మామ్మ - కొమ్ముల వెంకటసూర్యనారాయణ

maamma

“ఏవండీ! శుభవార్త” ఇంట్లోకి అడుగుపెడుతుంటే ఎదురొచ్చి మరీ నా శ్రీమతి గుమ్మంలోనే పలకరించింది.

“ఇంతకీ ఏమిటంట? ఆ శుభవార్త” అడిగా

“ఇంట్లో పనిచేయడానికి పనిమనిషి కుదిరిందండి” అదీ ఆ శుభవార్త

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

సుమారు నెల రోజులయింది మేము ఇల్లు మారి.ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచీ ప్రయత్నిస్తూనే ఉంది నా శ్రీమతి ఇంట్లో పనికి పనిమనిషి కోసం. ఎట్టకేలకు పని మనిషి కుదిరిందన్నమాట. అందుకే నా శ్రీమతికి ఆ సంతోషం.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

మా పెళ్ళి అయి కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు పది, పన్నెండు మంది పని మనుషులు మారి ఉంటారు. పట్టుమని పది కాలాల పాటు పని చేసిన పని మనిషి లేదు. పోనీ పెట్టు పోతలలో నా శ్రీమతి ఏమయినా లోటు చేస్తుందా అంటే అదీ లేదు, అడపా తడపా ఎంతో కొంత అదనంగా సాయం చేస్తూనే ఉంటుంది. అందుకే నాకు పని మనుషులపై ఒక విధమైన దురభిప్రాయం ఏర్పడిపోయింది. అలా ఆలోచిస్తూ వర్తమానం లోకి వచ్చి ఇంతకీ పని మనిషి విషయాలు ఏంటో చెప్పు అన్నా శ్రీమతితో.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

“వయసు డెబ్భై, డెబ్భై అయిదేళ్ళ వరకు ఉంటాయండి. బక్క పలుచగా ఉంది. పెద్దావిడే. రోజూ అంట్లు తోమడానికి, గదులు తుడవడానికి నెలకు వెయ్యి రూపాయలకు ఒప్పుకొంది. మనతో కలుపుకొని ఆరు ఇళ్ళల్లో పని చేస్తుందంట” చెప్పుకొంటూ పోయింది.

“అయితే ఈవిడా కొన్ని రోజులే అన్నమాట” మనసులోనే అనుకొన్నా

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

మరునాడు ఆఫీసుకు బయలుదేరబోతుంటే తలుపు చప్పుడు అయితే మా ఆవిడ తలుపు తీసి “రా! మామ్మ రా! అంటూ లోపలికి పిలిచి నాతో “తనేనండీ! మన యింట్లో పని చేయడానికి కుదిరిన పనావిడ” అని చెప్పింది. చూడటానికి చురుకుగానే ఉంది గానీ బాగా సన్నగా, కర్ర పుల్లలా ఉంది. పైగా ఆరు ఇళ్ళల్లో చేయాలి అని గుర్తుకొచ్చే సరికి నేను మనసులో అనుకొన్న మాట నిజమే అయ్యేలా ఉందనుకొన్నాను. అంతేకాక త్వరలోనే ఇంకొక పని మనిషిని చూసుకోవల్సిందే అనుకొన్నా.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నా “యిల్లాలు” కొత్త పనిమనిషి “మామ్మ” గురించి ఒకటే కబుర్లు. “ఎంత బాగా చేసిందనుకొన్నారు, అంట్లు ఎంత శుభ్రంగా తోమిందనుకొన్నారు, అన్ని గదులు ఎంత శుభ్రంగా తుడిచి తడి గుడ్డ వేసిందనుకొన్నారు” అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ చెప్పుకొంటూ పోయింది.

“వచ్చిన కొత్తలో అలాగే చేస్తారు,నాల్గురోజులు పోనీయ్ తర్వాత తెలుస్తుంది వాళ్ళ పనితీరు. ఆదరా బాదరా గా చేసి వెళ్ళి పోతారు. అందులోకి ఆరు ఇళ్ళల్లో వని కుదుర్చుకొంది అంటున్నావు, నీకు రోజూ వచ్చేస్తాదనుకొంటున్నావా! నెలలో ఎన్ని రోజులు పని ఎగ్గొడుతుందో చూస్కో! అంతే కాదు వాళ్ళకి నీవిచ్చే జీతం మీద ప్రేమ గానీ, నీ మీద కాదు, నీ ఇంటి మీద కాదు” అంటూ పని మనుషుల మీద నాకున్న భావాలన్నింటిని వెళ్ళ గ్రక్కాను.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

మనిషి రూపు, వాళ్ళ కుండే ఆర్ధిక స్థితిని చూసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తక్కువగా అంచనా వేయడం ఎంత పొరపాటో ఆ రోజే మొట్ట మొదటి సారిగా తెలిసొచ్చింది. ఆ రోజు సాయంత్రం కిరాణా సరుకులు తేవడానికి వెళ్తూ హేంగర్ కి తగిలించిన షర్టు వేసుకొని జేబులో పెట్టిన అయిదు వందల రూపాయల కాగితాన్ని వెతికితే కన్పించలేదు. ఎవరో పేరంటానికి పిలిచారని మా ఆవిడ బయటకు వెళ్ళింది. తనే తీసి ఉంటే కచ్చితంగా చెప్పుతుంది కదా! సరే, ముందు కిరాణా సరుకులు ఆవసరం కదా అని వేరే డబ్బులు తీసుకొని వెళ్తూ…షర్టులో పెట్టిన అయిదు వందల కాగితం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుంటే ప్రొద్దున్న ఆ గది ఊడ్చిన “మామ్మ” గుర్తొచ్చింది. తుడుస్తుంటె ఎవరో పిలిస్తే బయటకు రావడం కూడా గుర్తుంది. ఇంకేముంది తనే తీసుండాలి, ఇంక ఎవరు తీసినా చెప్తారు కదా! అలా అనుకొంటూనే సరుకులు కొనుక్కొని ఇంటి దారి పట్టాను.

ఇంటి లోకి అడుగు పెట్టగానే మా అబ్బాయి ఎదురొచ్చి “చెప్పటం మరిచి పోయా డాడీ! ప్రొద్దున్న కాలేజికి వెళుతూ అర్జంటుగా రికార్డ్స్ కొనుక్కోవడానికి మీ షర్ట్ జేబులో అయిదు వందల కాగితాన్ని పట్టుకెళ్ళా! అంతే మనస్సు చివుక్కుమంది. ఎంత తప్పుగా ఆలోచించానా అని.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

మామ్మ పట్ల నేను ఏర్పరచుకొన్న అభిప్రాయాలన్నీ పూర్తిగా తప్పేనని అతి కొద్ది కాలం లోనే తెలిసొచ్చాయి.

“ఒంట్లో ఓపికున్నంత కాలం పిల్లలకు భారం కాకూడదమ్మా, అంతే కాదు వేన్నీళ్ళకు చన్నీళ్ళలా కొంత వాళ్ళకిచ్చి సాయ పడుతున్నానమ్మా! అందుకే ఈ పనులన్నీ ఒప్పుకొన్నాను” మామ్మ ఒక రోజు మా ఆవిడతో మాటల మధ్యలో అంటుంటే విన్నా. అలాగే నెలలో ఒకటి రెండు రోజులయినా మానేస్తుందనుకొన్నా, కాని అప్పటికి ఆరు నెలల పైనే అయింది మామ్మ పనిలో చేరి, కానీ రెండే రెండు రోజులు మాని వేసింది, అదీ తన పెద్ద కొడుకు కొడుకు పెళ్ళికి. మామ్మకి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనవలు కూడా ఉన్నారు. అంతే కాదు, చాలా తక్కువగా మాట్లాడుతుంది, అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం లాంటి క్షణాలేమి లేవు. ఇట్లా ఎన్నో పాఠాలు మామ్మ నుంచి తెలుసుకొన్నాను.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

ఈ మధ్యనే జరిగిన సంఘటన మామ్మ నుంచి పాఠమే కాక గుణ పాఠాన్ని నేర్పింది.

“ఏం మామ్మా! ఈ మధ్య ఎన్నికలొచ్చాయి కదా! పోటీ చేసిన వాళ్ళు డబ్బులిస్తే!” అని అడిగా“తీసుకొన్నాను బాబూ!” అంటూ మధ్యలొ ఆగింది.“అంతే నా మనస్సుకి ఎంతో హాయి! అక్కడికి నేనేదో గొప్పగా ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు, కానీ వీళ్ళింతే అన్నట్లుగా! కానీ ఆ తర్వాత అంది” ఆ తీసుకొన్న డబ్బు నా కూడు కోసం కాదు బాబూ! ఎందు కోసం తీసుకొన్నానంటే ఆ డబ్బు పెట్టి రోడ్డు ప్రక్కన బస్ షెల్టర్ లో కొన్ని రోజులుగా లేవ లేక లేవ లేక ఉన్న ఓ ముసిలోడికి ఒక దుప్పటి, కొన్ని పళ్ళు, రొట్టె కొనిచ్చాను బాబూ!” అంది. అంతే నా చెంపపై చెళ్ళుమని కొట్టినట్లైంది.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

ఇక ఈ రోజు జరిగిన సంఘటన అయితే మామ్మ వ్యక్తిత్వానికి పరాకాష్ఠ లాంటిదే.

“అర్జంటుగా హస్పిటల్ కి రారా!మీ అన్నయ్యకి ఏక్సిడెంట్ అయ్యింది” ఈ ఊర్లోనే మా అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ నుంచి ఫోన్. పరుగు పరుగున హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది. ”అన్నయ్యకి రక్తం చాలా పోయింది. అర్జంటుగా రక్తం ఎక్కించాలి అంటున్నారు డాక్టరు” అని చెప్పింది అమ్మ.

అన్నయ్య బ్లడ్ గ్రూప్, మా అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఒక్కటే అందుకే వెంటనే ఇంటికి వచ్చాను. మా ఆవిడకి విషయం అంతా చెప్పాను. “రేపే వాడికి పరీక్ష, ఇప్పుడు బ్లడ్ యిస్తే ఎలా” అంది. ఏం చేయాలో తోచక అలా కూలబడి పోయా. అక్కడే ఉండి గది తుడుస్తున్న మామ్మ ”బాబు గారూ! పోనీ బయట ఎక్కడైనా ప్రయత్నించండి” అంటూ ఒక ఉచిత సలహా పారేసి ఇంటికెళ్ళిపోయింది..స్నేహితులు యిళ్ళకి ఫోన్ చేసి కనుక్కొంటున్నాను వాళ్ళ ఎవరి బ్లడ్ అయినా సరిపోతుందేమోనని. అలా గంట గడిచి పోయింది. ఈ లోపు అమ్మ దగ్గరినుంచి ఫోన్ “చాలా సంతోషంరా బాబూ! నీవు చెప్పావంట కదా! మీ పని మనిషి వాళ్ళ నలుగురి అబ్బాయిలను హాస్పిటల్ కి పంపించింది. వాళ్ళల్లో చిన్నబ్బాయి బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఆ అబ్బాయి రక్తం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి రక్తం ఇవ్వకపోతే మన అన్నయ్య మనకు లేనట్లేరా” అంటుంటే నా కళ్ళ వెంబడి కన్నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. సిగ్గుతో తల దించుకొన్నాను. ఆ క్షణమే ఒక నిర్ణయానికొచ్చా. కనీసం ఇప్పుడైనా మామ్మ యింటికెళ్ళి మామ్మకు కృతజ్ఞత చెప్పాలి అని మామ్మ గుడిసె కేసి వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళా.

*** ***** **** **** ***** ***** ***** ***** *** *** **** *** ***

మామ్మ ఇంటి ముందు చాలా హడావిడిగా ఉన్నారు. కొందరు కుర్రాళ్ళు పాడె కడుతున్నారు. ఈ లోపు ఎవరినో కుర్చిలో కుర్చోబెట్టి తల మీద నుంచి నీళ్ళు పోస్తున్నారు. తీరా చూస్తే ఆమె ఎవరో కాదు మామ్మే!. నా గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం మొదలయింది. తనివి తీరని బాధ గుండెని పిండేస్తుంది. అసంకల్పితంగా నా కళ్ళ వెంబడి కన్నీళ్ళూ జారిపోతున్నాయి. మామ్మ ని పాడె మీదకు తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఎవరో అంటున్నారు. “మామ్మ వాళ్ళ చిన్నబ్బాయి హాస్పిటల్ లో ఎవరికో రక్తం ఇవ్వడానికి వెళ్ళాడంట.

ఇంకా రాలేదు. వాడు రావాలి కదా వాళ్ళమ్మ చితికి నిప్పు పెట్టడానికి. అంతే ఒక క్షణం ఆలస్యం చెయ్యలేదు. “ఆ చితికి నేను నిప్పంటిస్తా!” అన్నా. మిగతా కొడుకులు, బంధువులు “వద్దు బాబూ! మీరెందుకు” అంటున్నారు. “లేదు, నేను దానికి అర్హుడనే ఎందుకంటె మామ్మ చిన్నబ్బాయి యిస్తున్న రక్తం ఎవరికో కాదు నా అన్నయ్యకే అంటే నా అన్నయ్య ఒంట్లో మామ్మ చిన్నబ్బాయి రక్తమే ప్రవహిస్తుంది అందుకే మామ్మ నాక్కూడా అమ్మే. పదండి అన్నా. ఆ విధంగానైనా మామ్మ ఋణాన్ని కొంతైనా తీర్చుకొనే అవకాశం వస్తుందని.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ