పంపిణీదారు. - *ఆదూరి.శ్రీనివాసరావు.

pampineedaaru

నా పేరెంట్స్ నాకు 'తనివి' అనే పేరు ఎలా పెట్టారో నాకే తెలీదు కానీ నాకు మాత్రం లేశమంతైనా 'తృప్తి ' అన్న మాట లేదు . ఎప్పుడూ అన్నింటికీ ఎదుటి వారితో నన్ను నేను పోల్చుకుని బాధ పడుతుంటాను. ఆ రోజు గబగబా బస్టాప్ కెళ్ళి, కదలబోతున్న బస్సెక్కాను. నా అదృష్టం కొద్దీ ఒక ఖాళీ సీటు దొరగ్గా కూర్చున్నాను, కాస్త సర్దుకున్నాక తలెత్తి చూసాను. నా ఎదుటి సీట్లో ఒక అందమైన యువకుడు కూర్చుని ఉన్నాడు. 'అబ్బా! ఎంతందంగా ఉన్నాడూ!' అనుకోకుండా ఉండ లేక పోయాను. పచ్చని మేలిమి ఛాయ, అందమైన ముఖం, తీర్చి దిద్దినట్లున్నకళ్ళూ ముక్కూ నోరూ , పెద్ద చెవులు, విద్వత్తుకు చిహ్నాలు, ఎత్తు కూడా షుమారుగా ఆరడుగులుంటాడు. నా ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలు మాత్రమే. అతడు తన చేతిలోని పుస్తకం చిరునవ్వుతో చదువుకుంటూ కూర్చున్నాడు, ఇటూ అటూ కూడా చూడటం లేదు. ఎంత ఏకాగ్రత! అతడ్ని చూశాక ' ‘రాజును చూసిన కళ్లతో ఎవర్నో చూసినట్లుగా‘--- నా రూపం నాకే చిరాకేసింది." భగవంతుడా! నాదీ ఒక రూపమేనా? ఎందుకయ్యా నీకింత పార్షియాలిటీ! నన్నూ అందంగా పుట్టించక పోయావా ఆ యువకునిలా !" అంటూ నాలో నేనే వెక్కి వెక్కి ఏడ్చుకున్నాను. ఆ యువకుడు నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఎగతాళిగా కాదు, ఎంతో ఆప్యాయంగా. తిరిగి తన పుస్తక పఠనంలో మునిగి పోయాడు. ఇంతలో ఒక స్టాప్ లో బస్ ఆగింది. ఆ యువకుడు తన పక్కనే ఉన్న ఒక బ్యాగ్ లోంచీ ఒక వస్తువు తీసి ఒక మీట నొక్కాడు, పొడవుగా ఉండే చేతి కర్ర వచ్చింది. అది పట్టుకుని మెల్లిగా మెట్లు దిగి కుంటుకుంటూనే నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు చూశాను అతడికి ఒక కాలు లేదు, కర్ర కాలు ! నా కాళ్ళ కేసి చూసుకున్నాను, నా రెండు కాళ్ళూ బావున్నాయి.' భగవాన్ నా రూపం ఎలా ఉన్నా నాకు రెండు కాళ్ళనూ ఇచ్చినందుకు ధన్యవాదాలు , కరుణా మూర్తీ! ఆ యువకుని చూసి అతడి అందమైన రూపానికి కుళ్ళుకున్నాను. 'అనుకుంటూ మనస్సులోనే లెంపలేసుకుని నమస్కరించుకున్నాను కనిపించని దేవునికి.

*******************


కొంత కాలమయ్యాక మరొక రోజు రైల్ లో పని మీద బయల్దేరాను. నా ఎదురుగా ఒక యువకుడు కూర్చున్నాడు. అతడూ గులాబీ రంగు ఛాయతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతడి కళ్ల జోడు అతడికి ప్రత్యేక హుందానిస్తున్నది. చిరునవ్వుతో విండో లోంచీ బయటికి చూస్తూ ఏదో ఊహా లోకంలో ఉన్నట్లు ఉల్లాసంగా ఉన్నాడు. ఇంత మంచి శరీర ఛాయ, అందం, మంచి ఖరీదైన దుస్తులూ, చాలా ధనికుడై ఉంటాడు, గొప్ప ఉద్యోగం అయి ఉంటుంది. అదృష్టవంతుడు. అందుకే అంత ఆనందం, గొప్ప కంపెనీకి మేనేజరో, ఓనరో అయి ఉండవచ్చు. అందుకే ఆ గాంభీర్యం!' అనుకుని నా వంటికేసి చూసుకోకుండా ఉండలేక పోయాను. నల్లగా..ఛా బొగ్గు రంగు ఓ దేవుడా! నీ వద్ద రంగే మిగల్లేదా నా వద్దకు వచ్చే సరికి, అంతా ఆ ఎదుటి యువకునికే వేసేశావా!' అనుకున్నాను. కుళ్ళుగా అనిపించింది. చాలా సార్లు నా వంటి రంగు నాకు చాలా అవమానాలు తెచ్చింది మరి. నా మనస్సు ఘొల్లున ఏడ్చింది. ఇంతలో రైల్ ఒక స్టేషన్ లో ఆగింది. ఆ తెల్ల , నల్ల కళ్ల జోడు యువకుడు లేచాడు. పక్క సీటులో ఉన్న యువతి కాలు తొక్కి దట్టుకుని ఆమె మీద పడ బోయడు. "కళ్ళు కనబడటం లేదా! పళ్ళు రాలుతాయి." అంటూ ఉగ్రురాలైంది ఆమె. ప్యాసింజర్లంతా అతడిని ఏదన్నా అనాలని నోర్లు తెరిచారు. ఇంతలో వెనక సీటులోని ఒక వ్యక్తి వచ్చి, ఆ తెల్ల యువకుని "ఉండు ఉమేష్ !" అంటూ చేయి పట్టుకున్నాడు. ఆ యువకుడు చిరునవ్వుతో తన నల్ల కళ్ళ జోడు తీసి ఆ యువతి వైపు తల తిప్పాడు. కళ్ళు ఉండాల్సిన చోట రెండు గుంతలున్నాయి. నా గుండె గుభేలుమంది. అప్రయత్నంగా నా చేతి వ్రేళ్ళు నా కళ్ళను తాకాయి. ఆ వ్యక్తి ఆ తెల్ల యువకుని చేయి పట్టుకుని నడిపించుకెళ్ళాడు. అందరి నోళ్ళూ తెరుచుకునే ఉన్నాయి.

"దేవుడా! మహానుభావా! నీకు ధన్యవాదాలు, నా రంగు నలుపైనా నాకు నల్లని కళ్ళనిచ్చావు." అనుకుంటూ దేవునికి నమస్కరించుకున్నాను మనస్సులోనే. పాపం ఆ యువతి కూడా "ఐయాం సారీ సారీ" అని దిగి పోయిన వ్యక్తినుద్దేశించి పదే పదే అనుకుంది పైకే.

*************

ఒక రోజున ఆది వారం సాయంకాలం పార్కు కెళ్ళి కూర్చున్నాను. చల్లని గాలి హాయిగా శరీరానికి తాకుతుండగా పక్కనే ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాను. నా బాల్యమూ గుర్తొచ్చింది. కొంత సేపయ్యాక ఒక వ్యక్తి వచ్చి నా పక్కనే బెంచీ మీద కూర్చున్నాడు. అతడూ నా వయస్సు వాడే. తెల్లని పైజామా లాల్చీ వేసుకుని ఉన్నాడు. చాలా సౌమ్యంగా , సంతోషంగా ఉన్నాడు. గాలికి అతడి రింగుల క్రాఫ్ అతడి ముఖం మీద పడుతుండగా సుతారంగా వెనక్కు త్రోసుకుంటూ కూర్చుని దూరంగా ఆడుకుంటున్న పిలల్లని చూస్తున్నాడు . బాగా చదువుకున్నట్లు కనిపిస్తున్నాడు. తృప్తిగా ఉన్నాడంటే బాగా డబ్బూ లేక పెద్ద ఉద్యోగం తప్పక ఉండే ఉంటాయి. అదృష్టవంతుడు, నా లాగా చిన్న ఉద్యోగం, చాలీ చాలని జీతం, పొదుపు మంత్రం స్మరిస్తూ , జేబు చూసుకుంటూ లెక్కలేసుకుంటూ జీవించే నా బతుకు మీద నాకు ఏవగింపు కలిగింది. అతడ్ని పలకరించాలనిపించింది. "మీది ఈ ఊరేనా? మీ పేరేంటీ!" అని అడిగాను. అతడు జవాబివ్వ లేదు. పెద్దగా అరుస్తున్న పిల్లల గోలకు వినపడలేదని తిరిగి "మీది ఈ ఊరేనా! పార్కులో ఎప్పుడూ చూడలేదే మిమ్మల్ని!" అన్నాను. కిమిన్నాస్తి.' గర్విష్టి లాగున్నాడు. నా లాంటి వాడితో మాట్లాట్టం అవమానం కాబోలు! పొరబాటున పలకరించాను. ఐనా జవాబిస్తే అతడికి పోయేదేముందీ! అనుకున్నాను గుర్రుగా. ఇంతలో ఒక కుర్రాడు వచ్చి,అతడి జేబులో ఉన్న ఒకవైర్ తీసి అతడి చెవిలో పెట్టి "అన్నా! వెళదాం రా! ఇందాకటి నుంచీ పిలుస్తున్నాను. నీవు మిషన్ పెట్టు కోలేదు కదా! అందుకే వినిపించలా. " అంటూ ఆ యువకునితో కల్సి బయల్దేరి వెళ్ళాడు. "ఓ భగవాన్! ప్రేమ మూర్తి! కరుణామయా! నీదెంత మంచి మనసయ్యా! గొప్ప పంపిణీ దారుడవయ్యా!. న్యాయ మూర్తివయ్యా!. అన్నీ ఒకరికే ఇవ్వకుండా సమంగా పంచావయ్యా! నాకు లోకాన్ని చూడను కళ్ళు ఇచ్చావు, నా అంతట నేను నడవను కాళ్ళిచ్చావు, మధుర గీతాలు, మాటలు వినను చెవులనిచ్చావు. మాట్లాడను నోరిచ్చావు. అందం, ఎత్తు, పర్సనాలిటీ లేకపోయినా అన్ని అవయవాలూ ఇచ్చావు. మహానుభావా! మన్నించు, నా చపల చిత్తాన్ని క్షమించు. నీవు భగవంతునివి కనుకే అన్నీ న్యాయంగా అందరికీ పంచావు. ఏవో అవకారాలున్న వారు ఆనందంగా ఉండగా, అన్నీ ఉన్న నేను ఎల్లప్పుడూ అశాంతిగా నిన్ను తిట్టుకుంటూ ఉండటం ఎంత అవివేకమో తెలిసొచ్చింది. మన్నించు దేవా!." అనుకుని భగవంతునికి ఈ మారు చేతులెట్టి మొక్కాను.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు