సక్సెస్ - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

success

ఒక స్త్రీ పురుషుడిని ఎందుకు ఎలా ఆకర్షిస్తుందో తెలియదు.

నేను నా స్నేహితుడి పెళ్ళికోసం ఆ ఊరు వెళ్ళి వుండకపోతే రాగిణి నాకు పరిచయం అయివుండకపోయేది.

రాగిణి అందగత్తేం కాదు. ఛామనఛాయకి కొద్దిగా రంగు తక్కువే! కళ్ళూ చలాకీగా, కనుబొమలు తీర్చిదిద్దినట్టు వున్నాయి. నుదుటన దోసగింజంత బొట్టుతో ముఖం ఆకర్షనీయంగా వుంది. చక్కని లైట్ కలర్ శారీ, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో ఒక గొలుసు, చేతికి రెండంటే రెండు గాజులతో సింపుల్ గా వుంది. ఆమెని చూడాలన్న తపన నాలో పదే పదే ఎందుకు కలుగుతోందో మాత్రం అర్ధం కావడంలేదు. ఆమె వంక అదేపనిగా చూస్తున్న నా చూపుల్ని పసిగట్టిన నా స్నేహితులు ‘వీడికేమైందసలు? చుట్టూ అందమైన అమ్మాయిల్ని పెట్టుకుని వీడు ఏవరేజ్ వెనకాల పడుతున్నాడు’ అనుకున్నారు. కానీ నా మనసు నా మాట వింటేగా? దానికీమే తెగనచ్చేసింది..నన్ను ప్రోవోక్ చేస్తోంది.

"ఒరే! నీకేమైనా గాలి సోకిందా? పిచ్చిపట్టిందా? చుట్టూ ఊరిస్తూ ఇన్నన్ని అందాలుంటే..నువ్వేమో అప్పలమ్మ కోసం చూస్తున్నావు. మాకు గొప్ప ఇన్సల్ట్ గా వుంది. ఇంక ఆపరాబాబూ"అన్నాడు నన్ను పక్కకి తీసుకెళ్ళి శీనుగాడు.

"ఏమోరా..నాకూ అర్ధం కావడం లేదు. నామనసెందుకో నా మాట వినడం లేదు. ఆమెని చూస్తుంటే నేను ఇన్నాళ్ళు వెతుకుతున్నదేదో దొరికినట్టుగా..హృదయం పులకించిపోతోంది."అన్నాను.

నా వంక పిచ్చోడ్ని చూసినట్టుగా చూసి ఏమనలేక వెళ్ళిపోయాడు.

ఆమె ఎక్కడికో వెళుతుంటే ఫాలో అయ్యాను. ఆమె స్టోర్ రూంలోకెళ్ళింది. నేనూ లోపలికెళ్ళి..ఆమెని సమీపించి "నిన్ను చూస్తుంటే నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ఇంతవరకూ ఏ ఆడపిల్లని చూసినా ఇలా అనిపించలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఇత్యాది పదాలు దీనికి వర్తిస్తాయేమో కూడా నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి. నిన్ను పెళ్ళిచేసుకోవడమే నా జీవిత ధ్యేయం. అని గట్టగా ఆమె ముఖాన్ని నా ముఖానికి దగ్గరికంటా తీసుకుని గట్టిగా ఆమె పెదాలపై ముద్దుని ముద్రించాను. ఇది పెళ్ళికి అడ్వాన్స్.."అని నాలుగు మాటలు చెప్పి ఒక చేత చేసి బయటకొచ్చేశాను.

వచ్చేశానన్నమాటేగాని.."కొంపదీసి జరిగింది పెద్ద వాళ్ళకి చెప్పేస్తుందేమో? నా పరువుతీస్తుందేమో? నన్ను పెళ్ళికి పిలిచిన నా స్నేహితుడు ఏమనుకుంటాడో.." అన్న భయం నన్ను తగులుకుంది.

కానీ అటువంటివేమీ జరగలేదు. ఆమె సావధానంగా ఒక పెద్దగిన్నె తీసుకుని పెళ్ళి మండపానికి వచ్చింది. కానీ సమయం దొరికినప్పుడల్లా నన్ను క్రీగంట గమనించడం నేను చూశాను.

నాకు కాస్త ధైర్యం చిక్కింది.

సాయంత్రం నేను అలా తిరిగొద్దామని తోట వైపువెళ్ళాను. పెద్ద పెద్ద పళ్ళ చెట్లతో..గడ్డీ, రకరకాల పూల వాసనలతో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదంగా వుంది.

‘సిటిలో ఇలాంటివన్నీ కరవు. చక్కటి ప్రకృతి గాలి పీల్చి ఎంతకాలమైందో.’ అనుకుంటూ పెద్ద మామిడి మాను పక్కనుండీ వెళుతుంటే..అదాటున రెండు చేతులు నా చేతుల్ని పట్టుకుని చెట్టుచాటుకి లాక్కెళ్ళాయి. రాగిణి! ఆమె హఠాత్ సాక్షాత్కారం నాకు ఎందుకో గమ్మత్తుగా అనిపించింది.

"చూడండీ! పొద్దున్న స్టోర్ రూమ్లో చిలిపి పని చేసి మీరు చక్కా బయటకి పోయారు కానీ నా మనసు నిమ్మళించడానికి చాలా సమయం పట్టింది. పట్నం నుంచి వచ్చిన మీరు కేవలం ఒక అనుభవం కోసం అలా చేసి వుంటే..నిజం నాకు చెప్పి నన్నూ, ఆ సంఘటననీ మర్చిపోండి. నిజంగా నేను మానసికంగా నచ్చి ముద్దుని బహుమతిగా ఇచ్చుంటే నా జీవితాంతం మీకు ఋణపడివుంటాను."అంది కన్నీళ్ళతో.

"ఛ..ఏమిటది? పొద్దున్న ఇచ్చిన ఆ ముద్దు తప్ప నేను ముందుకు వెళ్ళను..అందువల్ల మోసం ప్రసక్తే లేదు. రేపు నేను పట్నం వెళ్ళాక మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళతో సంబంధం మాట్లాడి మన పెళ్ళి ఘనంగా చేస్తారు. అప్పుడు గదిలో..మన శోభనం నాడుమాత్రం నువ్వు ఏ అడ్డూ చెప్ప.."మిగిలిన పదాలు అనకుండా సిగ్గుతో నా పెదాలు తన సున్నితమైన చేతివేళ్ళతో మూసి తుర్రున పరిగెత్తింది.

***

నాకూ తనకీ పెళ్ళయింది. ఎవరేమనుకున్నా నా భార్య నాకు అపూర్వసుందరి. నా స్నేహితులు కూడా ఆ పెళ్ళిలో సరదాగా ఆమె వెంటపడ్డాననుకున్నారు. నేనెప్పుడైతే ఆమెనే పెళ్ళిచేసుకున్నానో..నా సీరియస్నెస్ వాళ్ళకి అర్ధమైంది.

శోభనం.

గదిలో కూర్చుని వున్నాను. తెల్లచీరలో సిగ్గుల మల్లెమొగ్గలా అడుగుపెట్టిందామె. నేను ఆమె చేతినందుకుని మంచంమీద కూర్చోబెట్టాను.

"అప్పుడే చెప్పానుగా శోభనం గదిలో నేనేం చేసినా నువ్వు అడ్డుచెప్పకూడదని.."అని ఆమె మెడ వంపులో ముఖాన్ని అదిమాను. మొదట్లో చిన్న తంపరగా ప్రారంభమైన ముద్దులు వర్షమై..వాగై..నదై..సముద్రమై ఉప్పొంగాయి. తపనతో నరం నరం తన్మయత్వాన్నందుతోంది. అనుభూతి చెలికట్టదాటి ఇద్దరం మమేకమయి ఆనందపారవస్యంలో అలా మంచం మీద సేద తీరుతున్నప్పుడు..నా సెలెక్షన్ తప్పుకాదని తెలిసింది. నా భార్య రంభ.

***

రేపు మా షష్టిపూర్తి.

పిల్లలూ మనవలూ మనవరాళ్ళూ..అందరూ కలసి ఆనందంగా చేస్తున్న శుభకార్యం.

నా వైవాహిక జీవితం సూపర్ సక్సెస్. చాలా విషయాల్లో ఆమె నేర్పరితనం నాకు విజయాన్ని సాధించిపెట్టింది. పిల్లల పెంపకంలోకాని..అత్తమామలా ఆలనా పాలనలో కాని ఆమె తన బాధ్యతని సక్రమంగా నెరవేర్చింది. మేమిద్దరం ఒకరికోసం ఒకరం పుట్టినట్టుగా అనిపిస్తూంది. అందానికి..డబ్బుకి లొంగిపోయిన నా స్నేహితులు కేవలం సొసైటి కోసం మొగుడూపెళ్ళాలుగా కొనసాగుతున్నారని నాకు తెలుసు. కానీ మేము సెక్స్ పరంగా కానీ కుటుంబపరంగా కానీ ఎప్పుడూ రాజీపడలేదు. నాకిప్పటికీ అర్ధం కానిదేమిటంటే ‘నేను నా స్నేహితుడి పెళ్ళికి ఆ ఊరెళ్ళడం యాధృచ్చికమా..లేక అలా జరగాలని రాసిపెట్టి వుండి అలా జరిగిందా’ అని ఏదేమైనా మా ఇద్దరికీ సంతృప్తికరమైన జీవితం లభించింది.

శోభనం గదిలో తను సిగ్గులమొగ్గలా అడుగెట్టింది.

నేను "అప్పుడే చెప్పాను..నేను శోభనం గదిలో ఏం చేసి.."తన చేతుల్తో నా పెదవులని మూసేసింది. వృద్ధాప్యంలో కూడా మనసు ఇరవైలా పరుగులుతీయడం అదృష్టం కాక మరేమిటి?

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు