శిక్ష ఎవరికి - కొడాలి సీతారామ రావు .

shiksha evariki

“ శాంతీ ! నువ్వు కాస్త ఆలోచించు . నువ్వు పెళ్లిచేసుకుంటే నీ కాపురం చూడాలనివుంది . నీ మనసులో ఎవరైనా వుంటే చెప్పు . అతనితోనే పెళ్లి జరిపిస్తాను . నువ్వు సుఖంగా వుండటమే నాకు కావాలి . ఒంటరిగా వున్న ఆడదంటే అందరికీ లోకువే . “

ఈ రోజు ఉదయం తన తల్లి చెప్పిన ఈ మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి శాంతికి ఆఫీసుకి వెళ్ళినా . ఈ మాటలు ఆవిడ చెప్పటం ఇదే మొదటిసారి కాదు . ప్రతిరోజూ చెప్థూంటుంది. కొత్త కాకపోయినా ఈ రోజు మాత్రం ఆ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి . యెప్పుడూ శాంతి సమాధానం చెప్పేది కాదు . ఈ రోజు కొంచెం విసుక్కుంది తల్లిమీద , “యెప్పుడూ యిదే విషయం చెప్తావు . వినీ వినీ నాకు విసుగు కలుగుతోంది . “ అని . అది తనకి బాధగా వుంది . ఎప్పుడూ అమ్మని మాట అనని తను అంతలా ఎలా అనగలిగింది.

అసలు శాంతి పెళ్లి చేసుకోక పోవటానికి కారణం తను ఇదివరలో ప్రేమలో పడటమే . ఆ గతం ఆమె మనసు పొరల్లోంచి తుడిచి పెట్టుకు పోక పోవటమే. తల్లికి తెలిసినా కూతురు కొత్త జీవితం ప్రారంభించాలని ఆవిడ ఆశ.

దీనికి తోడు ఆఫీసుకి రాగానే వినత నుంచి వచ్చిన ఫోను కూడా తల్లి చెప్పిన విషయం గురించి ఆలోచించేలా చేసింది. నాలుగేళ్ల క్రితం శాంతి, వినత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ లో పనిచేసేవాళ్ళు విజయవాడలో .

****

“ హలో శాంతీ ఎలావున్నావు ? నేను మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నానే మా ఆయనతో , మా చిన్నవాడితో . పెద్దవాడిని ఎల్ కే జీ లో వేశాం . పాపం పిచ్చి వెధవ . పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాడే . నేనింటికి వచ్చేసరికి నీరసంగా కూర్చునుంటాడు. ఏం తినకుండా . చిన్నాడు నేలమీద ఆనడే. చచ్చిపోతున్నా వాడితో . మా ఆయనేం పట్టించుకోడు. మా అత్తగారికి మా ఆడపడుచు చదువుకుంటూ వుండటంవల్ల నా దగ్గిర వచ్చి వుండలేరు . మా అమ్మకి రావాలని వున్నా మా నాన్న - ‘అల్లుడిదగ్గిర ఎన్నాళ్ళుంటాము ‘ అంటారు . ఎలాగో అలా మా అమ్మ మూడునెలలుంది. మా నాన్నగారు నాల్రోజులుండి వెళ్లిపోయారు. అప్పుడుమాత్రం చాలా హాయిగా వుందే.

అన్నట్టు, హరిశ్చంద్రుడు ఫోన్ చేశాడే నిన్న. యెలా కనుక్కున్నాడో నా ఫోన్ నెంబర్. అందుకే ఫోన్ చేశా. నీగురించి అడిగాడు. తెలీదని చెప్పా. తెలుసుకోవటం పెద్ద కష్టం కాదన్నాడు . జాగ్రత్త. మళ్ళీ ఏం నాటకం

ఆడతాడో. నువ్విక్కడనుంచీ వెళ్లిపోయాకా అతనూ వెళ్లిపోయాడు. నేను పెట్టిన పోలీసు కేసు నుంచి బయట పడ్డాడు. ఇప్పుడు గులాబీ అగ్గిపెట్టెల కంపెనీకి ఏరియా మేనేజర్ట ఆంధ్రాకి. ఆంధ్రా అంతా తిరుగుతుంటాట్ట. పెళ్లయ్యిందట. యిద్దరు పిల్లలుట. “

*****

వినతి ఒక వారం రోజులముందు చేరిందా కంపెనీలో. కృష్ణలంకలో ఒక గదిలో వుండేది . శాంతి చేరేక యిద్దరూ కలిసి సత్యనారాయణపురంలో గది తీసుకుని వుండేవారు . యిద్దరూ వంట చేసుకునేవారు .

శాంతి చేరేటప్పటికే వినతికి హరిశ్చంద్రుడితో పరిచయం బాగా పెరిగిపోయింది . హరిశ్చంద్రుడు ఆ బ్రాంచికి మేనేజరు . నెలలో పదిహేను రోజులు కేంపులు తిరుగుతుంటాడు కంపెనీ పని మీద . కంపెనీకి చిట్లలో సభ్యులని చేర్పించటం , డెపోజిట్లు సేకరించటం అతని పని . అతనివల్ల ప్రతి యేడాది ఆ కంపెనీకి మంచి లాభాలు చేకూరుతుంటాయి . అందువల్ల అతనిమీద మేనేజిమెంటుకి మంచి అభిమానం . అతనికి కారు , క్వార్టరు యిచ్చారు . జీతభత్యాల సంగతి సరేసరి . అనేకసార్లు విదేశాలకి కూడా పంపేరు ప్రోత్సాహకంగా .

అతను ప్రేమ పిపాసి . ఆడపిల్ల కనిపిస్తే ప్రేమించానంటూ వెంటపడతాడు. అయితే తన విషయాలు బహిరంగం కాకుండా జాగ్రత్త పడుతుంటాడు . విడిగా అందరితో యెంతో మర్యాదగా పెద్ద మనిషిగా ప్రవర్తి స్తుంటాడు. అందువల్ల తన పేరు నలుగురి నోళ్లల్లో నానకుండా జాగ్రత్త పడుతుంటాడు . ఆడపిల్లలు వలలో పడ్డాక మోజు తీరంగానే వదిలేస్తుంటాడు . అలా వినతి కూడా అతని వలలో పడింది . అతన్ని నమ్మింది . అనేకసార్లు అతనితో యెకాంతంగా గడిపింది.

వినతి యెవరితోనో ప్రేమలో పడిందన్న విషయం శాంతి గ్రహించింది . ఒకటి రెండుసార్లు హెచ్చరించింది కూడా . కానీ హరిశ్చంద్రుడుతోనే అనుకోలేదు . ఎందుకంటే హరిశ్చంద్రుడు తననే ప్రేమించాడు అనుకుంటోంది శాంతి . తను చేరిన ఆరు నెలలకి హరిశ్చంద్రుడి వలలో పడింది శాంతి . అతని మాటలు , తన పట్ల చూపే అభిమానం ఆమెని అతని వేపు ఆకర్షితురాలిని చేశాయి .

ఒకరోజు అతను ఆమెని భవానీ ఐ లాండుకు తీసుకువెళ్లాడు . అక్కద అడిగేడామెని పెళ్లెప్పుడు చేసుకుందామని . ఆమె సిగ్గులమొగ్గయింది . “యెంత త్వరగా వీలైతే అంత తొందరాగా ‘ అంది .

“ అయితే , యిప్పుడే యిక్కడే గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు ఆమెని దగ్గిరకు తీసుకోబోతూ .

శాంతి అతని కొగిలిలో ఒక క్షణం పరవశించిపోయింది . మరుక్షణం స్పృహలోకొచ్చి దూరంగా జరుగుతూ “ పెళ్లయ్యేదాకా కొంచెం సంయమనం పాటించాలి “ అంది నవ్వుతూ .

“యిద్దరికీ యిష్టమయ్యాక యింకా దూరం దేనికి . ఎలాగూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఈ రోజునించే ఆ అనుభవాన్ని పొందవచ్చు కదా. కావాలంటే గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం . నేను నిన్ను చూస్తూ కూచోలేను . ప్లీజ్ .” అంటూ ఆమె దగ్గిరకి రాబోయడతను.

ఆమె దూరం జరుగుతూ “ యిలా చెయ్యటం తప్పు . నాకిష్టం లేదు . “

“అయితే రేపే రిజిష్టర్ మేరేజి చేసుకుందాం . లేదా దుర్గగుడిలో అయితే ముహూర్తాలతో పని లేదుట . “

“ ఊహూ . నాకిష్టం లేదలా. పెద్దవాళ్ళు ముహూర్తాలు నిర్ణయించాలి . నాకు మా అమ్మ ఒక్కతే వుంది. తనతో చెప్పి మీ యింటికి పంపిస్తాను . అన్నట్టు, మరి పెళ్లాయ్యాక తను మనతోనే వుంటుంది మరి . “

“ ఆవిడ మనకి భారమా ఏంటి . రేపే నేనే ఆమెతో మాట్లాడతాను . ఈరోజు మాత్రం యిక్కడే మనం పండగ చేసుకోవాలి . నువ్వు ఒప్పుకుంటావని యిక్కడ అన్ని యేర్పాట్లు చేసేశాను . “

“ నాకలాంటిది యిష్టం లేదు పెళ్ళికి ముందు “ అని ముందుకు కదిలింది . అతను వెంట పడ్డాడు . బ్రతిమిలాడాడు . తను యింతవరకూ ఏ ఆడపిల్ల వెంటా పడలేదన్నాడు . తనంటే ప్రేమవల్ల పిచ్చివాడైపోతున్నానన్నాడు. ఎంతకాలం దూరంగా వుండాలన్నాడు .

ఆమెకి ఒక క్షణం జాలి కలిగింది . పాపం అనిపించింది . పోనీలే ఒక్కసారేగా అనుకుంది . మరుక్షణం ఆమె సంస్కారం ఆమెని మేల్కొల్పింది . ఇప్పుడు ఓపికపడితే జీవితాంతం ఆనందంగా వుండొచ్చు అనుకుంది . అతను తనని పరీక్షిస్తున్నాడేమో అనుకుంది ఏమైనా తను తప్పటడుగు వెయ్యకూడదు .

అతనితో అదే చెప్పింది . “ యిప్పుడు ఓపికపడితే జీవితాంతం మనకి ఆనందం “ చివరికి అతనితో అంది “హరీ , మనం యిక్కడే వుంటే తప్పు చేయొచ్చు. అందుకే ఇక్కడనించి తొందరగా వెళ్లిపోదాం.”రేపే మా అమ్మతో మాట్లాడి మీ యింటికి పంపిస్తాను . ప్లీజ్ .” అని బతిమాలుతూ గబగబా ముందుకు నడిచింది . అలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది .

నాలుగో రోజు వినత ఆత్మహత్య చేసుకుంది కృష్ణానదిలో దూకి . అదృ ష్ట వశాత్తూ అక్కడ వున్న చేపలు పట్టే వాళ్ళు ఆమెని కాపాడారు . ఆ సమయంలో శాంతి తన తల్లితో పెళ్లి విషయం మాట్లాడేందుకు తన వూరు వెళ్లింది.

తను వచ్చేటప్పటికి ఆసుపత్రిలో వుంది. తనని చూడంగానే భోరుమంది. హరిశ్చంద్రుడితో తన ప్రేమ విషయం, తనని ఎలా మోసగించింది వివరంగా చెప్పింది . తనని తిరస్కరించటంతో ఆత్మహత్య చేసుకున్నాని చెప్పింది . శాంతి విస్తుపోయింది . తొందర పడి వుంటే తానూ ఇదే పరిస్థితిలో వుండేదేమో.

శాంతి హరిశ్చంద్రుడితో వినతి గురించి మాట్లాడింది . ఆమెని పెళ్లిచేసుకోమనీ , అన్యాయం చెయ్యొద్దని చెప్పింది . తనకీ వినతికీ ఏ సంబంధం లేదన్నాడు . తను శాంతిని తప్ప వేరెవరినీ కన్నెత్తి చూడలేదన్నాడు .

శాంతి చివరిగా చెప్పిందతనితో ‘ నువ్వామెని మోసం చేస్తే భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ‘

వినతి ఆసుపత్రినించి రాగానే తన కంపెనీ మేనేజిమెంటుకు ఫిర్యాదు చేసింది హరిశ్చంద్రుడిమీద . వారు అతన్ని వుద్యోగం లోంచి తీసేశారు . పోలీసు కేసు పెట్టారు .

ఆ సమయంలో శాంతి తల్లితో విశాఖపట్నం వచ్చింది తన మేనమామగారింటికి . ఇక్కడే వుద్యోగం చేసుకుని వుంటోంది . గతాన్ని మర్చిపోదామన్నా మరుపురావటం లేదు .

వినత కూడా కంపెనీ మానేసి వేరే వుద్యోగంలో చేరింది . తర్వాత పెళ్లి చేసుకుంది . విజయవాడలోనే వుంటోంది .

యిప్పుడు వినతి నుంచి ఫోన్ వచ్చేకా ఆలోచనలో పడింది శాంతి . తానెందుకు శిక్ష అనుభవించాలి పెళ్లిచేసుకోకుండా . అతన్ని తను ప్రేమించింది . కానీ అతను మోసం చెయ్యాలనుకున్నాడు . అతను హాయిగా పెళ్లి చేసుకున్నాడు . అతని వల్ల మోసపోయిన వినతి పెళ్లిచేసుకుని హాయిగా వుంది గతం మర్చిపోయి . తను మాత్రం యెందుకుండాలిలా మోడులా అనుకుంది .

అమ్మ చెప్పినట్టు పెళ్లిచేసుకుని తను కూడా తన ప్రపంచాన్ని నిర్మించుకోవాలనుకుంది . తన నిశ్చయాన్ని తల్లికి చెప్పాలనుకుంది . ఆమె మనసు కుదుట పడింది .

*****

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు