సంక్రాంతి కాంతి - నండూరి సుందరీ నాగమణి

sankranti kanti

“అభీ, అభీ... ఏం చేస్తున్నావు రా” మేడ మెట్లు ఎక్కి పైకి వచ్చిన అర్చన అక్కడి దృశ్యం చూసి మైమరచి నిలబడి పోయింది.

ఆకాశం నిండా రంగు రంగుల రెక్కలతో ఎగురుతున్న పక్షుల్లా గాలిపటాలు. ఎన్నో రంగుల్లో, తోకలతో, తోకలు లేకుండా, గాలిలో ఊగుతూ, వయ్యారాలు పోతూ, నిలకడగా ఎగురుతూ, పైపైకి దూసుకుపోతూ ఎన్నో ఎన్నెన్నో పతంగులు... ఆకాశమంతా అరవిరిసిన పూవులతో వర్ణమయమైన వనంలా కనిపిస్తోంది.

తమ డాబా మీద పదేళ్ళ తన తమ్ముడు అభినవ్ తో పాటుగా కొంత మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా గాలి పటాలు ఎగరేస్తూ ఎంతో తాదాత్మ్యత చెందుతున్నారు. ఎదురింటి డాబా మీద ఋత్విక్, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళూ పతంగులే ఎగరేస్తున్నారు. నవ్వులూ కేరింతలతో రెండు డాబాలూ మారు మ్రోగిపోతున్నాయి. అర్చన పిలిచినా వినిపించుకోకుండా తన పతంగు తాలూకు చరఖా పట్టుకుని దారాన్ని డీల్ చేస్తూ (విడుస్తూ) పైన ఎగురుతున్న గాలిపటం పైననే దృష్టి నిలిపి అటూ ఇటూ నడుస్తూ, దారాన్ని బాలన్స్ చేస్తూ రకరకాలుగా కదులుతున్నాడు అభినవ్. మిగిలిన వాళ్ళలో కొంత మంది అతన్ని ఎంకరేజ్ చేస్తూ, ‘అటు లాగు, ఇటు దించు...’ అని సలహాలు ఇస్తున్నారు. వాళ్ళను చూస్తూంటే నవ్వు వచ్చింది అర్చనకు.

“అరేయ్ అభీ, అమ్మ అన్నానికి రమ్మంటోంది... రా... తినేసి మళ్ళీ వచ్చి ఎగరేసుకో...” అంది దగ్గరగా వచ్చి.

వాడు ఒక్క క్షణం అక్కకేసి చూసి “ఒక్క పది నిమిషాలక్కా!” అని చెప్పేసి మళ్ళీ ఆకాశంలోకి దృష్టి సారించాడు.

“అబ్బా, పండక్కి వారం రోజుల ముందే సెలవులు ఇచ్చారు చూడు, మీ స్కూలు వాళ్ళను అనాలి!” చిరుకోపంతో అంది అర్చన.

“అబ్బా వచ్చేస్తున్నానక్కా... ప్లీజ్... ఋత్విక్ గాడి పతంగు కన్నా పైకి వెళ్ళాలి నాది...” అన్నాడు వాడు.

“అరేయ్ ఋత్విక్, మీరూ వెళ్లి అన్నాలు తినేసి రండిరా...” చెప్పింది అర్చన కొంచెం బిగ్గరగా...

“హా అక్కా... ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం...” చూపు తిప్పకుండానే జవాబు చెప్పాడు వాడు.

“ఎండగా ఉందిరా... ఒరేయ్ అబ్బిగా... అమ్మని పిలవాలా, నాన్నే రావాలా?” ఈసారి నిజంగానే కోపం వచ్చింది అర్చనకు. అంతే, మెల్లగా “వచ్చేస్తున్నాను అక్కా...” అంటూ గాలిపటం దించటం మొదలు పెట్టాడు అభినవ్.

***

సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్నప్పటి నుండీ తమ కాలనీలో ఇదే సందడి... అర్చనకి, అభినవ్ కీ అన్నం వడ్డిస్తూ,

“మరీ ఎక్కువ సేపు పతంగులాడకు రా... బాగా అలిసిపోతావు...” అంది సుభద్ర.

తలకాయ ఊపాడే కాని అభీ మనసంతా గాలిపటం మీదనే ఉన్నదన్న విషయం అందరూ గ్రహించారు.

“కాసేపైనా పుస్తకం తీసి చదవాలి. అప్పుడే ఆడుకోవటానికి ఒప్పుకుంటాను...” గంభీరంగా చెప్పాడు అర్జునరావ్.

ఆ సాయంకాలం అర్చన సహాయంతో పిండి వంటలు చేయటానికి ఉపక్రమించింది సుభద్ర.

“రెండు మూడు రోజులు కష్టపడితే అన్నీ వండేసి స్టీలు డబ్బాలకు ఎత్తుకోవచ్చు...మళ్ళీ పండగ అవగానే మీ కాలేజీ షురూ కదా!” అంది కూతురుతో.

అవునమ్మా... అంది పత్రికలో అచ్చయిన నెమళ్ళ ముగ్గు చుక్కలు లెక్కపెడుతూ అర్చన.

“రేపు ఆ ముగ్గు వేస్తావురా?”

“అవునమ్మా, బాగుంది కదా... నాన్నతో రంగులు తెప్పించు... పండుగ మూడురోజులూ రంగు రంగుల ముగ్గులే... “ నవ్వింది అర్చన.

***

భోగి పండక్కి రెండు రోజుల ముందు –

బావురుమని ఏడ్చుకుంటూ మెట్లు దిగి కిందికి వచ్చాడు అభినవ్.

“ఏమిటిరా అభీ, ఏమైంది?” గాబరాగా అడిగింది అర్చన, వాడిని దగ్గరకు తీసుకుని కళ్ళు తుడుస్తూ.

“ఏమైందిరా, పడ్డావా? దెబ్బలు తగిలాయా??” మరింత ఆత్రంగా అడిగింది సుభద్ర.

“బుద్ధి లేకపోతే సరి... పిచ్చాటలూ, పిచ్చి గంతులూ... డాబా మీద కుండీలన్నీ పగిలి చచ్చాయి... కోతి మేళమంతా చేరి...” గట్టిగా కసిరాడు అర్జునరావు.

“కొత్త కుండీలు కొంటాను లెండి, ఎలాగూ మార్చాలని అనుకుంటున్నాను...” మెల్లగా జవాబిచ్చింది సుభద్ర. ఏడుస్తున్న కొడుకును నెమ్మదిగా వంటింట్లోకి తీసుకుపోయారు.

వాడికి మంచి నీళ్ళు తాగిస్తూ, “ఏమైంది కన్నా?” అని అడిగింది సుభద్ర.

“మరి, మరేమో... వాడు... ఆ ఋత్విక్ గాడూ...” మళ్ళీ ఏడుపొచ్చేసింది అభీకి.

“మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదరా... వాడేం చేసాడు నిన్నూ?” అడిగింది అర్చన.

“నా గాలిపటాన్ని మాంజాతో కోసేసాడే...” మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు అభీ...

“ఛ, వాడు అలా చేయడురా... వాడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా?”

“ఏమో, ఇంకో పెద్ద అబ్బాయ్ కూడా ఉన్నాడు... ఇద్దరూ కలిసే చేసారు... అక్కా, నేను ఇక ఎప్పుడూ వాడితో దోస్త్ ఉండను... వాడితో మాట్లాడను... అంతే...” పరుషంగా ప్రకటించాడు అభి.

“సరేలే... ఇంద ఈ బిస్కట్లు తినేసి, ముఖం కడుక్కుని, కాసేపు పడుకో... ఇక గాలిపటాలు ఆడకు...” వాడిని బుజ్జగించింది అర్చన.

***

మర్నాడంతా ఇంటి పట్టునే ఉన్నాడు కానీ ఏదో పోగొట్టుకున్నట్టే ఉన్నాడు, అభీ. వాడికి మనసంతా దిగులు. ఇప్పుడు గాలిపటం గురించి కాదు, ఋత్విక్ గాడి స్నేహం పోయినందుకు.

ఆరోజు తన గాలిపటం కట్ అయి ఎటో ఎగిరిపోగానే తను గట్టిగా అరిచాడు. “ఒరేయ్... ఏంట్రా? పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇడియట్... నీ గాలిపటం కూడా తెగిపోతుందిలే, ఎవడో వేస్తాడులే...” అన్నాడు కోపంగా.

ఋత్విక్ ఏదో చెప్పబోతుంటే, అతనితో ఉన్నతను (ఋత్విక్ మామయ్యని తర్వాత తెలిసింది), “ఆటంటే ఇదేనోయ్... స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ అలా ఉడుక్కోకూడదు...” అన్నాడు తనతో వెటకారంగా.

“అదికాదురా అభీ...”ఋత్విక్ మాట పూర్తి కాకుండానే మెట్లు దిగేసి కిందికి వచ్చేసాడు తను.

పాపం వాడు ఏం చెప్పబోయాడో? ఋత్విక్ చాలా మంచి ఫ్రెండ్ తనకు. చిన్నప్పటి నుండీ కలిసే పెరిగారు, కలిసే చదువుకుంటున్నారు, ప్రతీరోజూ కలిసే ఆడుకుంటారు... అలాంటిది నిన్నటి నుండీ వాడితో కలవలేదు, మాట్లాడలేదు. వాడెంత ఫీల్ అవుతున్నాడో ఏమో... ఉదయం అక్క గేటు దగ్గర ముగ్గేస్తుంటే దగ్గరికి వచ్చి చూసి తనను చూసి చేయి ఊపాడు కూడా... తానే మాట్లాడకుండా లోపలకి వచ్చేసాడు. పాపం ఋత్విక్ గాడు...

“ఏంట్రా అలా ఉన్నావూ?” అర్చన అడిగింది అభీని.

ఏం లేదన్నట్టు తలూపాడు అభీ.

“ఋత్విక్ గురించా? పైకి వెళ్లి చూడు, వాళ్ళ డాబా మీద ఉన్నాడేమో కదా...”

“ఉహు...” అడ్డంగా తలూపాడు అభీ.

“సరే, నేను చూస్తానులే...” అంటూ డాబా మీదకు ఎక్కింది అర్చన. ఋత్విక్ వాళ్ళ డాబా మీద సందడి ఏమీ లేదు కాని, వాడు మాత్రం అభీ వస్తాడేమో అనుకుంటూ పిట్టగోడ దగ్గరగా నిలబడి, వీళ్ళ ఇంటి వైపే చూస్తున్నాడు.

అర్చనకు ఎలాగో అనిపించింది. “ఏరా ఋత్విక్, సాయంత్రం రా ఇంటికి... ఏం?” అంది.

“అలాగే అక్కా... వస్తాను... అభీ ఏం చేస్తున్నాడు?” అడిగాడు ఆరాటంగా ఋత్విక్.

“ఇప్పుడే ఏదో వర్క్ చేసుకుంటున్నాడు... నువ్వు కూడా కాసేపు చదువుకుని రా... సరేనా?” చెప్పేసి కిందికి దిగింది.

***

“రారా, నీకోసం వాడూ, వాడి కోసం నువ్వూ దిగుళ్ళూ, బెంగలు? ఏం??” నవ్వుతూ గేటులోంచి వస్తున్నా ఋత్విక్ ని పిలిచింది సుభద్ర.

హాల్లో కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటున్న అభీ దగ్గరికి వచ్చి, మెల్లగా “సారీరా...” అన్నాడు ఋత్విక్ వాడి చేయి పట్టుకుంటూ...

అభీ కళ్ళు ఆనందంతో మెరిసాయి. “ఫర్లేదురా...” అనేసాడు హాయిగా నవ్వేస్తూ.

“మా మావయ్య రా... దారానికి మాంజా పట్టించేసాడు వద్దన్నా... పైగా కట్ చేసింది కూడా అతనే... లేకపోతే నీ పతంగుని అలా చేస్తానారా నేను?” అన్నాడు ఋత్విక్.

“అసలు మీరిద్దరూ పంతాలకి పోయి, పోటీలు పడీ గాలిపటాలు వేయకండి. ఇద్దరూ ఒక్కటే ఎగరేసుకోండి, సరేనా? ఏమిట్రా ఆ కవరు నిండా?” అంది అర్చన.

“అక్కా, మా అమ్మ పంపించింది... అరిసెలూ, కజ్జికాయలూ, జంతికలూ, సున్ని ఉండలూ...” అన్నాడు ఆ పెద్ద కవరును అందిస్తూ.

“అమ్మో ఆంటీ ఎన్ని పంపించిందో... చూడమ్మా? నాన్నగారికి బెల్లంతో చేసిన అరిసెలు ఇష్టం కదా... దాచి పెట్టమ్మా...” అంది అర్చన.

“మరే, మన నువ్వుల లడ్డూలంటే వీడికీ, వీడి అమ్మకీ చాలా ఇష్టం... వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ నిండా మనం చేసిన చక్కిలాలూ, లడ్డూలు పాక్ చేసిద్దాం...” అంది సుభద్ర.

“అక్కా, ఆంటీ...సాయంత్రం అమ్మవచ్చి పిలుస్తుంది. మా తమ్ముడికి భోగిపళ్లు పోస్తున్నాము రేపు... అందరూ వచ్చేయండి...” చెప్పాడు ఋత్విక్, అభీకి కలర్ పెన్సిల్స్ అందిస్తూ.

“అలాగేరా, వస్తాం... ఉండు నీకు నువ్వుల లడ్డూలు పెడతా... తిందువు గాని...”

***

ముగ్గులూ, గొబ్బెమ్మలతో ముంగిళ్ళూ, రకరకాల బొమ్మలతో కొలువులూ, పండుగ వంటల ఘుమఘుమలతో వంటిళ్ళూ, స్నేహితుల బంధువుల రాకపోకలతో అందరి ఇళ్ళూ నిండిపోతూ, సంక్రాంతి పండక్కి మరింత కాంతిని తీసుకువచ్చాయి. స్నేహంలోని మాధుర్యాన్ని చవి చూస్తూ, ఒకరికొకరు పంచుకుంటూ పండుగ మూడురోజులూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అభినవ్, ఋత్విక్.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ