"బుల్లూ, ఆకలేస్తోందామ్మా.."
దాదాపు నాలుగు గంటల నిరీక్షణ తర్వాత లండన్ నుంచి హైద్రాబాదు వచ్చే బ్రిటిష్ అయిర్ వేస్ వారి విమానం యెక్కి, "హమ్మయ్యా.." అనుకుంటూ కళ్ళు మూసుకున్న సావిత్రమ్మ ఆ మాటలకి ఒక్క సారి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. యెక్కడా చిన్న పిల్లలు కనిపించ లేదు. తన పక్కన కూర్చున్నదెవరా అని నెమ్మదిగా తల తిప్పింది. ఒక కుఱ్ఱ జంట. బహుశా ముందు వరసలో యెవరైనా పిల్లలున్నారేమో అనుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకుందావిడ.
"నువ్వు యేర్ పోర్ట్ లో కూడా యేమీ తినలేదు బుల్లూ..నీరసంగా వుందామ్మా.."
మాటలు పక్క సీటు నుంచే. మాట్లాడేది ఆ పక్క జంట లోని పిల్లేనని ఆవిడకి అర్ధమై పోయింది.
అమెరికాలో కూతురి దగ్గర నాలుగు నెలలుండి, వెనక్కి హైద్రాబాదు వస్తున్న సావిత్రమ్మకి అరవైయేళ్ళు దాటాయి. భార్యని పేరు పెట్టి పిలవడమే చోద్యమనుకుంటున్న కుటుంబంలోని ఆవిడ యిన్నేళ్ళ జీవితంలో భర్తని కూడా పేరు పెట్టి పిలిచే రోజులు దాటి, భార్యా భర్తలిద్దరూ ముద్దు పేర్లతో పిలుచుకునే రోజులు వచ్చాయని యెప్పుడో గ్రహించేసింది. అందుకనే పక్కన కూర్చున్న అమ్మాయి మొగుణ్ణి పిలుస్తున్న పిలుపుకి ఆశ్చర్య పోకుండా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతూ, కళ్ళు చేసే పనిని కూడా చెవులకే అప్పగించేసింది.
"పోనీ పైన కాబిన్ బాగేజ్ లో కుకీస్, చిప్స్ వున్నాయి. తియ్యమంటావా బుల్లూ..నువ్వసలే ఆకలికి ఆగలేవు.."ఆడ గొంతే ఎంతో ప్రేమగా.
"పర్లేదురా బంగారం.."అంది మగ గొంతు.
"అవునూ, యింతకీ యేర్ పోర్ట్ కి మీ అమ్మ గారొస్తారా..మీ నాన్న గారొస్తారా బుల్లూ..?" ఆడ గొంతు అడిగిన ప్రశ్నకి వాళ్ల సంభాషణ ఏకాగ్రతగా వింటున్న సావిత్రమ్మ ఒక్క సారి ఉలిక్కి పడింది.
"తెలీదురా బంగారం.."మగ గొంతు నిరాశక్తత.
"పోనీ మీ యింటికి ఫోన్ చేసి రావద్దని చెప్తావా..యేం లేదూ..నువ్వొస్తున్నావు కదా..నీకు యేమేం యిష్టమో చెప్పమంది అమ్మ. అవన్నీ చేస్తుందిట."
"ఛ, అలా బాగుండదు. అత్తయ్య గారు యేదొండితే అదే తింటాను."
"యెందుకు బాగుండదు? పెళ్లైన రెండేళ్ళకి ఫస్ట్ టైమ్ అత్తారింటికి వస్తున్న అల్లుడివి. మాకు వి.ఐ.పి.వి కదా. యింతకీ మీ అమ్మ గారు యేర్ పోర్ట్ కి వస్తున్నారా..?"
"యేమోరా బంగారం నాకు తెలీదు కదా.."
సావిత్రమ్మకి అర్ధమై పోయింది.
ఓహో..పెళ్లై విదేశాలు వెళ్ళేక మొదటి సారి మళ్ళీ యిండియా వస్తున్నారన్న మాట వీళ్ళిద్దరూ. యెవరి పుట్టింటికి వెళ్ళాలో మొగుడూ పెళ్ళాలింకా తేల్చుకోలేదన్న మాట. సావిత్రమ్మకి కుతూహలం హెచ్చింది. వీళ్ళ మాటలు తప్పకుండా వినాల్సిందే. యెందుకంటే ఈ పిల్ల సీతక్క లాంటిదయితే మారు మాట్లాడకుండా తలొంచుకుని మొగుడి అడుగులో అడుగు వేసుకుంటూ అత్తారింటికి వెళ్ళిపోతుంది. పెద్దక్క లాంటిదయితే పైకి వినపడకుండా పళ్ళు కొరుక్కుంటూ, మొగుణ్ణీ అత్తగార్నీ తిట్టుకుంటూ అత్తారింటికి వెడుతుంది. బుల్లొదినలాంటిదయితే మొగుడితో వాదన పెట్టుకుని, మనసులోనే శాపనార్ధాలు పెట్టుకుంటూ మొహం ధుమధుమలాడించుకుంటూ అత్తారింటికి వెడుతుంది. లక్ష్మొదిన లాంటిదయితే మొగుణ్ణి కొంగున కట్టేసుకుని తన కూడా అతన్ని కూడా వాళ్లమ్మ గారింటికి లాక్కు పోతుంది. మరి ఈ అమ్మాయి యేం చేస్తుందో. "అయినా నా పిచ్చి కానీ ఈ అమ్మాయి మటుకేం తక్కువ తిందనీ. ఇందాకట్నుంచీ మొగుణ్ణి యెంతలా బుజ్జగిస్తోందీ "బుల్లూ..బుల్లూ.."అంటూ. యిందుకే నన్నమాట. అమ్మో. . ఈ రోజుల్లో అమ్మాయిలు మహా తెలివైన వాళ్ళు..అని లోలోపల సావిత్రమ్మ అనుకుంటుండగానే యెయిర్ హోస్టెస్ భోజనం తెచ్చింది.
భోజనం తినే వంకతో పక్కనున్న మొగుడూ పెళ్ళాల మాటలు మరింత స్పష్టంగా విన పడేలా మరి కాస్త ముందుకు వంగింది సావిత్రమ్మ.
"మా నాన్న గారు పెద్ద బండి తెస్తున్నారు. నాలుగు సూట్ కేసులూ పట్టాలి కదా. మీ అమ్మ గారికి ఫోన్ చేసి చెప్పు బుల్లూ..పాపం పెద్ద వాళ్లని యెందుకు శ్రమ పెట్టడం.."
"చూద్దాం లేరా బంగారం.."
సావిత్రమ్మకి అర్ధమై పోయింది్. ఆ పిల్లాడు చూద్దామూ అన్నాడంటే వాళ్ళింటికే లాక్కు పోతాడన్న మాట. ఈ పిచ్చి పిల్ల పాపం యేడుస్తూ వెడుతుందేమో అనుకుంటుంటే సావిత్రమ్మకి తను కాపురానికొచ్చిన తొలి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడాయనా అంతే..కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆయన మాటే నెగ్గించుకునే వారు. సానుభూతిగా పక్కనున్న పిల్ల వైపు చూసిన సావిత్రమ్మ తెల్లబోయింది. ఆ పిచ్చి పిల్ల ప్లేట్లో వున్నవి యేమిటో అతనికి తెలీనట్టు వివరించి చెపుతోంది.
"బుల్లూ, ఇదిగో..ఈ స్వీటు బాగుంటుంది. తిను. ఈ కూర వొద్దు. నీకు ఆ వాసన నచ్చదు. పప్పు కొంచెమే తీసుకో బుల్లూ..అసలు నువ్వు లండన్ నుంచే మీ అమ్మ గారికి ఫోన్ చేసి రావద్దని చెప్ప వలసింది. పాపం రాత్రంతా మేలుకునుండాలి వాళ్ళు యేర్ పోర్ట్ కి రావాలంటే.."
అమ్మో.. ఈ పిల్ల కూడా తక్కువేమీ తిన లేదు. యెంత వెన్న పూస్తోందీ అతనికీ.. యెలాగైనా తన మాటే నెగ్గించుకోవాలని చూస్తోంది.
తల వంచుకుని తింటున్న సావిత్రమ్మకి ఆ అబ్బాయి గొంతేమీ వినిపించ లేదు. అతను వాళ్ళింటికి ఫోన్ చేస్తాడా చెయ్యడా అని కుతూహలం పెరిగి పోతోందావిడకి.
"స్వీటు నాది కూడా యివ్వనా బుల్లూ..నీకిష్టం కదా.."
అమ్మో.. జాణే..స్వీటు పెట్టేసి అతన్ని తనింటికి తీసుకు పోవాలని చూస్తోంది.
"నాకొద్దురా బంగారం..నువ్వు తిను.."
హమ్మ..హమ్మ..యిద్దరికిద్దరూ యెంత తెలివిగా మాట్లాడుకుంటున్నారూ..ఇదే మా రోజుల్లో అయితే ఇలాంటి గొడవలొస్తే మొగుడూ పెళ్లాలిద్దరూ పక్కన మూడూళ్లకి విన్పించేలా అరుచుకునే వారు. యింతకీ ఆ పిల్లాడు ఆ పిల్ల చెప్పినట్టు యింటికి ఫోన్ చేసి వాళ్లమ్మని యేర్ పోర్ట్ కి రావద్దని చెపుతాడా..లేకపోతే ఈ పిల్లని మాయ మాటలు చెప్పి తనింటికే తీసుకు పోతాడా..
ఆలోచిస్తున్న సావిత్రమ్మకి ఆమెకి తెలీకుండానే నిద్ర ముంచుకొచ్చేసింది.
ఫ్లైట్ హైద్రాబాదు చేరింది. సావిత్రమ్మకి తన మీద తనకే చిరాకొచ్చింది,. "మాయదారి నిద్ర. కాస్త కన్ను మూత పడకుండా వుంటే ఈ పిల్లాడు వాళ్లమ్మకి ఫోన్ చేసేడో లేదో తెలిసేది. వయసొచ్చేసింది. నిద్రకాగలేక పోయింది. యిప్పుడు వీళ్ళిద్దరూ అతనింటికి వెడతారా.. ఆ పిల్లింటికి వెడతారా.
పాపం..సావిత్రమ్మ హడావిడి పడుతూ, వాళ్ళిద్దరూ తన దృష్టిని దాటి పోకుండా వాళ్ల వెనకాలే పరిగెడుతున్నట్లే బైట కొచ్చేసింది. సావిత్రమ్మని యింటికి తీసికెళ్లడానికొచ్చిన కొడుకూ, కోడలూ ఆవిడని చూసి చేతులూపుతున్నా కూడా వాళ్లకో సారి చెయ్యూపేసి వీళ్ల వెనకాల కార్ట్ తోసుకుంటూ కార్లన్నీ ఆగి వున్న చోటుకి వెళ్ళింది.
అప్పుడప్పుడే తెల్లవారుతోంది. మసక వెలుతురులో కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని వాళ్ళిద్దర్నీ తన దృష్టి నుంచి పోకుండా అలాగే చూస్తోంది సావిత్రమ్మ.
అరుగో వాళ్ళిద్దరూ..వాళ్లతో పాటు అటూ యిటూ యింకో రెండు పెద్ద జంటలు. బహుశా యిద్దరి తల్లి తండ్రులూ అయి వుంటారు అనుకుంది సావిత్రమ్మ. పాపం అందులో ఒక జంట యెంత చిన్న బుచ్చుకుంటారో..యెప్పటి నుంచో ఈ పిల్లల కోసం చూసీ చూసీ యెయిర్ పోర్ట్ వరకూ వచ్చిన వాళ్ళు యింటికి రాక పోతుంటే ఆ తల్లి తండ్రుల బాధ చెప్పడం యెవరి తరం. ఆ రెండు పెద్ద జంటల్లో పాపం ఆ బాధ యెవరు పడతారా అని కళ్ళప్పగించి చూస్తోందావిడ.
చూస్తూండగానే ఓ కారు వాళ్ల ముందుకు వచ్చి ఆగింది. ఆ అబ్బాయి రెండు సూటు కేసులు అందులో పెట్టేక, ఆ పిల్ల, ఓ పెద్ద జంట అందులో కూర్చుని, నిలబడ్దవాళ్ళకి చెయ్యూపుతూ వెళ్ళి పోయేరు.
యింతలో నిలబడ్ద వాళ్ల ముందుకి యింకో కారు వచ్చి ఆగింది. అందులో ఆ అబ్బాయి, మరో పెద్ద జంటా మిగిలిన రెండు సూటు కేసులతో సహా యెక్కి వెళ్ళి పోయేరు.
తెల్ల బోయింది సావిత్రమ్మ.
హమ్మ గడుగ్గాయిలూ..యెవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళారన్న మాట. యెంతైనా ఈ కాలం పిల్లలకి తెలివెక్కువే.
నోరెళ్ళ బెట్టి నిలుచుండి పోయిందావిడ..