స్వామి చిన్మయానంద అక్షయగ్రామంలోకి వచ్చారు.
ఆయన సంవత్సరంలో ఏదో ఒక రోజు అలా ఆ గ్రామంలోకి వస్తారు. అనుగ్రహభాషణం చేస్తారు.
ఆయనంటే ఆ గ్రామ వాసులకి ఎంతో గౌరవం. ఆయన మాటంటే వేదవాక్కు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పరితపిస్తారు.
పెద్దలంటే గౌరవం కనబరుస్తూ, సదాచార సంప్రదాయానికి పెద్దపీట వేస్తుంది కాబట్టి ఆ గ్రామం సుభిక్షంగా ఉంటోంది. ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడుతోంది.
ఈసారి సంక్రాంతికి నాలుగు రోజుల ముందుగా వచ్చి గ్రామ శివాలయంలో బసచేశారు.
ఆరోజు సాయంత్రం ఆయన ప్రసంగానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి.
ఎత్తైన పీఠం మీద కూర్చున్న స్వామి చిన్మయానంద తన ముందున్న గ్రామ ప్రజల్ని అర్ధనిమీలిత నేత్రాలతో ప్రసన్నంగా ఓమారు చూశారు.
సన్నటి గాలి కదిలించే ఆకులసందడి, పక్షుల కిలకిలలు, ఆవుల అంబాలు తప్ప గ్రామ వాసులందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనేం చెబుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"గ్రామ వాసులందరికీ నా శుభాశీస్సులు! పెద్దలంటే వినయవిధేయతలు, వారి మాటంటే గౌరవం ఉన్నాయి కాబట్టే ఈ గ్రామం పచ్చగా ఉంటోంది. నాకు తెలుసు నా మాటలు కేవలం ఈ చెవితో విని ఆ చెవితో వదిలెయ్యరని, ఆచరణతో వెలుగుబాటన నడుస్తారని.
ఇంకో రెండురోజుల్లో పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. దూర దూరాలకి ఉద్యోగాది కార్యాల నిమిత్తం తరలి పోయిన ఈ గ్రామ ప్రజలు మళ్లీ పండక్కి వచ్చి కొత్త నీరు ప్రవహించే నదల్లే గ్రామానికి నిండుదనం తెచ్చారు. పండగలు మన సంస్కృతికి సారధులు. తరచి చూడాలే గాని అవి ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తాయి. అందరం ఒకచోట గుమిగూడి అల్లర్లు, కేరింతలతో కాలం గడిపి తరలి పోవడం కాదు పండగంటే. ఊరు ఊరంతా ఒక్కటవుతుంది. ఒక కుటుంబమవుతుంది. మన కుటుంబానికంటూ కొన్ని సంబరాలు చే॑సుకుంటాం. పుట్టిన రోజులు, బారసాలలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇత్యాదివి. కానీ పండగలు ఊరందరివి. అందరూ కలసి ఐకమత్యంగా, ఎటువంటి అరమరికలు లేకుండా జరుపుకుంటారు. కలసి ఉంటే కలదు సుఖం అనే వాక్యానికి నిజమైన భాష్యం పండగలు. అందరూ కలసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా మెడలు వంచవచ్చు.
సంక్రాంతి పెద్ద పండగ. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు మచ్చటగా జరుపుకునే చక్కటి పండగ.
కన్నెపిల్లలు వేసే సప్త వర్ణ ముగ్గులు ఊరంతటినీ ఒక ఇంటి వాకిలిగా మారుస్తాయి. ముగ్గుల మధ్య పువ్వులతో అలంకరించిన గొబ్బెమ్మలు వాళ్ల కళాత్మకతకి చిహ్నాలు. గొబ్బియల్లో అని గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాడే పాటలు మానవ ఐకమత్యానికి సజీవ తార్కాణాలుగా నిలుస్తాయి. రంగు రంగుల గాలిపటాలు ఎగరేసి భూమినీ ఆకాశాన్నీ కలిపే ప్రయత్నం ఎంతో హృద్యంగా ఉంటుంది.
మొదటి రోజు భోగి. పాతవి తగల బెడితే వచ్చే వెచ్చదనంతో శరీరాన్ని సేద తీర్చుకోవడమే కాకుండా, చిందే వెలుగు అంధకారాన్ని తొలగిస్తుంది. సాయంత్రాలు పెట్టే బొమ్మల కొలువు ఇంటి ఇళ్లాల్ల, పిల్లల సృజనాత్మకతకు అద్దం పడుతుంది. సాయం కాలం పసితనం పై పోసే ఆశీర్వచన భోగి పళ్లు..ఓ సొంపైన దృశ్యం..మనసులో ఛాయాచిత్రమయి తీరుతుంది.
కొత్త పంట చేతికి వచ్చింది. ప్రతి ఇల్లూ ధన ధాన్యాలతో విలసిల్లుతోంది. ధన లక్ష్మి నట్టింట నర్తిస్తోంది. ఆ ఐశ్వర్యానికి మిడిసి పడక తనకు తోచినంతలో దానం చేయలి. దానం ఉత్తమ గతులనిస్తుంది. వాకిలే వైకుంఠం, కడుపే కైలాశంలాగా బతక్కుండా, సమాజంలోని ఆర్థిక అధమ స్థాయి జనావళినీ దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్లకి మేమున్నామన్న ధైర్యాన్ని ఇవ్వాలి. మన క్షేమం కోరుతూ హరి నామ స్మరణ చేసే హరిదాసులకిన్ని బియ్యం, సన్నాయితో బసవన్ననాడించి దీవించే వాళ్లకు బట్టలు, మన కుటుంబ క్షేమాన్ని అభిలషించే అయ్యవార్లకి భూరి దక్షిణలు ఇవ్వాలి. అంతే కాకుండా తమ కుల వృత్తులతో మన అవసరాలు తీరుస్తున్న చాకలి, కుమ్మరి, కమ్మరి, మేదరి, కంసాలీలకు తగు రీతిన సత్కరించాలి. వైద్యో నారాయణో హరిః అన్నారు. ఆయన మన పాలిట సాక్షాత్తు మృత్యుంజయ మంత్రం.
ఆయనకీ సత్కారం చేయాలి. మీ పిల్లలకి చదువంటే అక్షరాలు చదవడం. పదాలు వల్లె వేయడం కాకుండా సమాజాన్ని అర్ధం చేసుకునేదని తెలియజేయండి. సంస్కృతి సంప్రదాయాలు మన వారసత్వ సంపదని చాటి చెప్పండి.
పండక్కి కొత్తళ్లుల్లు వస్తారు. ఇళ్లకి వచ్చే ఆ కళే వేరు. అయితే వచ్చిన అల్లుడు ఏ గొంతెమ్మ కోరిక కోరతాడో అని ఇంటిల్లిపాదీ బెంగటిల్లితే ఇహ పండగ ఆనందం ఎక్కడ ఉంటుంది? పై పైన పెదాలపై కృత్రిమ నవ్వులు పూయించుకుని కలయ తిరుగుతుంటారు గాని మనసున సుడిగుండాలే! అల్లుడు వస్తున్నాడంటే యావత్ కుటుంబం ఆహ్లాదంగా ఉండాలి, అలాగే అల్లుడు అడిగే చిన్న చిన్న కోర్కెలు తీర్చి అత్త మామలు కొత్తల్లుడిలోని కొత్తని పోగొట్టాలి.
కనుమ నాడు మినుము తిని కోళ్ల పందాలకి వెళతారు. అది సరదా సంబరం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఆధిపత్య ధోరణికి అద్దం పట్టి వాదులాటలకు, కోట్లాటకు దారి తీయ కూడదు.
పండగలు, సంబరాలు, సంతోషాలు అన్నీ లోకా సమస్తా సుఖినోభవంతు అన్న సూక్తికి అద్దం పడతాయి.
అందరం కలిస్తేనే సమాజం. సమాజమే మన ఉనికి. దాన్ని కాపాడుకోవాలి. అందుకు పండగలు ఎంతగానో దోహదం చేస్తాయి. పండగల ప్రాశస్త్యం తెలుసుకుని మీ పిల్లలకి తెలియ జెప్పండి.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు - సర్వేషాం మంగళం భవతు
సర్వేసంతు సుఖినః - సర్వేసంతు నిరామయా
సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు సర్వేజనా స్సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీ అందరూ కళకాలం పిల్లా పాపలతో, పాడీ పంటలతో, ఆయురారోగ్యాలతో అష్టాఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను.
శుభం భూయాత్! అని నిష్క్రమించారు స్వామి చిన్మయానంద.