డబ్బు కోసం - - పి.బి.రాజు

dabbu kosam

"మేము పెళ్ళి చేసుకోలేదు. సహజీవనం చేస్తున్నాం. మేకేమైనా అభ్యంతరమా?" అడిగింది అవంతిక చాలా కూల్ గా. ఒక్క క్షణం నివ్వెరపోవడం నావంతయింది. అలా సూటిగా అడుగుతుందని అనుకోలేదు. పైగా ఎదురుచూడని సమాధానం.

ఆమె పెళ్ళి చేసుకుంటే నాకేంటి? చేసుకోకపోతే నాకేంటి? సహజీవనం చేస్తే నాకేంటి? చేయకపోతే నాకేంటి? పెళ్ళి చేసుకునో; చేసుకోకుండానో ఏమి చేస్తే నాకేంటి? --- అదంతా ఆమె వ్యక్తిగతం.

అయితే ఇందులో నాకొచ్చిన ప్రాబ్లెం ఏమిటి? ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హక్కు నాకెక్కడిది?

కొన్ని కొన్ని ధర్మసందేహాలకు సమాధానాలు దొరకవు.

ధర్మరాజు "అశ్వర్థామా హతః కుంజరహః" అనడం ధర్మమేనా?

బాలుడు అభిమన్యున్ని అలా చంపడం ధర్మమేనా?

ఏమో ! ఎవరికి వారు చేసింది ధర్మమే!

ధర్మానికి, అధర్మానికి; నైతికతకు, అనైతికతకు; నీతికి, అవినీతికి మధ్య స్పష్టమైన రేఖేమయినా ఉందా?

ఏమిటో! ఈ కాలంలో ఆ రేఖ చెరిగిపోయి అన్నీ కలగాపులగం అయిపోయి ఏది ఏదో గుర్తించడానికి వీల్లేకుండా అయిపోయింది.

దేశ, కాల, పరిస్థితుల బట్టి అన్నీ మారిపోతుంటాయి కాబోలు.

నేను ఈ బ్రాంచ్ కొచ్చి నాలుగు నెలలయింది. పెన్షన్ డిస్బర్సింగ్ బ్రాంచ్ కనుక మాకు అదే పని. నెలలో మొదటి పది రోజులు చాలా బిజీ గా ఉంటాం. ఆ తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది.

ఈవేళ మొదటి తేది. అదీ శనివారం. హాఫ్ డే. అందుకే హడావుడి. టిఫిన్ తినడానికి కూడా టైం లేక బైక్ తీసి బయలు దేరాను ఒక ప్రక్క శ్రీమతి అరుస్తున్నా. మొదటి వారం మాకిది మామూలే.

ఎనిమిదికి బయలు దేరితే కానీ ఈ ట్రాఫిక్ దాటుకొని బ్యాంక్ కి తొమ్మిది లోపల చేరలేము. కనీసం తొమ్మిదికి చేరితే కానీ పెన్షన్ జమ చేసి పదికి డిస్బర్స్మెంట్ కుదరదు. పదికి స్టార్ట్ కాకపోతే గోల మొదలెడుతారు. అందుకే ఈ హడావుడి.

అసలు పెన్షనర్లు ఒకటో తేదీ కోసం చాలా ఎదురు చూస్తూవుంటారు. ఉదయం ఏడు నుంచే కోలాహలం మొదలవుతుంది. ఆటోలు, రిక్షాలు, కార్లు, టూ వీలర్స్ లలో వచ్చే పెన్షనర్లు, వారిని దిగబెట్టడానికి వచ్చే వారు బ్యాంక్ ముందు తిరునాళ్ళను తలపిస్తుంది. వచ్చిన వారు వచ్చినట్లే పాసు పుస్తకాలు ఒక చోట సీరియల్ గా పెట్టేస్తారు. అలాగే సీరియల్ గా పేమెంట్ జరగాలి. అటో ఇటో అయితే ఇక కురుక్షేత్రమే. ఎంతసేపైనా వెయిట్ చేస్తారు కానీ; వెనక వచ్చిన వాణ్ణి ఎట్టి పరిస్తితుల్లోనూ ముందు పంపడం ఒప్పుకోరు. ఒకరిపైన ఒకరి నిఘా పక్కాగా మెయింటైన్ చేస్తారు.

బైక్ పార్క్ చేస్తుండగానే అందరూ లేచి విష్ చేశారు. యధావిధిగా నా కళ్ళు ఆ చెట్టు వైపు మళ్ళాయి. ఎదురుచూసినట్లే అక్కడ ఆ ముసిలావిడ; ఆమె ఇద్దరు కొడుకులు, మనవరాలు ఉన్నారు. ఆమె పేరు కమలమ్మ. టిఫిన్ తింటోంది. మనవరాలు నీళ్ళ గ్లాసుతో పక్కనే నిలబడివుంది. కొడుకులు మాత్రలు చేతిలో పెట్టుకుని ప్రేమగా ఆమె వైపు చూస్తున్నారు. ఆవిడ ఎంత అదృష్టం చేసుకుందో కొడుకులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దగ్గరుండి ప్రతినెలా కారులో తీసుకొచ్చి పెన్షన్ తీసుకుని చాలా అపురూపంగా తీసుకెళుతారు. ఆమెకు బీ పి; షుగర్ ఉందట. ప్రతి నిమిషం ఆమె తిండి; మాత్రల విషయంలో చాలా ఆప్రమత్తంగా ఉంటారు. ఇద్దరు కొడుకులు కారులో నుంచి ఆమెను దింపడం; మళ్ళీ ఎక్కించడం లో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. బాత్రూం కు తీసుకెళ్ళడం ...ఆమె అవసరాలు క్షణం క్షణం కంటికి రెప్పలా కాచుకోవడం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అందుకే ప్రతినెలా వారిని అలా గమనించడం అలవాటయిపోయింది. ఆమె వయసు ఎనభై దరిదాపుల్లో ఉంటుంది. వయసు; అనారోగ్యాల వలన ఆమె తిన్నగా కూర్చోలేదు. నిలబడలేదు. ఆయాసంతో రొప్పుతూ ఉంటుంది. కొడుకులు ఓదార్చుతూ ఉంటారు. చాలా శ్రద్దగా ఆమెకు దగ్గరుండి సేవ చేస్తుంటారు. ప్రతినెలా ఇది జరుగుతున్నా నా కెందుకో ఆ దృశ్యం అపురూపంగా ఉంటుంది. ఈ కాలంలో కూడా తల్లిని ఇంత జాగ్రత్తగా చూసేవాళ్ళుంటారా అని ఆశ్చర్యపోతుంటాను. నన్ను చూస్తూనే అన్నదమ్ములిద్దరూ విష్ చేశారు.

అప్పటికే మా స్టాఫ్ పనిలో పడ్డారు. మరో అరగంటలో పెన్షన్ అప్లోడ్ చేసి డిస్పర్స్ మెంట్ స్టార్ట్ చేశాం. ఇది నవంబర్ నెల కాబట్టి లైఫ్ సర్టిఫికేట్/ నాన్ మారియేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది మా స్టాఫ్ కు గుర్తుచేశాను. పెన్షనర్లందరూ లైన్లో నిలబడి ప్రశాంతంగా సర్టిఫికేట్లిచ్చి పెన్షన్ తీసుకెళుతున్నారు. మా స్టాఫ్ అంతా వేగంగా పనిచేసి త్వరగా పంపిస్తున్నారు.

ఇంతలో అవంతిక డోర్ తీసుకొని లోపలికొచ్చింది "గుడ్ మార్నింగ్ సార్" అంటూ.

"గుడ్ మార్నింగ్ మేడం. రండి." ఆహ్వానించాను.

"మీట్ మై హజ్బండ్ మిస్టర్ రవికుమార్" అంటూ పరిచయం చేసింది.

"హల్లో! ప్లీజ్ బీ సీటెడ్" అని కరచాలనం చేశాను.

కూర్చున్నాక, "వాట్ ఎ సర్ప్రైజ్ ...మీరిక్కడ.." అంది ఆశ్చర్యంగా.

"ఇక్కడికొచ్చి నాలుగు నెలలయింది మేడం" అన్నాను.

"మనం కాలేజ్ ఫంక్షన్లో కలుసుకున్నాం. గుర్తుందా?" అంది మళ్ళీ.

"భలే వారే! గుర్తులేకపోవడమేమిటి మేడం! ఉత్తేజకరమైన మీ స్పీచ్ ఎలా మరిచిపోగలం. పిల్లలకు మంచి ఉద్భోధ చేశారు. నిజానికి మీలాంటి గురువుల అవసం ఇప్పట్లో ఎంతో ఉంది." అన్నాను.

“థాంక్యూ వెరీ మచ్ సార్" అందావిడ ఎంతో మురిసిపోతూ.

ఆమె పరిచయం నాకు సుమారు మూన్నెళ్ళ క్రితం జరిగింది. ఈ సంవత్సరం స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక కాలేజ్ వారు నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అధ్యక్ష స్థానంలో ఆమె ఉంది. ఆమె అధ్యక్షోపన్యాసం నన్ను బాగా ఆకట్టుకుంది.

"స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా బడుగు; బలహీన వర్గాలకు; స్త్రీలకు ఇంకా స్వతంత్రం రాలేదు. మనిషి కనీసావసరాలయిన తిండి, గుడ్డ, గూడు అందరికీ అందడం లేదు. ధనిక; పేదల మధ్య అంతరం రోజు రోజుకూ పెరిగిపోతోంది. సృష్టించ బడుతున్న సంపద అందరికీ సమానంగా అందడం లేదు. దీనికి కారణం విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం. స్వార్ధం, ఆశ్రితపక్షపాతం. బడా బడా కాంట్రాక్టర్లు, అనినీతి తిమింగలాలు ప్రజా ధనాన్ని కొల్లకొడుతున్నారు.ఇది పోవాలి. అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలి. ఆ రోజు రావాలి. వస్తేనే నిజమయిన స్వాతంత్ర్యం వచ్చినట్లు. ఈ దోపిడి, అవినీతి, లంచగొండితనం -వీటిపై పోరాడాలి. ప్రజా ధనాన్ని దోచేస్తున్న వారిపట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వాటిపై పోరాడి స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా అందేట్లు చూసిన రోజే సామాన్యుడికి నిజమయిన స్వాతంత్యం వచ్చినట్లు. ఆవైపు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. అందులకు విద్యార్థులైన మీరు నడుం బిగించాలి. అందుకే ఈ శుభ దినాన మీరందరూ ఒక ప్రతిఙ్ఞ చేయాలి. మీ తరంతోనైనా నవశకానికి నాంది పలుకుదాం" ఎంతో ఆవేశంగా సాగింది ఆమె ప్రసంగం.

చివర్లో “అందరూ లేచి నిలబడి ఈ ప్రతిఙ్ఞ చేయండి" అంది.

విద్యార్తులంతా లేచి నిలబడ్డారు. ఆమె చేయి ముందుకు చాపి "భారత దేశ పౌరుణ్ణయిన నేను త్రికరణ శుద్ధిగా ఈ ప్రతిఙ్ఞ చేస్తున్నాను.అవినీతికి; లంచగొండితనానికి పాల్పడనని,అసూయ ద్వేషాలకు దూరంగా ఉంటానని.నీతిగా, నిజాయితీగా ఉంటానని, ప్రతి స్త్రీని తల్లిగా, చెల్లిగా గౌరవిస్తానని; నా తోటి పౌరులయిన సోదర సోదరీమణుల పట్ల ఎలాంటి వివక్ష చూపననీ, వారికి విద్య, వైద్య, ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలుండేట్లు కృషి చేస్తానని, నా దేశాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడుతానని ప్రతిఙ్ఞ చేస్తున్నాను. జైహింద్."

“ థాంక్యూ" అని తన ప్రసంగాన్ని ముగించింది అవంతిక.

కరతాళ ధ్వనులతో హాలు మారుమ్రోగింది. విద్యార్థులలో ఉత్సాహం ఉప్పొంగింది.

ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులు చేసిన ప్రతిఙ్ఞ నన్ను ముగ్ధుణ్ణి చేసింది.

ఆమె ఉత్తేజపూరితమయిన ప్రసంగం నా కెంతగానో నచ్చింది. అదే ఆమెతో చెప్పాను.

"ఈ వయసునుంచే క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, సోదర ప్రేమ, దేశ భక్తి పట్ల అవగాహన కల్పించాలి.అప్పుడే ముందు ముందు మంచి పౌరులుగా కాగలరు. మొక్కై వంగనిది మానై వంగదు కదా! ఇప్పుడెలాగూ వ్యవస్థ భ్రష్ట్టు పట్టిపోయింది. కనీసం ముందు తరాలయిన బాగుపడాలంటే రేపటి పౌరులయిన వీళ్ళు మంచి విలువలతో పెరగాలి. అదే నా ఆశయం." అంది నిశ్చలంగా.

ఆమె దూరదృష్టికి; దేశం పట్ల ఆమెకున్న అభిమానానికి నాకు చాలా ఆనందం వేసింది.

"మీలాంటి లెక్చరర్స్ దేశానికి ఎంతో అవసరం." అని మనస్పూర్తిగా అభినందించాను.

ఆమె అంటే గౌరవం పెరిగింది.

గత అలోచనల్నుంచి తేరుకొని, "చెప్పండి మేడం! ఏ పనిమీద వచ్చారు?"అన్నాను.

"నేను మీ కస్టమర్ని. పెన్షనర్ని. నవంబర్ నెలలో ఏవో సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా! ఇటు వెళ్తున్నాం. ఒక పనయిపోద్దనీ..." అంది.

"లైఫ్ సర్టిఫికేట్ ..."

"అవునవును" అంది.

వెంటనే మా అటెండర్ కి ఆ సర్టిఫికేట్స్ తెమ్మని పురమాయించాను. ఆమె క్యాజువల్ గా సంతకాలు చేసి నాకిచ్చింది. అవి - లైఫ్ సర్టిఫికేట్ ఒకటి. నాన్-రీమ్యారేజ్ సర్టిఫికేట్ మరొకటి. నాకాశ్చర్యం వేసింది. అంత క్రితమే హజ్బెండ్ అని రవికుమార్ని పరిచయం చేసింది. ఇప్పుడేమో మ్యారేజ్ కాలేదని సర్టిఫికేట్ ఇచ్చింది. ఆమెది ఫ్యామిలీ పెన్షన్. భర్త డిఫెన్స్ లో చేసి చనిపోయాడు.

"అవినీతి, లంచగొండితనం మితిమీరిపోయి ఎక్కడ పడితే అక్కడ ... ఎవరు పడితే వారు దోచేస్తున్నారని; ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారని;దీనికి అడ్డుకట్ట వేయకపోతే స్వాతంత్ర్యానికి అర్ధమే లేదని బాధపడిపోయిన అవంతిక ఇలా చేయడం నా కెందుకో రుచించలేదు. ఇంత నిసిగ్గుగా ఇలాంటి సర్టిఫికేట్ ఇస్తుందని అనుకోలేదు.

నేను నోట మాట రాక అలా చూస్తుండిపోయాను క్షణం పాటు. అప్పు డర్థమయిందేమో ఆమెకు నా సందేహం.

ఆమె భృకుటి ముడిపడింది. క్రమంగా మొహం ఎర్రబడింది.

"అంటే... మేం పెళ్ళి చేసుకోలేదు. సహజీవనం చేస్తున్నాం."అంది అసహనంగా.

"పెళ్ళి చేసుకోలేదు కాబట్టే సర్టిఫికేట్ ఇచ్చాను." అంది మరింత వివరంగా తానేమీ తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వలేదనే ధోరణిలో. పెళ్ళి చేసుకోలేదు. కానీ అందరికీ భర్తగా పరిచయం చేస్తుంది. సంఘంలో భార్యాభర్తలుగానే చలామణి అవుతున్నారు. నా మౌనం ఆమెను మరింత అసహనానికి గురి చేసింది కాబోలు అప్పుడంది -"మీకేమయినా అభ్యంతరమా?" అని.

"ఏమిటి?" అన్నాను పరధ్యానంగానే.

"మేము సహజీవనం చేయడం మీకేమయినా అభ్యంతరమా?" అంది కొంత కోపంగా.

నా జీవితంలో ఎదుర్కొన్న చాలా డెలికేట్ ఇష్యూ ఇది. నా మెదడు మొద్దుబారిపోయింది.

ఆమె విసవిసా వెళ్ళిపోతుంటే; మా అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్ లోనికొచ్చాడు.

"అంతే సార్! నీతులు నీతులే... గోతులు గోతులే. పెళ్ళి చేసుకుంటే ఆమెకు పెన్షన్ రాదు. డబ్బు కోసం సహజీవనమంటుంది. ఉపన్యాసాలు మాత్రం దంచేస్తుంటుంది. మనమేం చేయగలం?" అంటూ నిట్టూర్చాడు.

"వీటి గురించి ఎక్కువ ఆలోచించకండి సార్! పోదాం పదండి! రెండు దాటింది" అంటూ బయలుదేర దీశాడు.

తాళాలు వేసి బయటికొచ్చాం. ఒక మూలగా చెట్టు కింద కూర్చునుంది ముసలామె.

"ఏం! కమలమ్మా! ఇంకా ఇంటికి పోలా? మీ పిల్లలేరి?" అని పలకరించాను.

ఆ పలకరింపుకే ఆమె వలవలా ఏడ్చేసింది.

"ఏం జరిగింది?" కంగారుగా అడిగాను.

"ఏముంది సార్! ఈనెల పెన్షన్ తక్కువ వచ్చిందని అలిగి నన్నొదిలి వెళ్ళిపోయారు." అంది ఏడుస్తూ.

ఇంతలో మా అసిస్టెంట్ మేనేజర్ వివరణ ఇచ్చాడు.

"పోయిన నెల మూడు నెలలు డి.ఏ. అరియర్స్ వచ్చాయి. అందుకే ఎక్కువ వచ్చింది. ఈ నెల అంత రాలేదు. ఆ అమౌంట్ ఈమె నొక్కేసిందని వాళ్ళ అనుమానం."

"ఆమె పెన్షన్ ఆమె నొక్కేయడమేమిటి?" అడిగాను.

"సార్! పెన్షన్ తీసుకోవడం వరకే ఈమె పని. కొడుకులు ఒకర్నొకరు నమ్మరు. అందుకే దగ్గరుండి పెన్షన్ వచ్చింది వచ్చినట్లే చెరి సగం పంచుకుంటారు ఇద్దరు కొడుకులు. ఈ ఒక్క రోజు ఆమెకు రాజయోగం. మళ్ళీ ఒకటో తేదే. చేతిలో డబ్బు పడగానే ఈమెను ఇంట్లో వదిలేసి ఎవరి దారి వారిదే. తాగుబోతు వెధవలు. ఈ రోజు పెన్షన్ తగ్గిందని ముసలిదాణ్ణి వదిలేసి వెళ్ళిపోయారు.” ఇది మామూలేనన్నట్లు చెప్పుకుపోతున్నాడు మా అసిస్టెంట్.

ఉదయం దృశ్యం నా కళ్ళ ముందు కదలాడింది. ఎంతో అపురూపంగా తల్లికి సేవ చేస్తున్న కొడుకుల ఆంతర్యం అర్ధమయ్యే సరికి నా మెదడు పనిచేయడం మానేసింది. డబ్బు కోసం వీళ్ళు తల్లిని నడివీధిలో వదిలేశారు. డబ్బు కోసం అవంతిక అలా చేస్తోంది. ఆలోచిస్తే ఇద్దరికీ పెద్ద తేడా కనిపించడం లేదు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ