మార్పు - కొమ్ముల శ్రీ వెంకటమహలక్ష్మీదేవి

marpu

“అమ్మా! ధీరజా! వద్దమ్మా! తండ్రికి ఆడపిల్ల దహన సంస్కారాలు చేయ కూడదమ్మా!” బంధువులు ముక్త కంఠంతో అంటున్నారు.

“లేదు! నేనే చేస్తా!” ఏడుస్తూనే ధృడ చిత్తంతో సమాధానమిచ్చా.

“సరే, నీ ఇష్టం” అన్నారు

***

నాన్న పార్ధివ దేహానికి సంస్కారాలన్నీ పూర్తయ్యాక చితికి నిప్పంటించా. చితి మంటలు పైపైకి ఎగసి పడుతుంటే, నా మనసులో ఆవేశం, పగ అంతకు రెట్టింపు ఎగిసి పడుతుంది. మరో ప్రక్క కన్నీళ్ళు ప్రవాహంలా చెక్కిళ్ళ మీద నుంచి జారి పోతున్నాయి.

***

నా వయస్సు పద్నాలుగేళ్ళు. అమ్మానా న్నలకు నేనొక్క దాన్నే. గారాబంగా పెరిగా. అమ్మ, నాన్న, నేను ఇదీ మా ముచ్చటైన కుటుంబం. చదువులో ప్రతి తరగతిలోనూ నేనే ప్రధమరాల్ని. నాన్నకు ఎన్నో మంచి ఆశయాలు, ఆలోచనలు. ఆ ఆశయ సాధనలో భాగంగా మా ఊరి లోనే ఒక చిన్న పరిశ్రమ స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో తన వద్ద నున్న సొమ్మంతటిని పెట్టి పరిశ్రమను స్థాపించే ప్రయత్నంలో భాగంగా వివిధ శాఖల అనుమతి కోసం తిరిగి తిరిగి వారు అడిగిన లంచాలను తన ఆశయాలను చంపుకొని ఇవ్వలేక విసిగి వేసారి పోయి అనుమతులు సాధించుకో లేక, పరిశ్రమ పూర్తి చేయలేక అనుక్షణం సతమతమౌతూ తుదకు గుండె పోటుతో తనువు చాలించారు.

********

అందుకే నాన్న చావుకు కారణమైన ఈ వ్యవస్థ మీద పట్టరాని కోపం, పగ, కసి. ఎలాగైనా ఈ వ్యవస్థలో భాగమైన వారందరి మీద కక్ష తీర్చుకోవాలి. మరో ప్రక్క “ పగ తీర్చుకోవడం ద్వారా ఈ వ్యవస్థ మారుతుందా! అదే చేస్తే నీకూ వారికి మధ్య పెద్ద తేడా ఏముంది. సాత్వికంగా ఆలోచించు, ఏ విధంగా చేస్తే వారి ఆలోచనలలో మార్పు తీసుకు రాగలవో!” నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది.

అవే ఆలోచనలు, అవే ఆలోచనలు నిరంతరం. కంటి మీద కునుకు లేని రాత్రులెన్నో! చివరకు ఒక ధృడ నిర్ణయానికొచ్చా. ఈ వ్యవస్థను మార్చాలి. ఈ వ్యవస్థలో భాగమైన వ్యక్తుల ఆలోచనల్లో మార్పు తీసుకు రావాలి. ఆ దిశగా నా పయనాన్ని కొనసాగించాలి. కృత నిశ్చయంతో ముందుకు సాగాలి. ఎన్ని కష్ట నష్టాలెదురైనా ఎదుర్కొని పట్టుదలతో సాధించాలి అనుకొనే సరికి నా మనసెంతో తేలిక పడింది.

******

నా గమ్యాన్ని నిర్ణయించుకొన్నాను. ఆ దిశగానే నా పయనాన్ని కొనసాగించాను. మొక్కవోని దీక్షతో, పట్టుదలతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగులు వేసా. నా ఆశయమే శ్వాసగా, ధ్యాసగా, ఆశగా ముందుకు సాగాను.

*********

ఇపుడు నా పేరు డాక్టర్. ధీరజ.,ం.డ్.,(ఫ్స్య్చీత్ర్య్).,ం.ఫర్మచ్య్.,ఫ్.డ్.,. పరిశోధనా రంగాన్ని ఎంచుకొని నేను నిర్ణయించుకొన్న అంశంలో పరిశోధన కొనసాగించాను. చివరకు అనుకొన్నది సాధించాను. నా ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించాను.

**********

ఉన్నత ఆశయాలు, ఆలోచనలు కలిగిన దేశ ప్రధానిని కలిసి నా ఆలోచనలు వారి ముందుంచాను. వారెంతో సావధానంగా ఆలకించి, ప్రోత్సహించి ఆ దిశగా ప్రణాళికను రూపొందించి అమలు పరచారు.

***************

రమేష్ కాన్వెంట్ లో ఐదవ తరగతి చదువుతున్నాడు. తన మిత్రుడు సురేష్ పుస్తకాల సంచిలోని పెన్నుని అతను చూడకుండా దొంగిలించి ఇంటికి తెచ్చేసాడు.

సురేష్,పెన్ను తీసిన రమేష్ ని గుర్తించడం, టీచర్ కి చెప్పడం, టీచర్ అందరి ముందు రమేష్ ని మందలించడం, తర్వాత అందరూ దొంగ, దొంగ అంటుంటే “ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు చేయను” అంటూ గట్టిగా అరుస్తున్నాడు రమేష్. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయి ఉన్నాడు.
“ఏమిట్రా! ఆ కలవాట్లు!” రమేష్ తల్లి, రమేష్ ని లేపి అడిగింది.

“కలా! ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొన్నాడు. తల్లికి తను పెన్ను దొంగిలించి తీసుకు వచ్చిన తర్వాత కలలో సురేష్ తనని గుర్తించడం, టీచర్ కి చెప్పడం, టీచర్ అందరి ముందు మందలించడం, దొంగ దొంగ అని అందరూ అనడం అంతా పూస గుచ్చినట్టు చెప్పాడు.

నీ తప్పు తెలుసుకొన్నావు కదా! రేపు పట్టుకెళ్ళి యిచ్చేయ్ అని తల్లి అనడంతో రమేష్ మనసెంతో తేలిక పడింది.

*************

వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసి మెడిసిన్ లో సీటు కోసం ఎంసెట్ పరీక్షకు హాజరు అవుతున్నాడు. మంచి ర్యాంకు కోసం హైటెక్ కాపీయింగ్ కి పధకాన్ని రచించాడు. అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. రాత్రి ఇంటికి చేరాడు.

వినోద్ హైటెక్ కాపీయింగ్ చేస్తూ ఇన్విజిలేటర్ కి పట్టు బడటం, పోలీసులొచ్చి తీసుకెళ్ళడం, ఇటు వంటి కొడుకు మా కొడుకే కాదని తల్లితండ్రులు చీదరించుకోవడం, బంధు మిత్రులందరూ అసహ్యించుకొని దూరంగా ఉండటాన్ని చూసి తన మీద తనకే విరక్తి కలిగి “నేను చని పోతాను, నేను బ్రతక్కూడదు” అంటూ గట్టిగా అరుస్తున్నాడు. వినోద్ తల్లి తట్టి లేపింది. “ఉలిక్కి పడి లేచాడు. హమ్మయ్య ఇదంతా కలా! ఇపుడు మనసు కెంతో హాయిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అటు వంటి తప్పుడు పని చేయ కూడదని గట్టిగా నిర్ణయించుకొన్నాడు.

***********

ఆనంద రావు నిర్మొహమాటంగా చెప్పేసాడు పది వేలు లంచంగా ఇస్తే గానీ ఫైల్ ఒక్క అడుగు ముందుకెళ్ళదని తన దగ్గర కొచ్చిన కాంట్రాక్టర్ తో. అతను ఆనంద రావు కాళ్ళా వేళ్ళా పడితే చివరికి ఎనిమిది వేలకి ఒప్పుకొన్నాడు. మరుసటి రోజు ఆ మొత్తాన్ని తెచ్చి యిస్తానన్నాడు. ఆ ఆనందంతో యింటికి చేరాడు.

ఆ ఎనిమిది వేలు తెచ్చి ఆనంద రావు చేతిలో ఆ వ్యక్తి పెట్టడం, ఏసిబి వారు రెడ్ హేండెడ్ గా ఆనందరావుని పట్టు కోవడం, మరుసటి రోజు అన్ని దిన పత్రికల్లో మొదటి పేజీలో ఆనందరావు ఫొటోతో సహ రావడం, అందరూ తనను ఒక లంచ గొండి గాను, దోషి గాను, దొంగ గాను చూడటం, కుటుంబ సభ్యులే చీదరించుకోవడం చూసి తట్టుకో లేక ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకోవ డానికి ప్రయత్నిస్తుంటే భార్య చూసి ఆపటానికి ప్రయత్నిస్తుంటే “వద్దు!నన్ను ఆపొద్దు!” అంటూ బిగ్గరగా అరుస్తున్నాడు.

“ఏంటి! అట్లా అరుస్తున్నారు” అని బలంగా కుదిపి లేపింది అతని భార్య. అది కల అని తెలిసే సరికి అతని మనసు దూదిపింజ లా ఎంతో హాయి అనిపించింది. లంచాలు తీసుకొంటే తరువాత పరిస్థితేంటో కళ్ళకు కట్టినట్టు తెలియడంతో ఇక జీవితంలో లంచాల జోలికి పోకూడదని నిర్ణయించుకొన్నాడు.

**********

ఇట్లా ఒకరా! ఇద్దరా! వేలు, లక్షల మందికి….అవినీతి పనులు చేయాలనుకోవడమో, లంచాలు తీసుకోవాలనుకోవడమో, మోసం చేయాలనుకోవడమో, ఆ విధమైన ఏ చెడు తలపులు మనసులోకి వచ్చినా ఆ రాత్రి వాటి పర్యవసానాలు కలలో ప్రత్యక్షం కావడం, దానితో ఆ ఆలోచనలు విరమించు కోవడం; ఇటు వంటి ఆలోచనలు వచ్చిన ప్రతి సారి ఇంచు మించు అదే రీతిలో కలల రూపంలో పర్యవసానాలు ఎదుర్కోవడం నిత్య కృత్యమై ఇక అటు వంటి పనుల జోలికి వెళ్ళడమే మానుకొన్నారు.

************

అది దేశ ప్రధాని, కేంద్ర హోం మంత్రి, అన్ని రాష్ట్రాల డి.జి.పి.లతో ఏర్పాటు చేయ బడిన సమావేశం. ప్రతి రాష్ట్రానికి చెందిన డి.జి.పి తమ రాష్ట్రంలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గు ముఖం పట్టిందని చెపుతున్నారు. దేశ ప్రధాని మోములో చిరు దర హాసం తొంగి చూసింది. విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయ ప్రగతి సాధించామని మానవాభివృద్ధి సూచికలో ముందడుగు వేస్తున్నామని ముక్తాయించారు.

***********

నా ఆశయం ఫలించింది. నా సంతోషానికి హద్దుల్లేవు. ఆనందపు జల్లులలో తడిసి ముద్దవుతున్నాను. ఇంతకీ ఈ ఆనందపు జల్లులు ఎక్కడ నుంచి వర్షిస్తున్నాయనుకొంటున్నారు . అవి దివి కేగిన నాన్న కను కొనుకల నుంచి.

**********

ఇంతకీ నేను చేపట్టిన పరిశోధన ఏమిటో తెలుసా! మన శరీరంలో కొన్ని రకాల ఉద్వేగాలకు, శృంగార భావనలకు, ప్రేమ భావనలకు కొన్ని రకాల హోర్మోన్స్, రసాయనాలు కారణమవుతాయి. ఉదాహరణకు డోపమైన్ లాంటివి. ఆ విధంగా ఎవరికైనా చెడు ఆలోచనలు మనసులో కలిగితే ఆ రాత్రి నిద్రలో వాటి పర్యవసానాలు కలలో సాక్షాత్కరించే విధంగా మందుని తయారు చేసాను. దానిని అన్ని రకాలుగా పరీక్షించి సత్ఫలితాలు పొందాను. ఇదే విషయాన్ని దేశ ప్రధానికి వివరించి పోలియో డ్రాప్స్ మాదిరిగా ఈ మందు బిళ్ళలను ఈ తరానికందరికీ ఇచ్చేలా చేయమని అర్ధించాను. ఆ ప్రణాళికను అమలు పరచడం ద్వారా నేటి ఈ సంతోషమయమైన నా దేశాన్ని వీక్షిస్తున్నాను.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు