ఆహా....లలిత రాగం...యెంత లోతైన రాగమో! హిరణ్మయీం లక్ష్మీం...ముత్తుస్వామి దీక్షితర్ లక్ష్మి అమ్మవారిమీద వ్రాయటం, దాన్ని లలిత రాగంలో కూర్చటం.. బంగారానికి తావి అద్దటమే......చాలా తాదాత్మ్యంలో అనంద బాష్పాలు కళ్ళల్లో సుళ్ళు తిరుగుతుండగా వింటూంది నీరజ మిద్దె మీద..
'ఓయ్..ఇదిగో నిన్నే..నీరూ..పక్కింటి భాగ్యలక్ష్మిగారొచ్చారు నీకోసం'...కిందినుండీ సంతోష్ పిలుపు...
నీరజ పాటలో మునిగిపోయి ఉంది. అస్సలు కదలటమె లెదు.
వాళ్ళది డ్యూప్లెక్స్ ఇల్లు. మెట్ల మీదుగా మిద్దె మీదికి వెళ్ళె మలుపులో గోడకు 3/6 కొలతలతో ఓ పెద్ద అద్దం అమర్చుకున్నారు. కింద హాల్లోంచీ చూస్తే పైన కంపూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. అద్దం పెట్టినప్పుడు, సంతోష్ నీరజను చాలా కోప్పడ్డాడు..ఇంత అద్దం ఇక్కడెందుకని..నీరజ పట్టిన పట్టు వదల్లేదు. అ తరువాతే దాని ఉపయోగం తెలిసొచ్చేసరికి, సంతోష్ కూడా సమాధాన పడిపోయాడు. అమ్మాయి అమెరికాలో చదువూ, అబ్బాయి ఆష్ట్రేలియాలో వుద్యొగమూ..తామిద్దరూ, రిటైర్మెంట్కు కాస్త దగ్గరగా వున్నారు . ఫ్లాట్ అంటే బోర్ కొట్టి, ఇటీవలే సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళొచ్చారిక్కడికి! వున్న పిల్లలిద్దరూ అమెరికా, ఆష్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడిక వీళ్ళిద్దరూ.. జీవితం చాలా తీరికగా మూడు ఫోన్లూ, ఆరు స్కైప్ లతొ హడావిడిగా సాగుతోంది. నీరజకు కర్ణాటక సంగీతం ప్రాణం. సంతోష్ కు టీ వీ ప్రాణం. తీరిక దొరికినప్పుడంతా, కంప్యూటర్లోనూ, టీ వీ లోనూ, యెవరి అభిరుచుల్లో వాళ్ళు కూరుకుపోతుంటారు. ఇప్పుడు సంతోష్ కింద టీ వీ ముందూ-నీరజ మిద్దె మీద కంప్యూటర్ ముందూ!
సంతోష్ భాగ్యలక్ష్మిని కూర్చొమ్మని మర్యాదగా చెప్పి, పైకొచ్చేశాడు-నీరజను కిందికి పంపటానికి.. మొత్తానికి నీరజ కిందికొచ్చి, భాగ్యలక్ష్మిని చిరునవ్వుతో పలుకరించింది బాగున్నారా అంటూ.. ఆఆ...మీరు బాగున్నరా? ఆఆ..యేముందీ. వేళకు తినటం ..పడుకోవటం..పిల్లలతో మాట్లాడటం..ఇంతేగా మీకైనా? అంతేకదండీ మరి..మా సంగతి అంతేకదా..ఒకడు సింగపూర్..ఇంకోడు అబుదబీ .అన్నట్టు, మా ఇంట్లో రేపాదివారం పూజండీ..మీరూ మీవారూ తప్పక రవాలి మా ఇంట్లో భోజనానికి.. తప్పకుండా..మరి పొద్దున నాపూజ అదీ అయ్యేసరికే 12.30 దాటుతుంది..మేమొచ్చేసరికి 1 అవుతుందేమో మరి..
యేం ఫరవాలేదు.అసలు వుదయం తొమ్మిదికే పూజైపోతుంది..మీ ఇష్టం యెప్పుడైనా రావచ్చు..
ఐతే సరేలెండి ..
వస్తానండీ..ఇంకా పిలుపులున్నాయి..
అఆ..ఇదిగో బొట్టుపెడతానుందండి మరి..
నీరజ బొట్టూ రెండు కమలాలు భాగ్యలక్ష్మి చేతిలో పెట్టి నవ్వుతూ వీడ్కోలు పలికింది..
భాగ్యలక్ష్మి అటు వెళ్ళగానే, నీరజ 'యేమండీ'..అంటూ కేకేసింది అద్దం గుండా పైకి చూస్తూ..
'ఆఆ..యేంటి?' సంతోష్ పైనుంచే అడిగాడు.
'అదేనండీ..భాగ్యలక్ష్మిగారు వాళ్ళింటికి భోజనానికి పిలిచి వెళ్ళారు మళ్ళీ'..
'మళ్ళీనా? అమ్మో ..నీకిష్టమైతే వెళ్ళు. నేను రానంటే రాను'..
'అబ్బా..బాగుండదండీ..ఇరుగూ పొరుగూ పిలిస్తే అలా వంకలు పెడితే యెట్లా?'
' ఆఆ..బాగుందిలే.. ఆ స్పెషల్ లంచ్ నే చేయలేనుగానీ..నీవెళ్ళవోయ్..'
నీరజ నిట్టూర్చింది బరువుగా! నిజమే మరి...ఇటీవలే కొత్తగా కొనుక్కున్న యీ ఇంట్లోకి వచ్చారు వాళ్ళు. వచ్చీరాగానే, ఇరుగూ పొరుగూతో అప్పుడప్పుడూ పలకరి0చటాలూ, రెండుమూడు పండుగలకు పేరంటాలకు పిలవాటాలూ, పరిచయాలు బాగానే యేర్పడ్డాయి. ఆ క్రమంలో, పక్కనే ఉండే యీ భాగ్యలక్ష్మితో దోస్తీ బాగానే కుదిరింది. పోయిన నెల్లో ఆవిడేదొ వాళ్ళింట్లో ప్రత్యేక నోమని దంపతి భోజనాలకు పిలిచింది. అప్పుడూ 'ఇలాగే 12.30 అవుతుం'దంది నీరజ. ఫరవాలేదంది పక్కింటావిడ. సరే..ఇద్దరూ వెళ్ళారు..తీరా భోజనాలకు కూర్చుంటే, యెంతకీ, అవేవో వుండ్రాళ్ళూ, వేడి ముక్కల సాంబారూ, పులగమూ, టమాటో పచ్చడి వడ్డిస్తున్నారే కానీ మరో వంటకమే లేదు..వేడి వేడిగా రెండుసార్లు అవే వడ్డించి, ఆఖరున పెరుగు వడ్డించారు.
మొగవాళ్ళబంతిలో సంతోష్ ముందే భోజనం కానిచ్చి, ఇంటికి వెళ్ళిపోయాడు. నీరజ మర్యాదగా తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చేసరికి, సంతోష్ 'బాగా చేశావా పండుగ భోజనం?' అని నవ్వుతూ అడిగాడు.
'ఆఆ..మీరెలా చేశారు మరి?'
'భలే వుందిలే..యెంతకీ అదే వుండ్రాళ్ళూ, అదే సాంబారూ, అదే చట్నీ..రెండు సార్లూ అవే వంటలు..పెరుగూ వడ్డించరనుకున్నా. .అదొచ్చేసరికి, బతికిపోయా! ఇలాంటి పూజలకూ, భోజనాలకూ, వాళ్ళ బంధువులనూ, ఆ పూజలగురించి తెలిసిన వాళ్ళనూ పిలిస్తే బాగుంటుంది కానీ..ఇలా మనలాంటి వాళ్ళను పిలవటమెందుకు చెప్పు?'
చెప్పొద్దూ..నీరజకూ అదే అనిపించింది.. కానీ, ఇరుగూ పొరుగూ తొ సర్దుకు పోవాలంతే కదా! సంతోష్ పూర్తిగా నాస్తికుడు. పూజా, పునస్కారాలు అసలే పట్టని వాడు. అందుకే, నీరజ తన పూజలూ, వ్రతాలూ తన పాటికి తను చేసుకుంటుంది కానీ అతన్ని ఇన్వాల్వ్ చేయదిప్పటికీ! ఇక్కడికి ఇటీవలే వచ్చారు కాబట్టి, ఇంకాస్త సమయం పడుతుంది, యిక్కడి వాళ్ళతో సర్దుకు పోవటం..
ఈ సంఘటన జరిగి గట్టిగా పది హేను రొజులే అయింది. అంతలొనే మళ్ళీ పిలుపు. యీ సారి పిట్టగోడ దగ్గరే నిలుచుని పిలిచిందావిడ! 'ఇదేమిటా' అనుకున్నా, ఇరుగూ పొరుగూతో ఇలాంటి పట్టింపులు పెట్టుకోకూడదనుకుంది నీరజ.. యెలాగో సంతోష్ ను బతిమాలి, బామాలి, ఒప్పించి వాళ్ళింటికి భోజననికి తీసుకెళ్ళింది. ఇప్పుడు తెలిసిన విషయం- యీ నోము ఇంకా రెండు సార్లు నొముకోవలసి వుందంతే! ఆ తరువాత, అదేదో క్షేత్రానికి వేళ్ళి వస్తారట ఆ దంపతులిద్దరూ!
మరో పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆ రోజు ఉదయాన్నే ఫోన్ మొగింది. ఇంతపొద్దున్నే యెవరా అనుకుంటూ వెళ్ళింది నీరజ.
'నేనే నండీ భాగ్యలక్ష్మిని..బాగున్నారా?'
'ఆఆ..బాగున్నాము. మీరెలా ఉన్నారు భాగ్యలక్ష్మి గారూ?
'ప్రతి సారీ అలా మొత్తం పేరక్ఖరలేదు లెండి..లక్ష్మీ అంటే చాలు మీ పేరు బాగుంది..నీరజా అని చిన్నగా పిలవటానికి యీజీగా'.....నవ్వు అటువైపునుంచీ.
తానూ నవ్వి అంది నీరజ..'సరే లక్ష్మిగారూ..యేంటి సంగతి?' 'ఇదిగో నిన్ననే డిసైడ్ అయింది..రేపు మళ్ళీ పూజండీ..మీరిద్దరూ రావాలి భోజనాలకు'..
నీరజ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అమ్మో..యేంచెప్పాలబ్బా తప్పించుకునేందుకు..అవతల భాగ్యలక్ష్మిగారు, ఇది ఆఖరుసారనీ, ఇక ఆ క్షేత్రానికి వెళ్ళిరావలసి వుంటుందనీ చెబుతున్న్ కబుర్లకు అన్య మనస్కంగానే సమాధానం చెబుతూంది నీరజ. సంతోష్ యీసారి ఒప్పుకోడు గాక ఒప్పుకోడు. తాను వెళ్ళినా వాళ్ళకు ఫలం దక్కదు-దంపతులిద్దరూ వెళ్ళాలి కాబట్టి!
తడుముకోకుండా జవాబు చెప్పేసింది..'లక్ష్మిగారూ యీసారికి వదిలేద్దురూ..నాకు పనుంది..పొద్దున 11గంటలకల్లా వెళ్ళాలి'.
'9 గంటలకే పూజ ముగుస్తుంది కదా! మీరిద్దరూ 10.30 కి భోజనం చేసి వెళ్ళొచ్చుకదా?'
'అహహ..నా పూజా, భోజనమూ..అప్పుడే అంటే కుదరదు లెండి..పైగా నేను 10.30కల్లా వెళ్ళాలి 11 గంటలకు చేరుకోవాలంటే..'
'అవునా..మనవాళ్ళనే పిలవాలి భోజనాలకు..అని నియమం వుంది కాబట్టే యీ ఇబ్బంది యీ పూజకు..అసలు మీరిక్కడికి రాగానే, చెప్పొద్దూ. నేనెంత సంతోషించానో తెలుసా..హమ్మయ్య, నా పూజలకిక ఒక జంట దొరికింది యెక్కువ వెతుక్కోకుండా అని'..నిట్టూర్పు అవతల!
నీరజ గతుక్కుమంది కానీ, సంతోష్ ను ఒప్పించటం తనవల్లయ్యే పనికాదీసారి. అందుకే తానూ యీ అపూర్వావకాశం వదులుకుంటున్నందుకు, చాలా బాధపడిపోతున్నటే మాట్లాడింది. సున్నితంగానే చెప్పింది - రాలేమని. భాగ్యలక్ష్మి గారికి చెప్పనైతే చెప్పింది కానీ, ఇప్పుడు వున్నట్టుంది, యెక్కడికి వెళ్ళేది మరి?
తనకున్న ఫ్రైండ్స్ అందరినీ గుర్తు తెచ్చుకుంది. రమ వూళ్ళో లేదు. శాంతి వాళ్ళబ్బాయి దగ్గరికి అమెరికాకు వెళ్ళింది. సరోజ యెప్పుడూ బిజీ బిజీ..తన దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా అపాఇంట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా...ఆ..సంతోష్ నే అడిగితే?
' ఆఆ...సరేలే? తప్పకుండా వెళ్ళాలా యేంటి?'
' అమ్మో..లేదండీ. .వాళ్ళింటి కిటికీలోంచీ, మన కారూ, నా స్కూటరూ కనిపిస్తాయి తెలుసా? అవక్కడే వుంటే, ఆహా..యీవిడ అబద్ధం చెప్పిందనుకోదూ?'
నీరజ సందేహం..పోనీ తనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి-యెక్కడికెళ్ళాలో!
యెటూ తను చూడీదార్లు కొనుక్కొవాలనుకుంటూంది కదా! షాపింగ్ కి వెడితే సరి..హమ్మయ్య..మళ్ళీ గుర్తొచ్చింది..పదిన్నరకల్లా యే దుకాణం వాడు తెరుస్తాడు? పైగా ఇంట్లో పూజా, వంటా అన్నీ ముగించుకుని వెళ్ళాలి..సంతోష్ కు పప్పూ, పచ్చడీ, చట్నీ, చారూ-తప్పనిసరి.అంత పొద్దున్నే, పూజా, వంటా చేసుకుని, తానూ యేదో కాస్త కడుపు అడుగు తడుపుకుని వెళ్ళాలి కదా మరి? యీ మాట అనుకోగానే నీరజకు ఠక్కున అమ్మ గుర్తొచ్చింది. 'కడుపు అడుగు తడుపుకుని' అన్నది ఆమె తరచూ వాడే మాట! అంటే 'యేదో కాస్త తినీ' అని అర్థం..అబ్బో..ఇలాంటి జాతీయాలూ, ఇంకా సామెతలూ యెన్నింటితోనో ఆమె మాటలు సజీవంగా సురభిళ భరితంగా వుండేవెప్పుడూ.. మరి ఆమె ఇలాంటి వ్రతాలూ, పూజలూ వాటికి దంపతులను పిలిచే నోములు చేసిందో లేదో గుర్తే లేదు.
తన పూజలేవో, పునస్కారాలేవో..భర్తకూ, పిల్లలకూ సమయానికి వండి వార్చి పెడుతూనే, అబ్బో యెన్ని పూజలు గుట్టు చప్పుడు కాకుండానే చేసుకు నేదో ఆ మహా తల్లి! అత్తగారూ అంతే! ఉద్యోగస్తురాలంటూ ఉన్న ఒక్క కోడల్నికూడా, యేనాడూ వంటలోనూ, మరేదానికైనా కూడా ఇబ్బంది పెట్టిన గుర్తులే లేవు.రాణీ లాగే, సాయంత్రాలు, చక్కగా, పట్టుచీరె కట్టుకుని, పనంతా తనే చేసినట్టు పోజు కొడుతూ బూలాలిచ్చేదందరికీ! అమ్మా , అత్తగారూ గుర్తొచ్చి కంట్లో నీళ్ళు తిరిగాయి నీరజకు..పాలు మరిగి మరిగి స్టవ్ మీద పొంగి పొర్లుతుంటే, అ వాసనకు సంతోష్ వచ్చి ఆపేశాడు. 'అబ్బబ్బా..యేంటంతగా ఆలోచనలిప్పుడు ఓ వైపు పాలు స్టవ్ మీద పెట్టి?' అని విసుక్కుంటూ! నొచ్చుకుంటూనే లేచింది నీరజ-రేపటి సంగతెలాగబ్బా అనుకుంటూ! మొత్తానికి, మర్నాడు, ఇంట్లో పని ముగించుకుని, పర్స్ లో ఓ పదిహేనువందలు రూపాయలతో, భాగ్యలక్ష్మి గారింటి వైపే చూసుకుంటూ, స్కూటర్ తీసింది నీరజ, ఆమె కనిపిస్తే ఓ నవ్వు పడేసి 'ఇదిగో నిన్న మీకు చెప్పినట్టు వెళ్తున్నానండొయ్' అంటున్నట్టు తెలిసేలా!
ఊహూ..యెవరూ కనపడలేదుకానీ, ఇదివరకటిలాగే, వాళ్ళింట్లో, బంధువుల సందడి వినిపిస్తూనే వుంది. సంతోష్ కు తనిట్లా అనవసరంగా చూడీదార్లకంటూ ఖర్చు పెట్టటానికే ఇంట్లోంచీ బయటికి వెళ్ళటం ఇష్టమే లేదు కానీ ఇరుగూ పొరుగూ అన్న తర్వాత!!!!
సరే..నీరజ బండి ముందుకు నడుస్తోంది..ఆలోచనల్లోనే, తమ గల్లీ దాటి మైన్ రోడ్డుమీదికొచ్చేసింది నిరజ. యే షాప్ కు వెళ్ళాలా అని ఆలోచిస్తూ రెడ్ లైట్ చూసుకోకుండా సిగ్నల్ దాటి వెళ్ళిపోయింది.
రోడ్డు దాటగానే, అడ్డంగా, ట్రాఫిక్ పోలీసు. 'మేడం..200 ఫైన్ ' అంటూ..
అప్పుడు తేరుకుంది నీరజ..'సారీ అండీ..తొందరలో గమనించలేదు'..ఠక్కున అనేసింది..'మా స్నేహితురాలికి ఒంట్లో బాలేదంటే యెలా వుందోనని బయలు దేరానండీ..సిగ్నల్ చూసుకొలేదు'..తన తెలివికి లోలోపల తానే ఆశ్చర్యపోతూ యేమాత్రం ఆ ట్రాఫిక్ పోలీసుకు అనుమానం రాకుండా దిగులుగా మొహం పెట్టి!
'ఐనా, మీకే కదా మేడం ప్రమాదం..అలా రోడ్డు సిగ్నల్ పడనప్పుడు దాటితే, యెదుటి వాళ్ళూ, వచ్చి కొడితే మళ్ళి మీకే కదా ఇబ్బంది..ఆలోచొస్తూ డ్రైవ్ చేస్తే యెలా మీలాంటి వాళ్ళు కూడా?పైగా హెల్మెట్టూ లేదు.. మరోసారిలా చేయకండి'..విసుక్కుంటూనే దారిచ్చాడా పోలీసు.
'బతుకు జీవుడా!' అనుకుంటూ, స్కూటర్ ముందుకు పోనిచ్చింది ..
సరే..దారిలో గుడి కనిపించింది. పుణ్యమూ, పురుషార్థమూ, అనుకుంటూ గుళ్ళోకెళ్ళింది. రాములవారిని దర్శించుకుని, తను చెప్పిన అబద్ధాన్ని మన్నించమని వేడుకుని, ఓ యాభై రూపా యలు హుండీలొ వేసి బయటికి వచ్చింది. తీరా స్కూటర్ స్టాండ్ తీద్దామని చూస్తే, స్కూటర్ కదిలి తేనా! యేమిటబ్బా అని చూస్తే పంచర్...అబ్బా.. ఇప్పుడెలా..దగ్గరగా, రిపేర్ చేసేవాడూ లేడు. అటు భాగ్యలక్ష్మికీ, ఇటు పోలీసుకూ కూడా అబద్ధం చెప్పినందుకు శిక్ష ఇలా వేశాడా రామయ్య..అనుకుంటూ స్కూటర్ తోసుకుంటూ బయలు దేరింది.. యెలాగో చెమటలు కక్కుతూ ఒక స్కూటర్ రిపేర్ షాప్ కు వెళ్ళింది. రెందు పంక్చర్లున్నాయట! తీరిగ్గా చేశాడు ఆ షాపువాడు! వేసేసరికి 11.30..అక్కడో 150రూపాయలు సమర్పించుకుని మళ్ళీ యీసురోమని బయలుదేరింది .
మైన్ రోడ్డుమీదికి రాగానే, అక్కడే ఆహ్వానించింది వందన శారీ హవుస్..చూడీదర్ కన్నా చీరే కొనాలన్న కోరిక పెరిగిపోయిందా కొత్త డిజైనులు చూడగానే! పైగా డిస్కౌంట్ సేల్ కూడా! ఆహా యేమానందం అనుకుంటూ, చీరల సెలెక్షన్లో పడింది.. అలా చూస్తూ రెండు చీరెలు సెలెక్ట్ చెసుకుంది. లేత నీలంలో మాడ్రన్ డిజైనొకటీ, తనకెంతో ఇష్టమైన పసుపు పచ్చా ఆకు పచ్చ బార్డర్తో మరొకటీ.. విప్పి మళ్ళి చూసుకుందామనుకునేంతలో వున్నట్టుండి కరేంట్ పోయింది. జనరేటర్ యేదో రిపేర్ లో ఉందట! ఇప్పుడెలా? పొనీ బయటికెళ్ళి చూస్తే? అమ్మో...రెండొ అంతస్తు నుంచీ దిగి, చీరెలు చూసుకునీ , మళ్ళి పైకొచ్చీ, డబ్బు చెల్లించి బైటపడటమా? 'ఆ..యేముంది..బాగానే ఉన్నాయిగా చీరెలు..తీసేసుకుంటే పోలా?' మరో ఆలోచన లేకుండా డబ్బు చెల్లించి బయట పడింది నీరజ..
టైం 12.30..సరే ..ఇప్పుడిక బయలుదెరితే? కడుపులో యెలుకలు గొడవ మొదలెట్టేశాయి. స్కూటర్ తీసి బయలుదేరి, నెమ్మదిగా నడుపుకుంటూ, ఇల్లుచేరింది. హమ్మయ్య. టైం ఒంటిగంట! సంతోష్ భోజనమైపోయింది. తానూ భోజనం కానిచ్చి, కాసేపు నడుం వాల్చింది. సాయంత్రం తీరిగ్గా, పొద్దున తన అనుభవాలు సంతోష్ తో పంచుకుని, చీరెలు తీసింది..నీలం చీరె ఓకే! కానీ పచ్చ చీరో! దానికక్కడక్కడ, నల్లటి మరకలు-పాతబడినట్టు. .తెలిసిపోతూ..హమ్మో! ఇప్పుడెలా? వాడు ఒకసారికొంటే, వాపసు తీసుకోమని ముందేచెప్పాడు..తనే తన సెలెక్షన్ పై నమ్మకంతో ధైర్యంగా తీసుకుంది..ఇప్పుడేమిటి చేయటం?
నీరసం కమ్మేసిందొక్కసారి! సంతోష్ కు తన వ్యవహారం నచ్చనేలెదు. ఆవిడనుంచీ తప్పించుకోవటానికి ఇన్ని తిప్పలు పడాలా? ఇన్ని అబద్ధాలు చెప్పాలా? ఆవిడకూ, పోలీసువాడికీ..ఇంక యీ చీరెలదగ్గరీ మోసమూ! 'లేదండీ, . మావారికీ పూజలూ అవీ అంటే నమ్మకంలేదండీ అని ఆవిడకే స్పష్టంగా చెప్పి వుండాల్సింది.. యీ కాలనీలో నాస్తికులను వుండనీరా యేంటీ? . నీకూ ఇన్ని తంటాలు పడే బాధా వుండేది కాదుగా?'
యేది చెప్పినా సంతోష్ అలాగే నిర్మొహమాటంగానే చెబుతాడు. అదే కరెక్టా మరి? కానీ ఇరుగూ పొరుగో? నీరజ పచ్చ చీర చేతిలోపెట్టుకుని మళ్ళీ, విచికిత్సలో పడిపోయింది,