"హలో ! సుజా...లవ్ యు ..."
"ఇది ఎన్నోసారి చెప్పడం" కిలకిల నవ్వుతూ అంది...
"వందసార్లు చెబుతానోయ్ నీకేమన్నా అభ్యంతరమా!" అన్నా
"నాకేమీ అభ్యంతరం లేదు కానీ ... కొన్ని పదాల్ని పొదుపుగా వాడితేనే అందమేమో...ఆలోచించు ..."
నేను అలోచనలో పడ్డా... సుజా చెప్పిందంటే ఆలోచించాల్సిందే...ఆమె చెప్పిన ప్రతి విషయం చాలా సున్నితంగా, ప్రాక్టికల్ గా వుంటుంది...
"కానీ నాకు పదే పదే చెప్పాలనిపిస్తుంది... సుజా మరేం చేయను, నీతో ప్రేమలో పడ్డం ఒక వింత అనుభవం... ఒక్క నిముషంకూడా మరపు రావే... మనసంతా నీవే ఉంటావే " నా మనసులో వున్న విషయం చెప్పా.
"సరేలే... పర్లేదులే చెబుతూ వుండు... కానీ నేను మా ప్రొఫెసర్ దగ్గరున్నప్పుడు మాత్రం ఫోన్ చేయకు... నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది...
నీతో ప్రేమలో పడ్డం నాక్కూడా చాలా థ్రిల్లింగ్ గా వుంది... కానీ నీకు వచ్చినట్లు, మరీ అంత జ్వరం రాలేదులే..." నవ్వు చప్పుడు కాకుండా చేయి అడ్డం పెట్టుకుంది కాబోలు నాకు కిలకిలలు వినపడలేదు.
"వూ... అయితే ప్రేమ జ్వరం నాకే సోకింది... నీకు ఈ అంటు వ్యాది తాకలేదు. నీకు చాలా... చాలా రెసిస్టన్స్ వుంది కదా! అబ్బ సుజా... నిన్ను చూడాలనిపిస్తోంది... ప్లీజ్ కలుద్దాం..."
"నాకు ఉదయం నుండి చాలా పని ఉండింది సరే... ఫస్ట్ షో వెళదాం... వస్తావా...! "
"నేను అమ్మమ్మ గారి వూర్లోవున్నా... గంట అవుతుంది ఓకే..."
"త్వరగా వచ్చేయ్... అప్సరలో రాజేంద్ర ప్రసాద్ సినిమా "ఓనమాలు" వెళదాం..."
"ఇంకేం మంచి సినిమాలు లేవా"
"అంటే అది మంచి సినిమా కాదనా నీ ఉద్దేశం?". సుజా గొంతులో తీవ్రతకి ఉలిక్కి పడ్డా.
"అబ్బే అదికాదు ఆయన ఇప్పుడు కామెడీలు వదిలేసి చాలా సీరియస్ సినిమాలు చేస్తున్నారు కదా !"
"అయితే..."
ఇదేదో... సీరియస్ చర్చకు దారి తీసేట్టుగా వుంది. సుజకు నచ్చినట్లుగా వుండటం మేలు, ఆమెను సంతోషంగా ఉంచితే చాలు, నాకు సంతోషం వస్తుంది...
ఒరేయ్... పిచ్చి విశాల్ నీ పని అయిపోయిందిరా... ప్రేమలో పడ్డాక...ఇంక నీ ఇష్టాలు నడవవు... నన్ను నేను హెచ్చరించుకుని... "ఓకే... ఓకే వచ్చేస్తా... టికెట్ తీయమని నా ఫ్రెండ్ కి చెబుతాను..." అన్నా.
"మనం సినిమాకి వెళుతుంటే ఇంకొకరు టికెట్ తీయడమేంటి...? నేను తీసుకుని అక్కడుంటా సినిమా మొదలయ్యే లోపల వచ్చేయండి..."
"అదేంటి నువ్వు... ముందే వెళ్లి టికెట్ తీసుకుంటావా?"
"మరి... ఎవెరెస్ట్ ఎక్కుతావా అన్నట్లుంది... నేను వెళ్లి తీసుకుంటానులే, జాగ్రత్తగా త్వరగా వచ్చేయ్ విశాల్..."
ఏమీ చెప్పలేకపోయాను... తనేమి ఖర్చుపెట్టనీయదు, మామూలుగా అమ్మాయిలు పర్సుతీయరని వాళ్లకు వెంట వుండే మగవాళ్ళు పెట్టడం సంప్రదాయం అని నాకు ముందు పుట్టినోళ్ళు చెప్పారు... తీరా చూస్తే ఇక్కడది వర్కవుట్ కావడం లేదు... అంతా సీనియర్లు చెప్పినట్లు జరగడం లేదు. ఇప్పుడు సరయిన టైం కు పోయి చాలా పంక్చువల్ అని పేరు తెచ్చుకోవాలి, సుజా టైం కు చాలా విలువనిస్తుంది. సినిమా 6.15 కు మొదలవుతుంది... ఇప్పుడు 5 .05 అవుతుంది... అంటే 45 మైళ్ళు గంటలో వెళ్ళాలి... రోడ్డు బాగాలేదే... ఒకే నో ప్రాబ్లెం నడిపేది ఎవరు... విశాల్! అనుకున్నా.
ఒక్క నిముషంలో హాన్గర్ కున్న జాకెట్ వేసుకుని... కార్ కీస్ తీసుకుని... "అమ్మమ్మా... నే వెళుతున్నా... " సమాధానం కోసం చూడకుండా కారు స్టార్ట్ చేశా... నా కళ్ళముందు అప్సర థియేటర్... ఆ థియేటర్ ప్రాంగణం లో నా అప్సరస సుజా... మాత్రమే వుంది... పరుగున వచ్చిన అమ్మమ్మ" అదేంటిరా అప్పుడేనా!.." అన్న మాటలు కూడా నా తలకెక్కలేదు . చేయివూపి ఆక్సిలరేటర్ పై నా కాలు ఎంత బలంగా నోక్కానో... రైల్వే గేటు పడక ముందే పోవాలి... లేకపోతే లేట్ అవుతుంది... నా వేగాన్ని... నా కారు వేగాన్ని అందుకోలేనంత అద్వానంగా వున్న రోడ్డుపై విపరీతమైన కోపం వచ్చింది రోడ్డు గురించి పట్టించుకోని ఆ వూరి ప్రెసిడెంట్ మామయ్య మీద ఆవేశ మొచ్చింది... హు... గేటు పడింది బాబోయ్... టైం చూసుకున్నా... 5.20. వూ వీడెప్పుడుగేటు తీస్తాడో ! సుజా కి కాల్ చేద్దాం అనిపించింది... చేశా...
"చెప్పు"
"వూరికే చేశా... బయలు దేరా, గేట్ పడింది."
"వూరికే చేయడం లేదు ..ప్రతినిముషానికి చెల్లిస్తున్నావు..నీ ప్రతిమాట ఖరీదైంది... తొందరేమీ లేదు జాగ్రత్తగా రా"
"లవ్ యూ "
"వూ సరే..." నవ్వు తెరలమధ్య సుజా కొంటె గా కొంచం, పిచ్చోడా అన్నట్లుగా కొంచం భావాన్ని కలిపి అన్నది... కానీ ఆమాట తననుంచి రావడం బాగా అన్పించింది....యాహూ అని మనసులోనే ఎగిరి గంతేశా.
"ఇంక ఫోన్ చేయకు డ్రైవ్ లో, నేను బయలు దేరుతున్నా..."
"అప్పుడేనా ఇంకా 5.30 నే కదా టికెట్లు నేను వచ్చాక అయినా తీసుకోవచ్చు.
నేను వచ్చి తీసి కెళతాగా... నిన్ను..."
"అబ్బ వద్దులే విశాల్ దగ్గరేగా... నడిచి వెళతా..." ఏదో చెప్పబోయి గేట్ తీయడంతో సుజాకి బాయ్ చెప్పి వేగంగా బయలు దేరా...
"ఏ శ్యాం మస్తాని... మద్ హాష్ కియే జాయే
ముజే దోర్ కోయీ ఖించే, తేరీ ఓర్ లిఏ జాయే
దూర్ రహతీ హైన్ తూ, మేరె పాస్ ఆతీ నహీ
హోత్హోన్ పే తేరే, కభీ ప్యాస్ ఆతీ నహీ
అయేసా లగే జైసి కే తూ, హస్ కే జహ కోయీ పియె జాయే..." కిషోర్ తో పాటుగా పాడుకుంటూ హుషారుగా కారులో షికారు చేస్తున్న నాకు రోడ్డుకు అడ్డంగా ఒక ముసలాయన నిలబడి కారు ఆపమన్నట్టు సైగ చేస్తూ చేతులు చాచాడు. నిర్మానుష్యంగా వున్న ప్రదేశం కావడం వలన ఏ వాహనాలు కూడా రోడ్డుపై లేనందు వలన నేను ఆఘమేఘాలపై వెళ్ళేవాడిని కాస్త చిరాగ్గా... కారు ఆపాను... గ్లాసు తీసి ఏమిటి అన్నట్టు చూసాను. ప్రక్కనే నిలబడ్డ ఓ అమ్మాయి నిండు నెలలతో వుంది. ఆ అమ్మాయిని చూపిస్తూ "నాయనా మా పాపకు నెలలు నిండాయి... కడుపులో నొప్పిగా ఉందంట... కానుపు నొప్పులో ఏమో... నువ్వు గాని మమ్మల్ని ధర్మాసుపత్రిలో దింపుతే మేలు నాయనా!" అతనికి కనీసం అభ్యర్థించడం కూడా రాలేదు, ఒక్క నిముషం నా హృదయం ద్రవించింది... టైం చూశా 5.45 దాటింది... వీళ్ళను హాస్పిటల్ దగ్గర దింపి వెళ్ళేప్పటికి ఏడవుతుంది...సుజా ముద్దు మోములో నా ఆలస్యానికి కనిపించే చిరాకు ఊహించా ! తక్షణమే ఎవ్వెరితింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అనుకుని" లేదు తాతా నేను కడప పోవడం లేదు... పాయసం పల్లె పోతున్నా" అన్నా.
"సరే నాయనా నువ్వు పొ... మేము గవర్నమెంటు ఆస్ప్రత్రికి పోవాలగానీ... ఇబ్బంది పెట్టినాను, బస్ వస్తే దాంట్లో పోతాం గానీ" అని అటుపక్క తిరిగి ఆ అమ్మాయిని రోడ్డు పైనుండి చెట్టు కిందికి తీసికెళ్ళాడు. ఊపిరి పీల్చుకుని... ఒక్క సారి టైం చూశా 5.50. ఇంకా 25 నిముషాల్లో... కడప చేరాలి... అప్సర దగ్గరకి వెళ్ళే టప్పటికి... ఎందుకో చిరాకు తో పాటు ఏదో అసంతృప్తి... ఏదో తెలియని... భావాలు... మూడ్ ని మామూలు చేసుకోవడానికి తగ్గించిన వాల్యూం ని ఎక్కించా... జిందగీ ఏక సఫర్ హాయ్ సుహాన యహ కల్ క్యా హోగా కిసనే జానా! కిషోర్ ఉత్సాహంగా పాడుతున్నాడు... కానీ మనసు ఏదో కోల్పోయింది. యాంత్రికంగానే అప్సర చేరా... దూరం నుండే నా కార్ చూడ గానే నవ్వుతూ సుజా చేయి ఊపింది... సుజా నవ్వు చూడగానే నా మనసు తేలికైంది. గులాబి రంగు చీరలో ముద్దుగా వుంది సుజా, ఇద్దరం లోపలికి వెళ్లాం.
కూర్చున్నాక అడిగింది "లేట్ అయింది... కదా... స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా... నాకు సినిమా అంటే కర్టన్ రైసింగ్ నుండి చూస్తేనే తృప్తి..."
గేట్ పడ్డం వరకు చెప్పి."ఒక ముసలాయన..." అనేంతలోనే... తెర లేవడం తో... సుజ అటుకేసి చూస్తోంది... నా మనసులో ఏదో... తప్పు చేసిన భావన... ఆ ముసలాయనకు అబద్దం చెప్పి... ఆ నిండు చూలాల్ని... ఆ పరిస్థితిలో వదిలి ఛ. ఛ... నాకేమయ్యింది... సుజ ను కలవడానికి అర్థగంట లేట్ అయితే నష్టమేముంది... ఆమెను ఇంప్రెస్స్ చేసేదానికి నేను మనిషిని అన్న విషయం మర్చిపోయా, వాళ్లకు బస్సు దొరికిందో లేదో... ఆ అమ్మాయికి ఏమైనా అయితే, పాపం ఆ ముసలాయన... ఏమి చేయగలడు...? తల విదిలించి సుజను చూశా... తను ఏదో ఇంగ్లీష్ ట్రయలర్ చూస్తోంది...
"సుజా..." మెల్లిగా పిలిచా
"ఏంటి... లవ్ యు చెబుతావా ! "
"వూ... లవ్ యూ..."అన్నా
"నేను మాత్రం చెప్పను విశాల్... కానీ ప్రేమిస్తూ ఉంటా" నా చెవి దగ్గర గుస గుసగా అంది
నా మనసు కొంచెం లయ తప్పింది... సుజ నున్నటి బుగ్గల మెరుపు నన్ను కాసేపు మత్తులోకి తోసింది... మరు నిముషంలోనే నాలోని మరొక విశాల్ లేచాడు.
"సుజా నేను బయటికి వెళ్లి వస్తా, ఒక గంట... అంతే సినిమా చూస్తూ వుండు..."
తన సమాధానం కోసం కూడా చూడకుండా... లేచి బయటికి వచ్చా.
కారు పార్కింగ్ నుండి కార్ తీస్తుండగా ప్రక్కనే సుజ.
"ఏమయ్యింది విశాల్... అలా వచ్చావేమి? ఎనితింగ్ రాంగ్?"
"ఇప్పుడే వస్తా, వెళ్లి సినిమా చూడు... లేకుంటే కార్లో కూర్చో నేను వెళ్ళాలి "కొంచం చిరాగ్గానే అన్నా.
మౌనంగా వచ్చి కార్లో కూర్చుంది సుజా.
ఎంత వేగంగా కారు నడిపానో నాకే తెలియదు ఏదో అడగబోయిన సుజా... మళ్ళీ విరమించుకుంది... నా మనసంతా... విపరీతమైన అలజడితో నిండి పోయింది.
ఆ అమ్మాయికి ఏమైనా అయ్యుంటే... ఛి ఛి నేను మనిషినా... నా స్వీట్ హార్ట్ సమక్షం నన్ను కొంచం కూడా ఉత్సాహపరచలేదు.
దూరం నుండే నన్ను ముసలాయన ఆపిన ప్రదేశం వెతుక్కుంటూ వచ్చాను 5.50 కి వాళ్ళిక్కడున్నారు... ఇప్పుడు 6 .30 అయింది, ఉంటారో లేదో! ఏదైనా కారో, బస్సో వచ్చి వెళ్లి పోయారో ..! దూరంగా వున్న ముసలాయన్ని... ఆ అమ్మాయిని చూసి నా మనసు సంతోషంతో ఉరకలు వేసింది.
కారు ఆపి ఇద్దరినీ ఎక్కమన్నా. "ఏమి నాయన పాయసం పల్లె పోతివా... బస్సు వచ్చింది గాని, శానా మంది వుండ్రి... కడుపుతో వున్న బిడ్డను ఎక్కిస్తే కష్టమని ఎక్కకపోతిమి నాయనా... ఎవరో పుణ్యాత్ములు రాక పోతారా అని చూస్తా వుండా! నీవే వస్తివి... భయంగా వుండే, పాపకి నొప్పులు మొదలాయే..." వార్ధక్యం తోను, పేదరికంతోను, బాధ్యతల బరువు తోను వంగిపోయిన అతన్ని... అతని వయసుని, అతనున్న పరిస్థితిని, గమనించ కుండా వెళ్లి పోయానే... హమ్మయ్య దిద్దుకునే అవకాశం ఇచ్చినతనికి నాలో నేనే కృతజ్ఞతలు చెప్పుకున్నా... లేకపోతే... ఈగిల్ట్ నన్ను ఎంత బాధించేదో...!
"శశికాంత్... రిమ్స్ లో గైనిక్ లో మనకు తెలిసిన వాళ్ళేవరున్నారు ?" ప్రొద్దుటూరు జి జి హెచ్ లో పని చేసే ఫ్రెండ్ ని అడిగా
తన క్లాస్ మేట్ వనజ వుందని చెప్పడంతో పని సులభమయింది. అమ్మాయిని అక్కడ అడ్మిట్ చేసి ముసలాయన చేతిలో ఒక వెయ్యి పెట్టి... డాక్టర్ వనజ కు విషయం చెప్పి బయటకు వచ్చాం... అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సుజా.
బహుశ తను చూడాలనుకున్న సినిమాని చూపలేకపోయినందుకు, చేసే పని సరయిన పద్దతిలో చేయనందుకు పెద్ద క్లాస్ తీసుకుంటుంది అనుకున్నా... కారు ఎక్కగానే సుజా ఏమన్నా ఇప్పుడు హాయిగా భరించే దానికి సిద్ధంగా ఉన్నా.
సమయం7.50 అయింది సగం సినిమా అయిపోయి వుంటుంది. సుజా కేసి చూశా... నాకళ్ళలోకి చూస్తోంది... ఏదో చెప్పబోతుంటే సిద్ధంగా ఉన్నా... కానీ తను మాట్లాడలేదు "సారీ...సినిమా మిస్ అయింది కదా నా కారణంగా...అమ్ రియల్లి సారీ... సుజా... ఏదైనా చెప్పు... మాట్లాడు... కొప్పడు... కానీ మౌనం వద్దు.ప్లీజ్..!"
"లవ్ యు"
"వాట్!" ఎగిరి పడ్డా.
"లవ్ యు"
"యాహూ... నిజంగా... నిజంగానేనా !"
"లవ్ యు"
"కోపం రాలేదా నాపై సినిమా మిస్ అయినందుకు"
"లవ్ యు."
"కొన్ని పదాల్నిపొదుపుగా వాడితే మంచి దేమో!" తన మాటలు తనకి అప్ప చెప్పా!
"లవ్ యు' అంది మళ్ళీ. సంతోషంగా నవ్వుతున్న నన్ను చూసి "నీ మంచి మనసుకు నీరాజనాలు విశాల్ లవ్ యు ఏ లాట్"అంది. సుజా అలా అంటుంటే ఎంతో హాయిగా అన్పించింది. ప్రేమించటం ఒక వరం, ప్రేమించబడటం ఒక యోగం , మానవాళిని ప్రేమించలేకపోవడం ఒక రోగం అనిపించింది.