుండె జబ్బు వల్ల చనిపోయిన మా అబ్బాయి ని నేను ఎలాగో రక్షించుకోలేకపోయాను. కనీసం నా కొడుకులాంటి వాడు అయిన ఇతనిని రక్షించే అవకాశం నాకు కల్పించండి" అని రాసి నీ బెడ్ పై న పెట్టి ఈ హాస్పిటల్ పై నుంచి దూకి చనిపోయింది. ఆవిడనా నువ్వు అవమానిస్తున్నావు"

ఆగకుండా వస్తున్న కన్నీరు తో "అమ్మా..." అని మా అమ్మను గట్టిగా హత్తుకున్నాను.

నన్ను డిశ్చార్జ్ చేసారు. అమ్మా నాన్నలతో నాకు ఒకప్పుడు ఎంతగానో ఇష్టమైన ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆ ఇంటిలో శాంతమ్మ లేదు. నేను కంగారుగా దేనికోసమైతే బయలుదేరితే ఆక్సిడెంట్ అయిందో ఆ డబ్బు కప్ బోర్డులో నన్ను వెక్కిరిస్తూ చూస్తున్నట్టనిపించింది.

శాంతమ్మ పేరిట ఆ డబ్బుని గుడిలో అన్నదానానికి వాడాలనిపించింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు