భావచౌర్యం - పోలం రాజు శారద

bhavachouryam

"ఏంట్రా ఆ సిడి ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తున్నావ్?" లోపలికి వస్తూ వినోద్ అడిగాడు. "అయినా నీకు ఎప్పటి నుండి పాటల మీద ఈ మోజు?" "నాకు పాటల మీద మోజు కాదు పాడు కాదు. రా కూర్చో. నిన్న ఒక వింత అనుభవం ఎదురైంది. దానితో ఈ రోజు పొద్దున్నే దుకాణాలు తెరవగానే వెళ్ళి కొనుక్కొచ్చాను."

"ఏంటో నీ చేత సిడి కొనిపించిన ఆ అనుభవం" కుర్చీలో సెటిల్ అవుతూ అడిగాడు.

"నిన్న టివి లో అట్లా అన్ని చానెళ్ళు తిప్పుతూ ఒక దాంట్లో రాబోయే సినిమా పాటల సిడి విడుదల కార్యక్రమం చుసాను. గాయకులు అందులో పాటలు కూడా పాడారు. ఆ పాటలు వింటుంటే బాగా పరిచయమైనవి లాగా అనిపించి, వెంటనే గుర్తుకొచ్చింది. అవన్ని నా గేయాలే. అవి వాళ్ళకు ఎట్లా దొరికాయి. అయినా అవి నిజంగా నేను రాసినవేనా, లేకపోతే నేను భ్రమ పడుతున్నానా అని అనుమానం నిర్ధారణ చేసుకోవటానికి వెళ్ళి కొనుక్కొచ్చాను" "మరి, ఏమైంది నీ అనుమానం."

"అక్షరాలా నిజమైంది. ఇదిగో డైరీలో నేను రాసుకున్న గేయాలు. ఇదిగో సిడి లో ఇచ్చిన పూర్తి లిరిక్. అక్షరం తేడా లేకుండా యధా తధంగా నేను రాసినవే. ఇది ఎట్లా జరిగిందో అంతు పట్టటం లేదు."

"ఆ రాసిన కవి పేరేంటో చూడు. మిస్టరీ విడి పోతుంది" వినోద్ లాయరు బుర్ర సలహా ఇచ్చింది.

"అది కూడా చేసాను. నిన్ననే నాకు ఆ అనుమానం వచ్చింది. ఎవరో కలం పేరుతో రాసినవి. కవి కి ఈ సభలలో పాల్గొనటం ఇష్టం లేక అజ్ఞాతంలో వుండి పోయాడు అని కూడా చెప్పారు."

"అయితే ఇది సీరియస్ గా ఆలోచించవలసిన విషయమే" బుర్ర మీద పెన్నుతో కొట్టుకుంటూ ఆలోచించటం మొదలెట్టాడు వినోద్.

"నువ్వు కవితలు గేయాలు రాస్తున్నట్టు నాలాగా ఇంకా ఎవరికైనా తెలుసా?"

"ఉహు. నేనెవ్వరికి చెప్పలేదు. నీకొక్కడికే తెలుసు. అది కూడా ఒక సారి నువ్వు చూడబట్టి తెలిసింది. లేకపోతే నీకు కూడా తెలిసేది కాదు. చిన్నప్పటి నుండి ఎప్పుడు భావాలు వస్తే అప్పుడే కాయితాల మీద రాసి పెట్టుకోటం అలవాటు. తరువాత ఇదిగో డైరీలో రాసుకుంటూ వుంటాను. ఇవి బైటికి ఎట్లా వెళ్ళాయో అంతు పట్టటం లేదు."

" నాలాగే మన ఫ్రెండ్స్ లో ఎవరైనా నీ గదికి వచ్చినప్పుడు చూసే అవకాశం వుందా?"

ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాను. " ఒకసారి మోహన్ ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడే నేను ఫెయిర్ చేసి పక్కన పెట్టాను................ అవునురా కరెక్ట్. అప్పుడు ఈ గేయాలే రాసి పెట్టాను. వాడొచ్చి ఏమిట్రా ఈ కాయితాలు, అని కూడా అడగటం, ఏవో నా పిచ్చి రాతలు అని నేను చెప్పటం కూడా గుర్తుకొస్తున్నది. ఆ తరువాత ఆ చిత్తు కాగితాల గురించి నేను పట్టించుకో లేదు. అయినా వాడు ఇట్లాంటి పని చేయడురా" అనుమానంగా అడిగాను.

" ఏమో చెప్పలేము. సాక్షం లేనిదే ఎవరిని అనుమానించ కూడదు. అట్లా అని వదిలి పెట్టకూడదు."

"మరి ఏం చేద్దాం. ఈ గ్రంధ చౌర్యం చేసిన వాడిని పట్టుకొనేది ఎట్లా?"

"సరే నాకు నాలుగు రోజులు టైమ్ ఇవ్వు ఏదో మార్గం దొరకక పోదు."

"నాకు ఒక ఆలోచన వస్తూ వున్నది. అది ఇంకా ఒక రూపానికి రాలేదు. అదే కనుక పూర్తి రూపం దాలుస్తే నీ పని ఇట్టే సులువవుతుంది."
నాలుగు రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు.

"నాకు ఒక చిన్న ఆలోచన తట్టుతున్నది. నీకు బాగా మనసుకు నచ్చిన గేయాలలో ఒక పది ఇవ్వు."

"అవెందుకు"

"తరువాత చెప్పుతాను. నువ్వైతే అవి రాసి ఇవ్వు."

సరే లాయరు బుర్ర ఏదో ప్రయత్నం చేస్తున్నాడని నేను రాసిన గేయాలలో నాకు చాల నచ్చినవి, భావ పూర్వితంగా వున్నవి కొన్ని ఇచ్చాను.
నాకు భలే బాధవేసింది. ఎంత మోసం. ఇది నా గేయాల దొంగ తనం కాదు. ప్లేజురిజం. నా మది లోని భావాల దొంగతనం. ఇన్నాళ్ళూ పదిలంగా దాచుకొన్నవి ఒక్కసారి బట్ట బయలు అయిందే అన్న విచారం. వినోద్ ఎదో ఆలోచిస్తానన్నాడుగా, చూద్దాం అని వూరుకున్నాను.
ఈ నాలుగు రోజులు అన్ని చానెళ్ళలోనూ ఈ సినిమా పాటలు అద్భుతంగా వున్నాయని చర్చే. పాటల ట్యూన్ లకన్నా ఆ పాటల రచయిత గురించే పొగడ్తలు.

పది రోజులు గడిచాయి. ఒక రోజు వినోద్ రూం కు వచ్చాడు.

నిజంగానే మోహన్ ఈ పని చేసి వుంటే వాడిని పట్టుకోవటానికి ప్లాన్. అంటూ పధకం మొత్తం వివరించాడు.

ఒకరోజు మోహన్ కు ఫోన్ చేసాను. "ఏరా బొత్తిగా కనబడటం మానేశావు. ఒక రోజు రారాదు ఏదైనా సినిమాకు వెళ్ళవచ్చు. వినోద్ కూడా వస్తానన్నాడు.

"నాక్కూడా బోర్ కొడుతున్నది. ఆదివారం సాయంత్రం వస్తాను" అన్నాడు

ఆదివారం వచ్చింది. వాడొచ్చాడు. మనిషిలో కొద్దిగా మార్పు వచ్చింది. బట్టలు కూడా మామూలుకన్నా కొద్దిగా ఖరీదైనవే వేసుకున్నాడు. మెళ్ళో కొత్త చైన్. చేతికి బ్రేస్లెట్. అనుమానం లేదు. వీడికి అప్పనంగా బాగానే ముట్టినట్టున్నది. బల్ల మీద కాయితాలన్ని చిందర వందరగా పడి వున్నాయి.

"ఏంట్రా విశేషాలు? మళ్ళీ ఏమైనా రాస్తున్నావా?" అడిగాడు. చూపంతా కాయితాల వంకే.

"రా. కూర్చో. ఏవో నా పిచ్చి రాతలు. ఏవో రాస్తూ వుంటాను పడేస్తూ వుంటాను. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తాను. ఈ లోపు ఈ పేపర్ చదువుతూ కూర్చో. ఎంత పది నిమిషాలలో వచ్చేస్తాను. వినోద్ తరువాత కలుస్తాడు."

గది బయటికి నడిచాను. ప్లాన్ అమలు చేయటం మొదలయింది.ఒక్క నిమిషం తలుపు పక్కనే నిలబడ్డాను. చేతిలో మొబైల్ కెమెరా. వాడు హడావుడిగా కాయితాలు తిరగేయటం పట్టుకున్నది నా కెమెరా.పది నిమిషాలకు తయారయి వచ్చాను.

"పదరా సినిమాకు టైమవుతున్నది. వాడు వెయిట్ చేస్తూ వుంటాడు". తాళం కప్ప చేతిలోకి తీసుకుంటూ బయల్దేరాను.
ఎప్పుడూ ఏదో ఒకటి వాగే వాడు మౌనంగా నడుస్తున్నాడు. వినోద్ థియేటర్ దగ్గర కలిసాడు. కాస్సేపు కబుర్లు చెప్పుకొని సినిమా చూసాము. కాని మోహన్ మాత్రం మౌనం గా వున్నాడు.

ఇంటర్వెల్ లో కాఫీ తాగుతూ "ఏమిట్రా మాటాడకుండా కూర్చున్నావు" అడిగాను.

"ఏంటోరా విపరీతమైన తల నొప్పిగా వున్నది."

"అరే ముందరే చెప్పక పోయినావా? ఇంకో రోజు సినిమాకు వచ్చే వాళ్ళంగా. పోనీ వెళ్ళి పోదామా?"

"వద్దులే మీరు చూసి రండి. నేను ఇంటికి వెళ్ళి ఏదైనా టాబ్లెట్ వేసుకొని పడుకుంటే అదే తగ్గుతుంది."

హడావుడిగా కాఫీ తాగేసి "మళ్ళీ కలుద్దాం రా. వస్తా" అంటూ పరుగు లాంటి నడకతో వెళ్ళి పోతున్న వాడిని చూసి నవ్వొచ్చింది. మేమిద్దరం కూడా బయటకు వచ్చి రూం వైపు నడిచాం. అనుకున్నట్టే పెట్టిన కాయితాలు అక్కడ లేవు.

"సక్సెస్ రా మన పధకం ఫలించింది. అనుమానం లేదు వాడే ఆ దొంగ."

"సరే వాడి నెక్స్ట్ మూవీ కోసం ఆగుదాం"

అట్లా రోజులు గడుస్తున్నాయి. అలవాటు లేనిది ప్రతిరోజూ టివి లో పేపర్లలో సినమా వార్తల కోసం చూస్తూ వున్నాను. అనుకున్న రోజు ఆరు నెలల తరువాత వచ్చింది. పేపర్లో సినిమా కాలం లో కనిపించింది ఎదురు చూస్తున్న ఆ వార్త. అదే నిర్మాత కొత్త సినిమా మొదలెట్టాడు. పెద్ద హీరో క్లాప్ కూడా కొట్టాడు. అతను ఒక పేరున్న నిర్మాత. ఎన్నో ఎవార్డులు వచ్చిన సినిమాలు తీశాడు. స్టేట్ ఎవార్డే కాదు, అతని రెండు సినిమాలకు నేషనల్ ఎవార్డ్ లు కూడా వచ్చాయి. అతను ఇంత చిల్లర పని ఎట్లా చేసి వుంటాడు అని అనుమానం. కానీ చూద్దాం.
ఒక మూడు నెలలు గడిచిన తరువాత ముందటి సినిమాకు లాగానే ఆడియో రిలీస్ అని డేట్ అనౌన్స్ చేశారు. ఆరాటంగా టివి ముందు కూర్చున్నాను. అది లైవ్ ప్రోగ్రాం. పాటల రచయిత మళ్ళీ అనామకుడే. అతన్ని చూడాలని అందరూ వుర్రూతలూగుతున్నారు.

కాని యధా ప్రకారం ఆయనకు సభలు సమావేశాలు ఇష్టం వుండవు అని సర్ది చెప్పటం. పాటల కేసెట్ విడుదల చేశారు. గాయకులు మైకు ముందుకు వచ్చారు. ఆరాటంగా ఉన్నది. మొదటి పాట అందుకున్నారు. అంతే.... అనుమానం నివృత్తి అయింది. వెంటనే ఫోన్ తీసుకున్నాను.
"వినోద్ అనుకున్నంతా అయింది. టివి పెట్టావా" ఆరాటంగా అడిగాను. "ఆ వింటున్నాను. రేపే మనం రగం లోకి దిగుతున్నాం. అన్ని భద్రంగా వున్నయి కదా"

"వినోద్ , ఈ విషయంలో మోహన్ పేరు బయటకు రాకుండా చూడాలిరా"

"చూద్దాం, సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దాం. కాని ఇంత మిత్ర ద్రోహం చేసిన వాడి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు."

కోర్టు హాల్ ముందు జనం తండోపతండాలు. ప్రఖ్యాత నిర్మాత మీద ఎవరో అనామకుడు కేసు పెట్టాడు. సినీ పరిశ్రమ లోని అందరు ప్రముఖులు వున్నారు. నిర్మాత బోనులో నిలుచున్నాడు. అతని మొహంలో అదొక రకమైన పొగరు. నన్నెవరూ ఏమీ చేయలేరని ధీమా. కేసు నడిచిన సారాంశం.

వినోద్ అతన్ని ప్రశ్నించటం మొదలెట్టాడు.

అతను ఠీవి గా సమాధానాలు చెప్పుతున్నాడు.

"ఈ రకమైన ఆరోపణలు నా ప్రతి సినిమాకూ వచ్చాయి. నా సక్సెస్ చూసి ఓర్వలేని వారు ఎంత మందో నా ఎవార్డు సినిమాలు వాళ్ళ కధలే అని చెప్పుకోవటం నిరూపించ లేక పోవటం పరిపాటి అయింది. ఈ అభాగ్యుడెవరో పాటలే తనవి అన్నాడు. పాపం." అని ప్రేక్షకుల వంక చూస్తూ వెకిలిగా నవ్వాడు. అదొక జోకు లాగా అందరు పెద్దగా నవ్వారు సద్దు మణిగాక జడ్జి గారు వినోద్ ను సాక్ష్యాల కోసం అడిగాడు. వినోద్ కూడా అంత తొదరగా కేసు మూసేయ తలచుకో లేదు. ఎంత సాధ్యమైతే అంత పొడిగించి జనం ఎట్రాక్షన్ పొందాలి అని కొంత చిన్న చిన్న అంటే నేను చిత్తు కాయితాల మీద రాసుకున్నవి, నా డైరీ, వెనక నుండి మొహం కనపడకుండా నేను తీసిన మోహన్ ఫొటోల లాంటి విలువ లేని సాక్ష్యాలు ప్రవేశ పెట్టాడు.

"ఈ రోజుల్లో పాటలు మొత్తం సిడి పెట్టిన కవర్లో ఇస్తున్నారు. అవి కాయితాల మీద రాయటం నిమిషాల్లో చేయగల పని" అంటూ కొట్టి పారేసారు.
ఈ విధంగా చిన్న చితక రుజువులను కొట్టి పారేసి, జడ్జి గారు కోర్టు విలువైన సమయం వృధా చేస్తున్నందుకు మందలించటం కూడా జరిగి కేసు వాయిదా వేయటం జరిగింది. వార్తా పత్రికలలో దీని మీద వ్యాఖ్యలు, ఎగతాళిగా కార్టూన్లు. సినీ రంగంలో, ఇంకా కోర్టులో ఇతర లాయర్లు అందరూ వినోద్ ను ఎగతాళి చేయటం. అట్లా కొన్ని రోజులు కాలాయాపన చేసిన తరువాత జడ్జిగారు ఈ కేసును ఇంకొక తప్పుడు కేసుగా తీర్పు ఇవ్వటానికి సిద్దంగా వున్న సమయంలో వినోద్ తన తురుఫు ముక్కలు ఒడుపుగా తీసాడు.

ఆ రోజు తీర్పు ఇస్తారని కోర్టు హాల్లో జనం విరుచుకు పడ్డారు. "మీ కవి గారు ఈ పాటలు వ్రాసి ఎంత కాలమయ్యిందో చెప్పగలుగుతారా?" సూటిగా నిర్మాతను ప్రశ్నించాడు.

"నాలుగు నెలల క్రితం మా మ్యూజిక్ కంపోసర్ పాటలకు ట్యూన్ చేసిం తర్వాత నేను మా హీరో గారు డైరెక్టర్ గారు గేయ రచయితతో సన్నివేశాలు వివరించి మాకు కావలసిన భావం వచ్చేటట్టు స్టూడియో లోనే కూర్చొని రాయించుకున్నాం. అయినా ఈ మీరు పెట్టిన తప్పుడు కేసుకు మీరు వేసే ప్రశ్నలకు సంబంధం లేదు"

అమ్మయ్య ఇప్పుడు చేప వలలో పడ్డదని సంబర పడ్డ వినోద్ నా వంక చూసి బొటన వేలు పైకి పెట్టి విజయ సూచకంగా నవ్వాడు.
"వినోద్ ఇన్నాళ్ళు కోర్టు సమయం వృధా చేసావు ఇంక ఉపేక్షించేది లేదు" అన్న జడ్జి గారికి.

"యువరానర్, ఈ రోజు నేనొక అత్యంత కీలకమైన సాక్ష్యాన్ని ప్రవేశ పెట్టబోతున్నాను."

అందరూ ఒక్కసారి సైలెంట్ అయ్యారు. ఆదుర్దాగా ఊపిరి వదలకుండా కూర్చున్నారు.

"నిర్మాత గారి వద్ద లాప్ టాప్ వుండే వుంటుంది" వినోద్ ప్రశ్నించాడు.

"అది నావెంటే వుంటుంది. నా ఎసిస్టెంట్ అది పట్టుకొని కూర్చున్నాడు" అనుమానంగా చూశాడు. "ఒక్క సారి అది తెప్పిస్తారా. అదే నా విలువైన సాక్ష్యం" అక్కడున్న ఎవరికి అర్ధం కాలేదు.

"మీకు మెయిల్ చూసుకొనే అలవాటుందా?"

"నాకు రెందు మెయిల్ ఐడి లు వున్నాయి. ఒకటి నా పర్సనల్ ఐడి. రెండోది నా అఫిషయల్. అఫిషయల్ మెయిల్ నా పర్సనల్ ఎసిస్టెంట్ చూస్తాడు. అవసరమున్నవి నాకు పంపుతాడు."

"ఒక్క సారి మీ అఫిషయల్ మెయిల్ ఓపెన్ చేస్తారా?"

"వాట్ నాన్సెంస్ ఈస్ ఇట్? ఒక ప్రఖ్యాత నిర్మాత మెయిల్ చూడ వలసిన అవసరం, అధికారం రెండు మీకు లేవు." జడ్జిగారు అడ్డు పడ్డారు.

"నన్ను క్షమించాలి యువర్ ఆనర్. నాకు సో కాల్డ్ ప్రఖ్యాత నిర్మాత గారి మైల్ చూద్దామన్న సరదా ఏ మాత్రం లేదు". వినోద్ తను పంపిన ఐడి వివరాలు చెప్పి అందులో పోయిన సంవత్సరం నవంబరు పదవ తారీఖున అందిన ఒక మెయిల్ వుంటుంది. అది కాస్త ఒపెన్ చేసి వారినే చూడమని నా విన్నపం." అన్నాడు.

"అర్ధం లేని విన్నపం. యువర్ ఆనర్ ఇది అర్ధం లేని కోరిక. ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం ఎవరో పంపిన మెయిలుకు ఈ కేసుకు సంబంధం లేదు. కోర్టు సమయం వృధా చేయటమే" నిర్మాత గారి లాయరు అభ్యంతరం లేపాడు.

కాని జడ్జిగారు కేసు కొత్త మలుపు తిరుగుతుండటంతో ఆసక్తి చూపి అభ్యంతరాన్ని తోసి పుచ్చి వినోద్ కోరికను మన్నించి, మెయిల్ ఓపెన్ చేసి చూడమన్నారు.

నిర్మాత గారి ఎసిస్టెంట్ వచ్చి అదే విధంగా ఓపెన్ చేశాడు. ఈ లోగా వినోద్ తన లాప్ టాప్ తెరిచి రెడీగా పెట్టుకున్నాడు.

"నేను చెప్పిన తేదీ లోని ఆ మెయిల్ కాస్త పరిశీలించ వలసింది" అని కోరాడు.

ఎసిస్టెంట్ చూసి నిర్మాత చెవిలో ఏదో గుస గుస లాడాడు.

"అది ఏదో అర్ధం కాని గజిబిజి భాషలో వున్నది. అదేంటో మా ఎసిస్టెంట్ కు అర్ధం కాక తరువాత చూద్దామని డిలిట్ చేయకుండా వుంచేశాడు. అటువంటి అర్ధం లేని మైల్ కు ఈ కేసుకు సంబంధం ఏమిటో నాకైతే తెలియటం లేదు."

"వుంది యువరానర్. అదే ఈ కేసులోని అత్యంత కీలక సాక్ష్యం."

జడ్జి గారికి ఇంకా ఉత్సుకత పెరిగింది. "మిస్టర్ వినోద్ ఇదంతా ఏమిటో వివరిస్తారా"

"తప్పకుండా యువరానర్. ఆ గజిబిజి అక్షరాలే ఈ సినిమా లోని పాటలు. ఇవన్ని పోయిన సంవత్సరం నా క్లైంట్ రాసుకున్న గేయాలు. వాటిని ఒక తెలుగు లిపిలో వ్రాసి వాటిని కంప్యూటర్ లో ఫీడ్ చేసిపెట్టాడు. ఆ గేయాలని ఈ ప్రఖ్యాత నిర్మాత గారికి మైల్ లో పంపటం జరిగింది. కాని దురదృష్టవశాత్తు వారి కంప్యూటర్ లో ఆ సాఫ్ట్ వేర్ లేనందున అవి గజిబిజి అక్షరాలలాగా కనబడటం జరిగింది. అది ఏదైనా ముఖ్యమైన కోడెడ్ సమాచారమేమో నన్న అనుమానం తో ఆ ఎసిస్టెంట్ చెరిపేయకుండా వుంచాడు. నా అభిప్రాయం అవునో కాదో వారినే అడిగి నిర్ధారణ చేసుకోండి. ఇదిగో నేను పంపిన మెయిల్ లో ని గేయాలు. కావాలంటే పరిశీలించ వచ్చు. అంతే కాదు యువరానర్. ఏ రోజైతే నా క్లైంట్ ఈ గేయాలు రాశాడో ఆ నాడే వాటి కాపీ బాంకులో సేఫ్ డిపాసిట్ లాకర్ లో పెట్టటం జరిగింది. ఇదిగో దానికి సంబంధించిన రసీదు, కావాలంటే అది తెరిపించి లోపలి కాయితాలు తెప్పించి పరిశీలించవచ్చు. సూది పడితే వినిపించేటంత నిశ్శబ్ధం.

"కాని మిస్టర్ వినోద్ ఇదంతా మీరెందుకు చేయ వలసి వచ్చింది. వాళ్ళు ఇటు వంటి చర్యకు పూనుకో బోతున్నారని మీకు ముందే తెలిసా." నిర్మాత దోషి అని నిర్ధారణ చేసుకొన్న జడ్జి గారికి ఇంకా ఆరాటం పెరిగింది.

"తెలుసు యువరానర్. ఎట్లా అంటే వారు ఇంతకు ముందు విడుదల చేసి, పాటలన్ని సూపర్ హిట్ అన్న పాటలు కూడా నా క్లైంట్ వే."
కేసు కొత్త మలుపు తిరగ బోతున్నది.

"మరి అప్పుడే కంప్లైంట్ ఎందుకు చేయలేదూ?"

"అప్పుడు మావద్ద నిరూపించటానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఒక సారి సక్సెస్ అన్న రక్తం మరిగిన పులి తిరిగి వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే వారికి ఎర వేసి పట్టుకున్నాము"

"ఇంతకూ ఆ అజ్ఞాత రచయిత ఎవరో తెలిసిందా?"

"అది మాకనవసరం యువరానర్. నా క్లైంట్ కంప్లైంట్ నిర్మాత గారి మీద. ఆ రచయిత మీద తగిన చర్య తీసుకో వలసిన భాధ్యత వారిదే. కాని ఈ కేసుకు సంబంధించి గ్రంధ చౌర్యం అనే కన్నా భావ చౌర్యం జరిగిన నా క్లైంట్ కు న్యాయం చేయటం వరకే మాకు కావలసినది. పదిలంగా తన తృప్తి కోసం రాసి పెట్టుకున్న భావాలు ఈ విధంగా బహిర్గతమవటం నా క్లయింటుకు బాధా కరమైన విషయం. అతనికే పేరు ప్రతిష్టలు కావాలనిపించి వుంటే వారే ఈ గేయాలను వాడుకొనే వారు."

మరునాడు అన్ని దిన పత్రికల లో అవే వార్తలు.

ప్రఖ్యాత నిర్మాత మీద ఒక అనామక కవి విజయం.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు