అమ్మ మహిమ - పి.యస్.యమ్. లక్ష్మి

amma mahima

మా అత్తగారికి రోజూ ఉదయం 8 గం. ల నుంచీ 9 గం.లదాకా పూజ చేసుకోవటం, దేవుడుదగ్గర కూర్చుని ఆవిడకి ఇష్టమయినవేవో చదువుకోవటం అలవాటు. ఆసమయంలో ఆవిడని డిస్టర్బ్ చెయ్యటానికీ ఎవరం సాహసించం. ఎందుకంటే ఆ సమయంలో మా ఇల్లు చాలా ప్రశాంతంగా వుంటుంది. ఆ ప్రశాంతత అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆసమయంలో మా పనులు చాలా అయిపోతాయి. అర్ధమయిందనుకుంటాను. అదీ విషయం.

మరి మిగతా సమయాల్లో మా ఇల్లెలా వుంటుందోకూడా చెప్పాలికదా. రణగొణ ధ్వని, రాళ్ళ వాన అంటారే .. అలాగే వుంటుంది. మరి మా అత్తగారి అభిమానం అది. ఇంట్లో ఎవరన్నా ఆవిడకి చాలా ప్రేమ. కొడుకు, మనవడు, మనవరాలు ఎటూ తనవాళ్ళే .. కోడల్ని నేనన్నా కూడా ఆవిడకి చాలా ప్రేమ. ఆవిడ మేలుకున్నంతసేపూ ఇంట్లోవాళ్ళెవరు కనబడితే వాళ్ళమీద కురిపించే ఈ అతి ప్రేమే మా ఇంట్లో అందర్నీ సహనం లేని వాళ్ళుగా తయారు చేసి రణగొణ ధ్వని రాళ్ళవాన సృష్టిస్తుంది.

ఇవాళ ఒక అద్భుతం జరిగింది. మా అత్తగారు మామూలుగా పూజ చేసుకుంటున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. అంటే ఎవరి పనులలో వారున్నారు ఆ అపురూప సమయాన్ని వృధా చెయ్యకుండా. ఇంతలో ఎక్కడినుంచో సంపంగి పువ్వుల వాసన గుప్పుమన్నది. సంపంగి పువ్వులంటే నాకే కాదు, మా అత్తగారికి కూడా ప్రాణం. కానీ హైదరాబాదులో అవ్వి దొరకవు. ఆ వాసనకి మనసు ఆనందంతో గంతులు వేసింది. ఎవరన్నా పెట్టుకొచ్చారో, ఏ పూలబ్బాయన్నా అమ్మకానికి తీసుకొచ్చాడేమోనని గబగబా చుట్టు పక్కలా, వాకిట్లోంచి, పెరట్లోంచి రోడ్డు కనబడినంత దూరం డిటెక్టివ్ లా పరిశోధించేశా. ఎక్కడా కనబడలేదు. ఈ లోపల ఎప్పుడో ఆ వాసన కూడా మాయమయింది.

ఇంట్లోకొచ్చి చూస్తే మా అత్తగారు సంబర పడిపోతున్నారు. ‘ఏమిటత్తయ్యా, అంత సంతోషంగా వున్నారు?’ అడిగాను. మరి నా బాధ్యత కదా.

‘అమ్మవారు ఇన్నాళ్టికి నన్ను కరుణించిందే శారదా. ఆవిడ కరుణ అనేక రూపాల్లో ప్రసరింప చేస్తుంది. ఇప్పుడు..ఇప్పుడు, మనకిష్టమయిన సంపంగి పూల సువాసన వ్యాపింప చేసి నన్ను కటాక్షించింది. అంటే మిమ్మల్నందర్నీ కూడా కటాక్షించినట్లేలేవే. ఇన్నాళ్ళకి నా మీద దయగలిగింది అమ్మకి’ మధ్యలో నాకు కూడా భరోసానిస్తూ తెగ సంబర పడిపోతున్నారు అత్తయ్య.
ఏదో మేము కొంచెం చదువు వెలగబెట్టాము కదా. దేవుణ్ణి నమ్ముతాముగానీ, దేవుడు డైరెక్టుగా చేసే మహిమలు నమ్మము. అందుకే నేను ఆ సంపంగి వాసన ఎక్కడనుంచి వస్తోందో వెతకాలని ప్రయత్నిస్తూనే వున్నాను. మా అత్తగారు మాత్రం రోజూ అదే సమయంలో వచ్చే ఆ వాసనకు సంబరపడిపోయి, అది అమ్మ మహిమగా, అమ్మవారు తన మీద చూపించే కరుణగా, తను సంబరపడటమేగాక, అందరిచేతా నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇరుగు పొరుగువారు కొందరు మా అత్తగారి మాటలకి ప్రభావితులయ్యో, ఆ సంగతేమిటో చూద్దామనో, ఆవిడ చెప్పినప్పుడు వచ్చి చూడకపోతే మా అత్తగారి సలహాలు, సహాయాలు వుండవనో, మొత్తానికి ఏ కారణమయినాగానీ, మా అత్తగారి పూజ సమయానికి వచ్చి ఆ వాసనని ఆఘ్రాణిస్తున్నారు.

ఒకసారి పక్క పోర్షన్ లో వున్న అంజలి కూతురు దీప్తి మా అత్తగారితో ‘ గ్రానీ, మా ఇంట్లో కూడా వస్తోంది ఈ స్మెల్’ అన్నది.

దానికి మా అత్తగారు తెగ మురిసిపోయి ‘వాసన ఒక్క చోటే వుండదమ్మా. గాలితోబాటు వ్యాపిస్తుంది. అమ్మవారు నిన్ను కూడా చల్లగా చూస్తుందిలే.. నీకు మంచి చదువొస్తుంది, మంచి మొగుడొస్తాడు…’

‘స్కూళ్ళూ, కాలేజీలూ మంచివయితే మంచి చదువు ఎటూ వస్తుందిగానీ గ్రానీ, అమ్మవారు చల్లగా చూస్తే నాకు చలెయ్యదా. అసలే నాకు చల్లగాలి పడదు.’

దాని ప్రశ్నకి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సమాధానం చెబుతున్నారావిడ. ఎందుకో నా ధ్యాస వెనక ఇంటి వైపు వెళ్ళింది. నాలుగు రోజుల క్రితం ఆ ఇంట్లో కొత్తవాళ్ళు అద్దెకొచ్చారు. అంటే…అంతే. రెండు రోజులు నిఘా వేశాను. రోజూ అదే సమయంలో ఆ వాసన రావటానికి కారణం తెలిసింది. ఆ ఇంట్లో దిగినవాళ్ళు వాడే పెర్ఫ్యూమ్ వాసన అది. వాళ్ళు రోజూ ఆ సమయంలో బహుశా ఏ ఆఫీసులకో వెళ్తూ ఆ పెర్ఫ్యూమ్ వాడుతుండుంటారు.

నా డిటెక్షన్ సంగతి ముందు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళంతా మూక ఉమ్మడిగా ఆ సంగతి మా అత్తగారికి చెప్పే సాహసం చెయ్యద్దని బతిమాలారు. ఎందుకంటే, అమ్మవారు తనని కరుణించిన సంతోషంలో ఆవిడ మమ్నల్ని కరుణించి, ధ్యాస ఎక్కువగా అమ్మవారిమీదే పెడుతోంది. దానితో మాకు ఆవిడ ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం తక్కువ, ప్రశాంతత ఎక్కువ అయింది. ఎంతయినా అందరూ నావాళ్ళేగా. అందర్నీ సంతోష పెట్టాల్సిన బాధ్యత నామీద వున్నది. అందుకే నా పరిశోధన ఫలితాలను చెప్పి మా అత్తగారి దీవెనలు (ఎలాంటివైనా) పొందలేకపోయాను.

అయితే ప్రస్తుతం అమ్మ మహిమవల్ల మా అత్తగారికి మమ్మల్ని పట్టించుకునే సమయం లేక పోవటంవల్ల మేమంతా ప్రశాంతంగా వుంటున్నాము.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు