ఆత్మతో ఒక రాత్రి - కురవ శ్రీనివాసు

aatmatO oka ratri

"ఆరోజు ఈవినింగ్ ఐదు గంటలలకు నా రూం దగ్గరికొచ్చేయండి... బస్సు అక్కడినుండే బయలుదేరుతుంది....." "ష్యూర్..."

"వెంకట్ మీరుకూడా వీడితో పాటు తప్పకుండా రావాలి..."

"అలాగే..."

చెల్లెలి పెళ్ళికి పిలవడాని కొచ్చిన నారాయణ వెళ్ళి పోయాడు..

"రే వెంకట్ వెళదాం రా... అలా పల్లెటూళ్ళో తిరిగి వస్తే కాస్త రిలీఫ్ గా వుంటుంది..." శేఖర్ నన్ను కన్విన్స్ చేయాడానికి ప్రయత్నిస్తున్నాడు...

"అతను నిన్ను పిలవడానికొచ్చాడు... మొహమాటానికి నన్ను కూడా పిలిచాడంతె... ఎలా రమ్మంటావు... బాగుండదు"

మరీ దగ్గరి వాళ్ళైతే తప్ప నేను కలిసి పోలేను... ఇట్స్ మై వీక్నెస్...

"భలే వాడివే... వాడేమి అనుకోడు... పైగా నీవంటె వాడికెందుకో ఓ మంచి అభిప్రాయము, అభిమానము వున్నాయి... కాదనకు... నాకోసమైనా రావాలంతె... "

శేఖర్ నేను చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్. ఇద్దరిది ఒకే ఊరు. కలిసి చదువుకున్నాము. ఉద్యోగపర్వంలో హైదరాబద్ వచ్చాము. ఒకే రూంలొ వుంటున్నాము...నేను ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవాణ్ణి. ఈ మధ్యనే మేనేజ్ మెంట్ తో గొడవచ్చి రిజైన్ చేశాను. ఇగో మనస్తత్వాల నడుమ ఇమడలేను. మరో ఉద్యోగాన్వేషణలో వున్నాను. శేఖర్ బ్యాంక్ వుద్యోగి. నెమ్మదస్తుడు. సాంప్రదాయాలకు కట్టుబడి వుండె మనిషి. అందరిలో అలవోకగా కలిసి పోగలడు. వాడికి ఊరంతా స్నేహితులే. నారాయణ శేఖర్ కొలీగ్. తరచుగ వస్తూ వెళ్తూంటాడు. రిచ్ ఫామిలీ నుండి వచ్చాడు. మంచివాడు.

నా గురించి చెప్పాలంటే. మధ్య తరగతి కుటుంబం. అమ్మా నాన్నలకు ఒక్కణ్ణే సంతానం. అక్కరకు రాని ఆదర్షాలు, క్షణికావేషాలు నా వీక్నెస్. దానితోపాటు దేవుడిచ్చిన కొన్ని ప్రతేక లక్షణాలుకూడా వున్నాయి. సందర్భమొచ్చినప్పుడు చెబుతాను. అవి మంచివో కాదో తెలీదు కాని చాలాసార్లు బాగా టెన్షంకు గురి చేస్తూంటాయి.

వదిలిన ఉద్యోగం తాలూకు జ్ఞాపకాలు చికాకు పెడుతున్నాయి. శేఖర్ చెప్పినట్లు పెళ్ళి కెళితే కాస్త రిలీఫ్ గా వుంటుందేమొనిపించింది. ఇందాక నేను చెప్పిన ఆ ప్రత్యేక లక్షణాల కారణంగా, తెలియని ప్రాంతాలకెళ్ళాలంటె కొంచెం ఇబ్బందిగా వుంటుంది. అయినా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

******

వచ్చేవాళ్ళు ఎక్కువగా వుండడంతో, నారాయణ ప్రత్యేకంగా బస్సు అరేంజ్ చేయించాడు. అనుకున్నట్లుగానే ఆరోజు నారాయణ రూం దగ్గరికికి చేరుకున్నాము. ఆహ్వానితులందరు అక్కడికి చేరడానికి బాగా ఆలస్యమైంది. బయలుదేరేప్పటికి చీకటి పడుతోంది. పిల్లలు, పెద్దలు, వయసుమళ్ళిన వాళ్ళు, అంతా సందడిగా వుంది. ఎక్కువ శాతం నారాయాణ బంధువులే వున్నట్లున్నారు. చుడ్డానికి సరదాగా వుంది. శేఖర్ అందరితో కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు.

భోజనాల విషయం మరిచేపోయాము. ఓ బామ్మగారిచ్చిన చిరుదిళ్ళతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పక్కవాళ్ళ మాటలనుబట్టి ఊరు చేరడానికి సుమారు ఏడుగంటలు పడుతుందని అర్థమైంది. అలసి పోవడంతో కళ్ళు మూతపడుతున్నాయి. కొద్దిసేపటికి నిద్రపట్టేసింది. ఆకలి పూర్తిగా చల్లారక పోవడంవల్లనేమొ, మధ్యరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మెలుకువొచ్చింది.. అందరూ గాఢ నిద్రలో వున్నారు. కిటికీలు, ఇంజన్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఒంటరిగా అనిపించడంతో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. బలవంతంగా ఆపుకుంటూ నిద్రపోయె ప్రయత్నం పలించలేదు. కిటికీలోనుడి చీకటి ప్రపంచంవైపు చూస్తుకూర్చున్నాను. భవిష్యత్ ప్రణాళికలు మదిలో మెదలుతున్నాయి.

ఈ ఆలోచనలమధ్య మరో గంట గడిచిపోయింది. ఇంతలో హెడ్ లైట్ వెలుతురుకు తళుక్కున మెరిసి మాయమైంది ఓ మైలు రాయి "సీతాపురం 2 కి.మీ" అని రాసి వుంది దానిపైన. అంటె గమ్యం చేరుకున్నామన్నమాట. టైం చూసుకున్నాను రెండుకావస్తోంది... డ్రైవరు తన పక్క సీట్లో వున్న యువకుణ్ణి నిద్రలేపుతున్నాడు. బహుషా దారి చూపడానికనుకుంటా.

ఊళ్ళోకి ప్రవేశించాము. ఇంతలో రోడ్డుకు ఏభైమీటర్ల దూరంలో వున్న ఓ యింటిమీద నా కన్ను పడింది. అంతె. ఒక్కసారిగా వులిక్కిపడ్డట్లయింది. ఇల్లు చాలా పెద్దదే. అంతా చీకటిగావుంది, కాని, ముఖద్వారానికి ముందున్న మెట్ల మీద ఒక మనిషి ఆకారం నిలిచుంది. తెల్లగ మెరిసిపోతోంది. తీక్షణంగా ఇటువైపే చూస్తున్నట్లుగా వుంది. విషయం అర్థమైంది. అప్రయత్నంగా వాచీ వైపు చూసుకున్నాను. రెండున్నర కావస్తోంది.

బస్సు విడిది చేరింది. నారాయణ మాకోసమే ఎదురుచూస్తున్నాడు. అప్పటికే చాలామంది అక్కడికి చేరుకున్నట్లున్నారు. అందరిని సాదరంగా అహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు. నాకు, శేఖరుకు కేటాయించిన రూం లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నిద్రమత్తు దిగని శేఖర్ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. నాకాఅదృష్టం లేదు. ఆ ఇంటిముందు నిలుచున్న ఆకారం గురించే ఆలోచిస్తున్నాను. అది మనిషి కాదు, ఒక ఆత్మ. ఇదే నేను మొదట్లో చెప్పిన "ప్రత్యేక లక్షణం" కొంతమంది కళ్ళకు ఆత్మలు కనిపిస్తాయంటారే అలాంటి వాళ్ళలో నేనొకణ్ణి.

******

చిన్నప్పుడే కనిపించేవి. నాకర్థమయ్యేది కాదు. పెద్దవాళ్ళకు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. మా తాతయ్యకు మాత్రం అర్థమైంది ఏవొ పూజలు గట్రా చేయించాడు. కొద్ది సంవత్సరాలు బాగానే వుంది. ఇరభై ఏళ్ళు దాటాకనుకుంటాను, మళ్ళీ మొదలయ్యింది. అప్పటికే మా తాతగారు లేరు. అమ్మకు భయమెక్కువ చెబితే తట్టుకోలేదేమోననిపించింది. నాన్న అదో టైపు. పగలంతా గుమాస్తా పని రాత్రిళ్ళు ఆలస్యంగా ఇల్లు చేరేవాడు. దానికితోడు అనారోగ్యం... లోపలే నలిగిపోయేవాణ్ణి... ఆత్మల వల్ల నాకు ఏ హాని జరగలేదుగాని బాగా భయపడి పోయేవాణ్ణి. కొద్ది రోజులకు అలవాటైపోయింది. ఓ సారి ధైర్యం చేసి మాట్లాడె ప్రయత్నం చేశాను. మొదట్లో బదులు దొరకలేదు. మళ్ళి మళ్ళి ప్రయత్నిచాను; ఫలించింది. ఒక వృద్ద ఆత్మ స్పందించింది. బ్రతికున్న భార్యపట్ల అతనికున్న ప్రేమానురాగాలు అతన్ని స్పందించేలా చేశాయి, ఆమె పడుతున్న కష్టాలు అతని ఆత్మకు శాంతి లేకుండాచేశాయి.

వాళ్ళ కుటుంబాన్ని కలిసి విషయం చెప్పాను. మొదట్లో కొడుకులు నమ్మలేదు. భార్య మాత్రం భర్త విషయం వినగానే భావోద్రేకంతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. తల్లిని సుఖపెట్టేట్లు కొడుకులకు,కోడళ్ళకు నచ్చజెప్పి, ఆ ఆత్మ సమస్యను పరిష్కరించే సరికి, అతను ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కనబడలేదు. ఇలా, గడచిన నాలుగేళ్ళలో ఆరుగురి ఆత్మల సమస్యలు, నాకు చేతనైనంత వరకు పరిష్కరించి వాళ్లను సంతోష పెట్ట గలిగాను.

కొందరికి విషయం చేరవేయాలి; మరి కొందరికి వాళ్ళు చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నరని తమవాళ్ళకు చెఫ్ఫాలి. చాలావరకు ఇలాంటి సమస్యలే వుండేవి. కాని అన్ని ఆత్మలు సౌమ్యంగానే ప్రవర్తిస్తాయన్న గ్యారంటీ లేదు. బ్రతికున్నప్పటి వాళ్ళ మానసిక స్థితి, ఆత్మల ముఖాల్లొ ప్రతిబింబిస్తుంది.

దుష్ఠ ప్రవర్తన కలిగినవాళ్ళ ఆత్మలు భయంకరమైన ఆకారాల్లొ దర్షనమిస్తాయి. వాటిని గమనించిగమనించనట్లే తప్పుకొని వెళ్ళిపోయేవాణ్ణి. చాలాసందర్భాల్లొ, నేను వాళ్ళను చూడగలుగుతున్నానన్న విషయం వాళ్లకు అర్థమయ్యేది. అలా చాలా సందర్భాల్లో ఇరుక్కుపోయి అతికష్టం మీద తప్పించుకో గలిగాను. అది తలుచుకుంటే వళ్ళు జలధరిస్తుంది. కొన్ని ఆత్మలు వెంబడిస్తాయి. మానసికంగా బలహీనంగా అనిపిస్తే మన శరీరాన్ని ఆవహించే ప్రయత్నం కూడా చేస్తాయి. ఇది నమ్మలేని నా అనుభవం.

******

ఇప్పుడు చూసిన ఆకారం కౄరంగాలేదు. ఆ ముఖంలో ఏదో అందోళన స్పష్టంగా కనిపించింది. నా అవసరం తనకి వుందేమొననిపించింది. రిస్కు వున్నప్పటికి, అలాంటి వాళ్ళకు సహాయపడటంలో ఎంతో తృప్తి వుంటుంది. వీలైతే, ఆ ఆత్మను కలవాలనుంది. ఈ ఆలోచనలతోనే తెల్లవారిపోయింది.

ఎటు చూసినా ఫెళ్ళి సందడే. ణారాయణ వాళ్ళు బాగా కలిగిన వాళ్ళు కావడంతో విపరీతమైన జన సందోహం కనిపిస్తోంది. ఏర్పాట్లన్నీ ఆర్భాటంగా వున్నాయి. శేఖర్ వుత్సాహం, సంతోషం చెప్పనలవి కాదు. చిన్న పిల్లల మనస్తత్వం. మహా సరదాగా పెళ్ళి జరిగిపోయింది. రెండ్రోజులు గడిచిపోయాయి. తిరిగెళ్ళిపోయే సమయం దగ్గరపడుతోంది. శేఖర్ కు ఆ ఆత్మ విషయం చెప్పక తప్పదు. ఇంతవరకు వాడికి ఇలాంటి విషయాలేవి చెప్పలేదు. ఎలా రియాక్టవుతాడొ తెలీదు.

సందర్భం రానేవచ్చింది. నిదానంగ అర్థమయ్యేల, జడుసుకోకుండా జాగ్రత్త పడుతూ విషయం చెప్పాను. నేనాఆత్మకు సహాయపడలంటే తన సహకారం కావాలన్నాను. వాడు షాక్ లోనుండి తేరుకోవడానికి గంట పట్టింది.

"ఇందులో అంత భయపడాల్సిందేమి లేదు రా... నేను మేనేజ్ చేయగలను... నన్ను నమ్ము.." వాణ్ణి ప్రిపేర్ చేసె ప్రయత్నం చేస్తున్నాను.

శేఖర్ను కన్విన్స్ చేస్తేనే నారాయాణ నాకు సహకరించగలడు. అది జరక్కపోతె, నేనేమి చేయలేనని నాకు తెలుసు.

"నీకేమైన పిచ్చా... అయిన ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకుండా ఇన్నిరోజులెల భరించావుర..." వాడింకా పూర్తిగా తేరుకోలేదని అర్థమైంది.

"ఇదిగో ఇలాగె నీవు టెన్షన్ పడతావనే చెప్పలేదు.."

"దయచేసి నన్నొదిలైరా... నన్ను ఇందులోకి లాక్కు.. నావల్ల కాదు" వాడి ముఖంలొ భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది...

"సరే, ఏదో నాకు చేతనైన సహాయం చేద్దామనుకున్నాను. మనవల్ల మరొకరికి మేలు జరుగుతుందంటె, ప్రయత్నించడంలో తప్పు లేదు కదరా. నా ప్రయత్నమేదో నేను చేస్తాను... నిన్ను లాగన్లే..."

వాడి గురించి నాకు బాగా తెలుసు. తన వాళ్ళనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేయ గలడు... కొద్ది సేపు తర్జన బర్జనలు పడ్డాక దారి కొచ్చినట్లు కనబడ్డాడు.

"అది కాదురా అతని గురుంచి... అదే ఆ ఆత్మ గురించి మనకు తెలియాలంటె నారాయణ వాళ్ళ నాన్నా గారి సహకారం కూడా కావాలి... ఆయనకీ విషయం చెప్పామంటే, సహాయం విషయం తరువాత, ముందు మనల్ని తన్నించి మరీ తరిమేస్తారేమో...."

"రేయ్ ముందు నీవు నారాయణను కన్విన్స్ చేయి... వాళ్ళ నాన్న గారి విషయం నేను చూసుకుంటాను.."

ఎలాగోల శేఖర్ ను నారాయణ దగ్గరకు పంపించాను. సాయంత్రం కావస్తోంది వీడింకా రాలేదు. ఏం జరిగుంటుంది. నారాయాణ కన్విన్స్ అయి వుంటాడా. వాళ్ల నాన్న గారితొ చెప్ప గలడా. అనుమానమే. కొద్ది సేపటికి శేఖర్ వచ్చాడు. ముఖంలో గాభర తగ్గి పోయినట్లుగా అనిపించింది...

"రేయ్ నారాయణ వాళ్ళ నాన్న గారు రమ్మంటున్నార్రా వెళదాం రా..."

"మొత్తం చెప్పేశారా...?" వెళ్తూ అడిగాను

"ఆ.. అతను వాళ్ళ నాన్న గారి బాల్య స్నేహితుడట... ముందు ఆశ్చర్య పోయారు.. నమ్మారొ లేదో తెలియదు... నిన్ను తీసుకు రమ్మన్నారు..."

నారాయణ తండ్రి గారి పేరు పరంధామయ్య... పెళ్ళి పత్రికలో చూశాను... చాలా మంచి వారని విన్నాను...

గదిలో నారాయణ నాన్న గారితో పాటు నారాయణ మాత్రమే వున్నాడు... నారాయణ నన్ను కొత్త గాను, వింత గాను చూస్తున్నట్లు అనిపించింది... వాళ్ళ నాన్న గారి వైపు చూశాను...

"అబ్బాయ్ రా ఇల కూర్చో..." ముఖంలో అద్వితీయమైన ప్రశాంతత... నెమ్మదిగ మాట్లాడుతున్నారు.

"వీళ్ళు చెబుతున్న విషయాలు నిజమేనా...?"

"అవునండి... అంత సులభంగా ఎవరు నమ్మరని తెలుసు... అందుకే అవసరమంకుంటే తప్ప ఎవ్వరి తోను ఈ విషయాలు మాట్లాడనండి..."

"ఇలాంటివి వున్నాయని అప్పుడెప్పుడో నేను కూడా విన్నాను..." నేనేమి బదులు చెప్పలేదు.

"వాడి పేరు భుజంగ రావు. మంచి వాడే గాని పరమ లోభి. డబ్బు విషయాని కొస్తే భార్య పిల్లల్ని కూడా లెక్క జేసే వాడు కాదు. అలాగని కౄరమైన మనస్తత్వమున్న వాడేమి కాదు. కూడ బెట్టడమే తెలుసు, అనుభవించడం నేనెప్పుడు చూడ లేదు. పాపం వాడి పిల్లలు నా దగ్గరి కొచ్చి బాధ పడే వాళ్ళు. వాళ్ళావిడ కూడా వాడికి బుద్ది చెప్పమని నన్నడిగేది. కొడుకు సిటీలో సెటిల్ అయ్యాడు. ఒక రోజు వాడి ఫామిలీ మొత్తం సిటీ నుండి తిరిగొస్తూండగా కారు ఏక్సిడెంట్ అయ్యింది. భార్య, కొడుకు, కోడలు, ఇద్దరు మనుమలు అక్కడికక్కడే చనిపోయారు. వీడు మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ చేరాడు. ప్రాణాలతో నైతె బయట పడ్డాడు గాని, ఆ సంఘటన వాణ్ణి మానసికంగా కృంగ దీసింది. ఇంట్లో ఒక్కడే వుండేవాడు. ఎవ్వరిని కలిసే వాడు కాదు. అసలు తలుపే తీసే వాడు కాదు. కొద్ది రోజుల తరువాత వాడే కోలుకుంటాడ్లే అనుకున్నాను.. ఒకసారి వాణ్ణి పలకరిద్దామని ఇంటికెళ్ళాను. ఎంత పిలిచినా తలుపు తీయ లేదు సరి కదా కనీసం బదులు కూడా పలుక లేదు. అనుమాన మొచ్చి తలుపులు పగుల గొట్టించాను. లోపలి కెళ్ళి చూస్తే వాడి గదిలో వురేసుకుని కనిపించాడు. అప్పటికే రెండు మూడు రోజులైనట్లుంది. విపరీతమైన దుర్గంధం వస్తోంది. వాడి లోభత్వం వల్ల బంధువులెవరు వాడింటి గడప తొక్కేవాళ్ళు కాదు. నేనే దగ్గరుండి శ్రాద్ద కర్మలన్నీ చేయించాను. కొద్ది రోజుల తరువాత వాడి దూరపు బంధువొకరు ఆ ఇంట్లో కాపురముండడానికి ప్రయత్నిచాడు. కాని నెల రోజులు తిరక్కుండానే, ఎవరి తోను చెప్పకుండా, కనీసం ఇంటికి తాళమైనా వేయకుండా ఖాళి చేసి వెళ్ళిపోయాడు. భుజంగ రావు ఆత్మే వాళ్ళని భయపెట్టి తరిమేసిందని చెప్పుకునేవారు.. ఆ తరువాత అటువైపు ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. అలా అది పాడు బడిన కొంపై పోయింది... "

అంతా నిశ్శబ్దంగా వింటున్నారు.

"మీరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తూంటే అతనిలో కౄరత్వమేమి లేదని తెలుస్తోంది... కాబట్టి నేను అతని సమస్యని తెలుసుకొని పరిష్కరించ గలననే అనుకుంటున్నాను...”

"వూహు... నేనొప్పుకోను.. నువ్వేమో కుర్రాడివి నీకేం చెప్పిన అర్థం కాదు... అలాంటి ఆలోచనలు మానుకో. భవిష్యత్తున్న వాడివి...ఇలాంటి వాటికి దూరంగా వుండు... "

"సర్ అనవసరంగా కంగారు పడకండి. నన్ను నమ్మండి.. మీ ఫ్రెండుకు తన బాధల నుండి విముక్తి కలుగ జేస్తానన్న నమ్మకం నాకుంది. మీరు సరేనంటే ఒక సారి ప్రయత్నిస్తాను."

పరంధామయ్య గారికి కోపమొచ్చినట్లుంది.

"అన్ని విషయాల్లోను దూకుడు పనికి రాదయ్యా. అర్థం చేసుకో... " అంటూ మరో మాటకు తావివ్వకుండా గదిలో నుండి వెళ్ళిపోయారు. అతను కలవర పడుతున్నారు. ఏదైనా జరగ కూడనిది జరిగితే తనకు చెడ్డ పేరొస్తుందేమో నని అతను ఫీలవుతన్నట్లు అనిపించింది.

******

అక్కడినుండి బయట పడ్డాము... శేఖర్ కు ఆత్మల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలైనట్లుంది... ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నాడు.



ముగింపు వచ్చేసంచికలో....

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు